మధుర మీనాక్షి ఆలయం
మీనాక్షీదేవి దర్శనము, ఆ తరువాత ఆ ప్రాంగణంలో ఉన్న శిల్పసౌందర్యము చూసి, ప్రదక్షిణంగా వెడితే ఒక పెద్ద దారి (Corridor) వస్తుంది. సరిగ్గా మొదట్లో చెప్పిన దారి దీనికి కలిసే ముందు, తలపైకెత్తి కప్పు వంక చూడాలి. ఎందుకు చూడాలి? ఎవరూ మామూలుగా అలా తలెత్తి చూడరుగా? చూడాలి. ఎందుకంటే వచ్చిన భక్తులందరూ అలాగే చూస్తూంటారు కనుక! ఆలా చూస్తే ఒక శివ లింగ చిత్రం పైకప్పుపైన కనిపిస్తుంది. అది మహా చిత్ర చిత్రం. శివలింగం మనవైపే తిరిగినట్లు, సహజంగా కనిపిస్తుంది. ఇప్పుడు తలపైకే పెట్టి, ఆ చిత్ర పటాన్నే చూస్తూ పటం అటువైపు నడవండి. శివలింగం మళ్ళీ మీ వైపే తిరిగి ఉన్నట్లు ఉంటుంది! మీకు నమ్మకం కలగక మళ్ళీ ముందున్న వైపు వస్తారు. ఈసారి సరిగ్గా చూడాలని. లింగం, పానుమట్టం ఎటు ఉన్నాయో గుర్తుంచుకుంటారు, ప్రయత్న పూర్వకంగా. మళ్ళీ అటు వెళతారు. లింగం మీవైపే తిరిగి ఉన్నట్లనిపించి, ఖంగు తిని, ఈసారి మీ కుడివైపు వెళ్లి, మళ్ళీ అటువైపు నడుస్తారు. మీరెటువెళ్ళినా శివుడు మిమ్మల్నే చూస్తున్నట్లనిపించి, వెంటనే మీ చేతిలో ఇందాక అర్చకుడు పెట్టిన విభూతి నుదుటికి రాసేసుకుంటారు! ఇవన్నీ నాకయినాయి! ఇలా కప్పుల మీద ఇంత మంచి చిత్రచాతుర్యం ఉన్న దేవాలయం ఇది మాత్రమే అని నా అభిప్రాయం. నేలమీద, కప్పుమీద రక రకాల రంగవల్లులు దిద్దబడి ఉన్నాయి.
దీని పక్కనే ఒక స్థంభం పక్కన నేలమీద ఒక ఇత్తడి చెక్కిన పళ్లెం లాంటిది రాయిలో పాతబడి ఉంటుంది. దానిమీద నిలబడి పైకి చూస్తే అమ్మవారి గర్భగుడిపైన ఉన్న విమాన కలశం కనపడుతుంది. తమాషా ఏంటంటే అక్కడనించి కొంత ఆకాశంకూడా కనపడుతున్నా, పూర్తి వాన పడినా ఒక్క బిందువు కూడా గుడిలోపలకి కారదు. పైకప్పులో ఉన్న చిల్లు కోణం అలా ఉంటుందన్నమాట. అలా ఆ గోపురాన్ని చూడడం శుభం అని ప్రతీతి.
ఈ ప్రదేశంనించి పది పదిహేనడుగులు వేస్తే మనం మామూలుగా ఊహించలేనంత పెద్ద విఘ్నేశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ రోజుకి రెండుసార్లు, పండగరోజుల్లో మూడుసార్లు అభిషేకం జరుగుతుంది. విగ్రహం ఎంత పెద్దదంటే ఒక్కొక్కప్పుడు ఇద్దరు అర్చకులు ఒకేసారి నుంచుని అభిషేకం చేస్తారు. ఒక మనిషికంటే పెద్దది ఆ విగ్రహం. మనిషి చెయ్యి పైకెత్తినా, విగ్రహం మీద పైనించి జలం పొయ్యడం కష్టం. చాలా అందమైన విగ్రహం. గోడకి ఉంటుంది, దాదాపు 5 అడుగుల ఎత్తులో. ఆ పైన అంత పెద్ద వినాయకుడు. భలే లగ్నమవుతాము దేముడితో. విఘ్నేశ్వరుడి ఎదురుగా ఇదివరకు చెప్పిన 'దారి ' ఉంటుంది. అక్కడ అర్చన పూర్తిగావించుకుని, ముందరికి వెళ్లి, ఎడమచేతివైపు తిరిగి సుందరేశ్వరుడి ఆలయంలోకి ప్రవేశిస్తాము.
సుందరేశ్వరుడు శివకామి (కామేశ్వరి) చిదగ్ని నుంచి ఉద్భవించినప్పుడు, బ్రహ్మ వారిద్దరికీ వివాహం చేయదలచి, 'అమ్మ వారు అతిలోక సుందరిగా ఉన్నారు, నువ్వు పెళ్లిచేసుకుంటావా? మరి ఈ జడలుకట్టేసిన జుట్టేంటి? ఒళ్ళంతా బూడిదేంటి? ఈ రక్తం కారుతున్న ఏనుగు చర్మమేంటి? నిన్ను ఆవిడ పెళ్లి చేసుకోవాలంటే ఎలా? ఈ రూపం తగదు కదా?' అని అంటే, 'ఇదిగో! ఒక్క క్షణం' - అని శివుడు తన రూపం మార్చుకొచ్చాడట. అత్యంత సుందరమైన, శుద్ధ స్ఫటికాకృతితో, ఆయనతో ఇంక ఎవరూ పోటీ పడలేనంత అందంగా తయారయ్యాడట. అప్పుడు అమ్మవారు ఆయనని పెళ్లిచేసుకోడానికి ఒప్పుకుందట. అలా ఒకరైన ఆ దివ్య దంపతులు, ఒక లీల కోసం, జన్మనెత్తక్కరలేనివారు ఆమె పాండ్యరాజ బాలికగా అవతరిస్తే ఆయన సుందరేశ్వర రూపంతో వచ్చి ఆమెని గెలుచుకున్నాడు. ఈ శివలింగంలో కూడా మనకి ఆ కళ ద్యోతకమవుతుంది. మాకు స్పెషలు పర్మిషనుండి దగ్గిరగా చాలాసేపు నుంచుని చూడగలిగాము. అర్చన చేయించుకోగలిగాము. మీకు ఇది చాలా పెద్ద గుడని చెప్పానుకదా - ఆ కప్పు ఎత్తు చూడండి! 12 అడుగుల పైన ఉంటుంది. 11 వందల ఏళ్ల ముందర కట్టిన గుడికూడా ఎంత విశాలంగా కట్టారో చూస్తే మన పూర్వీకుల విశాల హృదయం మీద అంత గౌరవం కలుగుతుంది.
ఆ తరువాత మీనాక్షీ గుడిలోనే అటు పక్కనే ఉన్న పురాతన వస్తు ప్రదర్శన శాల చూడాలి. అన్ని మ్యూజియంలు బాగుంటాయి, కాదనను. కానీ ఇలాంటి ప్రదేశం చూడదగ్గది. 'ఆ! ఈ పాత వస్తువులు చూసేదేమిటి?' అని దాటెయ్యద్దు. ముందర ఒక వెయ్యి స్తంభాల మంటపం ఉన్నది. దాంట్లో మళ్ళీ చాలా స్తంభాలు ఒక మంచి కారిడార్ లాగా ఏర్పడి ఉంటాయి. దాని చివర పెద్ద నటరాజ విగ్రహం. అద్భుతమైన శిల్ప కళ. జీవం ఉట్టిపడుతున్నట్లు ఉంటుంది. ఈ స్తంభాలన్నిటి మీదా 'యాళి' చెక్కడాలున్నాయి. ప్రతి స్తంభం భాగంగా యాళి అశ్వాలు చెక్కబడి ఉండి, వాటి దవడలలోనుంచి ఒక "కఱ్ఱ" కింద కాళ్ళ నించి తల పైదాకా ఉన్నట్లు ఉంటుంది. ఈ చెక్కడాలలో పనితనం అబ్బురం కలిగిస్తుంది. గొప్పదనం ఏమిటంటే అన్ని స్తంభాలు ఒకేలాగా ఉంటాయి. ఒకదానికి ఇంకో దానికీ తేడాలుండవు. ఇంత పనితనం ఎలా సాధ్యం? అని విస్తుపోవడం తప్ప మనం ఏమీ చేయలేము. ఆ పక్కన మ్యూజియంలోకి వెడితే (చిన్న రుసుము ఉన్నది) కొన్ని వెలలేని శిల్పాలు ఉన్నాయి. మన పురాతన శిల్పాలలో ఏ కాలాల్లో ఏ విధంగా శిల్ప కళ అభివృద్ధి చెందింది, ఏ విధంగా శిల్పాన్ని చూసి అది ఏ కాలందో నిర్ణయించచ్చో ఆ విషయాలు చూపించబడి ఉన్నాయి. నాకు చాలా నచ్చిన అంశం - మనం ప్రతిదేవతకి, అంగన్యాస, కరన్యాసాలు చేస్తాము. అవి ఎలా చెయ్యాలో ఒక తీగెతో చేతులని చూపిస్తూ వివరించబడి ఉన్నాయి. ఎంత తెలివైన ఆలోచన! చిన్న చిన్న విగ్రహాలు - ఎంతో సూక్ష్మంగా చెక్కబడి ఉన్నవి చాలా కనిపిస్తాయి.
ఇలా సుందరేశ్వరుడి గుడి నించి బయటకు వచ్చి ఉత్తర ద్వారం వైపు వెడితే, ఈ మధ్యనే ప్రమాదంలో తగలబడిపోయిన తూర్పు గోపురం ముందుండే దారి, దానికి రెండు పక్కలనుండే మసిబారిన కొట్లు కనిపిస్తాయి. ఉగ్రవాద దాడేమో అని అడిగితే కాదన్నారు కానీ, నాకు భయంగా, అనుమానంగానే అనిపించింది. అలా బయటకు వస్తే ఒక అబ్బురమైన చెట్టు, దానికింద చిన్న గుడి కనిపిస్తాయి. ఆ చెట్టు రావి, వేప కలిసిన చెట్టు. ఇలా రావి/వేప కలిసి ఉండడం చాలా శుభం అనీ, అది కళ్యాణ దాత అనీ భక్తుల నమ్మకం. ఆ ఎండలో కాళ్ళు మాడి పోతున్నా, చాలామంది తలిదండ్రులు వారి కన్యలైన కూతుళ్ళని ప్రోత్సహించి ప్రదక్షిణాలు చేయిస్తున్నారు. అక్కడనించీ చూస్తే అన్నిటికన్నా పెద్దదైన దక్షిణగోపురం చాలా పెద్ద ఆవరణ వెనక అందంగా కనిపిస్తుంది. దీని వెనక కథేమిటంటే తిరుమల నాయకుడు దక్షిణ గోపురం కట్టక ముందే చనిపోయాడు. ఆ తరువాత ఆ పని పూర్తికాలేదు. 17వ శతాబ్దంలో ఒక పేద భక్తురాలు ఇంటింటికీ వెళ్లి, డబ్బు సేకరించి, ఆ గోపురం కట్టించింది. 3000 కుడ్యాలకు పైగా ఉన్నాయి ఆ గోపురం మీద. అసలు ఆ గోపురం ద్వారం దగ్గిర చూస్తే తెలుస్తుంది, అది ఎంత పెద్దగా కట్టారో!
ఈ గుడిలో చిత్ర శిల్పాలు కూడా ఉన్నాయి. ఒక శిల్పంలో నోటిలో ఒక బంతి ఉంటుంది. మనం కదిలిస్తే కదులుతుంది; కానీ బయటకు రాదు. చెవుల్లోనుంచి చెయ్యి లోపలకి పెట్టి, ఆ బంతిని పట్టుకోవచ్చు! ఎంత శిల్ప చాతుర్యంతో తయారు చేశారో!
ఇక్కడ ప్రమాణ పూర్వక శిల్పాలు కూడా ఉన్నాయి. వినాయకుడికి ఒక రూపం లక్ష్మీ గణపతి రూపం. "రూప ధ్యాన రత్నావళి" గ్రంథాన్ని నేను జాగ్రత్తగా పరిశీలించి నప్పుడు, లక్ష్మీ గణపతి రూపంకి వినాయకుడి రెండు తొడలమీదా సిద్ధి, బుద్ధి, ఉంటారు. ఇది ఇలాగే ఉండాలనే వాగ్వాదాలు నేను కొంతమందితో చెయ్యడం కూడా జరిగింది. ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి విగ్రహం చూసాక నాకు ఋజువు దొరికింది. ఈ గ్రంథ కర్త ప్రముఖుడు, స్థపత్య వేద ప్రజ్ఞాత, పలు పుస్తక రచయిత, పద్మశ్రీ గ్రహీత అయిన డా. గణపతి స్థపతి. తెలుగు వారి తలమాణికం. కాబట్టి, ఇలాంటి పురాతన ఆలయాల దర్శనం మనకి ఇతర లాభాలని కూడా చేకూర్చుతుంది.
ఈ ఆలయంలో మనం చూసి నేర్చుకునే శాస్త్రాలు - శిల్పం, చిత్రం, సాముద్రికం, శైవం, శాక్తేయం, ఆలయ వాస్తు, పురాతన జంతు దర్శనం, ఆధ్యాత్మికత వగయిరా. ఇంకా లోతుకు వెళితే గణితం, లోహ విద్య, శైవ ఆగమ శాస్త్రాలు వంటివి కూడా ఉన్నాయి.
ఇలా ఈ పెద్ద ఆలయ దర్శనం చేసుకుని, బయటకి వచ్చి, 'గోపు అయ్యంగార్ కాఫీ కడై' (కాఫీ కొట్టు) లో కాఫీ లాగించి దగ్గిరలో ఇంకొక క్షేత్ర దర్శనానికి బయలుదేరాము.
అద్భుతం. శంకర భగవత్పాదులు కూడా ఇలానే అంటారు మొదట్లో – శివుడూ పార్వతీ ఒకరికొకరు అమోఘమైన తపస్సు చేసి దంపతులయ్యారనేది.
నేను దేశంలో ఉన్నప్పుడు ఒకసారి మధురై వెళ్ళడానికి అవకాశం వచ్చింది. వెళ్దాం అనుకునేలోపు ఆ అవకాశం పోయింది. ఇప్పటికీ చూడలేదు. అలా చూడనివాటిలో అరుణాచలం కూడా ఒకటి. ఈ వ్యాసంలో ఫోటోలు నాకు కనబడలేదండి. ఉన్నాయా, పెట్టడం మర్చిపోయారా?