Menu Close
జంతుసంపద
ఆదూరి హైమావతి
ఒంటె

camels

ఒంటె అనగానే మనకు ఏడారిలో ప్రయాణం చేసే ఏకైన వాహనం అని గుర్తుకు వస్తుంది కదా! ఒంటె ఎడారి జంతువు. ఇవి ఆర్టియోడాక్టిలా క్రమానికి చెందిన క్షీరదాలు.

ఒంటెకు లొట్టిపిట్ట అనే పేరుండటం చిత్రమే. పిట్ట అనగానే మనకు పక్షి గుర్తు వస్తుందికదా! ఐతే ఈ పేరు తెలంగాణ మాండలికం లోనిది. ఉష్ట్రము అనే పేరుకూడా ఉంది ఒంటెకు. ఒంటె అనేది రాయలసీమ మాండలికం. ఒంటె ను ఆంగ్లంలో Camel అంటాం.

camel artసంస్కృతంలో ఒంటెకు వ్యుత్పత్యర్థం- ఎల్లప్పుడును ఎండచే తపింపబడునది- అని. ఒంటెను నీడన ఉంచి ఎవ్వరూ పోషించరు. దాన్ని ఎడారిలో ప్రయాణానికే సాధారణంగా వాడుకుంటారు. ఎడారి ప్రాంతాలవారు ఒంటెలను పోషించుకోడం ఎడారిలో ప్రయాణాలకే.

ఒంటె ఆంజనేయుని వాహనం అంటే ఆశ్చర్యమే. ఆయనే గాలిలో పయనించేవాడు, ఆయనకు ఒంటె వాహనం అంట.

ఒంటె మూపురమే ఒంటెలకు గొప్ప అందాన్ని తెస్తాయి అనడంలో అతిశయోక్తిలేదు. ఈ ఆకారంలో ఉండే ఇతర జంతువులేవీ లేవు. ఒంటెలకు రెండు మూపురాలు కూడా ఉంటాయి. రెండు మూపురాలు కలిగిన బాక్ట్రియన్ ఒంటెలు  మధ్య, తూర్పు ఆసియా దేశాలకు చెందినవి.

ఒకటే మూపురం ఉండే డ్రోమెడరీ ఒంటె అరేబియా, పశ్చిమ ఆసియా దేశాలకు చెందినది. ఒంటెల జీవితకాలం సాధారణంగా 40 నుండి 50 సంవత్సరాలు. ఒంటె భుజం దగ్గర 1.85 మీటర్లు, మూపు దగ్గర 2.15 మీటర్లు ఎత్తు ఉంటుంది. మూపులు సుమారు 30 అంగుళాలు ఎత్తుంటాయి. ఒంటెలు సుమారు 40 నుండి 65 కి.మీ. వేగంతో  పరుగెత్తగలవు. ఇసుక ఎడారిలో కాళ్ళు కదుపుతూ ఎండకు తట్టుకుంటూ పైన బరువులనో, మనుషులనో మోస్తూ ఒంటెలు చేసే సేవ ఆమోఘం అనవచ్చు.

మానవులు మొదటగా ఒంటెల్ని పెంచుకోవడం 2000 సంవత్సరాల నుండి అని తెలుస్తున్నది. ఒంటెల శరీరము మీది చర్మం మందముగా ఉండటాన ఎడారి జీవనానికి, ఎండ తట్టుకోనూ సహకరిస్తుంది. వీటి పాదాల క్రింది భాగాలకు పెద్ద దిళ్ళవంటి చర్మం వుండి ఇసుకలో పాదం దిగబడకుండా వేగంగా ప్రయాణించను ఉపకరిస్తుంది.

నీరు దొరకని ఎడారులలో ఎక్కువ దూరం ప్రయాణించే ఈ ఒంటెలు తమ కడుపులో ఎక్కువ నీటిని నిలువ చేసుకుంటాయి. నీళ్లతిత్తులు వీటి మూపురాలలో ఉండి నీటిని దాచుకోను అనుకూలంగ ఔతాయి. కొద్దిరోజుల వరకూ నీరు తాగకుండా ఇవి జీవించగలవు. ఒంటెలు నీళ్లు తాగకుండా రెండు నెలల వరకూ ఉండగలవు. ఐతే నీరు దొరికినపుడు మాత్రం ఒక్కసారి సుమారుగా ఏడు లీటర్ల నీరు ఒకేమారు తాగుతాయిట.

camel41 డిగ్రీలకంటే  ఉష్ణోగ్రత పెరిగితేనే వీటికి చెమట పడుతుంది. ఒక సమాచారం ప్రకారం ఒంటెలు తమ కడుపులో ఉండే సంచిలో కూడా నీటిని నిల్వ చేసుకుంటాయనీ, అందుచేతే చాలా రోజులపాటు నీరు లేకపోయినా ఉండగలుగుతాయని, ఎంతటి వేడిమినైనా తట్టుకుంటాయని అనే మాట నిజం కాదంటారు. ఏదినిజమోకానీ నీటిని నిలువచేసు కుంటుదన్న మాట మనం వినేదే. ఐతే  ఒంటె మూపురంలో చాలా ఎక్కువ మోతాదులో మోతాదులో కొవ్వు ఉండటాన  ఇది బయటి వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది! అనే మాటా కూడా ఉంది. ఇంకా ఎడారిలో పయనించేప్పుడు ఎక్కడా ఒయాసిస్సులు దొరకనపుడు ఒంటెలను చంపి వాటి మూపురాలలో మరియు శరీరంలో ఉండే నీటి సంచీలోని నీరు త్రాగుతారనే మాటా వినడం జరిగింది.

ఒంటెను వేటాడటం ఏ మృగానికైనా కష్టమే. ఒంటె కాళ్లు చాలా బలంగా ఉంటాయి. ఇసుకలో బరువుమోస్తూ నడావటాన దాని కాళ్ళు బలంగానూ, దృఢంగానూ పొడవుగానూ ఉండటం వల్ల చాకచక్యంగా ఇది నాలుగు కాళ్లతోనూ తన్ని తనను తాను కాపాడుకోగలదు. భగవత్ సృష్టిలో ప్రతిజీవికీ స్వయం సంరక్షణ కల్పించి సృష్టించడం సృష్టికర్త చాకచక్యం కదా!

ఒంటెలు ఎడారుల్లో ఇసుకలో పయనించేప్పుడు సంభవించే ఇసుక తుఫాన్ల సమయంలో కూడా స్పష్టంగా చూడగలుగుతాయి. అంత గొప్ప కంటి నిర్మాణం వీటికుంది. వాటి కనురెప్పలు రెండు పొరలుగా ఉంటాయి. అవి కళ్లను కాపాడతాయి. ముక్కు రంధ్రాల నిర్మాణం కూడా అవసరాన్ని బట్టి మూసుకోగలిగేట్లుగా ఉంటుంది. కాబట్టి వాటికి ఎంత వేడిలోనూ ఏ ఇబ్బందీ ఉండదు.

శత్రువులు దాడి చేసినప్పుడు ఒంటెలు మొదట చేసే పని... ఉమ్మడం! ఆకుపచ్చ రంగులో ఉండే చిక్కటి ద్రవాన్ని ఉమ్మేస్తాయి. ఆ జిగురును వదిలించుకోవడం, ఆ వాసనను భరించడం చాలా కష్టం! దాని జిగురు, దాని వాసనేవాటికి  తమను తాము రక్షించుకునే కవచం అన్నమాట.

ఎడారులలో ఒక చోటి నుండి మరొక చోటికి బరువైన సరుకుల రవాణాచేయను ఉన్న ఒకే ఒక సాధనం ఒంటె.

ఎడారులలో ఒంటె పాలు పితుక్కు త్రాగటం, ఇతర ఆహార పదార్ధాలలో ఈ పాలను వాడటం ఎడారి వాసులు చేస్తారు. ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు ఇవన్నీ మనకు తెలిసినా ఒంటె పాల గురించిన అవగాహన మనకు పెద్దగాలేదు.

గుజరాత్‌లో ఒంటె పాలకు మంచి గిరాకి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి కచ్‌ అనే ప్రాంతంలోని... సర్హాద్ డైరీ  దేశవ్యాప్తంగా ఒంటె పాలను అమ్మాలని ప్రయత్నిస్తున్నదిట!. ఇదిజరిగితే  దేశవ్యాప్తంగానేకాక, ప్రపంచవ్యాప్తంగా ఒంటె పాలను అంతా త్రాగవచ్చేమో! ఒంటె పాల వలన లాభం ఏంటంటే, ఒంటె పాలలో సహజ సిద్ధమైన ఇన్సూలిన్ లాంటి ప్రోటీన్ ఉంటుందిట. ఇది  డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకారట. ఈ పాలలో విటమిన్ సీ, ఐరన్‌తో పాటూ చాలా పోషకాలు కూడా ఉంటాయిట.

camel and milk

ఒంటె పాల ధర లీ. రూ.100..ఇహ ఒంటెలను ఎడారి ప్రయాణాలకు కాక పాల కేంద్రాలకు పాలు ఎగుమతి చేయను ఆవుల్లాగా, గేదెల్లాగా పెంచుకోడం జరిగి తీరుతుంది. మానవుడు సొమ్ము గడించను చేయని కృత్యమే లేదు కదా! మరి ఒంటెపాల వ్యాపారం చేయడంలో తప్పేముంది! ఒంటెపాల కాఫీ, టీల కోసం తయారుగా ఉందామా!

Posted in April 2021, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *