తెలుగు మాతకు తెలుగు జాతికి
తెలుగు భాషకు తెలుగు స్ఫూర్తికి
జయజయ ధ్వానాల ప్రభంజనం
తెలుగు వెలుగుల జనుల నీరాజనం
స్వప్న సాకారతకు వలసబోయిన గాని
ఖండాంతరాలలో చెల్లాచెదురైన గాని
నరనరాలలోన నవనాడులలోన
నెత్తురుగా పారేది తెలుగుదనమే తల్లీ
మన నోట పలికేది అమ్మ తెనుగే మళ్లీ
కవిత్రయపు చలువతో వెల్లివిరిసె భారతం
సహజకవి కరుణ చిలికె శ్రీమదాంధ్ర భాగవతం
విశ్వనాథ కలము జారె రామాయణ కల్పవృక్షము
సుమతీ వేమన భాస్కర శతక సుధారసము
ఏ భాషలో లేని రీతి మన తెలుగు పద్యము
తెలుగుభాషకిది ఎవరూ పెట్టని ఆభరణం
త్యాగయ్య అన్నమయ్య రామదాస కీర్తనలు
తరతరాల తెలుగు భక్తి రస రమ్య గీతికలు
జోల పాట లాలి పాట ఎంకి పాట వదిన పాట
తరతరాల జానపదుల వారసత్వపు బాట
వేయి రేకుల కలువై విరబూసె మన భాష
ఖండాంతరాలలో నినదించే మన ప్రగతి
రంగాజి తిమ్మక్క రసరమ్య కవితగా
మధుర శృంగార ముద్దుపళని పలుకుగా
రాయంచలా తిరిగే తెలుగు కవితా శక్తి
తెలుగు జిగిబిగిలతో తేనెలొలికే పద యుక్తి
ఏదేశమేగినా ఎందుకాలిడినా
ఒక్క జాతే మనది ఒక్కమాటే మనది
ఒక్కటై బ్రతుకంత కలిసి ఉందాము
తెలుగుమ్మపై అనగా పలుకుతున్నాము
మన నోట పలికేది అమ్మ తెలుగే మళ్ళీ ...