Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఔ)

ఆచార్యుడు కాని ఇతర గురువులు, ఉపాధ్యాయులు, తన బంధువులలోని పెద్దవారైన పినతండ్రి, పెదతండ్రి మొదలైన వారు, అధర్మాన్నుంచి తనను ప్రతిషేధిస్తూ (నివారిస్తూ), తనకు హితములు బోధించే వ్యక్తులకు కూడా, వారు తనకు కనిపించినప్పుడు ఒక బ్రహ్మచారి ఇదే రీతిలో అభివాదం చెయ్యాలి.

విద్యలోనూ, తపస్సులోనూ తనకంటే పెద్దవారిని బ్రహ్మచారి తన గురువును గౌరవించినట్లే గౌరవించాలి. అలాగే తన గురువుకు సజాతి స్త్రీయందు జన్మించిన, తనకంటే పెద్దవారైన గురుపుత్రులను తన గురువును గౌరవించినట్లే గౌరవించాలి. గురువు బంధువులలో పెద్దవారిని మాత్రమే కాదు; తన బంధువులలోనూ పితృవ్యుడు (తండ్రి తోడబుట్టినవాడు) వంటి పెద్దవారిని కూడా గురువును గౌరవించినట్లే గౌరవించాలి.

తన వయస్సు వాడైనా లేక తనకన్నా వయసులో చిన్నవాడైనా గురుపుత్రుడో లేక తనతో కలిసి తన గురువు వద్దనే విద్యనభ్యసిస్తున్న మరొక విద్యార్ధిగానీ, తనకు వేదాధ్యాపనము చేయించగలిగిన వాడైతే అతడిని శిష్యుడు గురువును గౌరవించినట్లే గౌరవించాలి. అలాగే యజ్ఞకర్మలలో ఋత్విజునిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిని లేక కేవలం యజ్ఞం చూసేందుకు వచ్చిన వ్యక్తిని తన గురువుతో సమానునిగా భావించి గౌరవించాలి.

గురువు ఎక్కడికైనా పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు తన కుమారునికి గానీ, లేక శిష్యులలో తెలివైన లేక సమర్ధుడైన విద్యార్థికిగానీ తన శిష్యుల అధ్యాపన బాధ్యతలు అప్పగించి వెళ్లే సందర్భాలు కూడా అప్పుడప్పుడూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి గురుపుత్రుడు లేక అధ్యాపన బాధ్యతలు నిర్వహించే తన సహవిద్యార్థి ఒక శిష్యునికంటే వయస్సులో చిన్నవాడు అయ్యే అవకాశమూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా శిష్యులు ఆ వ్యక్తిని గురువును గౌరవించినట్లే గౌరవించాలని నియమం. గురువు స్వల్పకాలంపాటు లేకపోయినా గురుకులంలో అధ్యాపనం నిరంతరాయంగా సాగడం కోసం ఈ నియమం రూపొందించబడింది. అలాంటి విద్యార్థిని తోటి విద్యార్థులందరూ వయస్సుతో నిమిత్తం లేకుండా గురువుతో సమానునిగా భావించి, గౌరవించాలి. ఇటీవలి కాలం వరకు గురువు లేనప్పుడు తరగతి గదిలో విద్యార్థులను అదుపు చేయడం కోసం ఉపాధ్యాయుడు క్లాస్ ప్యూపిల్స్ లీడర్ (Class Pupils’ Leader - C.P.L.) గా ఒకరిని నియమించడం మన పాఠశాలలలోనూ ఉండేది.

ఉత్సాదనం చ గాత్రాణాం స్నాపనోచ్ఛిష్టభోజనే |
న కుర్యాద్గురుపుత్రస్య పాదయోశ్చావసేచనమ్ || ( 2- 209)

గురుకులంలో చదువుకుంటున్న శిష్యులు గురుపుత్రుడి శరీరానికి ఉత్సాదనం (నలుగు పెట్టడం), స్నపనము లేక స్నాపనము (స్నానం చేయించడం), ఉచ్ఛిష్ట భోజనం (అతడు తిని వదిలేసిన ఎంగిలి అన్నాన్ని తినడం), గురుపుత్రుని పాదములకు అవసేచనం (కాళ్ళు కడగడం) వంటివి చేయరాదు.

దీనినిబట్టి ఒకటి స్పష్టమౌతున్నది. గురువు శరీరానికి నలుగుపెట్టడం, ఆయనకు ఒళ్ళురుద్ది స్నానం చేయించడం, గురువు తిని వదిలేసిన ఎంగిలి అన్నాన్ని తినడం, గురువు పాదాలు కడగడం వంటి పనులు ఆ కాలంలో గురువు దగ్గర విద్యనభ్యసిస్తున్న శిష్యులు చేసేవారనేది సుస్పష్టం. ఒకవేళ గురువు లేని సమయాలలో గురుపుత్రుడు కూడా శిష్యులచేత ఈ పనులన్నీ చేయించుకునే అవకాశం ఉంది కనుక శిష్యులు అలా చేయకూడదని ఈ నియమం పెట్టారన్నమాట.

శిష్యులు సవర్ణలైన (సజాతీయులైన) గురు యోషితలను (గురు పత్నులను) గురువువలె గౌరవించి, పూజించాలి. వేరే వర్ణానికి చెందిన స్త్రీలను గురువు వివాహం చేసుకుంటే, అలాంటి అసవర్ణ గురు పత్నులకు శిష్యులు ప్రత్యుత్థానం చేసి (లేచి నిలబడి) అభివాదం (నమస్కారం) చేస్తే సరిపోతుంది.

శిష్యుడు గురుపత్నికి అభ్యంజనం (తలంటడం), స్నాపనం (స్నానం చేయించడం), గాత్రోత్సాదనం ( తైల మర్దనం చేసి ఒంటికి నలుగు పెట్టడం), కేశ ప్రసాధనం (తల దువ్వడం) వంటి పనులు చేయరాదు.

గురుపత్ని యువతి అయినట్లయితే ఇరవై ఏళ్ళు నిండిన ఉచితానుచితాలు తెలిసిన శిష్యుడు ఆమె కాళ్ళు పట్టుకుని నమస్కరించకూడదు.

స్వభావ ఏష నారీణాం నరణా మిహ దూషణం |
అతోర్థాన్న ప్రమాద్యంతి ప్రమదాసు విపశ్చితః || ( 2- 213).

ఈ ప్రపంచంలో స్త్రీలు స్వభావరీత్యానే పురుషులను మోహింపజేసి వారిని చెడగొడతారు. కనుక వివేకులైనవారు స్త్రీల విషయంలో ఏమరుపాటు లేకుండా జాగరూకతతో వ్యవహరించాలి.

అవిద్వాంస మలం లోకే విద్వాంస మపివా పునః |
ప్రమదా హ్యుత్పథం నేతుం కామక్రోధ వశానుగం || (2- 214).

పురుషుడు నిరక్షరాస్యుడైనా, విద్వాంసుడైనా స్త్రీల వలలో తగులుకోవడం సహజం. ఎందుకంటే స్త్రీలు మూఢుడినైనా, విద్వాంసుడినైనా లోబరుచుకుని కామక్రోధాలకు బానిసగా చేసి, అతడిని చెడ్డ దారికి మళ్లించగల సమర్థులు.

మాత్రా స్వస్రా దుహిత్రా వా న వివిక్తాసనో భవేత్ |
బలవానింద్రియగ్రామో విద్వాంస మపి కర్షతి || ( 2-215)

ఇంద్రియముల సమూహము అతి బలీయమైనది. అది వివేకినైనను చెడుదారికి ఈడుస్తుంది. కనుక తల్లితో, సోదరితో, కూతుర్లతో అయినాసరే వివిక్తముగా (ఏకాంతంలో ఒంటరిగా) కూర్చొనరాదు.

వయసులో ఉన్న శిష్యుడు యౌవనవతియైన గురుపత్ని పాదములను తాకకుండానే భూమిమీద శాస్త్ర ప్రకారం సాగిలపడి అభివాదం చెయ్యాలి. యువకులు యౌవనవతులను తాకి పాదనమస్కారం చేయడం కాకుండా గౌరవసూచకంగా వారి పాదధూళిని తీసుకుని తమ శిరస్సుపై చల్లుకోవడం అనేది కూడా ప్రాచీన కాలంలో ఒక ఆనవాయితీగా ఉండేది. పాదములు పట్టుకుని లేక తాకి నమస్కరించడం యౌవనంలో ఉన్న స్త్రీ పురుషులకు కామవికారాలు కలిగించే అవకాశమున్నందున ఈ తరహా నియమాలు రూపొందించి ఉంటారు. దేశాంతరం వెళ్లి వచ్చినప్పుడు పెద్దలు పాటించిన ధర్మం ప్రకారం గురువు భార్యకు తన కుడి చేతితో ఆమె కుడి పాదమును, తన ఎడమచేతితో ఆమె ఎడమ పాదమును పట్టుకుని ప్రతి దినము అభివాదం చెయ్యాలి.

పారతో బావిని త్రవ్వే మానవుడు నీటిని పొందుతాడు. అదేవిధంగా గురువుకు శుశ్రూషలు చేసే శిష్యుడు గురువు దగ్గరనున్న విద్యను పొందుతాడు.

బ్రహ్మచారి శిరోముండనం (తల బోడి గుండు) చేయించుకునిగానీ, జటిలునిగానో అంటే జడలు పెంచుకునిగానీ (జటా అంటే జడ. జడలు పెంచుకున్న బ్రహ్మచారి లేక సన్యాసిని ‘జటి’ అనీ ‘జటిల’ అనీ అంటాం.) లేక శిఖా జటుని గానో (శిఖా అంటే పిలకను ముడి లేక జడగా వేసుకున్నవానిగానో) ఉండాలి. ఏ గ్రామంలోనైనా బ్రహ్మచారి పడుకున్నప్పుడు సూర్యుడు ఉదయించడంగానీ, అస్తమించడంగానీ జరగరాదు. అంటే సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మచారి నిద్రలేవాలి. సూర్యాస్తమయానికి ముందు బ్రహ్మచారి నిద్రపోకూడదు.

అలా ఎవరైనా బ్రహ్మచారి మైమరచి నిద్రిస్తున్నప్పుడు సూర్యుడు ఉదయించడం జరిగితే గాయత్రీ జపం చేస్తూ, పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయాలి. ఒకవేళ బ్రహ్మచారి నిద్రిస్తున్న సమయంలో సూర్యాస్తమయం కనుక అయితే, ఆ మరుసటి రోజంతా గాయత్రీ జపంచేస్తూ ఉపవాసం చేయాలి. బ్రహ్మచారి మైమరచి నిద్రించే సమయంలో సూర్యుడు ఉదయించినా, అస్తమించినా అతడికి పాతకం చుట్టుకుంటుంది. కనుక అతడు ప్రాయశ్చిత్తం చేసుకుని తీరాలి. లేకుంటే అతడికి మహతైనసము (గొప్ప పాపం) చుట్టుకుంటుంది. (మహత్ + ఏనసా = మహతైనసా). ఏనస్సు అంటే పాపము. ఆచమనం చేసి, పరిశుద్ధుడై, రోజూ ఇక వేరే ఆలోచనలనేవి లేకుండా ఉదయ మరియు సాయం సంధ్యా కాలాలలో పరిశుద్ధ ప్రదేశంలో కూర్చుని శాస్త్రప్రకారం గాయత్రీ మంత్రం జపించాలి.

బ్రహ్మచారి అన్నల భార్యలు, అలాగే గురుపత్నులు సజాతి (సవర్ణ) స్త్రీలు అయితేనే వారికి విధి ప్రకారం అభివాదం చెయ్యాలని మనువు విధించిన నియమం నాటి పురుషాధిక్య సమాజంలో స్త్రీల పట్ల ఉన్న స్పష్టమైన వివక్షను సూచిస్తున్నది. అలాగే సజాతి స్త్రీకి జన్మించిన గురుపుత్రులను మాత్రమే గురువుతో సమానంగా గుర్తించి, గౌరవించాలనే నియమం కూడా స్త్రీల పట్ల మనువుకున్న వివక్షనూ, సంకుచిత వర్ణాధిక్యతా భావాన్ని సూచిస్తున్నది. గురు పత్నులలో పూజనీయత కేవలం సవర్ణ గురుపత్నులకేననే విషయం కూడా స్త్రీలపట్ల మనువుకున్న వివక్షకే తార్కాణంగా నిలుస్తున్నది. వయసులో ఉన్న గురుపత్నిని యౌవనంలో ఉన్న బ్రహ్మచారి ఆమె పాదాలను తాకకుండా భూమిపై సాగిలబడి ప్రణామం చేయాలనే తరహా నియమాల గురించి చెప్పేటప్పుడు మనువు కేవలం స్త్రీలు చంచల మనస్తత్వం కలవారని, స్వభావరీత్యానే వారు పురుషులను చెడగొడతారని పేర్కొనడం కూడా మనువుకు స్త్రీల పట్ల ఉన్న వివక్షకు మరో దృష్టాంతం. కామాతురులైన స్త్రీ పురుషులకు భయము, లజ్జ ఉండవని ఆర్యోక్తి. కామోద్రేకం కలిగివుండే విషయంలో స్త్రీ పురుషులిరువురినీ సమానంగా తప్పు పట్టాల్సిన మనువు అలా చేయకుండా స్త్రీలు స్వభావరీత్యానే పురుషుడిని చెడగొడతారనీ, పురుషుడు నిరక్షరాస్యుడైనా, విద్వాంసుడైనా స్త్రీలు అతడిని లొంగదీసుకుని చెడు మార్గానికి మళ్లిస్తారని, వారి పట్ల వివేకులు ఏమరుపాటు లేకుండా, అప్రమత్తులై ఉండాలని పురుషులకు మాత్రమే సూచించడం కూడా మనువుకున్న వివక్షాపూర్వక వైఖరినే తెలుపుతున్నది. క్రైస్తవుల మత గ్రంథం ‘ బైబిల్’ లోని ఆది కాండము లో జ్ఞాన ఫలమును తినవద్దని దేవుడు విధించిన నియమాన్ని ఆ పండ్లు తినడం ద్వారా తాను ముందుగా ఉల్లంఘించి, పురుషుడిని కూడా ఉల్లంఘించమని స్త్రీయే ప్రేరేపించినట్లు చిత్రించి, స్త్రీలు స్వభావరీత్యానే పురుషుడిని చెడు మార్గానికి మళ్లిస్తారని పేర్కొనడం కూడా గమనార్హం. ఇది కూడా నాటి స్త్రీల పట్ల పురుషులకున్న వివక్షాపూర్వక వైఖరినే తెలియజేస్తున్నది.

***సశేషం***

Posted in April 2021, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *