Menu Close
మర్మదేశం (ధారావాహిక)

ఘాలి లలిత ప్రవల్లిక

ఘాలి లలిత ప్రవల్లిక

వెలుగులు పంచిన దినకరుడు అలసి సేదదీరే సమయాన్న అసురసంధ్యా లోలుడు తిమిరాస్త్రాలతో భానుని  పడమటి కనుమల్లోకి తరుముతున్నవేళ, పక్షుల కిలకిలా రావాలు చేస్తూ గూళ్ళకు చేరుకుంటున్నవేళ మల్లెల పరిమళాలతో పాటు సాయి హారతి పాటలు మోసుకొస్తున్నాయి పిల్లతెమ్మెరలు. రోడ్డుకు ఇరువైపులా పచ్చ తివాచీ పరచినట్లుగా వరి పైరు. ఆ తివాచీ పై పసిడి కాంతుల పాల కంకులు పిల్ల తెమ్మెరలు మోసుకొచ్చిన గీతానికి తలాడిస్తూ నాట్యం చేస్తున్నాయి.

బండిని లాగే ఎడ్ల మెడలోని మువ్వల రవళులు పదంకలిపి వీనుల విందు చేస్తున్నాయి. ఎడ్లబండిలో ప్రయాణం చేసే చరణ్ ప్రకృతి అందాలను తిలకిస్తూ పరవశించి పోతున్నాడు.

"అబ్బబ్బబ్బా .... ఇంకా ఎంత సేపు కూర్చోవాలి? నాకు నడుము పీకేస్తోంది." చిరాకుగా అంది చరణ్ తల్లి కౌసల్య.

"కాస్త ఓపిక పట్టు దగ్గరికి వచ్చేశాము” అన్నాడు చరణ్ తండ్రి కుమార్.

"ఆ వెధవ కారు ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? అంత పెద్ద ఊర్లో క్యాబ్ కూడా దొరకలేదు." విసుక్కుంది కౌసల్య.

కుమార్ ది సొంత ఊరు తామరకొల్లు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాడు. కొలీగ్ అయిన కౌసల్య ని ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతితో వివాహం చేసుకున్నాడు. పట్నం సౌకర్యాలకు అలవాటుపడిన కౌసల్యకి అత్తవారి ఊరంటే అసహ్యం. అందుకనే ఎప్పుడూ ఇక్కడికి రావాలన్నా సుముఖత చూపించదు. పండగలకు పబ్బాలకు కూడా రాకపోకలు తగ్గించేశారు. మరిది పెళ్ళికి తప్పదన్నట్లు వచ్చి ఓ వారం రోజులు ఉండటానికి నానా అవస్థ పడింది.

ఇదిగో మళ్ళీ ఇప్పుడు రాక తప్పలేదు. అనారోగ్యం కారణంగా కుమార్ తండ్రి మంచాన పడ్డాడు. కొడుకుని, మనవణ్ణి చూడాలను కోవడంతో..... కరోనా లాక్డౌన్.....వర్క్ ఫ్రొం హోమ్..... అన్నీ కలిసి రావడంతో వారు సొంతూరు ప్రయాణం కట్టారు. కారు కైకలూరు వచ్చేసరికి కదలనని మొరాయించింది. ఆ సమయంలో వారికి ఏ వాహనం దొరకలేదు. ఏదైనా వాహనం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్న తరుణంలో అనుకోకుండా ఆ దారిలో వెళుతున్న ఎడ్లబండి ఆగింది. అందులో ఉన్న వెంకన్న కుమార్ ని గుర్తు పట్టి పలకరించాడు. కుమార్ కూడా అతన్ని గవళ్ళ వెంకన్నగా గుర్తించాడు. పల్లెలో వాళ్ళ కులాన్నో వృత్తినో ఆధారంగా చేసుకొని వాటిని వాళ్ళ పేర్లతో కలుపుకుని పిలుచుకుంటూ ఉంటారు. వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు. ఆ ఆప్యాయమైన పిలుపుకి పులకరించిపోయాడు కుమార్. కారణం తెలుసుకున్న వెంకన్న తన బండిలో తీసుకెళ్తా రమ్మన్నాడు. కౌసల్య ముందు నిరాకరించినా కుమార్ ఒత్తిడి చేయడంతో ఎక్కక తప్పలేదు.

చరణ్ వీళ్ళకి ఒక్కగానొక్క కొడుకు టెంత్ క్లాస్ చదువుతున్నాడు. చరణ్ కి చాలా థ్రిల్లింగ్గా ఉంది ఎడ్ల బండి మీద వెళ్ళడం.

చిన్నప్పుడెప్పుడో వచ్చాడు తాతయ్య గారి ఊరుకి. మళ్లీ ఇప్పుడు వస్తున్నాడు.

అత్తయ్య కూతురు శర్వాణి. ఇప్పుడు ఎలా ఉందో? ఏం చదువుతోందో ఇప్పుడు? నన్ను గుర్తు పడుతుందో లేదో చూడాలి. అనుకున్నాడు చరణ్ మనసులో.

తామరకొల్లు పొలిమేరల్లోకి వచ్చేసింది బండి. ఎవరో వీళ్ళను చూసి పరుగున వెళ్ళి పరంధామయ్య గారి ఇంట్లో వీళ్ళు వస్తున్న సంగతి చెప్పారు. అంతే, ఇంట్లో ఉన్న చిన్నా పెద్దా అందరూ పరుగు పరుగున వీళ్ళకు ఎదురు వెళ్ళారు.

వీళ్ళని చూడగానే కుమార్ చరణ్ కిందకి దిగేసారు. వారిద్దరినీ ఆప్యాయంగా కౌగిలించుకుని ఇంటికి తీసుకొచ్చారు.

శర్వాణి కొంచెం పెద్దది అయ్యింది. ఎనిమిదో తరగతి చదువుతోంది. అలాగే చరణ్ వాళ్ళ బాబాయ్ కూడా కుటుంబంతో వచ్చాడు. బాబాయ్ కొడుకు కౌషిక్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. అందరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోటాలు, ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలుసుకోవడాలతో ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది. వాళ్లందర్నీ అలా చూసే సరికి పరంధామయ్య గారికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎంతో సంతోషపడ్డాడు. చరణ్ వచ్చాడు అని తెలిసి చరణ్ బాల్యమిత్రుడు దినేష్ గొల్లగూడెం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పిల్లలంతా బయట అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవటంలో మునిగిపోయారు. మిమ్మల్ని వదిలేస్తే ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేట్లున్నారు. కబుర్లు ఉంటే చాలా తిండితిప్పలు అక్కర్లేదా .... ఎరా దినేష్ ఇంట్లో చెప్పే వచ్చావా. అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళు చాలా పొద్దుపోయింది. రేపు పొద్దున్నే వద్దువు గానివి అంటూ దినేష్ ని ఇంటికి పంపించేసింది శర్వాణి వాళ్ళమ్మ చంద్రిక. కాళ్ళు చేతులు కడుక్కుని రండి భోంచేద్దురు గాని అని కేకేసింది కౌషిక్ వాళ్ళమ్మ విజయ. అమ్మా, మా అందరికీ కలిపి ముద్దలు పెట్టవా....ప్లీజ్.... బ్రతిమాలుతూ అన్నాడు కౌషిక్. అవును పిన్నీ, ఆరుబయట పండువెన్నెల్లో నీ చేతి ముద్దలు తింటుంటే ఎంతో బాగుంటుంది అన్నాడు చరణ్. చంద్రిక పిల్లలందరికీ ముద్దులు కలిపి నోట్లో పెట్టింది. మొత్తం అందరికీ ఆరుబయట వెన్నెల్లో చాపలు పరిచి పక్కలు ఎరేంజ్ చేసారు. కింద పాములు తిరుగుతాయి నేను పడుకోను అని కౌసల్య ఇంట్లోనే మంచం మీద పడుకుంది.

పిల్లలకైతే ఆ రాత్రి నిద్ర పట్టలేదు. చాలా సేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు. పెద్దలు అరవడంతో అందరూ బలవంతం గా కళ్ళు మూసుకుని నిద్ర లోకి జారుకున్నారు.

                                      *****

ఊరి చివరన కోనేరు గట్టు పై ఆడుకుంటున్న.. శార్వాణి, దినేష్, చరణ్ లకు ముసురుతున్న చీకట్లు  కనపడలేదు...

"అబ్బా ఇక్కడున్నారా మీకోసం ఊరంతా వెతకలేక చచ్చా.. రారా...అత్తయ్య నిన్ను తీసుకొని రమ్మంది" అంటూ రొప్పుతూ అక్కడికి వచ్చాడు కౌషిక్.

"నేను ఇంకొంచెం సేపు ఆడుకుని వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు” అంది శార్వాణి.

"ఇంకా ఎంతసేపు ఆడతారు నిన్ను వదిలేసి ఇంటికి వెళ్తే అత్తయ్య నన్ను అరుస్తుంది పద పోదాం" అన్నాడు కౌషిక్.

"అబ్బో కౌషిక్ గారు గది వదిలి బయటకు వచ్చారే" ఎగతాళిగా అన్నాడు దినేష్.

"ఒరే కౌషిక్ చీకటి పడుతున్నప్పుడు ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో తెలుసా రెండు కళ్లు తెరిచి చూడరా మా పల్లె అందాలను కంప్యూటర్లతో ను, వీడియో గేములను ఆడడం కాదురా ప్రకృతిలో ఏకమై ఆడుతూ ఉంటే కలిగే ఆనందం చెప్పలేమురా ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఎంత ఉత్సాహంగా ఉంటుందో తెలుసు కోరా” అన్నాడు చరణ్.

"సరే సరేలే పల్లెటూరి గబ్బిలాలు మీరు. నాకున్న నాలెడ్జ్ మీకు ఎక్కడుంది? అంతకన్నా ఎక్కువ మీరేం ఆలోచించలేరు. అయినా చరణ్ నువ్వు కూడా ఏంట్రా వీళ్ళతో?"వ్యంగ్యంగా అన్నాడు కౌశిక్.

"పోనీ లేరా మేము పల్లె గబ్బిలాలం.. ఏదో కొమ్మలు పుచ్చుకుని వేళ్ళాడుతాం..మీరు పట్నం గబ్బిలాలుగా ఇళ్ళూ దొరకవు, కొమ్మలు దొరకవు అందుకే యంత్రాలు పుచ్చుకుని వేళ్ళాడుతారు.." ఉక్రోషంగా అన్నది శార్వాణి . శార్వాణి వాళ్ళు ఆ ఊర్లోనే ఉంటారు.

“శార్వాణి ఊరుకో .... వాడేదో సరదాగా అన్నాడులే” అంటూ సముదాయించాడు చరణ్. ఒక్కసారిగావాళ్ళ చుట్టూ పెద్ద కాంతి వలయం ఏర్పడింది.

'వావ్...వాటే......గ్రేట్...' ఆశ్చర్యంగా చూసాడు కౌషిక్.

"ఇవాళ పౌర్ణమి కాదు ... చీకటి పడలేదు...అయినా ఈ వెలుగు ఎక్కడిది" ఆశ్చర్యపోయింది శార్వాణి.

అందరూ తలలు పైకెత్తి చూశారు.

ఆకాశంలో వెయ్యి అడుగుల ఎత్తులో రంగులు విరజిమ్ముతూ ఓ గుండ్రని ఆకారంలో ఎగురుతున్న ఒక వాయు శకటం. దాని అడుగు భాగం నుండి ఈ కాంతులు వెలువడుతున్నాయి. ఒక సెకనుకి వెయ్యి మైళ్ళు ప్రయాణించ గల వాయుశకటం అది. ఆరెంజ్ నీలం-పసుపు రంగులలో మెరుస్తోంది అది.

"ఓరి దేవుడో!! ఇదేదో మాయల భూతంలా ఉందిరో.... కొంపతీసి కొరివిదెయ్యమా ఏంటి" అంటూ భయపడుతూ కళ్ళు పెద్దవిచేసి అరచేతులు ఆనించి రెండు చేతులవేళ్ళూ పెనవేసి.... "గాలిలో దయ్యాలు జాడీలో కెళ్ళాల అంజన్న, మాకు అండగా ఉండాల" అని గొణుగుతూ వణికిపోతున్నాడు దినేష్.

“అమ్మో నాకు భయమేస్తోంది” అంటూ గబగబా కౌషిక్ వెనుకకు పరిగెట్టి కళ్ళు గట్టిగా మూసుకుని కౌషిక్ ను పట్టేసుకుంది శార్వాణి.

"హే....ఆపండి మీ గోల....దయ్యాలు లేవు, భూతాలు లేవు.... అవి U.F.O లాగా ఉంది". ఏదో గుర్తు తెచ్చుకుంటూ ఉన్నట్లుగా తలను చూపుడు వేలుతో కొట్టుకుంటూ అన్నాడు చరణ్.

“ఏంటి U.F.Oలా అంటే?” కుతూహలంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది శార్వాణి.

“Unidentified Flying Objects అని, ఎగిరే పళ్ళాలని అంటారు. ఇవి గుండ్రంగాను త్రికోణాకారంలోను ఉంటాయి” అని ఎప్పుడో తను లైబ్రరీల్లో చదివిన బుక్ లోని అంశాలను గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు చరణ్.

"అవునురోయ్. నువ్వు చెప్తే గుర్తుకు వచ్చింది. అందులో ఏలియన్స్ అనే వాళ్ళు ఉంటారు కదా..! భూమ్మీదకి అప్పుడప్పుడూ వస్తారుకదా.! బుగ్గలు లోపలికి పోయి పెద్ద పెద్ద కన్నులతో పొట్టిగా ఉంటారు కదా...! వాళ్ళను చూస్తేనే భయం వేస్తుంది... మొన్నొక సినిమాలో చూశా" అన్నాడు కౌషిక్.

"అరే...ఈ మూడంతస్తుల బిల్డింగ్..ఇక్కడ ఎప్పుడు కట్టారు....ఇది ఇప్పటిదాకా నాకు కనిపించలేదే" అని ఆశ్చర్యపోయాడు చరణ్.

“అవును ఈ బిల్డింగ్ ను నేనూ ఇంతకు ముందు ఇక్కడ చూడలేదు...ఏదో...మాయ లాగా ఉందే” అన్నాడు దినేష్.

ఆ బిల్డింగ్ వంక ఆశ్చర్యంగా చూస్తున్న శార్వాణి కి దాని మధ్యలోంచి నీలం, తెలుపు రంగులు కలిసిన ఓ వెలుగు కనిపించింది. ఆ వెంటనే ఆకుపచ్చరంగు లాంటి పొగమంచు చుట్టూరా వ్యాపించడం మొదలుపెట్టింది.

"ఓరిదేవుడా....! దయ్యాలు కూడా రంగులు...మారిపోతున్నారురా" ఆశ్చర్యంగా అన్నాడు దినేష్.

"నీ దెయ్యాల పిచ్చి తగలెయ్యా ఆపరా నీ గోల... గ్రహాంతరవాసులు జనసంచారం ఉన్నచోట దిగితే ఇలాగే ఆకుపచ్చరంగు పొగమంచు లాంటివి వదులుతారురా" అన్నాడు చరణ్.

“ఏం..? ఎందుకని..?” అమాయకంగా అడిగాడు దినేష్.

“ఆ మాత్రం గ్రహించలేవా..హా? వారు ఎవరి కంట పడకూడదని” అంది శార్వాణి ఎద్దేవా చేస్తూ...

“నీ అంత తెలివితేటలు నాకు లేవు లే” బుంగమూతి పెట్టాడు దినేష్.

కుక్కల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి..

“వాళ్ళు దిగినట్లు ఉన్నారు” అన్నాడు చరణ్.

“ఏరి ...?ఎక్కడ...? కనపడటం లేదుగా మనకి. ఎలా చెప్పావు?” అన్నాడు కౌషిక్.

“కుక్కలు కంటిపాప యొక్క ప్రత్యేక నిర్మాణం వల్ల ....అవి...ఆ ఆకుపచ్చ పొగ మంచుల్లో దాగున్న గ్రహాంతరవాసులు స్పష్టంగా చూడగలవు.... ఆ కుక్కల అరుపులు వింటున్నావుగా....” అన్నాడు చరణ్.

ఆ ఏలియన్స్ చేతిలో ఒక గొట్టంలాంటి పరికరాన్ని పట్టుకున్నారు అది ఇంచుమించు అర అంగుళం పొడవు 1.5 అంగుళాల వ్యాసం కలిగి ఉంది చూడటానికి అదో ఫ్లాష్ లైట్ లాగా కనిపిస్తోంది.

“అదిగో వారి చేతిలో ఉన్న ఆ లైట్ డివైస్ ని చూసారా దాన్నివాళ్ళు అత్యంత నైపుణ్యంతో తయారు చేశారు. అది వారికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ లైట్ నుంచి వచ్చే లేజర్ కిరణాలు శత్రువులను నాశనం చేస్తాయి. ముఖ్యంగా అందులోంచి వెలువడే పాలిపోయిన పసుపు రంగులో ఉన్న కిరణాలు మన మానవుల్ని అచేతనులను చేసి వాళ్ళను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగిస్తారు.

ఆ కిరణాలను గనుక మన కాళ్ళు చేతుల మీద ప్రసరింప చేస్తే అవి తాత్కాలికంగా చచ్చుబడిపోతాయి” అన్నాడు చరణ్.

“అమ్మో...!” అంటూ గుండెల మీద చేతులువేసుకుని కళ్ళు పెద్దవిచేసి భయంగా అంది శార్వాణి.

“ఏం భయపడకండి. వీడివన్నీ ఉత్తి మాటలు. మనకేదో లక్ష్మీగణపతి ఫిలింస్ చూపిస్తున్నట్లున్నాడు” అన్నాడు వ్యంగ్యంగా కౌషిక్.

“సర్లే.... నమ్మితే నమ్ము. లేకపోతే లేదు నీ కర్మ!” అన్నాడు రోషంగా చేతులు తిప్పుతూ..చరణ్.

“ఓర్నాయనో అటు చూడండి రా బాబు...ఆ గ్రహంతరవాసులు ఇటే వచ్చేస్తున్నారు ఓరి దేవుడో...ఇప్పుడెలా ఈ ఏలియన్స్ కూడా దెయ్యాల లాంటి వాళ్లే కదా...! ఏంచేయాలి ఇప్పుడు. సుడిగుండం వచ్చి ఏలియన్స్  ఎగిరిపోవాలా హనుమన్న మాకు తోడుగా ఉండాలి" అంటూ..చేతులు రెండు దగ్గరకు చేర్చి కళ్ళు గట్టిగా మూసుకుని భయపడుతున్న వాడిలాగా ఒణికిపోతున్నాడు దినేష్.

“అమ్మో వాళ్లు మనవైపే వస్తున్నారు” అంటూ భయంగా కౌషిక్ వెనకాలే నక్కి నక్కి దాక్కుంది శార్వాణి.

ముగ్గురు వ్యక్తులు తమ వైపే వస్తున్నారు వారు సన్నగా నాజూగ్గా అందంగా ఉన్నారు. నెత్తి మీద కిరీటం లాంటిది ఉంది. దానికి యాంటీనా లాంటిది అమర్చబడి ఉంది. చూడటానికి చాలా బాగున్నారు.

“ఒరే నీ మాటలన్నీ ఒట్టివే. నువ్వు చెప్పినట్లు వాళ్లేమీ అసహ్యంగా లేరు. చూడు ఎంత అందంగా ఉన్నారో...” అన్నాడు చేతులు తిప్పుతూ కౌషిక్.

“సరే లేరా వాడేమన్నా ముందు చూసొచ్చాడా.. ఏంటి? ఏదో చదివింది చెప్పాడు గాని” సమర్థింపుగా అన్నాడు దినేష్.

వాళ్లు ముగ్గురున్నారు. దగ్గరికి వచ్చేశారు...పిల్లలు అంతా బిక్క మొహాలు వేసుకుని చూస్తున్నారు.

***సశేషం***

Posted in April 2021, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *