విదేశీ దుస్తులు
మన దేశంలో విన్యాసాలు చేస్తున్నాయి
మన సంప్రదాయాన్ని
ఉరి తీస్తూ
స్వదేశీ మూర్ఖులు
మన దేశంలోనే కుప్పిగంతులు వేస్తున్నారు
విదేశీ వెర్రిని
ఆహ్వానిస్తూ
పక్కింటి పుల్ల కూర రుచి అనే సాకుతో
మనింటి భాషకు మట్టికొట్టి
కిరాయికొచ్చిన పరాయి భాషకు
పట్టం కట్టే
ఈ ప్రభుత్వ రంగ పండితులకు
ఏ పాశ్చాత్య దయ్యం పట్టిందో
ఎవరికి తెలుసు
కదిలే నవరంధ్రాల ప్రాకారం
బ్రతుకుకు ఆసరిచ్చే
ఆకారాలను చేస్తూ
చెమటచుక్కల తడిని
నేలతల్లి ఒడిలోకి కానుకిస్తూ
ఎదురైయ్యే సమస్యలను
నాలుగు రాళ్ళుగా వెనకేసుకుంటూ
అనుభవ ఆస్తులను మదిలోనే దాస్తూ
ముదపు మందారమై
సింధూరతోవ కొరకు ఎదురుచూస్తున్నది
ముడతలు పడిన దుప్పటిని విదుల్చుకుందామని
శభాష్ శునకమా...
"మిమ్మల్ని చూసైనా మాస్కు వేయని
మనిషి మనసు మరునా...?"
"మా తోక వంకర మారుతుందేమో...
కరోనా అని తెలిసికూడా
ఎగబడి సమాజాన్ని పాడు చేసే
వంకర మనిషి మాత్రం
మారడు గాక మారడాయే...
ఎవడెవడు ఓటేసినా
ఎవడెవడు గద్దెనెక్కినా
వలస కూలీ అన్నవాడు
అభివృద్ధిని మోసిమోసి అలసిపోయే గాడిదేరా...
ఎవడెవడు ఏమి చెప్పినా
ఎవడెవడు ఏమి చేసినా
వలస కూలీ అన్నవాడు
రాళ్ళు రాళ్ళు మోసి మోసి ఇంకిపోయే చెమట చుక్కేనురా...
ఏ బందు జరిగినా
ఏ సమ్మె జరిగినా
సన్నగిల్లి చిన్నబోయి
కడుపు కాల్చుకునేది దినసరి కూలేనురా...
ఇదే కదా మన అభివృద్ధి
ఇదే కదా మన ప్రగతి
ఇంతే కదా ఈ జగతి
ఈ జగతికో దండం
కూలోడి జీవితమే దినదిన గండం
వాడి మనసు నిత్యం కాలే అగ్నిగుండం
సమాజానిది
ఎంత
దయాగుణమో
ఎలుకలను
ఆమె కడుపులో పెంచిపోషిస్తున్నది
అభినందనలు సమాజమా
నీ దయాగుణానికి
మనుషులంతా
గొడ్డళ్ళై
నా అవయవాలైన మానులను
నరుకుతుండ్రూ
అయినా నేనేమి అనలేకపోతున్న
పాలు తాగుతూ
పొరపాటున రొమ్ముకొరికిన చంటిబిడ్డను
తల్లేమంటుంది
ఆప్యాయంగా తలపై చేయి నిమురుతుందిగానీ
నేను అంతే
మీరంతా నా బిడ్డలేగా
ఒక్కటే నా ఆవేదన
నీ తల్లి పోయాక ఆమె విలువ తెలుస్తుందేమో
నేను పోతే నా విలువతెలుసుకోవడానికి
మీరు కూడా ఉండరు
నా చిట్టికూనలారా
అందుకే
అనారోగ్యానికి గురైనా నాకు ఆకుపసరుతో
వైద్యం చేయండి
అందమైన ఆహ్లాదకరమైన హరితహారానికి అభయమవ్వండి
నా ఒడిలో మీరండడమే కాదు
మీ ఒడిలోనూ నన్ను లాలించండి బిడ్డలారా!!!
ఆహా...!
మరణాన్ని మోసుకొచ్చే మృత్యుదేవతైనది
మద్యం షాపు
బోడి కరోనాకు బయపడి
స్వర్గాన్ని చూపించే సారాసీసాను వదులుకుంటరా సామాన్యులు
తమ ఇజ్జత్ పోదూ..
కనుక పట్టా తప్పిన ప్రభుత్వాన్ని పట్టాలెక్కించ
తన బ్రతుకు పట్టాను బలిచేస్తున్నారు
ఈ ఘనులు
ఎంతటి త్యాగమూర్తులో కదా...!
చేతులెత్తి దండంపెట్టాలి...
ఈ సచ్చినోళ్ళకు కాదు
శవాలమీద చిల్లరేరుకునే సావచచ్చిన సర్కారుకు...
థూ...దీనమ్మ బ్రతుకు
నలభై రోజుల కష్టాన్ని కాటికంపుతున్నారు
నోటి వాసనకు లొంగి
ఆహా...! ఏమి భారత ఐక్యతయ్యా...శభాష్...
ఆకలి మంటలతో నిత్యం
దహించబడే వారి
ఆవేదన మంటలను
మసిచేసే మతాబులు ఈ సమాజానా లేవా
కూటికి, గూటికి నోచుకోక
మేమింతేనని పాటుపడిన
ప్రాణంలోని అసమర్థతను
కాల్చే కాకరొత్తులు ఈ సమాజానా లేవా
అరువుల బరువులను మోయలేక
తరువుల శాఖలతో మోయబడి
మౌనంగా పడుకున్న ఆ భూమిపుత్రుని చుట్టూ
సింపతి కోసం ఊసరవెల్లిల్లా
రంగులు మార్చే భూ బకాసురులను బూడిద చేసే
భూచక్రాలు ఈ సమాజానా లేవా
గంజినీరు తాగేవాడికి
గంజినీటి చొక్కావేసేవాడికి
మధ్యన పెరిగిన అహంకార గోడలను
పేల్చేసే లక్ష్మీ బాంబులు ఈ సమాజానా లేవా
ఉంటే అలాంటి టపాకాయలతో టక్కరిదొంగల జిత్తుల మాటలను మసిచేయండి
ప్రజలారా!!!
అసమానతలు లేని సమాజాన్ని దీపాలుగా వెలిగించండి
మీ చెమటచుక్కల నూనెలో నేను ఓ ఒత్తినౌతాను
మీ కళ్ళల్లో వెలిగే ఆరిపోని చిరునవ్వు టపాసు
అవుతుంది ఈ కవిత!!!
అప్పు దెచ్చి, సాలుజేసి
బీజమేసి, మట్టి కప్పి
నాకు జన్మ నిచ్చిన తండ్రియని తెలిసి
ఆనంద చిందులేసి
తండ్రి పాదాలు ముద్దాడి,
పాదాభివందనం చేసే ఆ బిడ్డ..
తన ఎదుగులకై తపించు తండ్రినే చూసి
అనురాగమే పొంది కొమ్మలను చేతులతో
నమస్కరించెను తండ్రిచాటు ముద్దుబిడ్డ
తనకేమో నీరివ్వలేక తల్లడిల్లిన తండ్రినే చూసి
చెదిరిన గుండెతో
బెదిరిన మనసుతో
ఏకశిలముగా నిలబడి
పాకద్విట్టుకై తపమాచరించి
ఇంద్రుడినే మెప్పించి
వర్షమును రప్పించి
తండ్రినే మురిపించే ఆ ముద్దుబిడ్డ...
తన ఎదుగుదలకు పడిన తండ్రి కష్టాలు
తలుచుకుని తపించి తపించి
సూర్యకిరణాలు స్వీకరించి
భూమాత అనుగ్రహమునొంది
పరిమళ పువ్వులతో
బరువైన కాయలతో
తన తండ్రి అరువు బరువులు తీసి
పరువు నిలుప తెల్లబంగారమను నగలు సృష్టించి
తండ్రికిచ్చె ...
మురిసిపోతు తండ్రి మార్కెట్ కెళ్ళంగా
మాయదారి దగాకోరులు దగాచేసిన తీరు తెలిసి…
పాత జ్ఞాపకాలన్న
పాడు మదిని ప్రశ్నించ
పాత జ్ఞాపకాలన్ని ఏకమై
తుప్పు పట్టిన ఇనుము కిలిమినే
స్వేదజలముగా మార్చుకుని
పతనమైన పాత తరాన్నే పాడుబడిన ప్రాణాలుగా మలుసుకొని
అలనాటి జ్ఞాపకాలనే ఆయువుగా చేసుకుని
బంధించబడిన బంధనాలను బ్రద్ధలుకొట్టుకుని
నవీన నాగరికానికి నడకలు నేర్ప
మొక్కవోని దీక్షతో మొలిచాయి మొక్కలు!!!