నది కదిలింది నాగరికత విరిసింది తెలుగుల జిలుగు వెలుగు నలు చెరగుల నటనమాడింది "నది" కృష్ణమ్మ కెరటాల కింకిణులు రవళింప ప్రత్తి పువ్వులు పూచె పాల వెన్నెల కాసె తేట వెన్నెల కాయ తెల్ల దారము తీయ తెలుగుజాతికి క్రొత్తవెలుగులను వెదజల్లె "నది" గోదారి నడకలో పూదారి పులకింప కలమ మంజరులూగె కలిమి అందెలు మ్రోగె వరదలను తొలగించి బ్రతుకులను వెలిగించి ఆంధ్రదేశము నేడు అన్నపూర్ణగ వెలసె "నది" తుంగభద్రానదీ తోయమ్ము ప్రవహింప చెరకు పంటలు పండె తేనె సోనలు నిండె తేనెసోనల తీపి తేటమాటల జూపి దేశభాషలలోన తెలుగు లెస్సగ నిలిచె "నది" పెన్నమ్మ జలధార పెన్నిధులు పొంగింప పసుపుతోటలు నవ్వె పసిమి నిగ్గులు రువ్వె ముత్తైదువల కెల్ల ముత్యమంతటి పసుపు సౌభాగ్య చిహ్నమై సౌందర్య మొలికించె "నది"
అవును అనిపిస్తుంది.
ప్రతిధ్వనిస్తున్న గాలితరగల్లో
సుడి తిరుగుతున్న
రంగు రంగుల గాలిపటమై
పనికి రాని సొద నిరంతరం
మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది.
మాసిపోయిన ఆకాశాన్నీ
రంగువెలిసిన హరిత వనాలనూ
వాషింగ్ మెషీన్ లో ఉతికి ఉతికి
మళ్ళీ ఒకసారి ఆరేసి నట్టుగా ఉంది
జనం మరచిపోయిన నట్టడవిలో మరోసారి
వెదురు కుటీరం ముందు
వాలుకుర్చీలో వాలి సేదదీరుతున్నట్టుగా
అనిపిస్తుంది.
ఊహల ఊలు దారాలతో
అల్లుతున్న నిశ్శబ్దాన్ని గట్టిగా కేకేసి
గొంతువిప్పి పాడుతున్న
స్వేచ్చాగీతాన్నీ ఈ గుందెకు చెవినానించి
వినమని చెప్తున్నట్టుగా ఉంది.
రోజుకో కొత్తమొగ్గ తొడుగుతున్న
రాధామనోహరం తీగ గారాలుపోతూ
రాగాలు వినిపిస్తూ గునుస్తున్నట్టుగా అనిపిస్తోంది.
ఈ అనిపించడాల మధ్య
నెమ్మదినెమ్మదిగా దిగుతున్న నీడల వెనక
సడి లేని ఒక జత అడుగుల అలికిడి.
లీలగా అవలీలగా మంచుతెరలా
ఆవహిస్తున్న ఒక ప్రశాంతత
ఆశ్చర్యం!
నా ఎదురుగా నువ్వనుకున్నాను కాని నేనే
వింటున్నానో చెప్తున్నానో కాని
స్వరం మాత్రం నాదైన నీది.
మాటపెగలని పెదవులపైకి
దొర్లివస్తున్న నీ దరహాసపు వెలుగులు
బాగా మాగిన ద్రాక్ష రసంలో మునిగి
నీకు దాసోహమంటూ
నా ఉనికి
ఒకే హృదయంతో జన్మించాను ...
లేత గులాబీ రంగులో, తెరచిన అరచేయి లాంటి
హృదయం ...
నవనీతంలా చల్లగా, మకరందంలా తీయగా, మల్లెపూవులా
మనోహరంగా
పరిమళిస్తూ,
పిల్లగాలులకి పల్లవిస్తూ
ప్రేమని ప్రేమిస్తూ
పలకరిస్తూ, పరవశిస్తూ
నా హృదయం నాతో పాటు ఎదుగుతుంటే
దాన్నిండా అనురాగ మకరందం నింపుతూ వచ్చాను..
దాని చుట్టూ ప్రేమ సుమాలు అలంకరించాను..
మంత్రజలంతో పుణ్యాహ వచనం చేయించి
పూర్తిగా వికసించాక అభిషేకించి నీకు అర్పించాలనుకున్నాను
ఏ పంచాంగం తిరగేసినా తిది, వార నక్షత్రాలు అనుకూలించడంలేదు..
ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత, ఆత్మీయత అనే పంచామృతాలు నింపి
రెండు చేతులతో భద్రంగా పట్టుకుని
జీవన ప్రాంగణంలో ద్వారబందానికి పూలతోరణం లా
మారి
పచ్చని గడపకి కుంకుమ బొట్టునై
నీ ఇంటి ముంగిట ముత్యాల ముగ్గునై
నీ హృదయంతో అల్లుకుని నీ పూజామందిరంలో మమతల
మాలనై
పరిమళించాలని తపిస్తూ, తరించడానికి పరితపిస్తూ
నువ్వు పంపించే
ఆశల పల్లకి కోసం ఎదురుచూస్తున్నాను.
తారలు వన్నెలద్దిన వెన్నెల మేలి ముసుగు ధరించి,
నీ జీవితానికి వెలుగు వెల్లువనై ప్రవహించడానికి
సంఘం చెక్కిన చెలియలికట్టను దాటి సిగ్గు మొగ్గల
బల్లకట్టు మీద
పయనించడానికి ఎదురుచూస్తున్నాను.
కాలం కరిగిపోతోంది... వన్నె తగ్గిన వెన్నెల కరిగిపోతున్నా,
వెల్లువై పొంగాల్సిన నది ఎండిపోతున్నా,
అల్లిన మాల బడలి వడలిపోతున్నా,
ముగ్గులన్నీ కన్నీటి వర్షంలో కరిగిపోతున్నా
పల్లకి రాలేదు....పాదాలు కదలలేదు..
మన కలయికకు ముహూర్తం కుదరలేదు...
గ్రహాలన్నీ విగ్రహాలై సంచారం ఆపేసినట్టున్నాయి
కాలం కదిలిపోతున్నా కదిలే జాడల్లేవు
కనుచూపు మేరంతా కందకాలే..
వాటినిండా ప్రశ్నార్ధకాలే...
ఆశలన్నీ అడుగంటి పోయాక తెలిసింది
అవన్నీ నీ అహం నిర్మించిన
కంచు కోటలనీ ఎన్నటికీ తెరుచుకోని నీ రాతి హృదయ కవాటాలనీ
వాటికి ప్రేమ కన్నా కామమే ముఖ్యం అనీ, మమతలు,
మమకారాలకి అవి కరగవని
అయినా ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను
ముకుళిత హృదయంతో
ఏనాటికైనా రాయి కరిగి అనురాగ ధార యై ప్రవహిస్తుందని ...
నీ జత కోరే రాగసంజాతను అర్ధం చేసుకుంటావని,
నీలో కలుపు కుంటావని
ఎందుకంటే నాకున్నది ఒకటే హృదయం
మీటర్లో సరిగా కూర్చోనక్ఖర్లేదు
ఈటెల్లా గుండెకి గుచ్చుకుంటే చాలు
మంత్రనగర పురవీధులు చూపనక్ఖర్లేదు
మనసు మరచిన మధురసీమకు తీసుకెళ్తే చాలు
కొత్త కలలపై కంటిపాపకు ఏ మోజూ లేదు
చెదిరిపోయిన కలల చెలిమిని తిరిగి తెస్తే మేలు
అపరగంధర్వగానకౌశలాప్రదర్శన వద్దు
మానసవీణ మంద్రంగా మీటి వెళ్తే చాలు
ఒట్టి మాటల గారడిలో ఏమున్నది జాదూ..?
ఒక్క గుండెను హత్తుకున్నా అదే పదివేలు
అంజలి మాటలు సంద్రంలో ఉప్పునీళ్ళు కాదు
ఆల్చిప్పల గుండెల్లో దాగి ఉండే ముత్యాలు!
శ్రీధరాజాత హృత్సర-సీజ మధుప!
జీవసముదయానంద స-ద్భావ కుముద
సామ్య చంద్రికాత్మ శశాంక -సత్య లక్ష్య
నామ మహిమాభ్యుదయ సాంద్ర-రామచంద్ర! -1-
కోతివంటి మనసు కోర్కె-కొమ్మలెక్కి
జీవన వనమంత విరచి-చిక్కువరచె
తప్పు తెలిసికొంటినిcక నీ-దాసునంటి
నామ మహిమాభ్యుదయ సాంద్ర-రామచంద్ర! -2-
నీ పదములు నమ్ముకొనిన-నా పదములు
గ్రుచ్చుకొనునె నా పదముల-కుcగనుకనిదె
వంద పద్దియముల నీకు-వందనమ్ము
నామ మహిమాభ్యుదయ సాంద్ర-రామచంద్ర! -3-
చదువు సాలదు గురుసేవ-యొదవలేదు
కనుక శబ్ద శాస్త్రవిధులు-కానలేను
నామజపమది యొక్కటె-నమ్ముకొంటి
నామ మహిమాభ్యుదయ సాంద్ర-రామచంద్ర! -4-
•1• నేను దాటాలి నన్ను నేను దాటాలి నన్ను నేను దాటిపోగలగాలి దాయటం దాటాలి దాగటం దాటిపోగలగాలి. •• నా దేహాన్ని దాటాలి దేహాభ్యంతరాలను దాటిపోగలగాలి నా మనస్సును దాటాలి మానసికాంశాలను దాటిపోగలగాలి నా అంగాలను దాటాలి అంగాంగ వైభోగాన్ని దాటిపోగలగాలి నా చూపును దాటాలి చూపుడును దాటిపోగలగాలి నా నీడను దాటాలి వీడని నీడను దాటిపోగలగాలి నా ధ్యాసను దాటాలి ధ్యానయాసను దాటిపోగలగాలి నేను ధ్యానం కావాలి యోగభాషను అవ్వాలి. •2• నేను అక్షరాన్ని దాటాలి క్షరసంపదను దాటాలి అక్షర మేధస్సును దాటిపోగలగాలి గురువును దాటాలి గురు పీఠాన్ని దాటిపోగలగాలి. •• నా జీవితాన్ని దాటాలి భవిష్య కాలాన్ని దాటిపోగలగాలి నా మూర్తిని దాటాలి వర్తమానం నుండి విడివడగలగాలి నా కృతకాన్ని దాటాలి గత అరువుకు గతం కాగలిగాలి నేను మూడుకోట్లను దాటాలి మూఢమతులను కాదనగలగాలి నేను అనుకరణను దాటాలి అడుగు అడుగున ముందడుగు కావాలి. •3• నేను భాషను దాటాలి భావలయ భాషను దాటాలి భూవలయ భాషను దాటిపోగలగాలి పుట్టని శబ్దాన్ని చేదుకోగలగాలి పుట్టిన నిశ్శబ్దాన్ని చేరుకోగలగాలి. •• నా పుట్టుక ప్రశ్న అయితే సమాధానం నేనే. సందేహించటం సమాధానించటం రూపించిన భౌతిక అస్తిత్వానివా! సాధించటం సంయోగించటం రూపించని నిశ్శబ్ద అంతస్తత్వానివా!! నాతోబాటు నా అహంభావమూ పుట్టింది జంటగా వచ్చిన మాకు విడాకు లెందుకు లెక్కగా వుందామన్న ఒడంబడిక మాకుంది అవును, నేను పర అహాన్ని ఇహ చైతన్యాన్ని. •4• విరిగిన అల తన విరుపును దాటి సాగటం లేదూ పెరిగిన కల తన పరిధిని దాటి పరిక్రమించటం లేదూ ప్రాపంచికంగా పెరిగిన ఆలోచన ఎల్లలు చెరుపుకుని పరాన్ని చేరటం లేదూ పగలయినా రాత్రిలో కలవాల్సిందే రాత్రయినా పగలును చేరాల్సిందే. అవును, ఇహ పరాలు సార్వకాలికాలే అహ చైతన్యాలు యోగభూమికలే. •• ఆలోచన ఆకాశానికి నిచ్చెన వేస్తుంది, సరే లోచన దిగంతాలను చేరాలి కదా కాంతి మండలాలు కనిపిస్తాయి, సరే కళ్ళు పెనుచీకట్లను కనాలి కదా వాసనలు భౌతిక సంపదలు, సరే నాసికాగ్రాన పరవాసన నిలవాలి కదా చెవులకు సుస్వరాలు ఇంపులు, సరే ప్రళయ ఘోష వినిపించాలి కదా అవును, సూర్య చంద్రులు స్నేహిస్తుంటేనే ఇడా పింగళుల ధ్యానం నిరాటంకమయ్యేది. •5• నేను దేహానికి ఇరుపోకడల ప్రాణవాహికను మూడున్నర చుట్ల నిర్వాణవేదికను బాహ్యానికి రెండురూపాల శ్వాసనిర్వహణను అంతరంగానికి నిత్యమైన ఏకశ్వాసను పూరక చర్యను కుంభక క్రియను రేచకయోగాన్ని జన్మ రహస్యాన్ని మృత్యు స్పర్శని జీవకణాన్ని మూడుకోశాలకు అందని మూలకోణాన్ని దేహసంస్కారానికి చేతనాంకాన్ని. •• నాడీ నాడీ నడుమ బ్రహ్మనాడిని కుడి ఎడమల జీవ ప్రమోదాన్ని స్థూల సూక్ష్మల శక్తి ప్రభంజనాన్ని అగుపించని నాడికి ఆజ్ఞాప్రజ్ఞానాన్ని కపాలాన నిలిచిన సహస్రోదంతాన్ని కుండలినిన పదిల ఆత్మస్రోతస్సుని. •6• నా సంకల్పం చీకటి వలయానికి కేంద్రం నా రూపం అరూప చిత్రానికి మూలం అవును, నేను రూప అరూపాల మేలు జగతిని ఆది అంతాల మూల సృష్టిని దేహ విదేహాల విశ్వసనీయ విశ్వాన్ని మురిపించే మనసుకు దిశా నిర్దేశాన్ని అభేదానికి సిద్ధత్వాన్ని శుద్ధత్వాన్ని. •• నేను కాను విగ్రహావతారుల భక్తిసంస్కారాన్ని కాను మతబడిన నేర్చిన భక్తిసంప్రదాయాన్ని గర్భాలయాన జీర్ణించుకున్న యోగసంసారాన్ని చనుబాలతో పారాడిన యోగసంస్కారాన్ని. •7• నేను బ్రహ్మయోగిని చతుర్ముఖ శుద్ధబ్రహ్మని పర పశ్యంత మధ్యమ వైఖరుల శబ్దస్పర్శని నిమీలిత నిర్మోహ నిశ్శబ్ద సంకల్ప లోచనని.