మనిషి లాంటి మనిషి -- ఆచార్య రాణి సదాశివ మూర్తి
స్థాయి ఎత్తులో లేదు
స్థాయి ఎత్తితే రాదు
నేల కాళ్ళక్రింద ఉన్నా
తల్లిలా మనను మోస్తున్నది ఎదపై
నింగి ఎంత ఎత్తులో ఉన్నా
భూమి మీద రూకలేరుకునే వాడికి కనబడదు.
ఎదిగేవాణ్ణి చూస్తూ కూర్చోకూడదు.
ఎదిగేందుకు ప్రయత్నం ఆపకూడదు.
భావిని చూడకుండా నడిచేవాడు
బావిలో పడతాడు
పొట్టివాడు గట్టివాడు.
మూడడుగులతో ముల్లోకాలనూ కొలిచేస్తాడు.
కొండ ఎదగమని చెబుతుంది
కోన ఒదగమని చెబుతుంది
ఎండైనా వానైనా నిలబడమంటుంది తరువు
గుండెకు తెలియని లోతుల్ని నేర్పుతుంది కడలి
అని ప్రకృతి లోంచి పాఠాలు నేర్వమనే
సిద్ధపురుషులెందరో....
కానీ
మనిషిని మనిషిలా ఉండమని చెప్పగల మనిషి లేక
ప్రతి మనిషీ జంతువులకు అన్నీ నేర్పి
తను జంతువుగా మిగిలి పోతాడు.
మనిషి లాంటి మనిషి కనబడటం లేదు.
సీతాకోకచిలుక రెక్కలు -- స్వాతి శ్రీపాద
ఊహ తెలిసిన క్షణం నుండి
చూపులు వడబోస్తూనే ఉన్నాయి
ఉదయమే వాకిట్లో పొడి నేల మీద చల్లిన కళ్ళాపిలా
సీతాకోక చిలుక ఒళ్ళంతా చిలకరించుకున్న రంగులను
చెయ్యి చాపి అడుగుతూనే ఉన్నాను
ఓ చిటికెడు నాక్కూడా ఇవ్వమని.
ఎప్పటి నుండో నా చుట్టూ చుట్టూ తిరుగుతున్న
ఆ రంగురంగుల ప్రపంచం
నా ఉనికిని హత్తుకున్న సుడిగాలిలా
అనుక్షణం ముంచెత్తే సముద్రపుటలలుగా
తీరాన పరచుకున్న సైకత వనంలా
అరచేతిలో ఒదిగిన సంపెంగ పువ్వుల్లా
నాలోకి రంగులను చినుకులు చినుకులుగా
వర్షిస్తూనే ఉంది.
ఇప్పుడు నా అణువణువునా
ప్రవహిస్తున్న రంగుల నదులు
ఇహ సీతాకోక చిలుకలు ఎందుకు?
ఏ అవసరానికా రంగు పులుముకుని
రోజుకో వైపు ఎగురుతూనే ఉంటాను
రెక్కల నిండా వికసించిన రంగులను చల్లి
పూటకో దిక్కు వశీకరించుకుంటాను.
వామనుడి పాదాన్నై అవని మీద ఓ కాలు మోపాలని
అవాకులూ చవాకులూ పుక్కిలిస్తాను.
యుగాంతం వరకూ నా చరిత్ర
రక్తపు గోళ్ళతో చెక్కుదామనే తపనలో
రేయింబవళ్ళకు ముళ్ళకిరీటాలు పెట్టి
మాటలకు మార్మికత అద్ది విహరిస్తున్న వేళ
ఏదో ఒక అదృశ్య శక్తి మంత్రదండం తిప్పి
రెక్కలు కత్తిరించి అగాధంలోకి నగ్నంగా విసిరేసినప్పుడు
గొంగళీ పురుగులా నాలో ఇంకిపోయిన
అమానుషత్వం అద్దం పట్టినప్పుడు
మళ్లీ నేను నేనుగా కనిపించాలన్న తపన
ప్రతి రక్తపు చుక్కా ప్రక్షాళనం
చేసుకోవాలన్న తహతహ.
చంద్రయానం -- డా.శనగవరపు కృష్ణమూర్తి శాస్త్రి
సందురూని కాడి కెల్దామా - ఓ! లచ్చిమీ
సందురూని సూసి వద్దామా- ఓ! లచ్చిమీ- నా లచ్చిమీ
సంద్రయానము చేతి కందిందే
లోకమంతా నివ్వెరోయిందే - ఓ! లచ్చిమీ
రేయి పవలు కట్ట పడ్డారె
అటు పోటులు తట్టుకున్నారే
ఓటమంచుల పట్టు బడలేదే
సందురూని పట్టుకున్నారే
శాసతరేత్తల యిచ్చ గెలిచిందే
మన దేశ పేరుయె పుటలు కెక్కిందే
సందురూడిపై కాలుపెడదామే
మన దేశ కీర్తికి ప్రబలు కడదామె
రాకెటెక్కి రయ్యి గెల్దామా
సంద్రలోకం సుట్టి వద్దామా
సందురూడు సల్లగుంటాడె
సందురూడు సక్కగుంటాడే
జాబిలిని సేరగ జాతి పొంగిందే
జాబిలంటే జండ యెగిరిందే
భరత మాత పరవశించిందే
భరతావనికి వన్నె తెచ్చిందే ఓ! లచ్చిమీ...నా లచ్చిమీ..