Menu Close
Adarshamoorthulu
-- అయ్యగారి సూర్యనారాయణమూర్తి --
అమృతహస్తుడు, పేదలపెన్నిధి - కీ.శే. డాక్టర్ రాయవరపు సూర్యనారాయణగారు
Rayavarapu Suryanarayana

వైద్యవృత్తి చాలా ఉదాత్త వృత్తిగా ప్రఖ్యాతి చెందింది. అది చేపట్టాలంటే ఎంతో అంకితభావం, రోగికంటే ఎన్నోరెట్ల ఓర్పు, అన్నిటినీ మించి సేవాభావం, ఉండాలి. వీటికి హస్తవాసి తోడయితే, ‘వైద్యో నారాయణో హరిః’ అన్నది అక్షరాలా నిజ మౌతుంది. అలాంటి మహానుభావు లెందరో మానవాళికి అపూర్వసేవ లందించి వారి మానవ జన్మలను ధన్యం చేసికొని తరించారు. వీరిలో డాక్టర్ రాయవరపు సూర్యనారాయణగారు తప్పకుండా గణనీయులు. వారి గురించి తెలుసుకోవడానికి ఇది ఒక సవినయప్రయత్నం.

శ్రీ రాయవరపు సూర్యనారాయణగారు 1903లో కులపర్తి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి ఫుల్లాబ్జాక్షి మరియు శ్రీ వేంకటాద్రి గార్లు. వైద్యవిద్య అభ్యసించి లైసెన్షియేట్ ఇన్ మెడికల్ ప్రాక్టిస్ (LMP) గా అర్హత పొందేరు. వీరు వైద్యశాస్త్రం చదివిన రోజుల్లో, మానవశరీరంలో వేలకొద్దీ ఉన్న నాడులలో సైతం ఏ ఒక్క దాని గురించైనా క్షుణ్ణంగా చెప్పలేకపోతే పరీక్షలో తప్పే వారుట. మళ్ళీ చదివి తెలిసికొని పరీక్షకి హాజరయి ఉత్తీర్ణులు కావలసిందే.

వృత్తిరీత్యా, వీరు విశాఖ ఓడరేవులో వైద్యులుగా పనిచేస్తూ బ్రిటిష్ హయాంలో సైనికవైద్యులుగా నియమితులయ్యారు. సైనికబృందాల వెంట ముందుకు సాగి క్షతగాత్రులకు అక్కడికక్కడే తగిన వైద్యసేవ లందించిన సిద్ధహస్తుడీయన. చావుబ్రతుకుల మధ్య పోరాడే సైన్యంలో నిరంతరం ధైర్యం నింపి తన వృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించిన మహనీయులు వీరు.

తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఎందరికో వైద్యమందించి బ్రతికించిన వైద్యశిఖామణి వీరు. 1942లో రెండవ ప్రపంచయుద్ధం జరుగు తున్నప్పుడు కైరోలో విమానాల నుండి బాంబుల దాడిని పత్యక్షంగా చవిచూసేరు. విమానదాడి సంకేతం వినబడే సరికి సైనికులతో వీరు ఒక సముద్రపు ఒడ్డున ఉండడంచేత, ఆ ఒడ్డున ఉన్న రెండు బండరాళ్ల మధ్య క్రమేపి పెరిగి చివరకు పీకలోతు చేరిన సముద్రపు నీటిలో ప్రాణాలుగ్గబట్టుకొని 12 గంటలసేపు ఉండి పరిష్కార సంకేతం వచ్చేక మృత్యుముఖం నుండి బయటకు వచ్చి, గాయపడ్డ సైనికులకు వైద్యం అందించిన మానసికస్థైర్యం చూపించిన ఘనత వీరికే దక్కింది.

యుద్ధం తరవాత వీరు విశాఖ ఓడరేవులో తిరిగి వైద్యులుగా పని చేసేరు. 1958 లో ప్రభుత్వ పదవీ విరమణ చేసేరు. మళ్ళీ ప్రభుత్వ అభ్యర్ధన మేరకు మన్యప్రాంతంలో సరియైన దారి కూడా లేని, చీకటి పడగానే క్రూరమృగాలు సంచరించే, ‘తోణాం’ లాంటి కుగ్రామంలో వైద్యులుగా పనిచేసేరు. అక్కడ ఆటవికులకు అల్పాహారం, భోజనం కూడా తామే ఏర్పాటు చేసి ఉత్తమ వైద్యం అందించేరు. ఆ తర్వాత విశాఖపట్నం దగ్గరలో ఉన్న గోపాలపట్నంలో స్థిరపడి వైద్యపరమైన సలహాలు అందజేసేరు.

బ్రిటిష్ కాలం నుండి ప్రఖ్యాతికెక్కిన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ‘ఇక నయం కాదు పొమ్మ’ని వదిలేసిన రోగులకు తన వైద్యంతో జబ్బులు నయం చేసి పంపించిన అమృతహస్తులు సూర్యనారాయణగారు. పేదవారికి వైద్యమేకాక, జబ్బునయం అయేదాకా మందులు కూడా ఉచితంగా అందించిన సేవాశీలి, ఉదారస్వభావులు వీరు.

రోగికి తప్పకుండా నయం అవుతుందనే  ధైర్యాన్ని నూరిపోసి, సామాన్యమైన మందులతో శస్త్రచికిత్సలదాకా వెళ్ళకుండా చాలా జబ్బులు మాయం చేసిన ఘనత ఈయనకే దక్కింది. “నీ కేది తినాలని ఉంటే అది తినేయి; మందులలో నేను చూసుకొంటాను” అని చెప్పి, మాట నెగ్గించుకున్న మేటి వైద్యుడు సూర్య నారాయణగారు. ఈయన్ని చూడగానే సగం జబ్బు తగ్గిపోయేదని ప్రసిద్ధి గాంచిన అపరధన్వంతరి వీరు. పిల్లలకీ, పెద్దలకీ, ఆహారం అరుగుదలను సరిచేయడానికి నిత్యం అందుబాటులో ఉండే ఇంటి మందు అయిన ‘కార్మినేటివ్ మిక్స్చర్’ ను వీరు స్వయంగా తయారు చేసేవారు.

శ్రీ సూర్యనారాయణగారు బహుముఖప్రజ్ఞాశాలి. ఉత్తమవైద్యులేకాక పాకశాస్త్రప్రవీణులుకూడా. యుద్ధప్రాంతాల్లో సైతం తెలుగింటి ఆవకాయలను, పచ్చళ్ళను అక్కడికక్కడ తయారు చేసి సైనికులచేత వాటిని తినిపించి తాను ఇచ్చే మందులతో పాటు గాయాలు మానడానికి తగిన బలాన్ని సమకూర్చిన సమర్థులు. వాటికి కావలసిన ముడిపదార్థాలను విమానాలద్వారా ఇండియానుండి తెప్పించిన వైద్యపాకశాస్త్రనిపుణులు. సామాన్యజీవితంలో పనసపొట్టుకూర వీరి ప్రత్యేకత.

వీరు సంగీతప్రియులు. విశాఖసాగరతీరంలోని టౌన్ హాల్ లో ఎన్నో సంగీత కార్యక్రమాలకు హాజరయి అమందానందం అనుభవించినవారు. స్వయంగా మురళి, ‘ఫ్లారెనెట్’ చక్కగా వాయించేవారు. తన పుత్రిక లకు సంగీతం (గాత్రం, వాయిద్యం) చిన్నప్పుడే అధ్యాపకురాలి ద్వారా నేర్పించినవారు. వీరి సతీమణి శ్రీమతి  సీతారామమ్మగారు ‘హార్మోనియం’ బాగా వాయించేవారు, పాటలు చక్కగా పాడేవారు. శివకేశవులు ఇర్వురూ వీరి ఆరాధ్యదైవాలు. ఈ అపూర్వదంపతుల సంతానం ఐదుగురు పుత్రులు, ముగ్గురు పుత్రికలు.

శ్రీ సూర్యనారాయణగారు మంచి భాషాభిమానులు. తెలుగుసాహిత్యం, కవిత్వమంటే మక్కువ ఎక్కువ. పూర్వకవుల చాటుపద్యాలెన్నో అనర్గళంగా చెప్పి అందరినీ నవ్వించేవారు. హాస్యరసం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే వేదాంతమన్నా. ఆంగ్లభాషలో ఉన్న వెయ్యి పుటల యోగవాసిష్ఠ గ్రంథము (ఒకరి Ph.D.Thesis) ను స్వదస్తూరితో సిరాలేఖినితో రెండు వ్రాతప్రతులు తయారు చేసి, పద్మశ్రీ భానుమతీ రామకృష్ణగారితో చర్చించి  ఒక ప్రతిని ఆమెకు ఇచ్చిన ఘనులు. వీరు ఆంగ్లభాషలో దిట్ట. ఒకే వాక్యంలో ఉన్న ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క సారి ఒత్తిపలికితే, ఆ వాక్యం అర్థం ఎలా మారిపోతుందో విపులంగా బోధపరచిన ఆంగ్లభాషావేత్త.

మానవసంబంధాల గురించి చెప్పాలంటే, ఎటువంటివారినైనా చక్కని సత్యమైన ప్రియభాషణములతో మిత్రులను చేసికోగల చతురులు వైద్యులు సూర్యనారాయణగారు.

కార్యసాధనలో వీరికి వీరే సాటి. అర్హత ఉన్న ఒక విద్యార్థికి M.Sc.లో ప్రవేశమివ్వకుండా ఇంటిపేరు మార్చి ఇంకొకరికి ఇవ్వబోతే, పట్టుపట్టి ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారుల దృష్టికి అసలు విషయాన్ని తీసుకువచ్చి ప్రవేశం సాధించేరు. తర్వాతికాలంలో ఆ విద్యార్ధి జాతీయపురస్కారం సాధించి, నడిచే భౌతికశాస్త్రంగా పేరు పొందేడు.

వైద్యరంగంలో అమృతహస్తులు, మానవత్వం ఆకారం దాల్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి, శ్రీ రాయవరపు సూర్యనారాయణగారు 1971 లో దివంగతు లయ్యారు. అప్పటికే కనుమరుగు అవుతున్న అరఖుల వైద్యం పూర్తిగా మూగ వోయింది. వారి అద్భుత వైద్యసేవ లందుకొనే భాగ్యం ఎందరో కోల్పోయేరు...

“ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్” అన్న పెద్దల మాటకు ప్రత్యక్ష సాక్ష్యమయ్యేరు ఉత్తమవైద్యులు శ్రీ రాయవరపు సూర్యనారాయణ గారు. ఆయన పేరులోనే భాస్కరుడు ఉన్నాడు మరి.

అట్టి ఆదర్శమూర్తికి అనవరతము
అంజలి ఘటింతు శ్రద్ధమై ఆత్మ నెంచి
లెక్క లేనంతమందిలో ఒక్క రిట్లు
అవతరింతురు భూమాత హర్ష మొంద

Posted in April 2021, వ్యాసాలు

1 Comment

  1. సి. వసుంధర

    సూర్యునిలో ఎన్నో సుగుణాలు ఉన్నట్లు Dr సూర్యనారాయణ గారిలోఉన్న గొప్ప సుగుణాలువల్ల వారు మనందరికీ, ముఖ్యంగా వైద్యవృత్తిలో ఉన్న వారికి ఆదర్శ మార్చులు.మందులతోనేకాక మంచి వంటకాలలో అవకాయతో కూడా ఆరోగ్యాన్ని అందించగలిగిన మంచి మానసిక వైద్య శిఖామణిని పరిచయం చేసినందుకు సూర్య నారాయణగారికి ధన్యవాదాలు.Dr. సి. వసుంధర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *