ఏదైనా ఒక ఉపద్రవం జరిగినప్పుడు గానీ లేక హింసాత్మక ఘోరం జరిగినప్పుడు గానీ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొన్న అధికారులను ప్రశంసించి, అప్పుడు తమవంతు బాధ్యతగా నిస్వార్థంగా సేవలందించిన వారి గురించి మనకు తెలుస్తున్నది బహు తక్కువే. పైపెచ్చు విశ్లేషణ రూపంలో ఎవరికి తోచిన విధంగా వారు వారి ఆలోచనా ధోరణి ని అనుసరించి వ్యక్తులను నిందిస్తూ లేక వ్యవస్థలోని లోటుపాట్లను విమర్శిస్తూ గంటల కొద్దీ వార్తలు వస్తుంటాయి. ఇక్కడ మారవలసింది ప్రభుత్వ అధికారుల తీరు కాదు. వ్యవస్థలో నిర్దేశించిన అంశాలు అన్నీ సక్రమంగానే జరుగుతున్ననూ ఆ సమయంలో అక్కడి అధికారుల ఆలోచనల ప్రవాహవేగం అనుసరించి ఆచరణ సాధ్యం కాని కొన్ని అంశాలు మరువడం జరుగుతుంది.
అలాగే మారవలసింది వ్యక్తులు మాత్రమె కాదు వ్యక్తుల సమూహంగా ఏర్పడిన సంఘ వ్యవస్థలోని కుంచిత మనస్తత్వాలు. వ్యక్తి రూపురేఖలను బట్టి వారితో మాట్లాడే విధానం ఉండాలనే అపోహ అందరిలోనూ ఏర్పడుతున్నది. మనం జీవులం అన్న విషయం మరచి మనలో ఏర్పడుతున్న చాదస్తపు ఆలోచనలు, అభద్రతా భావం ఇందుకు కారణం. ఎప్పుడైనా ఎక్కడైనా మనిషి మానసిక ధైర్యాన్ని కోల్పోయి శారీరకంగా కూడా అలసిపోయి ఉన్నప్పుడు తన అనుకునే సాటి మనుషులు అందించే స్పర్శతో కూడిన ధైర్యం ఎంతో శక్తివంతమైనది. అది సొంత కుటుంబసభ్యులైతే మరింత బలంగా ఉంటుంది.
మనందరికీ అర్థమై, అర్థం కాని విషయం ఒకటుంది. ప్రతి ఒక్కరికీ సంఘంలో హోదా, జీవితంలో అనుకున్న విధంగా సాధించి చూపిన అభివృద్ధి, సంపద, ఆధునిక వసతులతో కూడిన జీవన విధానం లభించిన రోజు మనిషిగా తన గురించి తను గర్వంగా తలుచుకొంటాడు. మరి ఇవన్నీ ఎందుకు అంటే ఆనందంగా జీవించడం కోసం అనుకుంటాము. నిజానికి ఆనందం, ప్రశాంతత అనే ఈ రెండు అంశాలు భౌతికంగా కాదు, మానసికంగా మన మన మెదడులోని ఆలోచనల ప్రవాహ ఫలితాలు. అంటే ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలంటే మన మనసును మంచి ఆలోచనల వైపు మరలించి ఆశల ఒరవడికి అడ్డుకట్ట వేస్తే ఆ ఆనందం మనకు లభిస్తుంది. మరి, పై విషయాలు అన్నీ ఎందుకు అంటే, మనిషి సంఘజీవి, సంఘంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, తన ఉనికిని సూచించే కొన్ని అంశాలు ఉండాలనే తపన మనందరిలోనూ ఉంటుంది. అదే నేటి ఈ ఉరుకులు పరుగుల యాంత్రిక జీవన విధానానికి దారి చూపింది. వచ్చిన అవకాశాలను వదులుకుంటే ఏదో కోల్పోతామనే భావన ఏర్పడటం సహజమే. అయితే దానిని సాధించాలనే ఆరాటంతో అంతకంటే ముఖ్యమైన జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సమతుల్యం తో తదనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలి.
మరొక సున్నితమైన అంశం, మనందరిలోనూ ఆలోచనలను రేకిత్తించే అంశం ఏంటంటే కట్టుబాట్లు, సాంఘీక ఆచారాలు. ఎప్పుడో వందల ఏళ్ల నాడు మన పూర్వీకులు, వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహా వ్యక్తులు, మనిషి జీవన విధానం ఏవిధంగా ఉంటె సహృదయ వాతావరణం ఏర్పడి మనుషులందరూ సుఖంగా, ఆనందంగా జీవించగలరు అని ఆలోచించి నాటి సామాజిక స్థితిగతులు, జీవనశైలికి అనుగుణంగా కొన్ని ధర్మాలను, సంప్రదాయాలను విరచించారు. కాలానుగుణంగా తరాల ఆలోచనలలో ఏర్పడుతున్న మార్పులు, జీవన విధానంలో ఏర్పడుతున్న సౌకర్యాలు, మనిషి లోని ఆధునిక జీవిత సుఖసంతోషాలు తదితర అంశాలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మన పూర్వీకుల నిర్దేశించిన విధి విధానాలు అన్నీ సరిగా ప్రస్తుత పరిస్థితులకు సరిపోవు. కనుకనే మనమే విచక్షణతో ఆ సంస్కృతి సంప్రదాయాల లోని శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకొని అందులోని మంచి చెడు రెండింటినీ సరైన పంధాలో బేరీజు వేసుకుని మన ఆచార వ్యవహారాలను సక్రమంగా పాటించాలి. అదే నిజమైన ఆనందకర జీవన మార్గానికి హేతువు అవుతుంది.
‘సర్వే జనః సుఖినోభవంతు’