Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
ఎవరు త్రవ్వుకున్న గోతిలో వారే పడ్డట్లు

వేంకటాపురంలో వెంకయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. వెంకయ్య చాలా తెలివైన వాడు. కల్తీ చేయడం లో దిట్ట. అతడు దేనిలో ఏది కలుపుతాడో ఎవ్వరూ తెల్సుకోలేరు. వెంకయ్యకు లేకలేక ఒక కుమారుడు కలిగాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటూ వాడిని కోటికి పడగలెత్తించాలని తన వ్యాపారాన్ని ఉబ్బడి ముబ్బడిగా పెంచసాగాడు. చౌకగా లభించే చోటునుంచి వస్తువులు తెప్పించి కల్తీ చేసి అధిక లాభానికి అమ్మసాగాడు. ఆ ఊర్లో అతడిదే పెద్ద దుకాణం, పైగా అన్నీ దొరకటాన అంతా అతడి షాపుకే వచ్చేవారు. బియ్యం నుంచీ నూనె, నెయ్యి వరకూ అన్నిట్లో కల్తీ. ముఖ్యంగా నెయ్యి, నూనెల కల్తీ వల్ల ఆరోగ్యాలకు చాలా ప్రమాదం.

ఒకమారు తండ్రితో అత్యవసరమైన పని ఉండి వెంకయ్య కుమారుడు కుమార్ అతడి గోడౌన్ కెళ్లాడు. అక్కడ తండ్రి చేయించే కల్తీ అంతా చూశాడు.

"నాన్నా! ఇలా కల్తీ చేస్తే తినేవారికి ఎంతో అనారోగ్యం కల్గుతుంది. దీనివల్ల వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా పాఠాల్లో వచ్చింది. మీరు ముఖ్యంగా ఇలా నెయ్యి, నూనెలో చేసే కల్తీ ప్రాణాలు తీస్తుంది. మానండి. ఇదే నేను చూట్టం. మన వద్ద వస్తువులుకొనే వారు సుఖంగా ఉంటే మన వ్యాపారం చిరకాలం బాగుంటుంది.” అని చెప్పాడు.

ఎనిమిదోక్లాసు చదువుతున్న కుమార్ చెప్పిన మాటలకు వెంకయ్యకు చాలా కోపం వచ్చింది. "ఏరా! గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు, తాతకు దగ్గులు నేర్పినట్లు నీవా నాకూ చెప్పేది? నోరు మూసుకెళ్ళు. అసలెందుకు ఇక్కడికి వచ్చావు? పో. మళ్ళా ఇక్కడికి రాకు. వ్యాపారమన్నాక చాలా ఉంటాయ్! వెళ్ళు" అని కసిరాడు.

కుమార్ 'భగవంతుడా! మా నాయన మనసు మార్చి ఈ కల్తీ నుంచి జనాలను కాపాడు’ అని దేవుని ప్రార్ధించుకున్నాడు. తల్లి లాగా భక్తి భావము, మంచి చెడు విచక్షణ, పాపం పుణ్యం బాగా వంట పట్టించుకున్నవాడు కుమార్. ఎలాగైనా ఈ కల్తీ ఆపాలని ఒక ఉపాయం పన్నాడు.

తన ఇంటికి వాడే నూనె, నెయ్యి వేరుగా ఉంచి, నూనె గానుగలవద్దే కల్తీ చేయించేవాడు వెంకయ్య.. ఒకమారు అతడి కొడుకు కుమార్ తన స్నేహితుని పుట్టినరోజు పండుగ పార్టీకి అతడి ఇంటికి వెళ్ళి విందు చేసి వచ్చి జబ్బున పడ్డాడు. వైద్యుని వద్దకు తీసుకెళ్ళగా కల్తీ నూనెతో చేసిన వంటకాలు తినడం వల్ల జబ్బు వచ్చిందని వైద్యుడు చెపాడు. కనీసం పక్షం రోజులు హాస్పెటల్లో ఉండి వైద్యం చేయించాక కుమార్ కుదుట పడ్డాడు. దానికి చాలా సొమ్ము ఖర్చైంది.

కుమార్ "నాన్నా! నీవు ఇతరులకు కల్తీ సరుకులు అమ్ముతున్నావ్? ఆ సరుకుల తిన్నవారంతా ఇలా జబ్బుల పాలైతే వారు ఇంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోగలరా! చనిపోతే ఆ పాపమంతా మనకు కాదా! ఎవరు త్రవ్వుకున్న గోతిలో వారే పడ్దట్లు నీవు చేయించిన కల్తీ నా ప్రాణానికి తెచ్చింది చూశావా? మరెప్పుడూ ఇలా చేయకు? లేకపోతే నేను ఇల్లు వదలి వెళ్ళి అనాధాశ్రమంలో చేరిపోతాను. డబ్బు సంపాదించి ఏంచేసుకుంటావు? పుణ్యం సపాదించుకుంటే మరో జన్మంటూ ఉంటె దానికి ఉపయోగపడుతుంది. డబ్బు ఒక్కరూపాయైనా మనతో తీసుకెళ్ళగలమా! మొన్న మరణించిన నా తాత ఎన్ని కోట్లు  తీసుకెళ్ళాడు చెప్పు. నేను విన్న మంచి విషయాల వల్ల ఇదంతా నేర్చుకున్నాను." అని చెప్పాడు.

దాంతో వెంకయ్యకు బుధ్ధి వచ్చింది. ఎవరి కోసమైతే తాను డబ్బు సంపాదించాలని కల్తీచేసి కూడబెడుతున్నాడో వాడే లేకపోతే తన డబ్బు ఏంచేసుకోనూ? వాడే ఇల్లు వదలి అనాధగా బ్రతికితే ఈ డబ్బంతా ఎందుకు? అనుకుని కొడుకు బ్రతికి బయట పడ్దందుకు బుధ్ధి తెచ్చుకుని కల్తీమాని, తగినంత లాభానికే సరుకులు అమ్ముతూ, మంచి వ్యాపారని పేరు తెచ్చుకున్నాడు.

తండ్రి బుధ్ధిమార్చను తాను తన తరగతి స్నేహితుడు తనయ్ తో కలిసి వాడి నాన్న గారు వైద్యుడైనందున ఆయన్ను బ్రతిమాలి వేసిన పధకం పారి, ఆ సొమ్ముతో తన తండ్రి అంగట్లో నూనెకొని జబ్బుపాలైన తన తరగతి కుటుంబానికి తనకు మారుగా వైద్యం చేయించిన విషయం కుమార్ కూ ఆ వైద్యునికీ తప్ప మరెవ్వరికీ తెలీదు. తన తండ్రి మారినందుకు కుమార్ ఎంతో సంతోషిచాడు. పిల్లకు ఇలా గుడ్డు పాఠం చెప్పింది.

Posted in April 2021, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *