Menu Close
వై
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

మగపిల్లాడు కలగలేదని అత్త సూటిపోటి మాటలు అంటుండడంతో తన కూతురిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది నీరజ. అప్పుడు నీరజకి ఐదో నెల. అత్తగారు చట్ట వ్యతిరేకంగా తమకు తెలిసిన డాక్టర్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్ష చేయించి ఈ సారి కూడా ఆడపిల్లేనని నిర్ధారించుకుంది. దాంతో సూటిపోటి మాటలు మరీ ఎక్కువయ్యాయి.

పుట్టింటికి వచ్చేసిన నీరజ తనకు తన భర్త మగపిల్లాడిని ప్రసాదించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. నీరజ వేసిన వ్యాజ్యాన్ని చూసి న్యాయస్థానం విస్తుపోయింది. వ్యాజ్యాన్ని అనుమతించాలో లేదోనని తర్జనభర్జన పడింది. న్యాయమూర్తి ప్రసాద్ మానవతా దృక్పధంతో వ్యాజ్యాన్ని అనుమతించారు. నీరజ తన తరపున న్యాయవాదిని పెట్టుకోకుండా తన కేసును తానే వాదించుకోడానికి సిద్ధపడింది.

విషయం తెలిసిన నీరజ తల్లిదండ్రులు గగ్గోలుపెట్టారు.

నీరజ తండ్రి – సంసారాన్ని నడివీధిలో పెట్టావు కదే, పెద్దలం మేమంతా ఏమయ్యామనుకున్నావు?

నీరజ – పెద్దలందరూ ఉన్నారు నాన్న. ఉండి ఏం లాభం. మగపిల్లాడు కలగడం లేదని, వాళ్ళకు వంశోద్ధారకుడు లేకుండా పోతాడేమోనని, మా అత్త సూటిపోటి మాటలు అంటుంటే పెద్దలంతా ఏమయ్యారు, ఏమి చేస్తున్నారు. ఆ క్షోభ, ఆ మానసిక క్షోభ ఎలాంటిదో నాకు, నాకు మాత్రమే తెలుసు నాన్న. పోనీ మా ఆయన ఓదార్పు అన్నా ఉందా అంటే అదీ లేదు.

నీరజ తండ్రి – అందుకని ఇప్పుడు కోర్ట్ కు వెళ్ళి ఏమి పరిష్కారం సాధిస్తావు. నేనేదో మధ్యస్తం చేస్తాగా. ఇలాంటివి అన్ని ఇళ్ళలో ఉండేవే.

నీరజ – ఏమి పరిష్కారం సాధిస్తానో కోర్టు తీర్పు వచ్చాక చూడండి నాన్న. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. నా లాంటి ఎంతో మంది ఆడవారి సమస్య.

వాయిదా రోజు వచ్చింది. న్యాయస్థానంలో బాధితురాలి బోనులో నీరజ, ఎదురుగా ప్రతివాది బోనులో ఆమె భర్త నవీన్ నిలబడ్డారు.

జస్టిస్ ప్రసాద్ – చూడమ్మా, న్యాయవ్యవస్థ చరిత్రలో ఇటువంటి కేసు ఎప్పుడూ ఎదురుకాలేదు. అసలు నీ అంతరంగం ఏమిటో, నువ్వు కోరుకునేదేమిటో కోర్టు వారికి కాస్త విపులంగా తెలియజేయి.

నీరజ – జడ్జీ గారు, నేనూ మా వారు ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. మా అనురాగానికి గుర్తుగా రెండేళ్ల క్రితం మాకొక పాప కూడా పుట్టింది. మళ్ళీ నాకిప్పుడు ఐదో నెల. చట్ట వ్యతిరేకం అని తెలిసి కూడా మా అత్త గారు నాకు లింగ నిర్ధారణ పరీక్ష చేయించారు. దానికి మావారి మద్దతు కూడా ఉంది. ఈసారి కూడా ఆడపిల్లే అని మా అత్తగారు దెప్పి పొడవడం మొదలుపెట్టారు. ఆమెను నిలువరించలేని అశక్తుడు మావారు.

జస్టిస్ ప్రసాద్ – అలా అయితే మీ ఆయన మీద, అత్తగారి మీద, లింగ నిర్ధారణ చేసిన డాక్టర్ మీద సెక్షన్ 498A క్రింద కేసు పెట్టుండాలి. కానీ మీ భర్త మీకు మగబిడ్డను ప్రసాదించేలా కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేయాలని కోరావు. ఏమిటిది?

నీరజ – జడ్జీ గారు, మా వారిది, నాదీ ప్రేమ వివాహం. వాళ్ళ అమ్మని నిలువరించలేని అశక్తుడు అన్నానే గానీ, మా మధ్య అన్యోన్యత లేదని నేను అనలేదే. మా అత్త గారు మగ పిల్లాడి కోసం, వాళ్ళ వంశాన్ని నిలబెట్టే వాడి కోసం పరితపిస్తుంది. ఎందుకంటే ఆమెకు కూడా మావారొక్కరే మగ సంతానం. ఆ పరితాపం ఎక్కువయ్యి నా మీద ఈ విధంగా సూటిపోటి మాటలతో విరుచుకపడుతోంది. ఇకపోతే లింగనిర్ధారణ చేసిన డాక్టర్ గారు మా కుటుంబంతో ఉన్న స్నేహం మూలంగా పరీక్ష చేశారు. అంతేగానీ, మా అత్తగారు, డాక్టర్ గారు కలసి బ్రూణ హత్యకేమీ పూనుకోలేదే?

జస్టిస్ ప్రసాద్ – నువ్వు నాకు ఎదురు ప్రశ్నలు వేస్తావేంటమ్మాయ్? అసలు నీ సమస్య ఏంటి? వీరు నేరస్తులు కాదు అన్నట్లు మాట్లాడతావ్. మగపిల్లాడు కావాలి అంటావ్. ఇక్కడున్న న్యాయదేవతేమీ సంతాన దేవతా కాదు. నేనేమీ వేణుగోపాలస్వామినీ కాదు. నీ సమస్య ఏమిటో సూటిగా, స్పష్టంగా చెప్పు.

నీరజ – సార్, అసలు ఆడదానికి తాను కనవలసింది మగాబిడ్డనా, ఆడబిడ్డనా అని నిర్ణయించుకునే శక్తి ఉంటుందా?

జస్టిస్ ప్రసాద్ – ఆడదానికే కాదు, మగవాడికీ ఆ శక్తి ఉండదు. అదంతా దైవాధీనం.

నీరజ – సార్, మగవాడికి కూడా నిర్ణయించుకునే శక్తి లేకపోవచ్చు. కానీ మగపిల్లాడు పుట్టడానికి బైలాజికల్ గా కావాల్సిన వై క్రోమోజోమ్ మగవారి దగ్గరే ఉంటుంది. ఆడవారిలో ఉండేటు వంటి నలభైయారు క్రోమోజోములూ ఎక్స్ క్రోమోజోములే. మగవారిలోనే ఇరవై మూడు వై క్రోమోజోములు, ఇరవై మూడు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. మేము మగపిల్లాడిని కనాలంటే ఎక్స్, వై రెండు క్రోమోజోములు కావాలి. మా దగ్గర ఎక్స్ క్రోమోజోములే ఉంటాయి. వై క్రోమోజోమ్ ఉండదు. అది మగవారి దగ్గరే ఉంటుంది. కాబట్టి మగపిల్లాడే కావాలనుకుంటే కలయిక సమయంలో వై క్రోమోజోములే మాలోకి పంపిస్తే సరి.

నీరజ మాటలకి కోర్టు లోని మగవారంతా జడ్జీగారితో సహా నోళ్ళు వెల్లబెట్టారు. ఆడవారికంతా నీరజ అత్తగారు మినహా ఆశ్చర్యానందాలు కలిగాయి. నీరజ అత్తగారు మాత్రం నోరువెల్లబెట్టి దీని దుంపతెగా అని మనసులో అనుకుంది.

జస్టిస్ ప్రసాద్ ఐదు నిమిషాల్లో తేరుకుని, నీరజ భర్త నవీన్ తో – (నవ్వుతూ)

జస్టిస్ ప్రసాద్ - ఏమయ్యా! వై క్రోమోజోమ్ మాత్రమే ఇస్తానని నీ భార్యకు మాటివ్వగలవా?

“సార్” అని నీళ్ళు నములుతూ అలానే నిల్చుండిపోయాడు నవీన్.

జస్టిస్ ప్రసాద్ నీరజతో - నువ్వు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?

నీరజ - లేదు సార్, నాకు కావాల్సింది, మీముందుంచాను, మీరే న్యాయం చేయాలి

కేసుని మరుసటి రోజుకి వాయిదా వేశాడు జస్టిస్ ప్రసాద్.

మరుసటి రోజు మళ్ళీ కేసు వాయిదా. కోర్టు ఆవరణలో చెట్టు క్రింద తన స్నేహితురాలితో కూర్చుని వేచి చూస్తుంది నీరజ. కొంత దూరంలో నీరజ భర్త నవీన్ తల్లితో కలసి వేచి చూస్తున్నాడు. జడ్జీ గారు ఇంకా రాలేదు. నవీన్ మనసులో అపరాధభావం, తన అశక్తత మీద కోపం ఉన్నాయి. క్రమంగా అవి ఈ చిరాకులకు కారణమైన తన తల్లి మీద కోపానికి దారి తీశాయి. దూరం నుంచి నీరజ కన్నార్పకుండా భర్త వైపే చూస్తుంది. నవీన్ ఆమె వైపు చూడలేకపోతున్నాడు. నవీన్ తల్లి మాత్రం కోపంతో ఊగిపోతుంది. “దీనికి విడాకులిచ్చేయిరా నవీన్” అంది మౌనాన్ని చెదరగొడుతూ. ఆ మాట వినడంతోనే నవీన్ కి కోపం నషాళానికంటింది.

“ఛీ, నోర్ముయ్, చేసింది చాలక, మళ్ళీ ఈ వెధవ సలహాలు” అని తల్లిని కసిరాడు.

“నేనేం చేశాన్రా” అంది నవీన్ తల్లి.

“అబ్బా, ఏం చేయవ్, నువ్వూ ఏం చేయవ్, ఆ పిల్లా ఏం చేయదు, మధ్యలో నన్ను వెధవని, బలిపశువుని మాత్రం చేస్తారు” అని విరుచుకపడుతూ “అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడకు, ఈ సమస్యను నేనే పరిష్కరించుకుంటా” అంటూ నీరజ వైపుకు కదిలాడు. భర్త తన వైపు వస్తుండడంతో గబుక్కున లేచి నిలబడింది నీరజ.

నీరజ దగ్గరకు వెళ్ళగానే తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేశాడు నవీన్.

“నీరజా, నా అసమర్ధత వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇకపై అమ్మ వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా, ఒకవేళ ఆమె పద్ధతి మార్చుకోకపోతే వేరుగా ఉందాం. ఇలాంటి కేసు వేసింది, నువ్వు అందరిలో పరివర్తన రావాలనేగా. నేను అర్ధం చేసుకున్నాను. నువ్వూ ఆలోచించు. సర్దుకుపోయాం అని జడ్జీ గారి ముందు చెబుదాం”.

నీరజ మౌనంగా ఉంది. ఇంతలో కోర్టు గుమాస్తా వచ్చి, జడ్జీ గారు సెలవు, ఈ రోజు ఉన్న వాయిదాలన్నీ శనివారం రోజున చూస్తారు అని చెప్పాడు.

“సరే శనివారం కలుద్దాం” అని నీరజకి చెప్పి వెళ్ళిపోయాడు నవీన్. నవీన్ ఆత్మస్థైర్యం ప్రదర్శించడంతో నీరజపై మానసికంగా పైచేయి సాధించాడు.

శనివారం రోజు మళ్ళీ కేసు వాయిదా. బాధితురాలి బోనులో నీరజ, ఎదురుగా ప్రతివాది బోనులో నవీన్.

ప్రొసీడింగ్స్ మొదలుకాగానే నీరజ జడ్జీగారితో – “సార్, నేను నా భర్తతో కేసు విషయమై సర్దుకుపోదాం అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటానని ఆయన మాటిచ్చారు” అని భర్త వైపు చూసింది, నవీన్ మొహంలో ఆనందం తొణికిసలాడింది.

జస్టిస్ ప్రసాద్ – మంచిదమ్మా. మీ అత్తగారెక్కడ? ఒకసారి వచ్చి నీ కోడలి పక్కన నిలబడమ్మా, చూడమ్మా, ఈ కేసు పెట్టడంలో నీ కోడలి ఆంతర్యం ఏమిటో నీకు అర్ధమయ్యి ఉండాలి. తను మీ మీద పగ సాధించాలనుకుంటే గృహహింస కేసు పెట్టి ఉండేది. ముందుగా పోలీసుస్టేషన్ కి వెళ్ళి మిమ్మల్ని అరెస్టు చేయించేందుకు ప్రయత్నించేది. గృహ సంబంధమైన విషయాల్లో ఆడవారికి మగవారి వల్ల కలిగే ఇబ్బందులు ఒక పార్శ్వమైతే, రెండవ పార్శ్వం ఆడవారికి ఆడవారి వల్ల కలిగే ఇబ్బందులు. మీ ఆడవారే ఆడవారి సమస్యలు అర్ధం చేసుకోకపోతే ఎలాగమ్మా? చాలా కేసుల్లో అత్తాకోడళ్ళ మధ్య అహం వల్ల జరిగే ఘర్షణల మూలంగా మగవారు చిక్కుల్లో పడుతున్నారు. ఒక ఇంట్లో పది జుట్లు ఇముడుతాయి గానీ రెండు ముడులు ఇమడవు అని పెద్దలు ఎందుకన్నారో ఆడవారంతా ఆలోచించాలి. లేదంటే స్త్రీవాదం ఓ నినాదంగా మిగిలిపోతుందేగానీ, సమస్య పరిష్కారం కాదు.

కేసులో ఇరుపక్షాలు సర్దుకుపోయారు కాబట్టి, కేసును కొట్టేస్తున్నాను. అయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్ష చేయించిన నీరజ అత్తగారిని, చేసిన డాక్టర్ ను మందలిస్తూ చెరో రూ.25 వేలు జరిమానా విధిస్తున్నాను.

The court is adjourned.

o00o00o00o00o

Posted in April 2021, కథలు

2 Comments

  1. నరేంద్ర బాబు సింగూరు

    బాగుంది. సమస్యని ఎత్తి చూపారు హాస్యం తో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *