Menu Close
Page Title

విశాల విశ్వంలో అణుమాత్రమే అయిన అవని

‘విశ్వమనంతం బ్రహ్మ’ అని మన వేదాలు, పురాణాలు ఉద్భాసిస్తున్న విషయం మనందరికి తెలుసు. ఆ అనంత పరిమాణమెంతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది మన శాస్త్ర పరిశోధన. ఐదువేల సంవత్సరాల క్రితమే శ్రీమద్మహాభారత గ్రంధాన్ని వ్రాస్తూ దానిలోని ‘శ్రీ విష్ణు సహస్రనామం’ లో వేదవ్యాసులవారు వక్కాణించినట్లు 'విశ్వం విష్ణుః' అనగా ‘వ్యాపించునట్టిదే విశ్వం’ అన్న విషయాన్నే నేడు శాస్త్రజ్ఞులు పరిశోధించిన పిమ్మట తిరిగివ్రాస్తున్నారు. అది సూక్ష్మ శక్తి గా కేంద్రీ కృతమై వ్యాప్తిచెందుతూ నేడు ఈ విశాల విశ్వంగా ఎలా పరివర్తన చెందిందో, ఇంకా చెందుతోందో, దానిని ప్రభావితం చేసే అంతర్గత శక్తులేమిటో తెలుసుకోవడానికి పరిశోధన సాగిస్తోంది నేటి శాస్త్ర నిపుణుల సమాజం. milky-wayలేత నీలిరంగులో అందమైన తారలతో మెరుస్తూ అలంకరింపబడినట్లు ఉండే ఆకాశం మనలాంటి సామాన్యులని ముచ్చట గొలుపడమే కాక భావుకులైన కవులని, సాహిత్య వేత్తలని, సంగీత కారులని, తత్వవేత్తలని, ఖగోళ శాస్త్రజ్ఞులనీ కూడా విస్మయ పరుస్తోంది. నేను చిన్నప్పుడు మా తాతగారి ప్రక్కన పడుకుని ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆయన సప్త ఋషి మండలం, ధృవతారలను, నక్షత్ర కూటమిలో చూపించి, నా కుతూహలాన్ని ఇనుమడింపచేసేవారు. రకరకాల రంగులతో మెరిసే తారలు ఏవో సంకేతాలిస్తునాయనిపించి వాటి అర్ధాల వివరణ తెలుసుకోవాలని వాటితో మాట్లాడాలని ఉబలాట పడుతుండేవాడిని. ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయము మన శాస్త్రజ్ఞులకు ఈనాడు లభించిన పరిజ్ఞానం తో 'నాసా' వారు చిత్రీకరించిన పటాన్ని ప్రక్కనున్న బొమ్మలో వివిధ నక్షత్ర మండలాలు గా చూడవచ్చు. ఈ విశాల విశ్వంలో 1000 నుంచి 2000 కోట్లనక్షత్ర మండలాలు ('గాలాక్సిస్') ఉన్నాయని ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనా. మనకంటికి రాత్రివేళ కనిపించేది కేవలం మన నివాసం అయిన సౌరమండలం ఉండే 'మిల్కవే గేలక్సీ' అంటే 'పాలపుంత' లోని పెద్ద నక్షత్ర కూటములు మాత్రమే. మనకు వివిధ పరికరాల సహాయం (రేడియో దుర్భిణి ఒక ముఖ్య పరికరం) తో చూడగలిన విశ్వాన్ని గురించే మనం ముచ్చటించు కుంటున్నాము. మనకు అగోచరమైన విశ్వం ఇంకెంత ఉందో ఊహకు అతీతం. వాటిని పరిశోధించడానికి వివరంగా తెలుసుకోవడాని కే 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్' అనే శక్తి వంతమైన రేడియో ఆధారిత దుర్భిణీని ఈ సంవత్సరాంతానికి వాడుకలోనికి తెచ్చే ప్రయత్నాలు తీవ్రముగా జరుగుతున్నాయి. galaxy galaxyఅది ప్రస్తుతం మనకి విశ్వ వివరాలు అందజేస్తున్న 'నాసా' వారి 'హబుల్ టెలీస్కోప్' కంటే నూరు రెట్లు శక్తి వంతమైనది, ఉన్నతమైనది కూడా, ఎందుకంటే ప్రస్తుతపు 'హబుల్ టెలీస్కోప్' భూమినుంచి 340 మైళ్ళ ఎత్తునుంచి వీక్షించి అది చూస్తున్నవి మనకి వివరిస్తుంటే, ఈ క్రొత్త దుర్భిణి భూమి పై పది లక్షల మైళ్ళ ఎత్తునుంచి పరిశీలించి మరిన్ని వివరాలను స్పష్టంగా చూసి పంపగలుగుతుంది. 1990 ఏప్రిల్ 24 న ప్రారంభించిన ఈ ప్రస్తుత దుర్భిణికంటే ఈసంవత్సరాంతానికి వాడుకలోనికి రానున్న దుర్భిణి ఎన్నోరెట్లు సాంకేతికంగాను, ఉంచుతున్న ఎత్తు వల్ల గొప్ప ప్రయోజనాలనే సాధించ గలుగుతుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అది మన పాలపుంత వివరాలే కాకుండా, చుట్టుపక్కల నక్షత్ర మండలాలు, విశాల విశ్వంలోని ఇతర వింతలు, విశేషాలు కూడా పరిశీలించి వివరిస్తుంది. దీనిని శాస్త్రజ్ఞులు అది మన విజ్ఞాన పరిధిని విపరీతంగా పెంచే గొప్ప ఉపయోగకర పరికరంగా భావిస్తున్నారు.

galaxyమన శాస్త్రజ్ఞుల లెక్కల ప్రకారం ఒకప్పుడు ఒక చిన్నగా మండుతుండే దట్టమైన నక్షత్ర సముదాయం గా ఉండే విశ్వం క్రమ క్రమంగా విస్తరిస్తూ నేడు, అనగా 13 .8 బిలియన్ (13.8 X109) సంవత్సరాల తరువాత అనేక లక్షల నక్షత్ర కూటములతో చాలా భాగం మనకు ఏ రీతిలోను కంబడనంత దూరంలో ఉండే ఈ విశ్వం హద్దులు గమనిస్తే నిజముగానే అనంతమేననిపిస్తుంది. అది ఇంకా 46 మైళ్ళు/సెకనుకు కి విస్తరిస్తూనే ఉందని శాస్త్రజ్ఞుల అంచనా. దీనిలో మనము ఉండే సూర్యమండలం ఒక వంద వేల కాంతి సంవత్సరాల వెడల్పుతో ఇరవైకోట్ల మెరిసేతారలతో ‘పాలపుంత' అని పిలువబడే చిన్న నక్షత్ర  కూటమి లో కనబడే ఒక తార మాత్రమే. మన సూర్యుని నుంచి 'పాలపుంత' కేంద్రం 26000 కాంతి సంవత్సరాలు (ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి వేగంతో మనం పోగలిగితే- అనగా సెకనుకు ఒక లక్ష 86 వేలమై మైళ్ళ వేగంతో ఒక సంవత్సర కాలం ప్రయాణించే అంత వేగంతో - అంటే సుమారు ఆరు ట్రిలియన్ అనగా 6X1012 మైళ్ళ దూరం), అంటే మన 'పాలపుంతే' ఎంత పెద్దదో ఊహించవచ్చు. ఇంక విశాల విశ్వం సంగతి చెప్పడానికి సాధ్యం కాదు. దానిలో మన భూమి అణుమాత్రమైతే, మన దేశం ఎలెక్ట్రాన్ అంత ఉంటుందేమో. భూమినుంచి సూర్యుడు 8.3 కాంతి నిముషాల దూరంలో మాత్రం - అంటే 93 మిలియన్ (93X106) మైళ్ళ దూరంలో- ఉన్నాడు. మన సూర్యుడు పాలపుంతని తాను తిరిగే మార్గంలోనే ఒక సారి చుట్టిరావడానికి 250 లక్షల భూసంవత్సరాలు పడుతుంది. ఇక అనంత విశ్వంలో పాలపుంత ఒకమారు తిరుగుటకు ఎంతకాలం పడుతుందో ఉహించాలిసిందే, ఎందుకంటే విశ్వం యొక్క పరిమాణం సరిగ్గా అంచనా వెయ్యడం నేటికీ సాధ్యం కాలేదు గనుక. ప్రక్కనున్న పటంలో మన శాస్త్రజ్ఞులకు తెలిసిన వివిధ నక్షత్ర మండలాలు (Galaxies) చూడవచ్చు. ఈ పాలపుంత ఎంత పెద్దదంటే ఇప్పుడు మనం చూస్తున్న పాలపుంతలో ఒక మూల ఉన్న నక్షత్రం పంపిన వెలుగు కిరణం మనం పుట్టకముందే కొన్ని పదుల సంవత్సరాల క్రితం బయలుదేరి కాంతి వేగంతో ఇప్పటికి చేరుతోందన్నమాట. ఇప్పుడు బయలుదేరిన కాంతి కిరణం బహుశా మన పిల్లలు ముసలివాళ్లైన తరువాత చూస్తారు. galaxyమరో విచిత్రమేమిటంటే ఇంతపెద్ద పాలపుంత మధ్యన ఒక 'కృష్ణ బిలం' (బ్లాక్ హోల్) ఉండి, సతతం దానిచుట్టూ పరిభ్రమణంలో తోసుకుపోతున్న నక్షత్ర కూటమిని మెల్లగా తనవైపు గురుత్వాకర్షణతో లాక్కుని, దగ్గరకొచ్చాక అమాంతం కబళించి వేస్తుంది. దాని నుంచి బయట పడడం దేనికి సాధ్యం కాదు. ఒక్కోసారి మన సూర్యమండలాల లాంటి వాటిని వందదాకా గుటుక్కున మింగేస్తుంది. ఆ మిగిలిన చెత్తని ఖగోళ శకలాలుగా విశాల విశ్వంలోకి విసిరేస్తుంది. ఇటువంటి కృష్ణ బిలాలు ప్రతి ఒక్క గాలక్సీ లోను ఉంటాయి. కొన్నిటిలో మరీ పెద్దవైతే మరికొన్నిటిలో కొచం చిన్నవి. పెద్దవాటికి ఆకలి ఎక్కువై దానికి దీటుగా నోరు పెద్దదిగా ఉంటుంది. కొన్ని నక్షత్ర మండలాలలో ఒకటి కంటే ఎక్కువే కృష్ణ బిలాలు ఉండవచ్చు.  అంతదాకా ఎందుకు మన పాలపుంతలోనే మన సూర్య మండలానికి సమీపంలోనే ఒక బిలముందని ఈ మధ్యనే ఒక శాస్త్ర బృదం అభిప్రాయపడింది. అది ఎన్నాళ్ళకి మన సౌరమండలాన్ని కబళించివేస్తుందోనని లెక్కలు వేయడంలో నిమగ్నులైయున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇంకో చిత్రమేమిటంటే ఒక్కో నక్షత్ర మండలము దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతూ కొంచం కొంచము జరిగి ప్రక్క నక్షత్ర మండలం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి దానితో విలీనమై గుర్తించలేనివిధంగా రూపురేఖల్ని మార్చుకుంటుంది. ఈ విచిత్ర లీల చాలా అద్భుతం గా ఉంటుంది అంటారు ఖగోళ శాస్త్రజ్ఞులు.

solar-systemమన భూమి వంటి వాతావరణం కలిగిన గోళాలు, వాటిలోని గ్రహాంతరవాసులు కూడా మనలాగా లేక మనకంటే ఎక్కువగా కూడా శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన నక్షత్ర మండలాల్లో ఉండి ఉండవచ్చు, కానీ మనము ‘ఐన్స్టీన్’ లెక్కల ప్రకారం అక్కడికి కాంతి వేగాన్ని మించి ప్రయాణం చేయడం సాధ్యం కాదు. కాంతి వేగంతో ప్రయాణించినా అక్కడికి చేరడానికి మన జీవితకాలం సరిపోదు, అవి మనకి మరీ అందుబాటు దూరంలో ఉంటె తప్ప.  అల్లాగే అక్కడి వాళ్ళుకూడా ఇక్కడికి చేరడానికి అదే కాలం పడుతుంది, కాంతి వేగాన్ని మించి వెళ్లడం సాధ్యం కాదు గనుక. ఆ గ్రహాంతర వాసులుంటున్న ప్రదేశం మనకి దగ్గరలో అంటే కొన్ని కాంతి సంవత్సరాల దూరం లో ఉంటెనే వాళ్ళ జీవిత కాలంలో (అది తెలియని విషయం) వాళ్లు ఇక్కడికి చేరుకోవచ్చు. మన ఖగోళ శాస్త్రజ్ఞులుకూడా మన వాతావరణానికి సమతుల్యమై మనకి అందుబాటులోగల గ్రహాల కోసం నిరంతరం గాలిస్తూనే ఉన్నారు, ఒకవేళ మన భూవాసులు ఎదో కారణం వల్ల ఇతర గ్రహాలకు వలస పోవాల్సి వస్తే అనువుగా ఉంటుందని యోచన. మన సౌర మండలం ప్రక్క పటంలో వివరంగా చూడవచ్చు.

earth-layersఇంక మనం ఉండే సూర్యమండలానికి వస్తే, దానిలో మన నివాసమైన భూమి సూర్యునినుంచి మూడవ గోళంగా భూమధ్య రేఖ వద్ద 7926 మైళ్ళ (12756 కి.మీ) వ్యాసంతో, ధ్రువాల మధ్య 7900 మైళ్ళ (12714 కి.మీ) విస్తీర్ణం తో, 6 X 1024 ద్రవ్య రాశి (Mass) కలిగి మన సూర్యమండలంలో ఐదవ పెద్ద గోళంగా ఉంది. మొదటి నాలుగు- గురు, శని, యురేనస్, మరియు నెప్ట్యూన్. భూమి తిరిగే దీర్ఘవృత్తము యొక్క వ్యాసం 9,29,56,050 మైళ్ళు (అనగా 14,95,98,262 కి.మీ). పరిభ్రమణ కాలం 365.2564 రోజులు. శాస్త్రజ్ఞులు గుర్తించిన దేమిటనగా, మెల్లగా తనచుట్టూ తాను 66 డిగ్రీల మొగ్గుతో తిరుగుతున్నభూమిపై ఋతు మార్పులకిది కారణభూతమై ఉండి పరిభ్రమణ వేగం క్రమంగా సామాన్యుడు తెలుసుకోలేనంతగా  తగ్గిస్తోంది, అంటే రోజు యొక్క పరిమాణం పెరుగుతూ బహుశా 140 మిలియన్ సంవత్సరాలకి ఒక రోజు పెరగవచ్చు. భూగోళ కేంద్రంలో అతి వేడి గా నికెల్ తో కూడిన ఇనుము ఉండి తనచుట్టూ తాను తిరుగుతోండం వల్ల బలమైన అయస్కాంత శక్తి కలిగి భూమిని సౌర గాలుల దుష్ప్రభావాలనుండి రక్షిస్తోంది. అతి పెద్ద నికెల్-ఇనుము స్ఫటికాలు భూకేంద్రంలో నిబిడీకృతమై ఉన్నాయన్నది శాస్త్రజ్ఞుల శోధనా ఫలితఫలితమైన యోచన. దీని వల్లనే భూ అయస్కాంత శక్తి ఉద్భవిస్తున్నదని వారి వాదన. భూ ఉపరితలం మీద 70 శాతం నీరు గలిగి గాలి లో తేమకు కారణం అవుతోంది. భూమిపై గల నీటిలో మూడు శాతం మాత్రమే త్రాగునీరు, మిగిలినందంతా భూమిలో ఉండే అనేక ఖనిజ లవణ సమ్మిళితమై ఉండడంతో సముద్రం ఉప్పు మయమై జీవులు త్రాగుటకు కానీ, మొక్కలు పెరుగుటకు కానీ అనువుగాలేదు. భూమి ఉపరితల ఉష్ణో గ్రత -88°C నుంచి +58°C ఉన్నా, భూమి ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత 58.62°F లేక 14.9°C కలిగి, భూమి కేంద్రం వద్ద దాదాపు 5200°C లేక 9392°F ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా. తరువాత అక్కడ పీడనం దరిదాపు ఉపరితల వాతావరణ పీడనం కంటే 360 లక్షల రెట్లు ఉంటుందని అంచనా. భూ ఉపరితల వాతావరణం మూడు వందల మైళ్ళ దట్టమై పైకి వెళుతున్నకొద్దీ సాంద్రత తగ్గుతూ, వివిధ వాయు సందోహమై అనగా 78% నత్రజని (నైట్రోజన్), 21% ప్రాణవాయువు (ఆక్సిజన్), 0.9% ఆర్గన్, 0.03% బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డయాక్సైడ్) తో నిండి ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత కాలిఫోర్నియా లోని 'డెత్ వాలీ' లో 'ఫర్నస్ క్రీక్ ' లో 134°F (56 .7°C) గా నమోదు చెయ్యబడగా, అత్యల్ప ఉష్ణోగ్రత దక్షిణ ధ్రువపరిసరాల్లో -128°F (-89°C). గా నమోదు చేయబడింది. భూవాతావరణాన్ని పొరలుగా విభజించి చూస్తే - ట్రోపోస్ఫియర్, భూమినుంచి 20 కి.మీ. వరకు (దీనిలో విమానయాననికి అనుకూలం), ఓజోన్ పొర 20-30 కి.మీ వరకు (దీనిలోను విమానయాననికి అనుకూలం), 30 నుంచి 50 కి.మీ వరకు స్ట్రాటో స్పీయర్  (దీనిలో బెలూన్ యానానికి అనుకూలం), 50 నుంచి 70 కి.మీ వరకు ‘మెసో స్పీయర్’ (దీనిలో రాకెట్స్ ప్రయాణానికి అనుకూలం), 70 నుంచి 90 వరకు ‘థెర్మో స్పీయర్’ గా పిలువబడతాయి (దీనిలోసూర్యునినించి అతినీలలోహిత కిరణాలు ఎక్కువ శక్తి కలిగిన ఎక్స్ రే లు ఇక్కడ శోషించ (absorb చెయ్య) బడతాయి అందువల్ల ఇక్కడి వాతావరణం చాలా వేడి గా ఉంటుంది అంటే 932° F (500° C) నుండి 3632°F (2000°C). సాధారణం గా ‘నార్తర్న్’ లేక ‘సథరన్’ లైట్స్ ఇక్కడే ఉద్భవిస్తాయి.

భూమిచుట్టూ తిరుగుతూ ఉండే చంద్ర గ్రహం 2160 మైళ్ళ (3476 కిమీ) వ్యాసంతో తిరుగుతుంటుంది. అక్కడి వాతావరణం భూవాసులు నివసించేందుకు అనుకూలంగా ఉండదు, నీరు, ప్రాణవాయువు అక్కడ ఉండదు గనుక. అంగారక గ్రహ (Mars) వాతావరణ పరిశీలన కోసం ఈ మధ్యనే 'నాసా' వారు అక్కడ శోధక నౌకని దించి పరిశోధన సాగిస్తున్నారు. అక్కడ అంతర్గతంగా నీటి సంద్రాలు ఉన్నాయనుకున్నా వాతావరణం మాత్రం లేదట. సూర్యుని అతి నీలలోహిత కాంతి కిరణాలు ఉపరితలాన్ని మాడ్చి వేస్తున్నాయిట. వారి శోధన సఫలీకృతమవుతుందని ఆశిద్దాము.

-o0o-

Posted in April 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!