Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

నాకు ఈ మధ్యకాలంలో ఒక శివస్తుతి (లేక పాట అనికూడా అనవచ్చు) ఎంతగానో నచ్చి అది నిజంగా నా స్వానుభవమేమో అని కూడా అనిపిస్తున్నది.

“దోసిలి యొడ్డితి దొడ్డ దొర తోచిన దొసగుమురా, .....దొరికినదేదో దేవర చిత్తము వరమని తలతునురా ..తృణమో, పణమో తర్కము సేయక తలను ధరింతునురా..”

ఈ విధమైన ఆత్మసంతృప్తి లభించిననాడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న సత్యమిది. మన సామర్ధ్యం మేర మన జీవనశైలిని మార్చుకుని, నీవు చేయవలసిన పనులు పూర్తిచేసి నీ కృషికి న్యాయం చేకూర్చిన నాడు దాని సారాంశం ఏమిటనే విషయాన్ని ద్రువీకరించుకోవలసిన అవసరం గానీ అగత్యం గానీ లేదు. అంతేకాదు. మనది కానిదేదీ మనతో ఉండదు. అది ధనము కావచ్చు, సిరిసంపదలు కావచ్చు. కొంతమందికి అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ఆస్తులు సంతరించి ఉండవచ్చు. చక్కటి విద్యార్హతలు ఉండి ఒక మంచి స్థాయికి చేరినప్పుడు మనలో ఉండవలసిన ఆ కనీస సంస్కారాన్ని కూడా మరిచిపోయి మనకు సమాజంలో ఏర్పడిన స్థాయితో పాటుగా గర్వము, అహంకారం, నాకేంటి నేను గొప్పవాడిని అనే భావన ఇత్యాది ధర్మాలను ఒంటపట్టించుకుని ఇతరులను చులకనగా చూడకూడదు. మనకంటే తక్కువ స్థాయిలో, హోదాలో కొంతమంది ఉండవచ్చు. అందుకు వారి సామాజిక స్థితిగతులు, సరైన ప్రోత్సాహం, అందిపుచ్చుకునే అవకాశాలు దొరకకపోవడం కారణం అయివుండవచ్చు. కానీ వారి మేధస్సులో, శక్తివంతమై, సమాజాన్ని ప్రభావితం చేసి, చైతన్యం కలిగించే ఆలోచనలు ఉన్నప్పుడు వారిని ఆదరించి, వారి జ్ఞానాన్ని గౌరవించి అటువంటి వారిని ప్రోత్సహించడమే నిజమైన సంస్కారం అనిపించుకుంటుంది. అంతేకాని వారు మన కన్నా చదువులో, స్థితిలో తక్కువ కనుక వారు అలాగే ఉండాలనే వికార మనస్థత్వం ఏర్పడితే నీ హోదా, సంపద, చదువు అంతా వ్యర్థమే. మంచి అవగాహనతో చక్కటి సూచనలు ఇచ్చే వారిని ఎప్పుడూ వారి స్థాయిని అనుసరించి చూడకూడదు. వారు ఇచ్చిన సూచనల ప్రామాణికతను, వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితి అయ్యింది. మహిళా దినోత్సవం, మాతృ దినోత్సవం, పితృ దినోత్సవం, ప్రేమికుల దినోత్సవం ఇలా ఎన్నో. అది మంచి విషయమే. అయితే నా దృష్టిలో ఆ భావన మాటలలోనే కాక చేతలలో కూడా ఉన్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. ఎవరిని ఉద్దేశిస్తూ మీరు శుభాకాంక్షలు చెబుతున్నారో ఆ వ్యక్తి మీ చెంతనే ఉన్నప్పుడు తనకు నచ్చిన వాతావరణాన్ని సృష్టించి తనను ఆ రోజంగా సంతోషంగా ఉంచి పూర్తిగా సేవలు చేసినప్పుడే మీరు చెప్పిన శుభాకాంక్షలు నిజమౌతాయి. కొంత సమయం, మీ శ్రమను కూడా ఆ వ్యక్తి కొరకు వెచ్చించాలి. అపుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమె. ఉదాహరణకు మాతృ దినోత్సవం నాడు మనతో ఉన్న భార్య లేదా తల్లికి ఒక్క రోజు సేవలు చేసి చూడండి. వారి కళ్ళలో ఏర్పడిన సహజమైన ఆనంద భాష్పాలను గమనించండి. అదే మనం వారికి ఇచ్చిన, ఇస్తున్న నిజమైన, సహజమైన సత్కారం.

పైన చెప్పిన మాటలకు ఆరోగ్యానికి సంబంధం ఏమిటి అనే ప్రశ్న మీకు రావచ్చు. శ్వాసిస్తూ ఎదిగే ఏ జీవికైననూ శారీరక రుగ్మతలే కాదు మానసిన రుగ్మతులు కూడా మెండుగా ఉంటాయి. మానసిక రుగ్మతలను మరయంత్రాలతో స్వస్థత చేకూర్చడం జరగదు. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నాననే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము..’ అని ఒక మహాకవి వ్రాసినట్లు, మన ఘంటసాల గారి పాటలో చెప్పినట్లు మన గురించి ఆలోచించే వారు ఒక్కరున్ననూ అదృష్టమే. కనుకనే మన వైవాహిక వ్యవస్థ యొక్క విలువ నేటికీ స్థిరంగా ఉంది.

అయితే ఆ అదృష్టం ఎవరైననూ పొందవచ్చు కానీ అందుకొరకు మనం కూడా మన చుట్టూ ఉన్న సమాజ శ్రేయస్సుకు మనవంతు కర్తవ్యం నిర్వహించాలి. మన ఎదుగుదల కొరకు ఇతరులను వాడుకునే మనస్తత్వాన్ని వీడి, ఒకవేళ వాడుకున్ననూ అందుకు తగిన విధంగానే మననుంచి వారికి సహాయం చేయాలి. ఎటువంటి అభ్యంతరం, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా మనం ఎవ్వరికైననూ ఇవ్వగలిగినది, ఎవ్వరితోనైననూ పంచుకోగలిగినది ఒక్క చిరునవ్వు మాత్రమె. ముందు మనం ఆ నవ్వును ఆనందపూరిత వాతావరణంలో పొందగలిగితే, అదే నవ్వును, ఆ సంతోషాలను ఇతరులకు కూడా నిరభ్యంతరంగా అందించగలము. మనలోని మానసిక అసౌకర్యాలకు అదే ఒక చక్కటి దివ్యౌషధం.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in April 2021, ఆరోగ్యం

2 Comments

  1. నరేంద్ర బాబు సింగూరు

    వాస్తవం… కళ్ళకు కట్టారు. సాహిత్య విలువలతో కూడిన పాట కి ఇంపైన సంగీతం చేరితే …విన్న మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది.
    బాల్యంలో
    రేడియో లో పాట వింటూ..వీధి అరుగులపై మిత్రులతో సేదదీరిన క్షణాలు గుర్తుకొచ్చాయి.

    “ఎవ్వరితోనైననూ పంచుకోగలిగినది ఒక్క చిరునవ్వు మాత్రమె” ఇప్పుడు ఎమోజీ లు వచ్చి నిండు నవ్వు పంచుకునేది కొందరే.

  2. సి వసుంధర

    మధుగారికి”,నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ…”ఈ వాక్యంలో అసలైన అర్ధవంతమైన పదం “నిండుగ.”ఆత్రేయ నిండు అనే పూర్ణ బిందు యుత మైన ప్రయోగంచేసి ఆ పాటకు ఒక నిండుదనాన్ని తెచ్చారు.మన డబ్బుకోసం లేక మరే దేనికోసమో నికు నెనున్నానని చేప్పడం కాక,నీకోసం నెనున్నానని చెప్పే మాటలో నిండుదనం ఎలా రావాలో మనసు కవికి తెలుసు. అందుకే “నిండుగ” అనే పదం వాడి మన హృదయాలకు పండుగ చేశారు.నాకు ఇష్టమైన పాటతో కలిపి మీరు అందించిన సందేశం సర్వులకు ఆచరణీయం. అందుకొండి అభినందనలు. Dr సి వసుంధర

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!