కుటుంబ వ్యవస్థ నాడు-నేడు
నాడు నమ్మకం తో పాటు పెద్దలయెడ భయంతో కూడిన భక్తి భావం ఉండేది. కనుకనే అంతా సవ్యంగా ఉమ్మడి కుటుంబాలు కూడా ఇబ్బందిలేకుండా సాగిపోయేవి. నేడు భయం ఉంది కానీ భక్తి, గౌరవం లోపించింది. అలాగే నమ్మకం స్థానే నటించడం ఎక్కువైంది. మనుషులు భౌతిక వాదంతో (మెటీరియలిస్టిక్ గా) మసలుకోవడం అలవాటు అయ్యింది. అందరూ గుర్తించాలనే తపన, ‘భయ భక్తులు’ అనే పదానికి అర్థాన్ని మార్చి ‘అవసరానికి ఆచరించడం’ అనే పదాలు వచ్చాయి.
నాడు కుటుంబ వ్యవస్థ వలన తరాల మధ్యన అంతరాలు ఉన్ననూ వాటి ప్రభావం అంతగా కనపడక ఆర్థిక సమతుల్యాన్ని పాటిస్తూ అందరూ కలిసి ఉండడం జరిగేది. నేడు కుటుంబ నియంత్రణ వలన కుటుంబంలో సభ్యుల సంఖ్య తరిగి ఒకరిద్దరి మీదనే ప్రత్యేక శ్రద్ధను కనబరిచి తద్వారా భవిష్యత్తులో ఎన్నో ఆశలను సృష్టించుకొని ఆ తరువాత అవి సిద్ధించక మానసికంగా బలహీనులుగా మారి ఆరోగ్యం చెడగొట్టుకోవడం జరుగుతున్నది. అలాగే నాడు పొందిన కుటుంబ వ్యవస్థ లోని మాధుర్య బంధ అనుభూతులను నేడు పొందలేక పోతున్నాము. అవి కోల్పోయి అవకాశం లభించి, లభించక అవస్థలు పడిన నా వంటి వారికి ఆ మాధుర్య విలువలు అర్థమౌతాయి.
నాడు ఉమ్మడి కుటుంబంలో ఒక పండగ వచ్చిందంటే ఆ హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఊరిలోని అన్ని కుటుంబాలు కలిసి చేసుకునే వినాయక చవితి, దసరా ఇటువంటి పండగలు మనలో మనస్పర్థలను మరిచిపోయేటట్లు చేసి అందరూ కలిసి ఆనందంగా సమయం గడపడం జరిగేది. నేడు అది ఉన్నది కానీ పోటీ మనస్తత్వం వలన సంఘంలో సమూహాలు ఏర్పడి అనవసరమైన రాజకీయ వ్యవహారాలు జరుగుతూ సహజసిద్ధమైన శాస్త్రీయ పండుగ వాతావరణం లోపిస్తున్నది. ఉదాహరణకు ఒక పండుగ గురించి ప్రస్తావిస్తాను.
వినాయక చవితి, నాడు మట్టి వినాయకుడు నేడు రంగురంగుల కృత్తిమ వినాయకుడు. నాడు చెరువును త్రవ్వి బంకమట్టి ని తెచ్చి చేసే వినాయకుణ్ణి పూజించిన తరువాత మరల చెరువులో కలిపేవారు. తద్వారా రెండు సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి చెరువుకు పూడిక తీయడం జరుగుతుంది. రెండు పూజ సమయంలో ఆ మట్టి వినాయకుని చుట్టూ ఉన్న పత్రి, కర్పూరం, పసుపు, కుంకుమ, విభూది, పండ్లు, కూరగాయలు అన్నీ కలిపి ఒక సారవంతమైన ఒండ్రుమట్టి గా మారుతుంది. దానిని తిరిగి చెరువులో కలిపినప్పుడు అది సులభంగా నీటితో కలిసి నీరు కూడా ఎన్నో పోషకాలను కూర్చుకొని పంట పొలాలకు చేరుతుంది. అది ఒక విధంగా మంచి సేంద్రీయ ఎరువుగా పంటలకు ఉపయోగపడుతుంది.
మరి నేడు ప్లాస్టిక్ పదార్థాల కూడికతో మట్టితో, నీటితో కలవని అనేక వ్యర్థ పదార్థాల సమ్మేళనంతో చెరువులు, సాగరాలు అన్నీ కలుషితం అవుతున్నాయే తప్ప సారవంతం, పౌష్టిక శక్తి కారకాలు కావడం లేదు. అలాగే వినాయకుని విగ్రహాల ఆకారాలు, పరిమాణాలు, వేషధారణలు అన్నీ అగమ్యగోచరంగా అనిపిస్తున్నది. మార్పులు సహజం కానీ ప్రకృతి సమతుల్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఏ దేవుడూ నాలుగు మైళ్ళ దూరం వరకూ వినే విధంగా పాటలు పాడమని చెప్పడు. అది ధ్వని కాలుష్యమే. అలాగే బాణాసంచా కాల్చడం అనేది శృతి మించి వాతావరణ కాలుష్యం అవుతున్నది. అప్పుడు మనమే ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ చూసుకుని ఇంట్లోనే కూర్చుంటున్నాము. ఎందుకంటే శ్వాసకోస సంబంధమైన రుగ్మతలు రాకూడదని. కబీర్ దాస్ వందల ఏళ్ల నాడే దేవుని ప్రార్థించే విధానం గురించి వాస్తవ అంశాలను బోధించారు. మన మనసును మించిన దైవం లేదు. మన మనసు స్వచ్ఛంగా ఉన్న రోజు మనమే కాదు మనతో పాటు మరో పదిమందిని మనం ఆరోగ్యంగా ఆహ్లాదంగా జీవించేటట్లు చేయగలము.
సంతోషకరమైన విషయం ఏమిటంటే, సహజమైన పాత పద్దతులలోనే పండుగ జరుపుకోవాలనే తలంపు నేటి యువతలో, పాత తరంలో కూడా కలిగి మట్టి వినాయకుని ప్రతిష్ఠ మొదలు అనేకమైన పాత పద్ధతులను అనుసరించడం మొదలుపెడుతున్నారు. అది నిజంగా సుభ పరిణామము. అంతేకాదు మనలో చాలామంది సనాతన జీవన విధానాలకు తిరిగి అలవాటు పడుతూ అనేక విధాలుగా ఈ కృత్రిమ జీవన విధానాలకు దూరంగా సహజ వనరుల సమ్మేళనంతో ప్రకృతి ఒడిలో మమేకం అవుతూ తమ జీవన శైలిని మార్చుకునే ఆలోచనలతో ఉన్నారు. మరికొంతమంది ఆ విధానాలతో తమ జీవితాలను పూర్తిగా ఎప్పుడో మార్చుకుని జీవిస్తున్నారు. ఆ ఆలోచన అందరిలో కలిగితే, సమతుల్య ఆహార విధానాలతో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఇక్కడ విశేషమేమిటంటే నాడు పేదవాడు భుజించిన గంజి అన్నము, అంబలి నేడు శ్రీమంతుల ఆరోగ్య సూత్రమౌతున్నది. ఉన్న తేడా ఏమిటంటే ప్రస్తుతం ఈ ఆరోగ్య సూత్రం కొంచెం ఖరీదు అవుతున్నది. పదార్థమొక్కటే కానీ దానిని వాడుతున్న వారి వలన ఆ పదార్థ స్థాయి కూడా పెరిగింది.
‘సర్వే జనః సుఖినోభవంతు’