తరాలు-అంతరాలు
తరాల మధ్య అంతరాలకు అనేక కారణాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే సామాజిక స్థితిగతులు బాగుపడి, ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అందిపుచ్చుకున్న జీవన సౌలభ్యాలు ప్రతి మనిషి యొక్క ఆలోచనల పరిధిని మార్చే అవకాశం ఉంది. నాటి తరం జీవించిన పరిస్థితులు నేటి తరం జీవిస్తున్న ఆధునిక సుఖమయ జీవన విధానం ఖచ్చితంగా మనందరిలోనూ అవసరానికి మించిన జీవిత సుఖానికి అనువైన మార్గాలను శోధించే దిశలో ఉండే అవకాశం మెండుగా ఉంది.
కుటుంబ వ్యవస్థ అంటే పెద్దలు పిల్లలూ అందరూ ఒక్కచోట నివసించడం మాత్రమే కాదు. ఒకరికొకరు ఎల్లప్పుడూ సంభాషించుకునే విధంగా ఉండాలి. ప్రస్తుతం చేతిలో ఉన్న చిన్న చరవాణి (సెల్ ఫోన్) ధ్యాసలో సౌకర్యవంతంగా అమర్చుకున్న తమ గదులలో జనులందరూ సౌకర్యంగా ఉంటున్నారు. జగమంత కుటుంబం..ఏకాకి జీవితం అనే విధానాన్ని చాల కుటుంబాలలో చూస్తున్నాము. ఇంటికి అతిధులు వచ్చి ఉన్నప్పుడు కూడా పిల్లలు వారి గదులలో నుండి బయటకు రావడం లేదు. అదేమంటే వారికి మనతో ఉంటె బోర్ కొడుతుంది అని తల్లిదండ్రులే ముందుగా, ముద్దుగా సమర్ధించుకుంటూ అందరూ ప్రత్యక్షంగా కలిసి సమయం గడిపినందువలన జరిగే మంచిని మరిచిపోతున్నారు. ఈ సోషల్ ఇంటరాక్షన్ వలన ప్రతి వ్యక్తి తనేంటో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా తన అలవాట్లను ఏవైనా మార్చుకోవాలా? లేదా అనే సందేహాన్ని నివృతిచేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలలో సహజంగా ఉన్న బిడియం తగ్గి ధారాళంగా మాట్లాడేందుకు ఇటువంటి సమావేశాలు ఉపయోగపడుతాయి.
అలాగే పిల్లలను ఎల్లవేళలా ఇంటికే పరిమితం చేయడం వలన వారికి స్నేహితులు, స్నేహం యొక్క విలువ తద్వారా కలిగే సామాజిక స్పృహ, సాటి మనుషుల పట్ల ఉండవలసిన కనీస మానవత్వ పోకడలు అవేవీ లభించవు ఆ అనుభవం యొక్క అనుభూతి, అనుభవం ప్రత్యక్షంగా లభించదు. అలాగే ఎదిగే పిల్లలు జీవిత పాఠాలను స్వయంగా అనుభవించి నేర్చుకోవాలి. మనతోనే ఉంచుకుంటూ మన ఇగో త్రుప్తిపడవచ్చు. కానీ తద్వారా వారిలో ఏర్పడుతున్న పరాధీనత ను మార్చలేము. ఆ విషయంలో పాశ్చాత్య దేశాల సంస్కృతిని మెచ్చుకోవాలి. ఒక వయస్సు తరువాత వారి బతుకు వారు బతకాలి. కనుకనే అక్కడి వారి జీవన విధానంలో ఒక విధమైన స్థిరత్వం ఉంటుంది, అలాగే ధైర్యంగా ఇబ్బందులను ఎదుర్కొనగలుగుతారు.
గత రెండు తరాల నుండి మగవారితో పాటుగా ఆడవారు కూడా అన్ని రంగాల్లో ప్రతిభతో రాణిస్తూ వ్యక్తిగత ఎదుగుదలతో సమాజంలో సమాన హోదాను సాధించే దిశగా పయనిస్తున్నారు. అటువంటప్పుడు మరల లింగ భేదముతో వారి జీవన విధానాన్ని నియంత్రించే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ కొంత ఛాందస ఆలోచనల ప్రవాహంలో నేటికీ మనలో చాలామంది కొట్టుకుపోతూ అనవసరమైన అస్థిరత్వానికి ఆజ్యం పోస్తున్నారు. అలాగే ఇంటి పనుల విషయంలో నేటికీ మగవారు మగమహారాజులు అనే చాదస్తం నుండి బయటకు రాలేక ఇంటిలోని పనులన్నీ కేవలం ఆడవారు మాత్రమే చేయాలి ముఖ్యంగా ‘వంటగది మహారాణులు’ అనే బిరుదును ఆపాదించి పనులనుండి తప్పించుకొని సుఖపడుతున్నారు. ఆ పరిస్థితిలో నేడు కొంచెం మార్పు కనపడుతున్నది. ఆడ మగ అనే భేదాన్ని మరించి అందరూ అన్ని పనులను చేసుకునే స్థితికి మన సమాజం చేరుకోవడం ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా నేటి తరంలో ఆ మార్పు ప్రస్ఫుటంగా కనపడుతున్నది. అయితే తమ తల్లిదండ్రులు జీవించిన విధానాలను ప్రత్యక్షంగా చూసిన కొంతమంది పిల్లలలో ఆలోచనల విధానం ఇప్పటికీ సందిగ్దంగా ఉండి ఊగిసలాడే ధోరణిలో ఇబ్బందులు పడుతున్నారు.
వాస్తవిక ప్రపంచ వరుణ వాహిని యొక్క ఆరోగ్యకర సహజ వనరుల ఔషధాల ఉనికిని మరిచి అనవసరమైన భయాందోళనల బాటలో పయనిస్తూ నిత్యం కృత్తిమ ఆలోచనల అభూతకల్పనా స్రవంతిలో కొట్టుకుపోతూ అయోమయ సందిగ్దావస్తలో మనిషి జీవించడం నేర్చుకొని అనుకోని విధంగా వేరే వారికి అవకాశం కల్పించి వారి సూత్రాలను గుడ్డిగా నమ్మలేక, అట్లని పాటించలేక సతమతమౌతూ మానసిక స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. మన శరీరం లోపలే ఒక పెద్ద మందుల కర్మాగారం ఉందనే విషయాన్ని మరిచి కాలం వెళ్ళబుచ్చుతూ లేని అనారోగ్యాన్ని ఆపాదించుకుని మానసికంగా కుమిలిపోతున్నారు. వారి జీవితకాలంలో వారు పొందిన స్వీయ అనుభూతి, స్వీయ అనుభవాల భావాలను పూర్తిగా విస్మరించి మనో ధైర్యాన్ని కోల్పోతున్నారు. మన మనసు చెప్పే మాటలను మనం వినగలినప్పుడు, మనలోని చెడు ఆలోచనల ప్రవాహాన్ని కట్టడి చేసినప్పుడు మనం హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు.
‘సర్వే జనః సుఖినోభవంతు’
చక్కటి వ్యాసం మరియు ఆలోచింపజేసే విశ్లేషణ!