సాయంత్రం ఆఫీసునుంచి వచ్చిన నీరజాక్షి అలసటగా కుర్చీలో వాలిపోయింది.
"అమ్మా కాఫీ కావాలి" వంటగదిలోనున్న తల్లికి వినబడేలా అరిచింది నీరజాక్షి.
మరో ఐదు నిమిషాల్లో కాఫీ కప్పుతో కూతురు దగ్గరకు వచ్చిన మీనాక్షి ఆమెకు కప్పు నందిస్తూ
"నాన్నగారు నిన్ను రేపు శలవు పెట్టమంటున్నారు" అంది కూతురితో.
"ఏం ఎందుకు?" అన్నట్టు చూసింది నీరజాక్షి.
"రేపు నీకు పెళ్లి చూపులు అబ్బాయి తో పాటూ అతని తల్లిదండ్రులు కూడా వస్తున్నారు" అంది మీనాక్షి.
" నాకిష్టం లేదు, రావద్దని చెప్పేయండి"
" ఏం ఎందువలన?" అన్నారు ఆమె తండ్రి శ్యాం సుందరం గారు అప్పుడే లోనికి వస్తూ.
"నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు" అంది నీరజాక్షి నిర్మొహమాటంగా.
"ఇప్పుడే చేసుకోవాలని లేదా అసలు పెళ్లే చేసుకోవా?" గాండ్రించారు శ్యాంసుందరం గారు.
"అసలేంటి మీరు కూతుర్ని ట్రీట్ చేసే పద్ధతి ఇదేనా?" విసుక్కుంది నీరజాక్షి.
"అంటే మాకు పిల్లల్ని పెంచే విధానం తెలియదనా నీ ఉద్దేశ్యం?"
"అది కాదు డాడీ నేను..నేను ఒకతన్నిప్రేమిస్తున్నాను. అతన్ని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోలేను" అంది నీరజాక్షి తలదించుకొని కాలి బొటనవేలు నేల మీద రాస్తూ.
"ఓ అలా చెప్పు ఎవరతను? ఏం చేస్తుంటాడు మన కులస్తుడేనా? ఏఊరు? పేరేంటి?" ఆరా తీయడానికి ప్రయత్నించారు శ్యాం సుందరం గారు.
"అతను నాతో పాటే ఇంజనీరు గా చేస్తున్నాడు. అతని పేరు రాజా. అతనిది రాజమండ్రి, మన కులం కాదు" అంది. అదురు, బెదురు లేకుండా నీరజాక్షి.
"మన కులం కాదా?" అన్నారు తండ్రి శ్యాంసుందర్ గారు కళ్లెర్రజేస్తూ.
"అవును. వాళ్ళు క్రిష్టియన్. ఇంకా ఈ రోజుల్లో కూడా కులమూ గోత్రం అంటారేంటి డాడీ? అతను నా కిష్టపడ్డాడు అంతే" అంది మొండిగా నీరజాక్షి.
"నా కూతురికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మహా బుద్ధిమంతురాలు అనుకునేవాడ్ని ఉద్యోగానికెళ్లినా దించిన తల ఎత్తదు అనుకునే వాడ్ని. ఇన్నాళ్ళూ ఇంత అమాయకంగా కనిపించిన ఈ పిల్లేనా! నా మొగుడ్ని నేనే ఎంచుకున్నాను మీరు వచ్చి అక్షింతలు వెయ్యండి చాలు' అంటుంటే నమ్మశక్యం కావటం లేదాయనకు. ఇన్నాళ్ళూ తల్లి చాటు బిడ్డగా పెరిగిన నా కూతురేనా?" అనుకోసాగారు శ్యాం సుందరం గారు కూతుర్ని చూస్తూ.
"అందం ఒక్కటే చూడకూడదమ్మా, జీవితమంటే భవిష్యత్తు లో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు ఎదురవుతాయి, వాటిని ఎదుర్కోవాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు, కొన్నిచోట్ల బంధుమిత్రుల హేళనలకు గురికావాల్సి ఉంటుంది. అవన్నీ తట్టుకునే శక్తి నీకుందా?" అన్నారు శ్యాం సుందరం గారు.
"నాకు వాళ్ళందరితో సంబంధం లేదు డాడీ, నాకు నా రాజా ఉంటే చాలు" అంది నీరజాక్షి.
"మన వంశమేంటి, మన సంప్రదాయమేంటి, మన ఆచార వ్యవహారాలేంటి? పెళ్లంటే కులం, గోత్రం, నక్షత్రాలు అన్నీ చూడాలి, అవన్నీ గాలి కొదిలేసి కంటికి నదురుగా కనబడ్డాడని తాళి కట్టించేసుకుంటే ఇక్కడ మా పరువేం కాను? ఫలానా వారి అమ్మాయి ఇలా అట, అలా అట, అని లోకులు వేలెత్తి చూపిస్తుంటే నలుగురిలో తలెత్తుకు తిరగ్గలమా? కుటుంబ గౌరవం మంట గలిసి పోదూ? బంధువుల్లో ఎంత తలవంపులు?" అంది మీనాక్షి కూతుర్ని నిలదీస్తూ.
"పోనీ అవన్నీ వదిలేయ్. రేపు మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందనుకుంటున్నావు? నేను చెప్తా విను, మీ ఎదురుగా మెచ్చుకుంటారు, మీ ఆదర్శాన్నిమెచ్చుకుంటారే తప్ప అనుసరించరు. దాన్ని బట్టి అర్ధం చేసుకో, దిగుదిగు అన్నవాడే గానీ దిగేవాడు లేడన్న సామెతలో ఎంత సత్యముందో నీకే తెలుస్తుంది. అంతే కాదమ్మాయ్ ఈ ప్రేమలో వ్యామోహాలు పలచబడ్డాక తిండి, తిప్పల్లో, ఆచార వ్యవహారాల్లో, జీవన విధానంలో, తేడా లొచ్చి సరిపెట్టుకోలేక మీలో మీరే కలహించుకుంటుంటే ఎవరూ మీకు సర్ది చెప్పరు, మీ సమస్యను ఎవరూ తీర్చిదిద్దరు, అదే పెద్దలు చేసిన సంబంధమనుకో వారి మధ్య వచ్చిన సమస్యను ఇట్టే పరిష్కరిస్తారు. ఇంతటితో సరిపోదు, రేపు మీకు పుట్టిన పిల్లలకు ఓ పట్టాన పెళ్లిళ్లు కావు. నానా అవస్తా పడాలి. సంకరమే వెదుక్కోవాలి, ఎందుకు చెబుతున్నానో నా మాట విను" అన్నారు శ్యాం సుందరం గారు.
"లేదు డాడీ మేమిద్దరం ఇవన్నీ ముందే ఆలోచించుకున్నాము. ఒకర్ని ఒకరం బాగా అర్థం చేసుకున్నాము. సామరస్యం, అవగాహనా, సహకారం ఉంటే ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు డాడీ. మాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు" అంది నీరజాక్షి. హతాశులయ్యారు తల్లిదండ్రులిద్దరూ.
ఓ పది రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి.
ఆ రోజు శ్యాం సుందరం గారు ఒక ముఖ్యమైన పని మీద పొరుగూరు వెళ్లి వస్తున్నప్పుడు ఆయన ఎక్కిన ఆటో యాక్సిడెంట్ కు గురి కావటంతో ఆయనకు బాగా దెబ్బలు తగిలి రక్తస్రావం బాగా జరగడంతో ఆయనకు రక్తం ఎక్కించవలసి రావటంతో హాస్పిటల్లో ఓ వ్యక్తి రక్తదానం చేయటం వలన ఆయన బ్రతికి బట్టకట్టారు.
కొన్ని గంటల తరువాత మెలుకువ వచ్చిన శ్యాం సుందరం గారు అప్పుడే విజిట్ కు వచ్చిన డాక్టర్ తో చేతులు జోడిస్తూ "డాక్టర్ నాకు రక్త దానం చేసి ప్రాణ భిక్ష పెట్టిన ఆ వ్యక్తి ఎవరు సార్? నేనతన్ని చూడాలి. ప్లీజ్ అతన్ని ఒక్కసారి పిలిపించండి" అన్నారు.
"ఓ దానికేముంది. నర్స్ ప్రక్క రూమ్ లో పేషంట్ దగ్గరున్న రాజాని పిల్చుకురా" అన్నారు డాక్టర్ మధుసూదనం గారు.
"ఎలా ఉన్నారు సార్ బాగున్నారా?" అడిగాడు రాజా.
"బాబూ నాకు రక్త దానం చేసిన వారు మీరేనా, నాకు పునర్జన్మనిచ్చి కాపాడారు. మీ రుణం ఎలాతీర్చుకోను?" అన్నారు శ్యాం సుందరం గారు చేతులు జోడించి.
"అయ్యో మీరలా అనుకోవద్దు సార్. కష్టంలో నున్న మనిషికి సాటి మనిషిగా నేను చేయవలసింది చేసాను, మీరు అన్యదా భావించకండి" అన్నాడు రాజా.
"మళ్ళీ వస్తాను సార్ నా ఫ్రెండ్ దగ్గర ఎవరూ లేరు" అంటూనే నిష్క్రమించాడు రాజా.
ఇంతలో నర్స్ ఫోన్ చేయటంతో మీనాక్షి, నీరజాక్షి ఆటోలో రానే వచ్చారు కంగారుగా.
"ఏమయ్యిందండీ" రాగాలు తీసింది మీనాక్షి భర్తను చూస్తూ.
"అమ్మా!! ఇది హాస్పిటల్ ఇక్కడ ఏడవకూడదు, ఒకాయన రక్త దానం చేయడం వలన ఆయనకు బాగానే ఉంది" అన్నారు డాక్టర్.
నీరజాక్షికి వార్డులో ఎదురయ్యాడు రాజా.
"మీరేంటి ఇక్కడ ఎవరికైనా బాగలేదా?" అంది నీరజాక్షి రాజాని చూడగానే.
"అవునండీ. నా ఫ్రెండ్ కు యాక్సిడెంట్ అయ్యింది. ఇక్కడ చేర్చాను, మరి మీరు ఇలా వచ్చారేంటి?" అన్నాడు రాజా.
"మా నాన్న గార్కి కూడా బాగలేదు. ఆయనకూ యాక్సిడెంట్ అయ్యింది. అందుకే ఇలా వచ్చాను" అంది నీరజాక్షి.
"సరే నండీ మనం తరువాత కలుద్దాం వస్తాను. నా ఫ్రెండ్ దగ్గర ఎవరూ లేరు" అంటూనే నిష్క్రమించాడు రాజా.
నీరజాక్షి తండ్రి ఉన్న వార్డులోకి వచ్చింది. ఇంతలో డాక్టర్ గారు వచ్చి "రక్త దానంతో మీ నాన్నగారికి ప్రాణ గండం తప్పినట్లేనమ్మా. మరో గంటలో ఫార్మాల్టీస్ పూర్తవగానే మీరు మీ డాడీని ఇంటికి తీసుకెళ్లవచ్చు అన్నారు.
డిశ్చార్జి తతంగమంతా ముగిసిన తరువాత మరోగంటలో ఇల్లు చేరుకున్నారు శ్యాం సుందరం గారు భార్యా బిడ్డలతో.
"ఎలా జరిగింది నాన్నా యాక్సిడెంట్" అడిగింది నీరజాక్షి.
"నా వరకూ పర్వాలేదు గానీ నాకు రక్తదానం చేసిన అబ్బాయితో పాటూ మరో అబ్బాయి. ఇతను బైక్ తో ఆటోను గుద్దేయటంతో అతని ఫ్రెండ్ కి దెబ్బలు బాగా తగిలాయట. ఎలా ఉన్నాడో ఏంటో?" విచారించారు శ్యాంసుందరం గారు.
మరో రెండు రోజుల్లో రాజా శ్యాం సుందరం గార్ని చూసేందుకు డాక్టర్ గార్ని ఫోన్ నెంబర్ అడిగి ఆయన ఇంటికి పళ్ళు పట్టుకొని బయలు దేరాడు.
"రండి బాబూ ప్రత్యేకించి వచ్చారా నన్నుచూడటానికి"
"భలేవారే అంకుల్ డాక్టర్ గార్ని అడిగితే మీరు ఇంటికి వెళ్లిపోయారని తెలిసింది, అందుకే ఇలా వచ్చాను. బాగున్నారా"
"మీ దయవలన బాగున్నాను బాబూ! ఆ సమయంలో మీకున్న మంచి మనసుతో నాకు రక్త దానం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోను బాబూ?" అన్నారు శ్యాం సుందరం గారు ఎంతో దయతో.
ఇంతలో నీరజాక్షి వచ్చింది అక్కడికి "అరె మీరేంటి ఇక్కడ?" ఆశ్చర్యపోయాడు రాజా.
"ఆ మాట నేనడగాలి" అంది నీరాజాక్షి.
"ఇది మా అమ్మాయి బాబు. పేరు నీరజాక్షి. మీ ఇద్దరికి ముందే పరిచయముందా?" అడిగారు శ్యాం సుందరం గారు
"అవును సార్ మేమిద్దరం ఒకే ఆఫీసులో వర్క్ చేస్తున్నాం"
"మీరెవరు బాబూ ఏదో పరిచయమంటున్నారు?" అంది మీనాక్షి ఆరా తీస్తూ.
"మనమ్మాయి జాబ్ చేస్తున్న కంపెనీలోనే ఇతను కూడా చేస్తున్నారట" అన్నారు శ్యాం సుందరం గారు.
"అలాగా!" అంది అతని చేతికి కాఫీ కప్పు అందిస్తూ.
"మేమిద్దరం ఒకే ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నాము ఆంటీ. మీ అమ్మాయి గారు కూడా నాకు బాగా తెలుసు" అన్నాడు రాజా కాఫీ తాగి కప్పు క్రింద పెడుతూ.
"అమ్మా ఈ రాజా చాలా మంచి వాడు, నేనెవరో తెలియకపోయినా ఎంతో ధైర్యం చెప్పి మానవత్వంతో నాకు తన రక్తాన్ని దానం చేసాడు లేదంటే నీ తండ్రి మీ అందర్నీ ఇలా చూసేవాడు కాదు" ఉత్తరీయంతో కళ్ళనొత్తుకున్నారు శ్యాం సుందరం గారు.
"నాన్నా ఈయన మన కులం వారు కాదు మరి మీకు రక్తదానం చేసి మిమ్మల్ని కలుషితం చేయడం ఎంతవరకు సబబు?" అంది నీరజాక్షి.
"ఎంత మాటన్నావమ్మా! ఆపదలో ఆదుకున్న మనిషిని ఇలా అవమానిస్తావా! ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం?" కళ్లెర్రజేశారు కూతుర్ని గదమాయిస్తూ.
"నాన్నా నేను ప్రేమించిన అబ్బాయిది కూడా ఇతని కులమే అందుకే అలా అన్నాను" అంది నీరజాక్షి.
"అయితే మాత్రం అతనెవరో నాకు తెలియదు కానీ ఇతని సంస్కారం ముందు అతనెంత? ఇతను ప్రాణాలను తెగించి నన్ను కాపాడిన వ్యక్తి, ఇతనితో అతన్ని పోల్చి ఇతన్ని చిన్నబుచ్చుతావెందుకు?"
"అతను ఇతనే నాన్నా మీకు అనుకోకుండా రక్త దానం చేసి మనకు మహోపకారం చేసిన వ్యక్తి ఈయనే ఆయన" అంది నీరజాక్షి.
"నిజమా నీరజాక్షి, నేను రక్తదానం చేసింది మీ ఫాదర్ కా? ఓ మై గాడ్" అన్నాడు రాజా ఆశ్చర్యంగా.
ఇంకా, ‘నీరజాక్షి తమ ప్రేమ సమస్యను తల్లిదండ్రులకు చెప్పి ఎలా పరిష్కరించగలదోనని ఇన్నాళ్లుగా తను మనసులో బాధ పడుతూనే ఉన్నాడు, ఎందుకంటే ఇంట్లో కులాంతర వివాహాన్ని ఒప్పుకోరని ముందుగానే తనతో చెప్పి ఉంది. దాన్ని భగవంతుడు ఈ రూపంలో సాల్వ్ చేస్తాడనుకోలేదు' మనసులోనే అనుకున్నాడు రాజా.
"బాబూ నిజంగా ఆ వ్యక్తి మీరేనా? నా కూతురు ప్రేమించింది మిమ్మల్నేనా?" అడిగాడు శ్యాం సుందర్ గారు.
"అవును సార్ క్షమించండి, మేమిద్దరం చాలా కాలంగా ప్రేమలో పడిపోయాము, మీ అనుమతి కోసమే మేము ఎదురు చూస్తున్నాము కానీ ఇంతలో ఇలా! నన్ను క్షమించండి సార్."
"మీరేం తప్పు చేశారని క్షమించడానికి, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే నాయనా. మీ లాంటి మంచి వ్యక్తిని ఎంపిక చేసుకున్న నా కూతుర్ని అభినందించాలి" అన్నారు శ్యాం సుందరం గారు
"నాన్నా నిజంగా మా వివాహానికి మీరు ఒప్పుకున్నారా?" అంది నీరజాక్షి తండ్రి చేతులు పట్టుకొని.
"అవునమ్మా! నేను స్మారకం లేకుండా పడి ఉన్నప్పుడు నాకు రక్తదానం చేసి నన్ను బతికించింది ఏ కులం వాడో నాకు తెలియదు. నాకు ప్రాణం పోసిన దేవుడు ఈయన. ఇంతకంటే ఉన్నతుడ్ని నేను నీకు తీసుకురాలేను, ఆ క్షణాన నాకతను కులమతాల కంటే అతీతుడు, నేను ఛాoదశున్నే కానీ మూర్ఖుణ్ణి కాదు, కాలానికి తగ్గట్టుగా ధర్మం మారుతుంది, మారాలి కూడా, మారుతున్న ధర్మాలకు అలవాటుపడాలి అదే ధర్మం. అలా కాదు, కాలానికి ఎదురీదుతానని మొండి పట్టు పట్టడం అవివేకం, బుద్ధి హీనత, నా కూతురు సెలెక్షన్ చాలా బాగుందని నా అభిప్రాయం. దీనికి తిరుగులేదు" అన్నారు శ్యాం సుందరం గారు.
"అవునమ్మా మీ నాన్న చెప్పిందే బాగుంది, నువ్వు మా ఒక్కగా నొక్క బిడ్డవు, నీ సంతోషమే మా సంతోషం. అబ్బాయి చాలా మంచివాడు, మనసున్న వ్యక్తి. అందులోకి మీ నాన్నకు పునర్జన్మను ప్రసాదించిన ప్రాణ దాత. ఇతను మా అల్లుడు కావటం మా ఇద్దరికీ సంతోషమే" అంది మీనాక్షి.
నీరజాక్షి తల్లిదండ్రుల పాదాలకు ప్రణమిల్లింది ఆనందభాష్పాలతో.
సందేశాత్మాకమైన కథ బాగుంది మేడం. అభినందనలు. 🌹🙏🌹
బాగుంది
మంచి కధ మేడమ్, చాలా అధ్బుతం గా సాగింది. అభినందనలు