Menu Close
SirikonaKavithalu_pagetitle

చీకటిలో వెలుగు కొరకు
వెదుకులాటలెందుకు?
వెలుగు కనుల కమ్మినపుడు
వారింతువదెందుకు?।। చీకటిలో।।

వెలిగి వెలిగి వెలుగు తుదకు
చీకటి పరదాల దాగు
నలుపంటే వెఱపు వలదు
తెలుపు నిల్చునెంత వరకు? ।। చీకటిలో।।

కారుమొయిలు జలమునిచ్చు
నీలికురుల సొగసు హెచ్చు
కలకంఠికి కను కాటుక
అందపు సిరులను పెంచు ।। చీకటిలో।।

చీకటిలో ఈదులాట
వెలుతురులో వాదులాట
విడిచిపెట్టి నీదు బాట
ఆశల తోటల వేటా? ।। చీకటిలో।।

పట్టపగలు కలహిస్తే
అంతకన్న చీకటేది?
కనులు మూసి ధ్యానిస్తే
చీకటి పరమాత్మ వేది ।। చీకటిలో।।

ఈక్షణం మధురానుభూతికి
మరోజన్మ ఎత్తాలి.
ఈ గడియ ఆనందానికి
మరో పుటక రావాలి.
ఆ తన్మయత్వాన్ని కొలవడానికి
ఒక యుగం చాలదు.
తరలి తెరలి వచ్చే
నీటి తెరలు
ముందటి అలలకు కోపెట్టి
గట్టును ముట్టిస్తున్నాయి.
పొరలుపొరలుగా ప్రవహించే
గాలి ప్రసారాలు
మైపులకలతో కబుర్లు చెప్పి
నిగిడిస్తాయి.
తమకంతో ఊసులు చెప్పే
చెలియగుసగుసలు
తమకూ వినబడినట్లు
నాచుగుబురులు తలలూపేస్తున్నాయి.
మసిఆయిన మన్మథుడు
ఎక్కడో చాపం ఎక్కుపెట్టిన సంకేతంగా
పరిమళం మత్తెక్కిస్తూనే ఉంది.
ఈ వింత హాయి
ఈనాటికే దరి కట్టకుండా
కల్పాలకు నన్నూ తనతోపాటు
తరలించుకుపోతే ఎంత బాగుణ్ణు!
కంట్లో కాపురం పెట్టిన ఈ అందం
ఒంట్లో వేసవి నింపిన ఈ సొగసు
మదిని నిలువనీయని ఈ పొంకం
నాకే శాశ్వతం అయిపోతే ఎంత హాయి!

రెండు రోజులుగా వాన
నగరానికి తలంటి
గాలికి రెక్కలు తొడిగింది

డాబాపై మొక్కలు
దుమ్ము దులుపుకుని
పూల రంగులతో
నవ్వుతున్నాయి

చినుకు పాదాల హడావిడిని
గొడుగులు ముఖాలు విప్పార్చి
చూసాయి

ఎర్రని ఎండకు
విసిగిన పుడమి
నింగి నుండి జారిన నీటిచుక్కలతో
కాస్త పెదవులు తడుపుకుంది

నైరుతి ఋుతుపవనం
గతి తప్పి
ఆలస్యంగా వస్తే వచ్చింది కానీ
చెమట నదులను
దారి మళ్ళించి
చల్లని చేతులతో
జీవులను దీవించింది

దాచుకున్నది లేనివాడిని
దోచుకునే దెవరు?
తనకంటూ లేనివాడికి
తనది కానిదేముంది ప్రపంచంలో?

ఫుట్పాతే పట్టెమంచం
గోనెపట్టాయే హంసతూలికాతల్పం
హారన్లే హాయినిచ్చే జోలపాటలు

దోమలకు ఫలహారం వాడి రక్తం
ఎండ వానలకు వాడే నేస్తం
దొరికింది తిన్నా
దొరలా నిద్రిస్తాడు
సగం శరీరాన్నైనా
సరిగా కప్పని దుప్పట్లో...

లాఠీ తట్టిలేపే వరకు
మత్తెక్కి మదగజం నాలుగు చక్రాలు
మీదనుంచి పోయేవరకు...
ఏడ్చేవారున్నారో లేరో
ఎందుకని అడిగేవారేరి?

అవిటివాడిగా మిగిలినా
అసలే లేకుండాపోయినా
అంతగా ఏముంటుంది?
జనాభా లెక్కల్లో రానివాడు
ఓటర్లజాబితాలో లేనివాడు
వార్తకెక్కే అనామకుడు
ఫారిన్ సీసా విలువ చెయ్యదు
పేదవాడి ప్రాణం!!!
తప్పెవరిది???

మిత్రుడా!
సముద్రాన్ని విడిచి
ఎడారులలో నీటిని ఎందుకు వెతికేవు?
దప్పికైతే
ఎండమావులకై తిరిగేవు?
ఓ అవివేకీ,
లోయల్లోకి దిగివచ్చావు
ఇక్కడ పసిడిరాశులను వదిలి
బూడిద తీసుకువెళుతున్నావు!
ఇదిగో!
ఇక్కడ జ్ఞాన సముద్రం వున్నది
నీ దప్పిక తీర్చుకో!
ఇదిగో!
ఇచట అదృష్ట పర్వతాలున్నవి
నీకు వలసినంత త్రవ్వితీసుకో!
నేను నీకొరకే వచ్చాను!
నీవెంత కురూపివైనా,
నీవెంత అపరిపూర్ణుడివైనా,
నీవెంత అజ్ఞానివైనా,
నేను నిన్ను ప్రేమిస్తున్నాను!
నన్ను అనుసరించు.
నా ప్రేమను స్వీకరించాలన్న
నువ్వు యోధుడివి కమ్ము,
నువ్వు జ్ఞానార్తుడివి కమ్ము!
ఇదో ఖడ్గం!
ఇదో పవిత్ర గ్రంథం!!
నిన్ను స్వీకరిస్తున్నాను,
నన్ను అనుసరించు!
నీ హృదయ కుహరాన
ఈ ప్రేమసాగరాన్ని నింపుకో!
నీ అజ్ఞాన మస్తిష్కాన
ఈ జ్ఞాన జ్యోతులు వెలిగించుకో!!
ఇక నీకు నాతో అవసరం లేదు,
నీ దారి నువ్వు నిర్మించుకో!
నీ గమ్యం నువ్వు నిర్ధారించుకో!!
ఇదే నా గాధ!
ఇదే నా బోధ!!

Posted in November 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!