Menu Close
PrakriyalaParimalaalu_pagetitle
కిరణాలు

పద్యకవిత్వం వచన కవిత్వంగా పరిణామం చెందినాక జలపాతపు వేగంతో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పాఠకుల స్థాయిని, సమయాన్ని, ఆసక్తిని అనుసరించి వచన కవిత్వం మినీ కవిత్వంగా రూపుదాల్చి పాఠకుల మన్ననలు పొందింది.

మినీ కవిత్వం అనేక రూపాలతో కవుల కలాలను పరుగులు పెట్టించింది. ఒక ఉద్యమంగా 1980 ప్రాంతాలలో ప్రవేశించి దశాబ్దంపాటు వడివడిగా సాగి మరో దశాబ్దం మందకొడిగా నడిచింది.

లఘు కవితా రూపాలలో డా.ఎన్.గోపి సృష్టించిన ప్రక్రియ నానీలు విశేష ఆదరణ పొంది పుంఖానుపుంఖాలుగా కవులచే నానీలను సృజింపజేసింది. ఎన్నో సంపుటులు వెలువడ్డాయి. 4 పాదాలతో 25 అక్షరాలలోపు నియమంతో గల ఈ ప్రక్రియ సృష్టించిన సంచలనం మరుగున పడకముందే "మినీ కవితా పితామహుడు" డా. రావి రంగారావు ఈ ప్రక్రియను మరింత సరళం చేసే ఆలోచనతో "కిరణాలు" అనే నూతన లఘుకవితా ప్రక్రియకు రూపకల్పన చేశారు.

మినీ కవిత లక్షణం ఏమిటంటే తక్కువ పదాలతో పెద్ద భావాన్ని ఫెడీల్మనే కొసమెరుపుతో చెక్కబడడం. కిరణాలు పేరుకు తగినట్లే ఆదిత్యుని కిరణాలలా కవికలం నుండి వాడిగా వేడిగా వెలువడి చదువరుల మస్తిష్కాన జ్ఞానజ్యోతులై ప్రకాశిస్తాయి.

నాలుగు పాదాలు, పాదానికి మూడేసి పదాలు మించకుండా ఉన్న కిరణాలు కు ఎటువంటి అక్షర నియమం లేకపోవడం వలన కవిత్వశక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి కవిత్వం వెలువడుతుందని తన ఆశగా చెబుతారు డా. రావి రంగారావు.

మచిలీపట్నం ఆంధ్ర జాతీయ బి.ఎడ్.కళాశాల లో విశ్రాంత ప్రిన్సిపాల్ అయిన డా. రావి రంగారావు ప్రస్తుతం గుంటూరులో స్థిరపడ్డారు. అమరావతి సాహితీమిత్రులు, రావి రంగారావు సాహిత్య పీఠం సంస్థలు నెలకొల్పి సాహితీ సేవ చేస్తున్నారు.

శక్తివంతమైన మినీ కవితా వ్యాప్తి ధ్యేయంగా ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా కిరణాలు, మినీ కవితలను కవులచే వ్రాయించి సూచనలతో పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నారు.

కిరణాలు ప్రక్రియ నియమ రహితం కావడంతో పలువురు కవులు ఉత్సాహంగా స్వేచ్చగా తమ భావాలను కిరణాలుగా పదును పెట్టుకుంటున్నారు. అగ్నిపర్వతం నుండి లావా విరజిమ్మినట్లు ఒక్కసారిగా పెల్లుబికే అభివ్యక్తి పాఠకులను మరో కిరణానికి వెంటనే వెళ్ళనీకుండా నిశ్చేష్టులను చేస్తుంది.పలువురు కవులు సంపుటులు కూడా వెలువరించారు. ఆకర్షణీయం, శక్తివంతం, సులభ తరం అయిన నూతన లఘు కవితా ప్రక్రియ "కిరణాలు" నియమాలను ఒకసారి చూద్దాం.

కిరణాలు నియమాలు:

  1. నాలుగు పాదాలు ఉండాలి.
  2. ఒక్కో పాదానికి మూడు లేదా అంతకంటే తక్కువ పదాలు ఉండాలి. మూడు పదాలు మించరాదు.
  3. అక్షరాల సంఖ్య, మాత్రల సంఖ్య, ప్రాస నియమాలు లేవు.

ఉదా.కు డా.రావి రంగారావు సంపుటి "రావి కిరణాలు" నుండి ముచ్చటగా మూడు కిరణాలు చూద్దాం.

నాలుగు కాళ్ళ
కుర్చీ కదా!
ఎక్కగానే
మనిషి జంతువు.

పువ్వును చూస్తున్నారు
కాడని చూడరు
సంపదని
శ్రమజీవి మోస్తున్నాడు.

ఇతరుల
లోపాలు
చూపే వేలుకి
ఉంగరం తొడగరు.

మరింత అవగాహనకై నేను సృజించిన కిరణాలు కొన్ని పరిశీలించండి.

శివుడేమో నందినెక్కె
వినాయకుడు ఎలుకనెక్కె
వీడే నా వాహనమని
డబ్బుకట్ట మనిషినెక్కె.

చిగురాకు
పండుటాకై రాలింది
ఎరువై
తల్లిరుణం తీర్చింది.

నిప్పూ నీళ్ళూ
కలిసి కాపురం
బాయిలర్ ఇంట్లో
ఆవిరి కొడుకు

రాకెట్
రోదసికి
నైతిక విలువలు
పాతాళానికి.

కూరలో టమాటాలా
కాకర కలుస్తుందా?
యదార్థవాదీ
లోకవిరోధి.

అచ్చంగాయలు
తొక్కుడుబిళ్ళ
వామనగుంటలు
పరభాషా పదాలు.

చీకటి కాటుక
వెన్నెల పౌడరు
జాబిలి బొట్టు
ప్రకృతి సోయగం.

పూదోటపై యుద్దం
గజమాల సిద్దం
సంబరాలు షురూ
ఓటరు ఓడితేనేం?

కర్మాగారాలు
ఒకోసారి
కావచ్చు
ఖర్మాగారాలు.

శబ్దం
నిశ్శబ్దాన్ని మిగిల్చింది
నిశ్శబ్దం
శబ్దాన్ని రగిల్చింది.

***సశేషం***

Posted in April 2021, సాహిత్యం

2 Comments

  1. రావి రంగారావు

    గుడిపూడివారూ, కృతజ్ఞతలు, మధుగారూ, మీకు కూడా…

  2. బత్తిన కృష్ణ

    అవును కదా మినీ కవితలు చదువుతుంటే చాలా చక్కగా ఉన్నాయి ఇంత నిదివిలోనే అంత అర్ధం వివరణ బావుంది

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!