Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు
ఉగాదమ్మ రావమ్మా

తేటగీతులు

౧. శ్రీ శుభకర యుగాదిగా సిరులు దెచ్చి
    కటుకరోనా బ్రతుకులెల్ల క్రాంతి జూడ
    నవవసంత రాగాలతో నాట్యమాడ
    తెలుగుయిండ్లకు రావమ్మ వెలుగులీయ

౨. చితికిన బతుకు వారికి చివురులిచ్చి
    శిశిర రాల్చిన కొమ్మల చిగురులిచ్చి
    మనుషులందరికి మమతమంచి నిచ్చి
    శ్రీ ప్లవయుగాది గారమ్ము శివము నిచ్చి

౩. పాట కిన్నెరసానిలా పల్లవించ
    మాట విశ్వంభర జనుల బాట సాగ
    తెలుగు ఆత్మవై పరమాత్మ వెలయురీతి
    పూవు పూవుల రావమ్మ పుడమి మురియ

౪. వరలు ఓరుగల్లు అమరావతులు వెలుగ
    తెలుగు హద్దులు వేరైన తేజమొకటె
    తెలుగువారెక్కడున్ననూ వెలుగు వారె
    అనుచు రావమ్మ మాయిండ్ల హాయిగొలుప.

౫. చిరము శ్రీశైలమల్లన్న సిరులు యివ్వ
    ధక్షవాటికా భీమన్న దయను జూప
    భవుడు కాళేశ్వరుడు సదా భాగ్యమొసగ
    మన తెలుగు దేశపు యుగాది మహిత కాగ

౬. నన్నయ కృతులు నీలోన వన్నెలొలుక
    తిక్కన నుడులు నీలోన తేనెలొలుక
    పోతన పలుకుల్ నీలోన పూతలలది
    తెలగనార్యుని తెలుగులు తేజమీయ

౭. శాతవాహన రాజుల శౌర్యరీతి
    వేంగి చాళుక్యచోళుల విజయగీతి
    కాకతీయుల ఘనకీర్తి కదనరీతి
    తెలుగువారల చరితలు వెలుగురీతి

౮. నీదు హొయల లయలతోడ నెనరు జూపి
    మనదు సంస్కృతులందున మహితనేర్పి
    విశ్వశాంతితో జనులెల్ల విరియురీతి
    గడప గడపకు రావమ్మ కమ్రరీతి

అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు

Posted in April 2021, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!