లాస్ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో ఇండియా వెళ్లే సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ప్రయాణీకుల బోర్డింగ్ ముగిసింది. కానీ ఎవరో ఒకరు రాలేదని నాలుగు సార్లు అనౌన్స్ చేశారు. అయినా ఎవరూ రాలేదు. కొద్ది క్షణాల తర్వాత డోర్ క్లోజ్ చేసే సమయంలో పరుగులతో వచ్చాడు ఒక యువకుడు. సాగరి పక్క సీటులో కూర్చున్నాడు.
ఫ్లైట్ నెమ్మదిగా కదిలి వేగం పుంజుకుని మబ్బుల్లో ప్రయాణం ప్రారంభించింది. అయిదు సీట్లు వున్న మిడిల్రోలో చివరి సీటు సాగరిది. నాలుగో సీటు చివరి క్షణంలో వచ్చిన ఇండియన్ యువకుడిది. అతను అనీజీగా కదులుతూ మోకాళ్ళమీద తల పెట్టుకుని ఒకసారి, రెండుకాళ్లు సీటులో పెట్టుకుని కూర్చుంటూ మరోసారీ విసుగు పుట్టిస్తుంటే 'ఖర్మకొద్దీ నాపక్క సీటుకి వచ్చాడు. సరిగా కూర్చోలేవా ఇదేమైనా నీ ఇల్లా...!’ అని చెప్పాలన్నంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంది.
మరో సీటుకి మారుదామని లేవబోయింది. హఠాత్తుగా అతను వెక్కిళ్లు పెట్టి ఏడవటం మొదలు పెట్టేడు. ఇండియా నుంచి వస్తూంటే తల్లి తండ్రులను వదిలి వెడుతున్ననందుకు బాధపడుతున్నాడు అనుకోవచ్చు. అమెరికా నుంచి వస్తూ ఎందుకు ఏడుస్తున్నాడో సాగరికి అర్ధం కాలేదు.
అలా అని చిన్నవాడు కాదు....పాతికేళ్ళు ఉంటాయి. ఊరుకుని ఉండలేక పోయినది. జాలివేసింది. కోపం తగ్గి ,''హలో ...నీ పేరు ఏమిటి? ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందా ...ఎందుకు బాధ పడుతున్నావ్?” అని అడిగింది.
''నాపేరు అభిరాం ...ఆంటీ ...మా డాడీకి యాక్సిడెంట్ ఐంది అని ఫోను వస్తే సడన్గా బయలుదేరాను. ఇప్పుడు ఎలా వున్నారో... అంటూ సాగరి భుజమ్మీద వాలి మళ్ళీ రోదించాడు.
''అభి అంతా బాగుంటుందిలే! భయపడకు. ఆయన క్షేమంగా వుంటారు.'' అంది ఓదార్పుగా.
''ఫోను చూడాలంటే భయంగా వుంది ఆంటీ” అన్నాడు అతను.
''మీ మదర్కి తోడు ఎవరైనా వున్నారా! అసలు ఏమి జరిగింది?
“మా అన్న వదినా వాళ్లకి ఏడు ఏళ్ల కూతురు. అంతా ఉమ్మడి కుటుంబం మాది. నాన్నగారికి టెన్నిస్ అంటే ఇష్టం. టోర్నమెంట్స్కి వెడుతూవుంటారు. నాకు, మా అన్నకు నేర్పించాలని చూసారు కానీ మాకు రాలేదు. ఎప్పుడూ గాయాలు. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు.
మా అన్న కూతురు మాటీ..దానిపేరు. దానికి మాత్రం నాన్నగారి వారసత్వం వచ్చింది. స్కూల్ ఛాంపియన్. మా నాన్నగారితో రోజూ క్లబ్ కి వెడుతుంది. ప్రాక్టీసు చేస్తుంది.
అలా రెండురోజుల క్రితం నాన్నగారు క్లబ్ కి బయలు దేరితే, ఈ రోజు నేను రాను. భుజం నొప్పిగా వుంది అంటూ డ్రాప్ అయిపోయిన కారణంగా అది సేవ్ అయినది.
నాన్నగారికి బ్రెయిన్ ఇంజ్యూరీట....ఫోను చూడాలంటే భయంగా వుంది...'' అన్నాడు.
''వద్దు. మనం ల్యాండ్ అయ్యేదాకా చూడకు. ...అంటూ ఏవో కబుర్లు చెబుతూ మరిపించింది సాగరి.
సింగపూర్ చేరాక హైదరాబాద్ ఫ్లయిటుకి మారే హడావిడి...జెట్లాగ్ ,,నిద్ర బద్ధకం...అలా ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయారు. లాంజ్లో కూర్చున్న సాగరి అభిరాం కోసం చూసింది. అతను కనబడలేదు.
ఎందరో అమెరికా వెళ్లిన యువత - తల్లి దండ్రులను కోల్పోతున్నారు. ఒక్కో సారి అమెరికాలో రోడ్డు ప్రమాదాలలో పిల్లలూ మరణిస్తున్నారు. అప్పుడు పెద్దవాళ్ళు భరించరాని బాధతో జీవితకాలపు వేదన అనుభవిస్తున్నారు. పిల్లల మీద అంతులేని ఆశలు పెట్టుకుని డబ్బుకోసం పంపేవారు కొందరు....బంగారు భవిత కొరకు తల్లి తండ్రులను ఒంటరిగా వదిలి వెళ్లే పిల్లలు మరికొందరు.
ఎవరిని తప్పు పట్టలేం....కానీ, ఇప్పుడు భారతదేశంలో మెరిట్ ఉంటే తప్పక మంచి జాబ్స్ దొరుకుతున్నాయి. గతం కంటే మెరుగుపడింది.... కనుక మధ్యతరగతి వారు...అమెరికా కానీ, విదేశాలకు కానీ వెళ్ళవలసిన అవసరం లేదు. కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ అందరూ ఒకచోట ఉండటం సంతృప్తి కలిగిస్తుంది. కొందరు అమెరికాలో ఒత్తిడి తట్టుకోలేక తల్లి తండ్రులకు చెప్పలేక డిప్రెస్ అవుతూ అనారోగ్యం తెచ్చుకుంటున్నారు....ఇలా ఆలోచిస్తూంటే ...బోర్డింగ్ అనౌన్సమెంట్ వినిపించి సాగరి లేచింది.
అప్పుడు వచ్చాడు అభీరామ్! ఆమెను రెండు చేతులతో చుట్టుకుని భోరుమన్నాడు...
“ఆంటీ నాన్నగారు ఇకలేరు...!” అన్నాడు.
''సారీ అభిరాం...వెరీ సారీ! ధైర్యంగా వుండు....ఏదీ మనం అనుకున్నట్టు జరగదు. అమ్మని ఓదార్చు. ఆవిడకు తోడుగా వుండు....అంటూ ఓదార్చింది. తప్పనిసరియై అభిరాంని వొదిలించుకుని వెళ్ళిపోయింది.
ఈ సంఘటన జరిగిన నెలరోజులకు స్నేహితుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళినపుడు అనుకోకుండా కలిసాడు అభిరామ్. దూరంగా నలుగురు ఫ్రెండ్స్ తో హుషారుగా కబుర్లు చెబుతూ...డ్రింక్ చేస్తూ ...ఏవో జోకులు వేస్తూ!
''ఎంతలో టైం గాయం మానుతుంది ...పోనీలే పాపం....! అనుకుంటూ అతడిని పలకరించాలని అటు వైపు నడిచింది.
''ఒరేయి అభీ ...నువ్వు అమెరికా వెళ్లి కూడా నీ బుద్ధి మార్చుకోలేదు. ఆడవాళ్ళని బోల్తా కొట్టించడంలో ఘనుడివి. ఎలాగో పడగొట్టేస్తావ్. కొత్తగా నీ అనుభవం ఏమిటోచెప్పు వింటాం అన్నాడు ఒకడు.
''ఈ సారి నా వలలోపడిన పిట్ట......ఒక ఆంటీ!....పేరు సాగరి అట!” అంటూ ఆమె గురించి ఉన్నవీ లేనివి వల్గర్గా మాటాడుతూ వెకిలిగా నవ్వుతుంటే అభీ నిజ స్వరూపం తెలిసి వచ్చి అక్కడే ఆగిపోయింది.
తండ్రి చచ్చి పోయినట్టు నాటకం ఆడిన దుర్మార్గుడు వీడు...అన్నమాట. ఆడవాళ్ళని మోసం చేయడానికి ఇదో టెక్నీక్ అన్నమాట. వాడు ఎవడూ ఎందుకు ఈ పెళ్ళికి వచ్చాడో..కానీ బాగా బుద్ధి చెప్పాలి అనుకుంది...కసిగా.
స్టేజిమీద పాటలు పాడుతున్న అమ్మాయి చేతిలో మైక్ తీసుకుని.,
''అభిరామ్ ఎవరో స్టేజిమీదకు వస్తే నేను ఒక గిఫ్ట్ ఇస్తాను....అని పిలిచింది. అభిరామ్ ఆమెను గుర్తుపట్టి,
''అరే సాగరీఆంటీ !...ఓహ్ ఏమ్ అదృష్టం ఇంకాస్త చొరవ తీసుకోవచ్చు...నన్ను లైక్ చేస్తూంది....అనుకుంటూ గర్వంగా స్టేజ్ మీదకు వెళ్ళాడు.
''హాయ్ ఎవిరీబడీ ... థిస్ బాయ్ అభిరామ్ వెరీ క్రేజీ ఫెల్లో. ....క్రితం నెల నేను అమెరికా నుంచి వస్తుంటే నాతోబాటు ప్రయాణం చేసాడు.....అంటూ జరిగింది చెప్పి. ..., దగ్గిరగా వెళ్లి అతడి చెంపమీద ఛెళ్ళున వాయించింది.
తెల్లబోయిన అభిరామ్కి కళ్ళుతిరిగి ఏమి జరిగిందో తెలియడానికి కొన్ని క్షణాలు పట్టింది. అందరూ వింతగా చూస్తున్నారు. ఎందుకు ఆవిడ అతన్ని కొట్టిందో అర్ధంకాక.
“ఇప్పుడు ఇక్కడ వీడు ఫ్రెండ్స్ తో ఏమి మాట్లాడాడో వినండి. ఇదిగో ...అంటూ ఫోనులో రికార్డ్ చేసిన అభిరాం మాటలను వినిపించింది.
''ఇప్పుడు వీడిని ఎందుకు చెంపమీద కొట్టానో అర్థం అయినదిగా! ఇదేరా నీకు గిఫ్ట్. రాస్కెల్ ఆడవాళ్ళని చూస్తే నీబుద్ధి పెడదారి పడుతుంది. ఇలా చాలామంది చేత చీవాట్లు కూడా తినేవుంటావ్.
పెద్ద గొప్పగా నీ ఫ్రెండ్స్ కి కథలు చెబుతావా? ఇదిగో గైస్ మీరు ఇక వీడి మాటలు నమ్మకండి. వీడిని అమెరికాలో కూడా తన్ని తగలేస్తే, ఆ విషయం చెప్పుకోడు ఎలా చెబుతాడు...? వీడితో స్నేహం మానుకుని బుద్ధిగా వుండండి. లేకపోతే అలా మోసపోతూనేవుంటారు. ఒరేయి అభీ ....రాముడి పేరు చెడగొట్టేవు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఇప్పుడు అందరికీ నీ గురించి పూర్తిగా తెలిసింది. అందరూ అసహ్యించుకుంటారు. ఇదే నీకు తగిన శాస్తి. నీ బుద్ధి మారక పొతే, జైలుకి వెడతావ్. జాగ్రత్త! అంటూ స్టేజ్ మీదనుంచి కిందకి తోసింది.
అభిరాం తలవంచుకుని.....సిగ్గుతో ....అక్కడ నుంచి పారిపోయాడు !
''ఇది నిజంగా జరిగింది. అమ్మాయిలూ జర భద్రం! అబ్బాయిలను గమనించి దూరంగా ఉండండి.” అంటూ సాగరి ముగించింది.
బాగుందండి అన్నపూర్ణ గారు.