Menu Close
భగవద్విభూతి
-- ఆర్. శర్మ దంతుర్తి

సత్యాన్వేషణ – 6

ముందు నెల వ్యాసాల్లో భగవంతుడి విభూతి (విస్తారణ) ఎక్కడ, ఎలా చూడవచ్చో చూసాం. అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు ఎక్కడైనా చూడవచ్చు అంటే మనసులో నమ్మకం కుదరడం అంత సులభం కాదు కనక కృష్ణుడు చెప్తున్నాడు ఎక్కడెక్కడ తన విభూతి సులభంగా చూడవచ్చో. అయితే ఈ చెప్పిన విషయాలలో “మాత్రమే” భగవంతుడు ఉంటాడనుకోకూడదు. హరిమయము విశ్వమంతయు అని ముందే చెప్పుకున్నాం కదా? ఇప్పుడు మిగతా శ్లోకాలలో ఏం చెప్పాడో చూద్దాం.

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ                     [10-21]

మనకి “తెలుసున్న రూపులలో” భగవంతుడి విస్తారం గురించి చెప్తున్నాడిప్పుడు. ద్వాదశాదిత్యులలో (ధాత, మితృడు, ఆర్యమ, రుద్రుడు, వరుణుడు, సూర్యుడు, భగుడు, వివశ్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు) విష్ణువుని. ప్రజ్వలించే జ్యోతులలో విశ్వానికి రశ్మి అందిస్తూ కంటికి కనిపించే సూర్యుడిని. సప్త మరుత్తులలో (ఆవహ, ప్రవహ, వివహ, పరావహ, ఉద్వహ, సంవహ, హరివహ) ఆవహుడనే మరీచిని. నక్షత్రాలలో చంద్రుడిని. ఇక్కడ చెప్పేది చూస్తే కాస్త సంకటంగా కనిపించవచ్చు కానీ మొదట్లోనే చెప్పాడు కదా, ఈ శ్లోకాల్లో చెప్పేవి ముఖ్యమైనవీ, దివ్యమైనవీ, ధ్యానానికి పనికొచ్చేవీ మాత్రమే. అయితే నక్షత్రాలలో చంద్రుడు ఎక్కడినుంచి వచ్చాడు? చంద్రుడు నక్షత్రమే కాదు కదా అనే ప్రశ్న వస్తే చెప్పేది ఏమిటంటే – ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఏమిటి? చంద్రుడు కదా, అలా మిణుకు మిణుకు మనే నక్షత్రాలలో కూడా ఉండేది బ్రహ్మమే కానీ కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేదీ, ధ్యానానికి పనికివచ్చేది, మనం చూసి ఊహించుకోగలిగేది చంద్రుడు కనక – నక్షత్రాణా మహం శశీ అని చెప్తున్నాడు.

వేదానాం సామవేదోऽస్మి దేవానామస్మి వాసవః
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా            [10-22]

వేదాలలో (ఋగ్, యజుర్, సామ, అధర్వణ) భగవంతుడి గొప్పదనాన్ని గానం చేసే సామవేదాన్ని. దేవతలలో ఇంద్రుణ్ణి (వాసవుడు), ఇంద్రియాలలో అంత సులభంగా కట్టడిలో ఉంచుకోలేని మనసుని. అంతేకాక ఏ ప్రాణి శరీరంలో చూసినా అందులో ఉండే చైతన్యం భగవంతుడే.

రుద్రాణాం శఙ్కరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్             [10-23]

ఏకాదశ రుద్రులలో (శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయడం గమనిస్తే రుద్రులు పదకొండు మంది అని తెలుస్తుంది) శుభకరుడైన శంకరుణ్ణి. యక్ష, రాక్షసులలో డబ్బుకి (విత్తం) అధిపతి అయిన కుబేరుణ్ణి. అష్టవసువులలో అగ్నిని (పావకుడు), ఎత్తైన శిఖరాలలో మేరు పర్వతాన్ని.

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్
సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః                   [10-24]

పురోహితులలో ముఖ్యుడైన దేవపురోహితుడైన బృహస్పతిని; సేనానాయకులల్లో విశిష్టమైన కుమారస్వామిని (స్కందుడు), జలాశయాలలో అతి పెద్దదైన సముద్రాన్ని.

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్
యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి స్థావరాణాం హిమాలయః        [10-25]

మహర్షులలో భృగువుని. శబ్దసమూహంలో బ్రహ్మవాచకమైన ఒకేఒక ఓంకారాన్ని. యజ్ఞాలలో చేసే మౌనంగా చేసే జప యజ్ఞాన్ని. కదలని స్థావరాలలో హిమాలయ పర్వతాన్ని.

అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః
గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః                  [10-26]

వృక్షాలలో రావి చెట్టుని (ఆశ్వత్థ), దేవర్షులలో నారదుణ్ణి. గంధర్వులలో ముఖ్యుడైన చిత్రరధుణ్ణి. సిద్ధి పొందిన మునులలో కపిలుణ్ణి. కలిపావతారంలో విష్ణువు తల్లికే మోక్షమార్గం చూపినవాడు.

ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్
ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్                 [10-27]

అశ్వాలలో, అమృతం కోసం పాలసముద్రం చిలికినప్పుడు బయటకొచ్చిన ఉఛ్ఛ్హైశ్రవమనే అశ్వం, నా అంశతో పుట్టినదే. అలాగే ఏనుగులలో ఐరావతం కూడా. ప్రజలలో పరిపాలించే రాజు నా అంశతో ఉన్నవాడే. దీన్నే మరోవిధంగా విష్ణువు అంశ లేనివాడు రాజు కాలేడు అని – “నా విష్ణు పృధివీ పతిః” అనడం గమనించవచ్చు.

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః                 [10-28]

ఆయుధాలలో దధీచి మహర్షి ఎముకలతో తయారై, ఇంద్రుడిచేతిలో ఉండే వజ్రాయుధం నా అంశచేత సృష్టించబడినదే. ప్రజోత్పత్తి కోసం ఉపయోగపడే మన్మధుణ్ణి. సర్పాలలో వాసుకిని కూడా నేనే. గమనించారా?  ప్రజోత్పత్తికి ఉపయోగపడే మన్మధుడు అంటే కేవలం కామం, సంభోగం అనే సరదాలు భగవంతుడి విభూతి కాదు. ప్రజోత్పత్తి అయితే అది భగవంతుడి విభూతి ఎందుకంటే అది మరో చైతన్యంతో ఉన్న జీవికి జన్మనిస్తోంది కనక.

అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్    [10-29]

అనేక తలలున్న నాగులల్లో నేను శేషుణ్ణి. ఆయన దానిమీదే పడుకుంటాడు కదా? జలదేవతలలో (యాదసాం) వరుణుణ్ణి. పితృదేవతల్లో ఆర్యముణ్ణి. శాసించేవారిలో (సంయమతాం) యముణ్ణి. యముడు ఎందుకంటే ఆయనకి “వీడు నావాడు, వాడు వేరే” అనే తారతమ్యాలు ఏనాడు లేవు. ఎవరు చేసిన పాపపుణ్యాల ప్రకారం వారికి ఆయన శిక్షలు శాసించగలడు.

ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్
మృగాణాం చ మృగేన్ద్రోऽహం వైనతేయశ్చ పక్షిణామ్        [10-30]

రాక్షసులలో (దైత్యులు, దితికి పుట్టినవారు), సౌమ్యుడై విష్ణుభక్తితో ఉన్నప్రహ్లాదుణ్ణి. లెక్కపెట్టేవారిలో (కలయతాం), కాలాన్ని. మృగాలలో రాజైన సింహాన్ని, పక్షులలో అతి బలమైన గరుత్మంతుణ్ణి (వినతకి పుట్టినవాడు, వైనతేయుడు).

పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ           [10-31]

పవిత్రత ఇచ్చేవారిలో వాయువుని. ఆయుధాలు ధరించేవారిలో (శస్త్రభృతాం) రాముణ్ణి. నీటిలో నివసించే జాతులలో మొసలి; ప్రవహించే నదులలో (స్రోతసా) గంగని (జుహ్ను అనే రుషి వల్ల గంగకి వచ్చిన పేరు జాహ్నవి)

సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్          [10-32]

ఇంత ఎందుకు, సృష్టించబడిన అన్నింటిలో ఆది, మధ్య అంతాలన్నీ కూడా నేనే. విద్యలలో ఏది నేర్చుకుంటే ఇంకేమీ తెలుస్కోనక్కర్లేదో అటువంటి మోక్షప్రదమైన అధ్యాత్మ విద్య నేనే. తార్కికులు చేసే వాద, జల్ప వితండాలలో వాదాన్ని నేనే. వాదం అంటే న్యాయాన్యాయాలు చూసి సరిగ్గా చెప్పేది కానీ అడ్డంగా చేసే వితండవాదం కాదు.

అక్షరాణామకారోऽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః            [10-33]

అక్షరాలలో మొదటిదైన “అ” అనే అక్షరాన్ని. సమాసాలలో ద్వంద సమాసాన్ని (ఉదా: కర్ణార్జునులు – అంటే ఇద్దరికీ సరైన గౌరవం ఇవ్వడం – కర్ణుడొక్కడే మంచివాడు కాదు, అర్జునుడు కూడా మంచివాడే – ఇద్దరూ భగవదంశ అని చెప్పడమే ఉద్దేశ్యం. ప్రవాహ రూపాలలో కాలాన్ని. కర్మ ఫలదాత అయినవాణ్ణి కూడా నేనే. కాలం గడిచే కొద్దీ మనం చేసే కర్మలు ఎక్కువౌతాయి కదా? అలా వాటికి ఫలం ఇచ్చే ఆయన కూడా భగవంతుడే.

మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా             [10-34]

సర్వం హరించే మృత్యువు కూడా నేనే. మళ్ళీ అందులోంచి భవిష్యత్తుని ఉద్భవించేదీ నేనే. ధర్ముని పత్నులైన శ్రీ, వాక్, స్మృతి, ధృతి, మేధ, క్షమ అనేవారు కూడా నేనే. దీని అర్ధం ఏమిటంటే ధర్మాన్ని ఆచరించేటపుడు ఉంచుకోవల్సిన శ్రీ (సంపద), వాక్ (మాట), స్మృతి, ధృతి, మేధ, క్షమ అనే గుణాలన్నీ భగవంతుడి వల్లే కలుగుతాయన్నమాట.  నోటికొచ్చినట్టు మట్లాడేవారూ, దయా, ధర్మం లేనివారు భగవత్స్వరూపులు అవలేరు.

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహమ్
మాసానాం మార్గశీర్షోऽహమృతూనాం కుసుమాకరః        [10-35]

వేదాలలో సామవేదాన్ని చెప్పాడు కదా, అదే మరోసారి చెప్తున్నాడు – సర్వేశ్వరుణ్ణి స్తుతించే బృహత్ సామాన్ని. ఛందోవిశిష్టమైన ఋక్కులలో గాయత్రీ మంత్రాన్ని. మాసాలలో మార్గశీర్షమనే మాసాన్ని. ఋతువులలో వసంత ఋతువుని (కుసుమాకరం).

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్
జయోऽస్మి వ్యవసాయోऽస్మి సత్త్వం సత్త్వవతామహమ్  [10-36]

ఇప్పటివరకూ నువ్వు చూసే మంచివి అన్నీ నా అంశ మాత్రమే అని చెప్పాడు కదా మరి చెడ్డవో? అది కూడా చెప్తున్నాడు – వంచన చేసేవారిలో జూదాన్ని నేనే. ‘ధర్మరాజు కావాలని ఓడిపోలేదు సుమా, ఇదంతా నా లీలే అని తెలుసుకో అర్జునా’ అని చెప్తున్నాడన్నమాట. తేజశ్వులలో కనిపించే తేజం నా మూలానే. ఉద్యమించే వారిలో ఉద్యమాన్ని; సాత్వికులైన వారిలో సత్వగుణం నాదే.

వృష్ణీనాం వాసుదేవోऽస్మి పాణ్డవానాం ధనఞ్జయః
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః              [10-37]

ఇంతవరకూ వచ్చాం కనక యాదవులలో నేను కృష్ణుణ్ణి, పాండవులలో అరునుణ్ణి (నేనూ నువ్వూ కూడా ఒకే అంశ సుమా అని చెప్తున్నాడు). మునులైనవారిలో వ్యాసుణ్ణి. సూక్ష్మార్ధ వివేకులలో శుక్రుడని (ఉశనా)

దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్     [10-38]

దండించేవారిలో దండనీతినీ, జయం ఆకాంక్షించేవారిలో రాజనీతినీ, రహస్యాలలో మౌనాన్ని; తత్త్వజ్ఞానులలో నా విభూతి జ్ఞానం. ఎవరిదగ్గిరనుంచైనా ఏదైనా రహస్యంగా ఉంచాలంటే మొదట చేసేది ఏమిటని ఆలొచిస్తే మౌనంగా ఉండడం కదా? అందుకే రహస్యాలలో ఆయన మౌనం.

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్        [10-39]

అసలైన విషయం ఇప్పుడు చెపున్నాడు. సర్వ భూతాలలో ఉండే మూలకారణమైన చైతన్యం ఏదైతే ఉందో అది నేనే. స్థావర జంగమాత్మకాలలో నేను, నా శక్తి లేకుండా నిలబడగలిగేది ఏ ఒక్కటీ లేదు.

నాన్తోऽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా                 [10-40]

భగవంతుడి దివ్యమైన ఈ విభూతికి పరిమితి అంటూ లేదు. కానీ ఇప్పటివరకూ చెప్పినవి కేవలం ఉదాహరణ కోసం చెప్పినవి మాత్రమే సుమా.

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంऽశసమ్భవమ్          [10-41]

ఐశ్వర్యయుక్తమైనదేదైనా సరే, శ్రీమంతమైనదైనా సరే, సర్వశ్రేష్టమైనదీ కూడా భగవంతుడి అంశతో పుట్టి ప్రభవిస్తున్నదే అని తెలుసుకుంటే చాలు.

అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్             [10-42]

చివరగా చెప్తున్నాడు. అసలు భగవంతుడి అంశ ఎంత అని తెలుసుకోవడం వల్ల మనకి ఏమిటి ప్రయోజనం? ఒక్క ఆంశం చేతనే ఈ జగత్తంతా వ్యాపించి సర్వత్రా వ్యాపించి ఉన్నాను.

చూశాం కదా భగవద్విభూతి అంటే? ప్రపంచంలో భగవదంశలేని పరమాణువు కూడా లేదు. అలా అయితే భగవంతుణ్ణి ప్రతీచోటా దర్శించడం అందరికీ సులభంగా కుదరదు కనక తెలుసున్న వాటిలో మొదట చూడడం అలవర్చుకుంటే క్రమంగా ఈ జగత్తులో హరిమయం కానిదేదీ లేదని తెలుస్తుంది.  వచ్చే వ్యాసంలో ఈ విషయంలో మనకి ప్రస్తుతం తెల్సిన ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఏం చెబుతోంది అనేది చూసి ఈ పరంపర ముగిద్దాం.

****ముగింపు వచ్చే సంచికలో****

Posted in April 2021, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *