Menu Close
Galpika-pagetitle
గల్పికావని-శుక్రవార ధుని-26 -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

ఇండియా దటీజ్ భారత్

విచిత్రమానవుల్లో పేరెన్నికగన్నవాడు సుబ్బు. తను ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది. ఆకలేసిందనుకోండి, వెంటనే వెళ్ళి కంచం పెట్టుకుని కూర్చుంటాడు. అతనలా కూర్చున్న రెండు నిమిషాల్లోపే వడ్డించెయ్యాలి. లేదా థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోతుంది.

ఓ పద్ధతీ పాడూ ఉండే వాడికైతే భోజన ఫలహారాలకి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. కానీ సుబ్బుకి వేళాపాళా ఉండదు. వాడిని వాళ్ళ మేనేజర్ బండ బూతులు తిట్టాడనుకోండి. వెంటనే కిర్రెక్కిపోయి ఇంటికి వచ్చీరాగానే కంచం ముందెట్టుక్కూర్చుంటాడు. వాళ్ళ మామ్మగారు ఫోన్ చేసి మనవణ్ణెప్పుడు కంటావురా వెధవా అని తిట్టారనుకోండి వెంటనే కంచం సీన్ స్టార్ట్. ఇలా ఎందుక్కోపం వచ్చినా కంచం సీనే.

వాళ్ళావిడ ఖర్మకాలి ఏ డే నైట్ క్రికెట్ మ్యాచో ఉందనుకోండి. ఇండియా నెగ్గేంతవరకూ ఆరు నూరైనా కంచం దగ్గరకి రాడు. అలాగని మ్యాచ్ అయ్యేంతవరకూ రాడుకదా అని తను ముందే తినేసిందనుకోండి. ఏం మేచయ్యేంతవరకూ ఆగలేవా? కట్టుకున్న మొగుడంటే ఆమాత్రం గౌరవం లేదా? నీకోసం, నీ పిల్లల కోసం పగలూ రాత్రీ కష్టపడే మనిషిని కరివేపాకులా తీసిపారేస్తావా అంటూ గొడవకి దిగుతాడు. పొరపాట్న రోహిట్ శర్మ, నేను ఇండియాకే సూపర్ హిట్ మేన్ని అనే విషయం మర్చిపోయి పదికో పరక్కో ఔటైపోయాడనుకోండి, వెంటనే కంచం పుచ్చుకుని రెడీ అయిపోతాడు.

పాతికేళ్ళుగా వేగుతున్న అనుభవంతో ఎప్పుడూ అన్నం వండి హాట్ పేకుల్లో సిద్ధంగా పెడుతుంది సుబ్బు భార్య. ఈ మధ్యన సుబ్బుకి థైరాయిడ్ లో ఆండ్రాయిడ్ ప్రాబ్లం వచ్చి అడ్డంగా ఊరిపోవడం మొదలెట్టాడు. దాంతో డాక్టర్లు అతన్ని రోజూ వాకింగుకి వెళ్ళమని సజెస్ట్ చేశారు. వెంటనే మన సుబ్బు వాకింగ్ మొదలెట్టాడు.

మనోడు ఏం చేసినా విచిత్రమే కదా..,

అలా వెళ్తూ ఉంటే ఓ చోట సరస్వతీదేవి గుడి కనిపించింది. వెంటనే ఆ గుడి ముందాగి సరస్వతీ ప్రార్థన చేశాడు. ఇంకాస్త ముందుకు వెళ్తే మసీదు కనపడింది. అక్కడ ఏం చేస్తే బాగుంటుందో అర్థం కాలేదు. అందుకే మౌనం పాటిస్తూ అలాగే ముందుకెళ్ళాడు. అక్కడ ఆంజనేయస్వామి గుడి కనిపించింది. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుకున్నాడు. ఇంకాస్త ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి.

‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి’ అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే నా బూతే నా భవిష్యత్ అనే తెలుగు కామెడీ సినిమాలో వెకిలి డైలాగు గుర్తొచ్చింది. దెబ్బతో వచ్చిన మంత్రాలూ దేవుళ్ళూ భక్తీ అన్నీ గాలికెగిరిపోయాయి.

తెలుక్కామెడీగాళ్ళందర్నీ బండబూతులు తిట్టుకుంటూ విసాడించుకుంటూ నడవడం మొదలెట్టాడు. కుడిపక్కన చర్చి కనిపించింది. అక్కడ ఆగాలని గానీ ప్రభువుని తలుచుకుందామని గానీ అనిపించలేదు. నేలని తన్నుకుంటూ నడుచుకుంటూ ఇల్లు చేరాడు.

లోపలకి రాగానే కంచం పట్టుక్కూర్చున్న సుబ్బుని చూసి అతని శ్రీమతికి మతి పోయింది. ఎలాంటి ప్రిపరేషనూ లేకుండా అప్పటికప్పుడు ఆపరేషన్ అన్నం కూరా అంటే అంత సులభం కాదు. అందుకే కాఫీ కప్పు తీసుకొచ్చి ఆపాద మస్తకం గడగడా వణికిపోతూ నిలబడింది. ఆమె పరిస్థితిని చూడగానే జాలేసింది. అందుకే కాఫీనే కంచంలో పోసుకుని తాగేశాడు.

మర్నాడు వాకింగ్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ సరస్వతీదేవి గుడి ఎదురొచ్చింది. ఈసారి మంత్రం కాకుండా ప్రదక్షిణాలు చేద్దామనిపించింది. కానీ స్నానం చెయ్యకుండా ప్రదక్షిణాలు చెయ్యచ్చో చెయ్యకూడదో తెలియలేదు. అందుకే, ప్రదక్షిణాల కంటే గుంజీలు తియ్యడం బెటరనిపించింది.

సుబ్బు సీమ లయన్. అందుకే రాయలసీమ పద్ధతిలో ఒక చుట్టు ఆత్మ ప్రదక్షిణ చేసి-కూర్చుని-మోచేతులు నేలకానించి- పైకి లేచిలేస్తేగానీ గుంజీ పూర్తవ్వదు. అలా నాలుగు పుంజీల గుంజీలు తీశాడు. తరవాత ఆంజనేయస్వామి గుడి, మసీదు, చర్చి ఇలా కులమత వర్ణ వర్గ విచక్షణ లేకుండా సర్వసమానంగా అన్ని చోట్లా నాలుగేసి పుంజీల గుంజీలు తీస్తూ వాకింగ్ పూర్తి చేశాడు. అలా వారం రోజులపాటు గుంజీల సేవలు చేశాక అతనికి పదిహేను రోజులపాటు ఢిల్లీ టూరు పడింది.

టూరు పూర్తి చేసుకుని వచ్చిన మర్నాడు మళ్ళీ వాకింగ్ కి వెళ్ళాడు. చూస్తే తనకంటే ముందే వచ్చిన బాల, కౌమార, యౌవన, ప్రౌఢ, వృద్ధ వాకర్లంతా గుడి ముందు గుంజీలు తీస్తున్నారు. అంతే కాదు, గేటుదగ్గర పెట్టిన హుండీలో అందరూ తలో పదిరూపాయలనోటూ వేస్తున్నారు. అలా చేస్తే కోరుకున్నది జరుగుతుందట. అంతకంటే ఎక్కువ వేస్తే గుంజీల సేవ ఫలం దక్కదట. ఇదెక్కడి విచిత్రంరా బాబూ అనుకుంటూ మసీదు దగ్గరకి వెళ్తే అక్కడా గుంజీలూ పదిరూపాయల నోట్లే. చర్చి ముందూ సేమ్ టు సేమ్.

దటీజ్ సర్వసమానత్వం ఆఫ్ ఇండియా. మాస్టారూ, ఇలా ఎందుకు జరిగిందంటారు?

సామాన్యం (ఒక కథ) -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

"ప్రముఖ కథారచయితలమధ్య మేం నిర్వహించిన కథలపోటీలో మీకథకు ప్రథమ బహుమతిని ప్రకటిస్తున్నందు కు మేం ఆనందిస్తున్నాం. మేం వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించబోయే సన్మానసభలో మీకు బహుమతి ప్రదానం చేస్తాం. ఆ బహుమానం ఏమిటో అక్కడే చెబుతాం.” ఒక ప్రముఖ వారపత్రిక నుంచి వచ్చిన చరవాణి సందేశం. ఆ వార్త చదివాకా నా పెదవులపై చిరునవ్వు. నా కథలకు పురస్కారం లభించడం కొత్త విషయం ఏమీ కాదు. కాని ఈ కథకు బహుమతి వచ్చింది అని వినగానే ఆశ్చర్యం కలిగింది. కారణం ఈ పోటీలో పాల్గొన్న వారిలో హేమాహేమీలందరూ ఉన్నారు. సామాజిక సమస్యల్ని విశదీకరించే కథలను, గ్రామీణ కథలను, అపరాధపరిశోధనాత్మక కథలను, సోషియో ఫాంటసీలను, ప్రేమకథలను, రాజకీయవాద సైద్ధాంతిక కథలను, ఆధ్యాత్మిక కథలను, బడుగు జీవుల కథలను, వైజ్ఞానిక కథలను, పౌరాణిక కథలను, చారిత్రక కథలను, యాత్రలకథలను, జాతరలను ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన కథలను ఎంతో చాతుర్యం తో వ్రాయగలిగిన, వ్రాస్తున్న వారే అందరూ. తనూ అనేక విధాలుగా కథలెన్నో వ్రాసి పేరు సంపాదించుకున్న వాడే.  ప్రతిసారి తన కథలమీద తనకు ఒక అంచనా ఉంది. అయితే ఈ సారితన కథకు బహుమతి వస్తుంది అనే ఊహ కూడా లేదు. కాని ఎందుకు ఇస్తున్నారో? వేచి చూద్దాం. అనుకున్నాను.

ఈలోపు ఈ వార్త తెలిసిన వాళ్ళకూ, తెలియని వాళ్ళకీ అందరికీ చేరింది. కథ ఏంటి? ఎలా వ్రాశారు? బహుమానం ఏమిటి? ఇవే ప్రశ్నలు. తను అందరికీ ఇచ్చిన సమాధానం ఒక చిరునవ్వు. ఒక పెదవి విరుపు.

సన్మానం రోజు వచ్చింది.  సాయం సంధ్య వేళ. చాలా చక్కని సంగీతం వినబడుతోంది. వేదికపైకి అతిథులను ఆహ్వానిస్తున్నారు. తననుకూడా వేదిక మీదకు ఆహ్వానించారు. నాప్రక్కన ఉన్న అతిథి ఎంతో మర్యాదగా నన్ను చూస్తూ నమస్కరించి పలుకరించారు.  సభాసంచాలకులు పత్రిక ప్రధానోపసంపాదకులు. "ఆహూతులందరికీ స్వాగతం. ఈ కథలపోటీలో ఒక విశేషం ఉన్నది. కథలకు న్యాయనిర్ణేతలుగా  ఈ సంవత్సరం రాష్ట్రపతి నుంచి ఉత్తమ ఉపాధ్యాయని పురస్కారాన్ని పొందిన శ్రీమతి వాసవదత్తా దేవి గారు, మనరాష్ట్ర పారిశ్రామిక వేత్తలలో ప్రథములైన శ్రీవిజయప్రసాద్ గారి అర్థాంగి శ్రీమతి వాగ్దేవి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల సతీమణి వింధ్యేశ్వరి గారు వ్యవహరించారు. వచ్చిన నూరు కథలనూ నెలరోజుల పాటు చదివి ఈకథను ఏక గ్రీవంగా ప్రథమ బహుమతికి ఎంపికచేశారు. మిగిలిన కథలలో కథనంలో, ఇతివృత్తంలో, సమస్యలను ఆవిష్కరించటంలో, పరిష్కారాలను చూపటంలో అవసరానికి మించిన అత్యుత్కంఠ, అతిశయం, తమదైన బాణీని నిలబెట్టుకోవడం కోసం తపన ఇవన్నీ కనబడ్డాయి. కానీ వీరి కథలో అందరికీ ఒక వైవిధ్యం కనబడింది. ఈకథ విషయానికి వస్తే ... ఇది ఒక సామాన్యుడి కథ. ప్రమాదవశాత్తు రచయిత అయ్యాడు. అక్కడ నుంచి సమాజంలో ప్రతి సమస్యకూ పరిష్కారాలు చూపే కథలు వ్రాసి అందరి మన్ననలూ పొందాడు. ఆ సమస్యలన్నీ నిజం జీవితంలో తనను ఎదుర్కొంటున్న ఆషాఢమాసపు ఈగలే. తోలిన కొద్దీ ముసురుకుంటేనే ఉన్నాయి. ఒక్క సమస్యకూ పరిష్కారం లేక అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఐసియూ లో చేరాడు.

బయటినుండి భర్త యాతన చూస్తున్న అతని భార్య ఎవరికి ఏమి చెప్పుకోవాలో తెలియక కళ్ళు మూసుకుని "భగవంతుడా! మా ఆయనను బ్రతికించు. ఆయనలోని మనిషిని బ్రతికించు." అని వేడుకుంది. అక్కడితో ఆ కథ ముగిసింది. ఈ కథ న్యాయనిర్ణేతలు ముగ్గురికీ నచ్చింది.

ఇక్కడ ఒక చిన్న మలుపు ఉంది. వీరి కథను చదివిన వింధ్యేశ్వరిగారు తమ భర్త అయిన మన మాన్య ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి రాష్ట్రంలోని రచయితల దైనందిన సమస్యలలో తెరిగిన మన రచయితను రాష్ట్ర రచయితల సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఆ ఉత్తర్వులను, నేటి బహుమతిని సభాముఖంగా రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి గారి చేతులమీదుగా మన రచయిత అందుకుంటారు." అని సభాసంచాలకులు నాకు పిలుపు నిచ్చారు. రెండూ అందుకున్న నేను సన్మానసభ చివర్లో  సంచాలకుల అనుమతి తో  నా ప్రతిస్పందన లో "అందరికీ వందనాలు. నాకథను అభినందించి బహుమతిని అందించిన అందరికీ కృతజ్ఞతలు. కాని ఈ కార్యదర్శి పదవికి నేను అర్హుణ్ణి కాను. దీనికి వేరెవరినైనా మంచి పాలనానుభవం కలిగిన తగిన అధికారిని నియమించండి." అని సున్నితంగా ఆ ఉత్తర్వులను ప్రభుత్వకార్యదర్శిగారికి సమర్పించి సభ పూర్తి కాగానే ఇంటి ముఖం పట్టాను.  ఆ తర్వాత తెలుగు కథావీథిలో గాలివాటు మారింది. అన్ని కథలూ పరిష్కారాలు లేని సమస్యలు పుట్టల గుట్టలే.

చిన్న సూచన-ఈ కథలోని పాత్రలన్నీ కల్పితాలే. వీరిని పోలిన వారెవరూ నిజజీవితంలో లేరు

పాతపుటల వసివాడని అక్షరాలు -- డా. వాసిలి వసంతకుమార్

అన్యోన్య దాంపత్యానికి వయసు అడ్డంకి కాదు  ...

 

 

‘నాతి చరామి..’ అంటూ దాంపత్య బంధం లో అడుగిడే వేళ చేసుకున్న ప్రమాణాలు.. పాతికేళ్ల ప్రాయంలో ఉరకలేసే ఆనందం.. గృహస్థ జీవనానికి ప్రేమతో తలుపులు తెరిచిన శుభముహూర్తం.. ఆడ,మగ జీవిత భాగస్వాములుగా మారి ఏడడుగుల బంధం పెనవేసుకున్నాక- ఎన్నో ఊసులు... మరెన్నో ఆశలు.. కొన్ని ఆశయాలు.. ఇదీ సంక్షిప్తంగా సంసార బంధం. ఇద్దరి జీవితాలే కాదు, రెండు కుటుంబాలు కలిసిన నేపథ్యం.. రెండు వర్గాల పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కారాలు సంగమించిన తరుణం.

ఇలా ఇరు నేపథ్యాలను పుణికిపుచ్చుకుని రెండు జీవితాలు, రెండు విభిన్న ప్రవృత్తులు, రెండు భిన్న ప్రకృతులు, రెండు వేర్వేరు శరీర ధర్మాలు ఒకటైన వ్యవస్థ- వివాహ బంధం.

కన్నపిల్లలతో,కని పెంచిన తల్లిదండ్రులతో, తోడబుట్టిన వారితో, అల్లుకున్న బాంధవ్యాలతో, కలిసిన స్నేహాలతో భార్యాభర్తల జీవితాలు మరో వ్యవస్థలా తయారవుతాయి. మరో తరానికి- భర్త ‘ఇంటి పెద్ద’ అయితే భార్య ‘సారథి’ అవుతుంది. ఇద్దరూ కూడబలుక్కోవటమే ‘సంసారిక గీత’. ఇక్కడ ఎవరికి ఎవరు ఉపదేశం చేశారన్నది కాదు.. ఎంతలా ఆ ఉపదేశసారం సంసారంలో ఇంకిపోయిందనేదే ముఖ్యం. అవస్థలు, కష్టాలు, ఆనందాలు, బాధ్యతలు, బరువులు, అనుకోవటాలు, ఆశించటాలు, అవరోధాలు, అనుమానాలు, అవమానాలు, ఆలనా పాలనా, పెంపకాలు, విసుక్కోవటాలు, కసురుకోవటాలు, నిందించుకోవటాలు, కోపగించుకోవటాలు, కూడబలుక్కోవటాలు, అగ్రిమెంట్లు, కాంప్రమైజ్‌లు.. ఓహ్.. ఒక్కటేమిటి ఎన్నో ఎగసిపడే అలలమధ్య భార్యాభర్తల జీవితం మరో మూడు పదులో, నాలుగు దశాబ్దాలో జతకలవటంతో షష్ఠిపూర్తికి చేరుకుంటుంది. విశ్రాంత జీవనం దిశగా అడుగులు పడటం ప్రారంభమవుతుంది.

మరింత గా పెద్దదైన కుటుంబం, అల్లుళ్లు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, కన్నపిల్లల వియ్యంకులు.. ఈ బాంధవ్యాల మధ్య ‘సీనియర్ సిటిజన్స్’ అనిపించుకునే దశలో మరింతగా విస్తరించిన భార్యాభర్తల వ్యవస్థ. ఇంతకాలం తామే ఇంటి పెద్దలు... ఇప్పుడు తమ పిల్లలే ఇంటి పెద్దలు. వారి ఆలోచనలకు, వారి ఆశయాలకు అనుగుణంగా ఆచరణకు సాధ్యమవ్వాల్సిన జీవనదశ. ఈ దశలో ఎక్కడ అపృశ్రుతి పలికినా- ఈ దశ వృద్ధాశ్రమ దిశగా పయనమవ్వాల్సి ఉంటుంది.

అందరూ కళ్లముందే ఉంటారు. కానీ, కడుపున పుట్టినవారి చూపు సైతం కరవవుతుంటుంది. ఒక్కొక్కపుడు గతంలోని అలక్ష్యవైఖరి మరో తరం రూపం కళ్లముందు ‘70 ఎంఎం స్క్రీన్’లో కనిపిస్తుంటుంది. అవును- జీవితం ‘పునరపి జననం పునరపి మరణమే’! అలాగే మన గత ఆలోచనలు, వ్యవహారాలు ఏదో రూపంలో పునరావృతమయ్యేవే! పునః జీవితానికి వచ్చేవే!

సమాజం సీనియర్ సిటిజన్స్ అంటూ అప్పుడప్పుడూ వేదికలు ఎక్కే అవకాశం ఇచ్చినా కుటుంబంలో మాత్రం ప్రేక్షక పాత్ర వహించాల్సిందే! మనం ఎంత గొప్ప ఉద్యోగం చేసినా మళ్లీ అదే ఆఫీస్‌కి పని పడి వెళ్లినపుడు మనం ఒకప్పుడు కూర్చున్న కుర్చీలో కూర్చునే అవకాశం దక్కదు. టేబుల్‌కు అటువైపు కాక ఇటువైపు కూర్చోవలసిందే! వెయిట్ చేయాల్సిందే! ఇంట్లోనూ ఇదే పరిస్థితి. వృద్ధాప్యంలో మనం ఇంటికి అధిపతులం కాదు. జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్‌మే. భూమి మాత్రమే కాదు, మన జీవితమూ తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది. ఇలా ఎన్నో దృశ్యాల మధ్య మనం మళ్లీ మళ్లీ జన్మిస్తుంటాం. వడలిన దేహనికి ఎన్ని ముడతలో.. అన్నీ అనుభవం మడతలే!

షష్ఠిపూర్తి సందర్భంగా దంపతులకు మళ్లీ పెళ్లిచేస్తుంటారు. అంటే మళ్లీ ‘నాతిచరామి’ అని మరోసారి ప్రామిస్ చేయమనా? అంతవరకూ ఆరోగ్యవంతమైన జీవితంలో కలసి బతికినట్టే ఇకమీదటా ఆరోగ్య, అనారోగ్య జీవితంలోను కలిసి మెలిసి బతకాలన్నదే ఈ ప్రామిస్ కాబోలు. కలిమిలేముల జీవితం నుండి వృద్ధాప్యంలోకి అడుగుపెడుతూ వృద్ధులు కావసిన తరుణంలోను కలిసిమెలసి ఉండగలం అని ఒకరికి ఒకరు సర్ది చెప్పుకోవటమా? వందేళ్ల బతుకు కోసం ‘త్వమేవాహం’ అని వంద శాతం తెలిసొచ్చే ఘట్టమే షష్ఠిపూర్తి ఉత్సవం.

ఆరు పదుల వరకు భార్యాభర్తలు ఎలాగోలా కలిసి బతికేసినా, అరవైల తర్వాత కలిసిమెలిసి బతికే తీరులో కచ్చితంగా మార్పు వచ్చి తీరవలసిందే. ఒకరికి ఒకరు సహాయకరంగా ఉండటమే కాదు, ఒకరికి మించి ఒకరు మరింతగా సహకరించుకుంటుండాలి.. కారణం జీవితం అష్టదిగ్బంధనం మధ్య కురచైపోతుంటుంది కాబట్టి.

వృద్ధాప్య దశలోనూ వ్యాపకాలు, లక్ష్యాలు, ఆశయాలు అవసరం. అవే భావి జీవితాన్ని దిశానిర్దేశం చేస్తాయి. మెదడుకు మేత అవుతాయి. ఉత్సాహంగా ఉండటానికి కావలసిన శక్తినిస్తాయి. ఎంత వయసులోనైనా శక్తి అనేది స్వతహాగా పుట్టుకురావలసిందే తప్ప ‘ఎనర్జీ డ్రింక్స్’తో వచ్చేది శారీరిక బలమే తప్ప మానసిక ఉత్సాహం కాదు. ఏదైనా చెయ్యగలం అన్న తపనకు దేహం అడ్డంకి కాదు. మనసు శూన్యం కాకుంటే ప్రతిదీ తపస్సే. కాబట్టి ముప్ఫయ్‌లలో భార్యాభర్తలది లౌకక సంసారం.

అరవైల తర్వాత భార్యాభర్తల జీవితం-

* స్నేహభరితమై జీవితం వికసించాలి.

* ఆధిక్యతా భావాలు పూర్తిగా తొలగిపోవాలి

* అహంకారానికి, అహంభావానికి దూరంగా ఉండాలి.

* ఆదరణకు, ఆచరణకు ప్రతిబింబం కావాలి.

* చులకన భావంతో గాక పరస్పరం గౌరవించుకుంటుండాలి.

* సంయమనంతో ఎవరి ‘స్పేస్’లో వారు ఉండాలి.

* ఖర్చుల నిమిత్తం ఇద్దరి దగ్గరా డబ్బు ఉండాలి.

* సేవింగ్స్ వివరాలు ఇద్దరికీ తెలిసి ఉండాలి.

* ఇద్దరి అనారోగ్య వివరాలు ఇద్దరికీ తెలిసి ఉండాలి.

* డబ్బు విషయంలో దాపరికాలు అనవసరం.

* అనవసర భేషజాలు ఏ మాత్రం పనికిరావు.

* గొప్పలకు పోయి ఆర్థిక కష్టాలు కొనితెచ్చుకోకూడదు.

* ఫాల్స్ ప్రిస్టేజ్ పనికిరాదు. ఆర్భాటంవల్ల నష్టమే. వయసురీత్యా జరిగే శారీరక మార్పులవల్ల స్ట్రెస్, యాంగ్జయిటీ, డిప్రెషన్‌లు తప్పవు.. కూల్‌గా ఉండటానికి మెడిటేషన్ వంటి మార్గాలను అనుసరించాలి.

"కృష్ణ” -- డా. సిహెచ్. సుశీల

ఎదురుగా గోడకు తగిలించివున్న పెద్ద లామినేషన్ వంక చూస్తోంది వేదసంహిత. లాస్ట్ యియర్ కంపెనీవాళ్ళు తనకు బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది యియర్ అవార్డ్ ఇస్తున్న ఫోటో. బంగారంలాంటి ఛాయతో ఎంత అందంగా వుంది తను! కళ్ళనిండ ఆత్మవిశ్వాసం. ఆ చిరునవ్వులో తృప్తి. ముఖమంతా సంతోషంతో వెలిగిపోతోంది. జ్ఞాపకాల పొరల్లో తనకెన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి. వాటన్నిటిలో ఇది తనకు చాల యిష్టం.

అయిష్టంగా తనవైపు చూసుకొంది. నల్లగా... అసహ్యంగా...! తనంటేతనకే ద్వేషంపుట్టించేలా... నల్లటి నలుపు.

అమ్మానాన్న మంచిరంగు. వాళ్ళవల్ల తనకూ మంచిరంగు వచ్చింది. చిన్నప్పటి నుండి అమ్మ ఎంతో శ్రద్ధ తీసుకుని అప్పుడేతీసిన వెన్నతో వళ్ళంతా మర్దనచేసి, ఇంట్లో తయారుచేసిన సున్నిపిండి తో నొలిచి, ఆయుర్వేదసబ్బుతో రుద్దేది. గానుగనుండి తెచ్చిన స్వచ్ఛమైన కొబ్బరినూనెతో తలంతా కుదుళ్ళకు పట్టించి, కుంకుడుకాయలరసంతో వారంవారం తలంటుపోసేది. రోజురోజుకి అందంగా, మంచివన్నెతో నిగనిగలాడే తనని చూసి మురిసిపోయేది. నాన్నేమో చదువులో ప్రతిఅడుగులో తోడుగా నిలిచేవారు. బి.టెక్. కంప్యూటర్ సైన్స్ మంచిమార్కులతో పూర్తి చేసి, మంచి కంపెనీలో మంచి జీతంతో చేరింది. వర్క్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకొంటోంది.

చదువుకొనే రోజుల్లో తనవైపు ఆరాధనతో చూసేకళ్ళు. అభిమానంతో చూసేకళ్ళు. ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు మళ్ళీ మళ్ళీ తిరిగి చూసేకళ్ళు. నవ్వుకునేది. నిత్యం ప్రేమసందేశాలు. ఏనాడు పట్టించుకోలేదు తను. ‘వేదసంహిత’ అంటే అందానికి, ఆనందానికి, అద్భుతానికి నిదర్శనం. ఏదో గంధర్వలోకం నుండి ఈ భూమ్మీదకు వచ్చిన తనకు కాబోయే, రాబోయే వరుడు మరో గంధర్వుడై వుండాలన్న భావం ఏదో మనసులో వుందేమో ఎవరినీ లెక్కచేసేదికాదు. అలాగని తనకు గర్వంలేదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కలుపుగోలుగా వుండేది. స్నేహపూరితమైన, ఆహ్లాదభరితమైన తన ప్రెజన్స్ అందరికీ ఇష్టంగా ఉండేది.

ఎప్పటిలా స్కూటీమీద ఆఫీసుకెళ్ళి వచ్చాక ఒకరోజు చేతులు కమిలినట్టుగా అన్పించి, మంచిక్లెన్సర్ తో రుద్ది, మాయిశ్చరైజర్ రాసుకొంది. రోజురోజుకి అది పెరిగి చర్మం నల్లగా మారిపోతుండడం అమ్మ గమనించి కంగారుపడింది. ‘పర్లేదులే అమ్మా’ అంటూ ఫుల్ గ్లౌస్ కొనుక్కొని, ఎండతగలకుండా బండిమీద వెళ్ళేది.

కాని ముఖం మీద, మెడ మీద నలుపు మచ్చలు రావడంతో తనకూ భయమేసింది. వెంటనే ఖరీదైన ఆరోమా ఆయిల్స్ తో ఫేషియల్స్ చేయించుకొంది. నెలతిరిగే సరికి నల్లగా మారిపోయింది చర్మం. “క్రీమ్స్ తో తగ్గేది కాదమ్మా. డాక్టర్ సలహా అవసరం” అని నాన్న డెర్మటాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు.

“మీ యూత్ కి ప్రతిదీ కంగారే” అని నవ్వారు డాక్టర్. ఏమీ పరవాలేదు అంటూ ఫేస్ వాష్ లు, మాయిశ్చరైజర్స్, లోషన్స్, ఆయింట్మెంట్స్, చాల ఖరీదైనవి రాసారు. అందరికంటే డెర్మటాలజిస్ట్ లకే ఎక్కువ ఆదాయంలావుంది అనుకొంది ఇరవైవేలు దాటిన బిల్లు చూసి. వారం రోజుల్లో తగ్గిపోతుంది గ్యారంటీగా అన్నారు. కాని నెల తర్వాత కూడ తగ్గకపోగా, ఎక్కువైంది.

ప్రతిఒక్కరు ‘అయ్యో ఏమిటిలా అయిపోతున్నావ్’ అంటున్నారు. కొందరు సంస్కారంతో పైకి ఏమీ అనలేకపోయినా కూడ కళ్ళతో ప్రశ్నిస్తున్నారు. తిక్కకుదిరింది అనుకున్నారేమో. అప్పుడు మొదటిసారి చాల భయపడింది తను. “స్కిన్ కాన్సర్” కాదుకదా. గబగబా యూట్యూబ్ లో అంతా తిరగేసి, అల్లోపతి లాభంలేదని, ఆయుర్వేదానికి వెళ్ళింది. చర్మంలో మెలనైన్ ఎక్కువైంది అంటూ ఏవో పొడులు, చూర్ణాలు, గోళీలు యిచ్చారు. పథ్యం చాల కఠినంగా వుంది. అయినా అమ్మానాన్న తనచేత పాటింపజేసారు.

మరోనెల. పూర్తిగా నల్లటినలుపు వచ్చేసింది. అవమానం. అసహనం. అయోమయం. ఆలోచనాశక్తిని పూర్తిగ కోల్పోయిన ఒకానొక శూన్యం. జాబ్ కి రిజైన్ చేసేసింది. బైటకు వెళ్ళడం పూర్తిగా మానేసింది. కొలీగ్స్, ఫ్రెండ్స్ చేసే ఫోన్స్ తీసుకోవడంలేదు. కొందరు దగ్గరైన ఆప్తుల ధైర్య వచనాలు, హితోపదేశాలు విసుగు పుట్టిస్తున్నాయి. ఒడ్డున కూర్చొని ఎన్నైన చెప్తారు, మునిగేవారికి తెలుస్తుంది అనుకొంది కసిగా.

ఇదే రూం....ఇదే లాప్ టాప్. కాలేజ్ లోవి ఎన్ని అందమైన ఫోటోలు! ఆ ఫోటోలు చూస్తూ గతంలో బ్రతుకుతోంది. వర్తమానం భయం. భవిష్యత్ శూన్యం. గతంలో వేదసంహిత ఓ చైతన్య తరంగం. అందనంత ఎత్తులో మిలమిల మెరిసే నక్షత్రం. ఇప్పుడు... మసిబొగ్గు...! వైద్య రంగంలో ఉన్న అన్ని విధానాలు వాడింది. లాభంలేదు. అన్నీ మానేసింది. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ కొన్నేళ్ళు ఒకేగదిలో పాత సి.డి. చూసినట్టు .... ఇదే గదిలో... ఇదే లాప్ టాప్ లో... ఫోటోలు చూస్తూ తను రెండేళ్ళుగా.

తన డిప్రెషన్ చూసి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు నాన్న. ఆవిడ చెప్పేది వింటుంటే ఒళ్ళు మండిపోయింది. ఈ ‘పెద్దమనుషులు’ చెప్పే ఉపన్యాసాలు వింటుంటే చేతికందిన వస్తువులన్నీవిసిరి కొట్టాలనిపిస్తుంది. ‘నాకు పిచ్చి లేదు’ అని జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. తనను పలకరించడానికే అమ్మానాన్న భయపడుతున్నారు. ఎంతో నిర్లిప్తంగా మారిపోయారు నాన్న. ఎప్పుడూ కడిగిన ముత్యంలా వుండే అమ్మ తనేం అనుకుంటుందోనని శుభ్రంగా తయారవడమే మానేసింది.

ఎప్పుడూ లాప్ టాప్... అందమైన ఫోటోలు... చేజారిపోయిన గతం. ఈమధ్య “నీ కాళ్లను పట్టుకువదలనన్నవి చూడే నాకళ్ళు...” అన్న పాటను చూడబుద్దేసింది. ఆడపిల్ల కళ్ళమీద పాటలు వినింది కాని, కాళ్ళని చూసి పడిపోవడం... పాటపాడడం...! సిరివెన్నెలగారు గ్రేట్. ఫైనలియర్ లో టూర్ కి బాంబే వెళ్ళినప్పుడు అక్కడ తెల్లటి ఫ్రాక్ ... అక్కడక్కడ బ్లూ కలర్ డాట్స్ వున్నది కొని వేసుకొంది తను. అసభ్యంగా లేదు. శిల్పం లాంటి తన శరీరానికి సరిగ్గా సరిపోయింది. కాళ్ళకి ఎప్పటి కంటే ఎక్కువ మాయిశ్చరైజర్, లోషన్ రాసుకొంది. నడుస్తుంటే , సూర్యకిరణాలు పడి, మెరుస్తూ అందరి కళ్ళనీ ఆకర్షించేసాయి తన కాళ్ళు.

ఆలోచనల నుండి బయటపడి న్యూస్ చూసింది. అదేమిటో కరోనా...! ప్రపంచమంతా కరోనావ్యాధితో వణికిపోతోంది. రోజురోజుకి భూగోళమంతా వ్యాపించిపోతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువైపోతున్నాయి. వాక్సిన్ రాలేదింకా. చివరికి ఏంచేయలేక అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అందరూ ప్రాణభయంతో ఇళ్ళకే పరిమితమైపోయారు. లాక్ డౌన్ లో చూస్తూచూస్తూనే రెండునెలలు గడిచిపోయాయి. ఇంటికే పరిమితమైపోయి అందరూ అల్లాడిపోతున్నారట. సర్లే. రెండేళ్ళ నుండి క్వారంటైన్ తనకు తానే విధించుకుంది. స్క్రోల్ వస్తోంది. ఈరోజే కరోనాకి విరుగుడు వాక్సిన్ కనుగొనబడిందట. త్వరలోనే ప్రపంచమంతా వినియోగం లోకి తెస్తారట. పైగా కఠినంగా లాక్ డౌన్ పాటించడం వల్ల మరణాలు తగ్గాయి, స్ప్రెడ్ అవడం పూర్తిగ తగ్గాయట. త్వరలో లాక్ డౌన్ ఎత్తేస్తారట.

ఆ సందర్భంగా స్పెషల్ స్టోరీ వస్తోంటే చూస్తోంది వేదసంహిత. ఎంత ఘోరం! అన్నిదేశాల్లో గుట్టలు గుట్టలుగా శవాలు. అయినవాళ్ళు వున్నా అనాధశవాల్లా...! ఖననానికి దహనానికి ఎవ్వరూ ఒప్పుకోకపోవడం... అంతిమసంస్కారాలకు క్యూలట. కొందరైతే తాము క్వారంటైన్ లో నుండి, తమవాళ్ళు ప్రాణాలు కోల్పోవటం టి.వి.ల్లో చూడడం...! ఎంత నరకం! చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది.

అన్నిటికన్నా ముఖ్యంగ చెప్పుకోవాల్సింది వైద్యబృందం. అనిర్వచనీయమైన త్యాగం. తమకు సోకుతుందని, చచ్చిపోతామని తెలిసీ కొన్ని వేలమందికి వైద్యంచేస్తున్న డాక్టర్లు, నర్సులు. ఒక కార్టూన్ లో — యమభటులు వచ్చి వినయంగా చేతులు కట్టుకుని గౌరవంగా “ ఇక వెళ్దామా డాక్టర్ గారూ” అంటుంటే , కర్తవ్యదీక్షలో వున్న డాక్టర్ “ ఈ ఒక్క పేషంట్ ని చూసి వస్తాను” అంటున్నారు. కళ్ళ ముందు నడిచే దైవాలు కదా ! వారి ముందు తనెంత!

రెడ్ జోన్స్ గా ప్రకటించబడిన ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్యకార్మికుల ధైర్యం ముందు తనెంత! ఆ శ్రమైకజీవన సౌందర్యం ముందు తననుకుంటున్న సౌందర్యమెంత! బైట ఎవ్వరూ తిరగకుండా నిరంతరం ఎండలో డ్యూటీ చేస్తున్న పోలీసుల దీక్ష ముందు తన బాధ, దుఃఖం ఎంత!

కళ్ళ వెంట నీరు కారిపోతోంది. ఏమైంది తనకు!

తన అందం కంటే తన వ్యక్తిత్వం గొప్పదని అమ్మానాన్నే కాదు, చాలమంది అనేవారు. ఆ వ్యక్తిత్వం ఏమైపోయింది? ఈ త్యాగధనుల హృదయసౌందర్యం ముందు తన సౌందర్యంఏపాటిది! అసలా బంగారుఛాయలో సౌందర్యముందా! అత్యంత సేవా సౌందర్యరాశి మదర్ ధెరెసా కాదా!

చిన్నప్పటినుండి అమ్మానాన్నలతో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళేది. ఆప్రసాదాలంటే తనకెంతో ఇష్టం. కాని కృష్ణతత్వాన్ని గుర్తించలేక పోయిందా! “కృష్ణ” వర్ణం ఎంత అందంగా వుంటుంది! దానికేగా గోపికలందరూ ముగ్ధులైపోయారు. “ కృష్ణ” పేరుగల ద్రౌపదికి ఐదుగురు భర్తలు వశులై పోయారంటే ఆ వర్ణం చూసి కాదు, వ్యక్తిత్వం చూసి అని నాన్న చెప్పేవారు. తనకూ నీలివర్ణమంటే ఇష్టం. తనకున్న డ్రస్సుల్లో చాలవరకు నీలివర్ణమే ఎక్కువ.

అనంతమైన ఆకాశం నల్లనిది. అగాధమైన సాగరం నల్లనిది. “ నల్లనివాడా! నే గొల్లపిల్లనోయ్! పిల్లనగ్రోవూదుమా నా ఉల్లము రంజిల్లగా...” చిన్నప్పటి పాట గుర్తుకొస్తోంది. రెండేళ్ళుగా గడ్డకట్టుకుపోయిన భావాలు కరిగి కరిగి ప్రవహిస్తున్నాయి కన్నీటి రూపంలో.

కృష్ణా! ఈ కరోనాను తెచ్చింది నువ్వేనా! దాన్ని అంతమొందించేది నువ్వేనా! ప్రకృతిని నిర్లక్షంగా నాశనం చేస్తున్న మానవాళికి బుద్ధి చెప్పాలనుకున్నావా! ఈప్రపంచంలో... ఈదేశంలో... ఈవూళ్ళో ... ఈగదిలో వున్న పిపీలికం లాంటి ఈ వేదసంహిత కి, ఈ అల్పజీవికి బుద్ధి చెప్పింది నువ్వేనా! శ్వేత వర్ణం...కృష్ణ వర్ణం...హూ. అంతా "కృష్ణ మాయ"! లేచి అద్దం ముందు నిలబడింది.

ఇప్పుడు ఈ నల్లటి నలుపు అసహ్యంగా కనిపించడంలేదు. పైన రంగు మాత్రమే మారింది. నాలోని “నేను” నేను గానే వున్నాను. ఎందుకు బాధ, దిగులు! వందల్లో రోగులకు వైద్యంచేసి , తనకూ వ్యాధి సోకిందని, చనిపోతున్నానని తెలిసి ఇంటి కొచ్చి బైటనుండే భార్యాబిడ్డల్ని చూసి మౌనంగా వెళ్ళిపోయిన మహర్షిలాంటి డాక్టర్ కంటే తన అందం ఏవిధంగా గొప్పదని ఇంతలా బాధపడిపోతోంది!

కర్తవ్య నిర్వహణలో ప్రాణాలకు తెగించి కరోనా బాధితుల్ని కాపాడిన ఎంతోమంది ముందు తనెంత అల్పురాలు! తన చదువు, మేధస్సు ఎవరికీ ఉపయోగించకుండా గదిలో కూర్చొని ఏడుస్తూ, ప్రపంచాన్ని తిట్టుకుంటూ రెండేళ్ళు హింసపెట్టుకుంది ఆత్మని. లేదు లేదు ... హత్య చేసుకుంటోంది ఆత్మని.

బాత్ రూం లోకి వెళ్ళి శుభ్రంగా స్నానంచేసింది. ఇన్నాళ్ళూ తన అందమైన మనసును భరించిన ఈ శరీరాన్ని యిష్టంగా తాకి రుద్ది రుద్ది స్నానం చేసింది. బుర్రలో పేరుకుపోయిన మకిలి అంతా పోయేలా తలారా స్నానంచేసింది. ఎంతో హాయిగా వుంది. తనకిష్టమైన నీలంరంగు డ్రస్ ని ఇప్పుడు మరింత యిష్టంగా వేసుకొంది.

తలుపుతీసి బైటకు వచ్చింది. నిర్లిప్తంగా, నిరాశగా కూర్చున్న అమ్మానాన్న కంగారుగా చూసారు ఏం ప్రళయం రాబోతోందో అన్నట్టు.

“లాక్ డౌన్ తీసేసారుగా అమ్మా! రెండేళ్ళుగా నేను కదలకుండా గదిలోనే కూర్చున్నా కదా, లావెక్కాను. రేపటినుండి జిమ్ కి వెళ్తాను” అంది నవ్వుతూ.

కరిగి నీరైపోతున్నట్టు గబాల్న వచ్చి కౌగిలించుకొంది అమ్మ. నాన్న వైపు చూసింది. బహుశా తను భూమి మీద పడ్డరోజు, ఆ క్షణంలో నాన్న ఇంత అబ్బురంగా, మురిపెంగా చూసి వుంటారు అనిపించింది. ఆయన్నిప్పుడు చూస్తుంటే. ముందుకువచ్చి తన తల మీద ఆప్యాయంగా వేసిన నాన్న చేతిపై తన చేతిని వుంచింది.

“నా టాలెంట్ కి ఇంకా మంచి జాబ్ వస్తుంది కదా నాన్నా” అంది ఆత్మవిశ్వాసం నిండిన స్వరంతో.

“ అవును నాన్నా” అన్నారు నాన్న.

“ యస్. ఐ కెన్” అంది వేదసంహిత చిరునవ్వుతో.

ఆ నవ్వు చాల అందంగా వుంది తెల్లగా, స్వచ్ఛంగా....!!

Posted in April 2021, కథానికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *