Menu Close
“నాన్న కావాలి!”
-- మధుపత్ర శైలజ --

పగలంతా తన ప్రతాపం చూపిన సూర్యుడు పడమటిదిక్కున వాలిపోయాడు. పక్షులు గూటికిచేరటంతో దీపాలు పెట్టే వేళయ్యింది. అమ్మకు పనిలో సాయంగా ఇల్లంతటిని శుభ్రం చేసి తల్లికోసం ఎదురుచూస్తూ హోంవర్క్ రాసుకుంటున్నాడు కార్తీక్. స్కూలునుండి వచ్చి రెండుగంటలు దాటింది. పాలువేడి చేసుకుని తాగాడు.

అమ్మ ఉదయం తనను స్కూలుకు పంపి, తొమ్మిది కొట్టేసరికి ఉద్యోగానికి వెళ్ళి, రాత్రి ఏడుగంటల తరువాతే ఇల్లు జేరుతుంది. కొన్నిసార్లు కేసుల విచారణ ఉంటే ఇంకా ఆలస్యం అవుతుంది. మరి ఆమె చేసేది సబ్ఇనస్పెక్టర్ ఉద్యోగమాయె!.

నాన్నగారు విదేశాలనుండి తిరిగివచ్చేస్తే, అమ్మ హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి తనకు చదువులోనూ, మిగిలిన విషయాలలోనూ సాయం చేయవచ్చు. మిగిలిన అందరి పిల్లలలా అమ్మ చేతి ముద్దలు తానూ తినవచ్చును. “ఇవాళ అమ్మను గట్టిగా అడగాలి నాన్నగారెప్పుడొస్తారు?” అని అనుకుంటున్న కార్తీక్‌కు తలుపు చప్పుడు వినబడలేదు.

బయటనుండి “కార్తీక్! నాన్నా కార్తీక్! తలుపు తీయమ్మా” అంటూ గట్టిగా, కంగారుగా పిలుస్తున్న తల్లి గొంతు తన ఊహాలోకంలో వినబడి పరుగుపరుగున వచ్చి తలుపుతీసి, కంగారుగా వస్తున్న తల్లిని బల్లిలా అతుక్కుపోయాడు ఏడవతరగతి చదివే కార్తీక్.

“అమ్మా! ఇవాళ బాగా ఆలస్యమయ్యిందేమిటి? ఇంట్లో ఒక్కడినే ఉంటే నాకు చాలా బాధగానూ, భయంగానూ ఉంటోంది. నాన్నగారు వచ్చేదాకా అమ్మమ్మతాతగార్లను మన దగ్గరకొచ్చి ఉండమనకూడదా?” అన్నాడు కార్తీక్.

“ఈసారి మనం వాళ్ళ ఊరెళ్ళినప్పుడు మనతో తీసుకొద్దాం సరేనా, పద కాస్త టీ తాగి, అన్నం వండుతాను” అంటూ లోపలికి నడిచింది కార్తీక్ తల్లి భారతి.

“అమ్మా! వచ్చే నెలలో మాస్కూలులో జరిగే పేరెంట్స్ మీటింగ్ కన్నా నాన్నగారొస్తారా? నా స్నేహితులంతా అమ్మానాన్నలతో కలసి స్కూలుకొస్తూంటే నేను మాత్రం నాన్నగారు లేకుండానే వెళ్ళాల్సి వస్తోంది” అంటూ తన వేదనను తల్లితో పంచుకున్నాడు కార్తీక్.

“కొడుకు హృదయం తండ్రి కోసం తపించి పోతోంది. దీన్ని ఇక్కడే తుంచేయాలి. ఇన్నాళ్ళుగా దాచిన నిజాన్ని వాడితో చెప్పే రోజు వచ్చింది. ఇంత కాలం అబధ్ధాలతో వాడి పసిమనసును నమ్మించాను. ఇకపై అది సాధ్యపడదు” అనుకుంటున్న భారతికి గత జ్ఞాపకాలొక్కసారిగా కళ్ళ ముందు మెదిలాయి.

భారతి భర్త భరత్ పోలీసు శాఖలోని “ఆక్టోపస్” విభాగంలో పెద్ద ఆఫీసర్. చిన్న వయస్సులోనే రక్షణదళంలో చేరి తన కృషి, పట్టుదలలతో పెద్ద పదవిని చేపట్టాడు. రిపబ్లిక్ దినోత్సవంనాడు ప్రభుత్వం వారిచే రెండుసార్లు ‘ఉత్తమ ఉద్యోగి’గా అవార్డులనందుకున్నాడు. నాలుగేళ్ళకిందట పోలీసులకు నక్సల్స్‌కు జరిగిన ఎదురు కాల్పులలో విజయుడయి తిరిగివస్తూ నక్సల్స్ పేల్చిన క్లయిమోర్ దాడిలో అమరుడైపోయాడు. ఆ దాడి అతని పాలిట మరణశాసనమయి, తన బ్రతుకు చిత్రాన్ని చిదిమి వేసింది.

చిన్నవాడైన కార్తీక్‌తో పుట్టింట్లో ఉండి, భర్తకు ఇష్టమైన పోలీసుశాఖలోనే ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం సబ్ఇనస్పెక్టర్‌గా పనిచేస్తోంది. కొడుకును తన దగ్గరే వుంచుకుని వాడిలో భర్తను చూసుకుంటూ కాలం గడిపేస్తోంది. కార్తీక్‌కు మాత్రం నాన్న విదేశాలకు వెళ్ళారనే చెపుతూ నమ్మించిందింత కాలం. వాడూ పెద్దవాడయ్యాడు.

“అమ్మా! ఓరోజు నేను బస్‌స్టాప్‌కెళ్ళి బస్ కోసం నుంచున్న సమయంలో కొందరు వచ్చి, ‘మీ అమ్మ పోలీసా? మీ నాన్న ఎక్కడున్నాడు? మీ ఇల్లెక్కడా?’ అంటూ అడిగారమ్మా. ఈరోజు నా వెనకనే వచ్చి ‘ఇదేనా మీ ఇల్లు?’ అంటూ ఎవరో రావటంతో వెళ్ళిపోయారమ్మా. వాళ్ళెప్పుడూ నీడలా నన్ను వెంటాడుతున్నారమ్మా. ఇంట్లో నాన్నగారు ఉంటే వాళ్ళసలు నీ గురించి అలా ఆరాలు తీసేవారా? నీవు జాగ్రత్తగా ఉండమ్మా“ అన్నాడు కార్తీక్. వాడి ప్రవర్తన గమనిస్తూంటే నిజానిజాలను గ్రహించే ఈడు వచ్చింది వాడికి అన్న నమ్మకం కలుగుతోంది భారతికి.

“అమ్మ అందం వాడికి శాపంగా మారబోతోంది. స్త్రీ భర్త రక్షణ లేకుండా ఈ సమాజంలో ఉండలేదా? అనిపించింది. ఈ సారి వాళ్ళను జాగ్రత్తగా కనిపెట్టి బుధ్ధి చెప్పాలి” అనుకుంది భారతి.

ఓ రోజు శెలవొచ్చింది కార్తీక్‌కు. తాను ఆరోజు కాస్త ఆలస్యంగా ఆఫీసుకు వెడతానని లోపలి గదిలో ఏదో రాసుకుంటూ కూర్చుంది భారతి.

ఇంతలో ఎవరో వచ్చి తలుపు కొట్టారు. కార్తీక్ వెళ్ళి తలుపు తీసాడు. ఎదురుగా ప్రతిరోజూ తనను అల్లరిపెట్టే నలుగురు యువకులు నిలబడి ఉన్నారు.

“అన్నా! ఏం కావాలి?” అని అడిగాడు కార్తీక్.

“మీ అమ్మ కావాలిరా” అన్నారు వాళ్ళు. అటు కార్తీక్‌కు, ఇటూ భారతికి గుండెలు గుభేలు మన్నాయి.

“నిత్యం కార్తీక్‌ను ఇలా మాటలతో హింసపెడుతున్నారన్న మాట. వాడు నాకు చెప్పలేక బాధ పడుతున్నాడు పాపం. వీళ్ళ పని పట్టాలి” అనుకుంటూ క్షణంలో ఆఫీసుస్టాఫ్‌కు విషయం చెప్పి, డ్రస్ మార్చుకుని చేతిలో లాఠీ పట్టుకుని అపరకాళికలా బయటకువచ్చింది.

పోలీసు డ్రస్సులో ఉన్న భారతి చూస్తూనే “మేడం…” అంటూ నసుగుతూ మడమ తిప్పిన నలుగురిని అడ్డగించి “ఆగండి! ఏమిటి సంగతి? ఎందుకు మా వాడి వెంట పడుతున్నారు? అదీ ‘నాకోసం’  అంటూ మాట్లాడుతూ వాడిని బెదిరిస్తున్నారట! ఖబడ్దార్! వచ్చే నెలలో ట్రైనింగ్ పూర్తిచేసుకుని వాళ్ళ నాన్నగారొస్తారు. ఆయన పేరు వింటేనే క్రిమినల్స్ గజగజ వణుకుతారు. ‘ACP భరత్’ అని ఏ పోలీసుస్టేషన్‌లో అడిగినా వారి వివరాలు చెప్తారు. ఇంకోసారి ఈ ఇంటివైపుగానీ, నా కొడుకుదగ్గరకుగానీ వచ్చారో మీకు చిప్ప కూడే గతి అవుతుంది. ఇకనైనా బుధ్ధి మార్చుకుని చక్కగా చదువుకోండి. మీ అమ్మానాన్నల కలలను నెరవేర్చండి. మీ అక్కలా చెపుతున్నాను వెళ్ళండి” అంది. ఆమాటలకే వాళ్ళు తోకలు ముడిచి గబగబా వెళ్ళిపోయారు.

“అమ్మా!” అంటూ తల్లిని చుట్టేసి “నిజంగా నాన్నగారొస్తున్నారా? ఆయన నీకన్నా పెద్ద ఆఫీసరా?” అని అడిగాడు కార్తీక్.

“ఔనురా! భయపడకు. వాళ్ళు ఇక నీ జోలికి రారు. నా వార్నింగ్ పని చేస్తుంది” అని చెప్పింది భారతి.

“ఇంకా నాకెందుకు భయం? నాన్నగారొస్తారు కదా! నన్ను అల్లరిచేసే వాళ్ళే ఇక జాగ్రత్తగా ఉండాలమ్మా!” అన్నాడు కార్తీక్.

నాలుగురోజులు శెలవుపెట్టి భారతి తండ్రిగారి ఊరికెళ్ళింది. ముందుగా తాను చేయబోయే పని గురించి తల్లికి చెప్పి అందుకు తగ్గ వాతావరణాన్ని సృష్టించమంది. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి.

కార్తీక్ అమ్మమ్మతాతగార్ల దగ్గరకెళ్ళి “తాతగారూ! ఈ నెలలోనే మానాన్నగారు వచ్చేస్తున్నారు. ఆయనతో కలసి ఇక నేను రోజూ బస్‌స్టాప్‌కు ధైర్యంగా వెళ్ళగలను. ఎవరైనా పొకిరీవాళ్ళు అల్లరిపెడితే వాళ్ళను జైల్లో పెట్టిస్తాను. నాన్న కావాలని రోజు రాత్రిళ్ళు అమ్మను అడిగే నేను, ఇక ఎప్పటికీ నాన్నతోనే ఉంటాను” అని చెపుతున్నాడు.

“అలాగే నాన్నా…!” అంటున్న ఆ ఇరువురి కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి.

మరునాడు భారతి బయటకు వెళ్ళి కొన్ని సామాన్లతో తిరిగి వచ్చి గదిలోకెళ్ళి తలుపులేసుకుంది. ఈలోగా డైనింగ్‌టేబుల్ దగ్గర అమ్మమ్మ తాతయ్యలతో కలసి టిఫెన్ పూర్తి చేసాడు కార్తీక్. హాల్లో కూర్చుని తాతగారితో తన స్కూలు కబుర్లను చెప్పటం మొదలుపెట్టాడు.

తాతగారు వాడితో “కార్తీక్! నీకింతకాలం ఓ విషయం చెప్పకుండా దాచి పెట్టాం” అంటూ భరత్ మరణం గురించి వివరంగా చెప్పారు.

ఆసాంతం విన్న కార్తీక్ “ఇది అంతా అబధ్ధం. నాకు నాన్న కావాలి, నాకు నాన్న కావాలి” అంటూ ఏడుపు మొదలుపెట్టాడు.

ఇంతలో గదిలోనుండి భారతి రమ్మనమని చెప్పటంతో, “నాన్నా కార్తీక్! నాన్ననేగా చూపిస్తానురా” అంటూ భారతి వున్న గదిలోకి కార్తీక్‌ను తీసుకెళ్ళారు.

లోపల గోడపై నిలువెత్తు భరత్ చిత్రపటం దండలతో నిండుగా కనిపిస్తోంది. ప్రక్కనే అచ్చు ‘భరత్‌’లా మారిన ‘భారతి’ నిలబడి “రారా! కార్తీక్ ఇప్పటినుండి నేనేరా మీ నాన్నను. నీకు రక్షణగా, ధైర్యకవచంలా మారి నాన్నని నీవెలా కోరుకుంటున్నావో అలాగే ఉంటాను” అంటూ గంభీర స్వరంతో పలికింది.

“కొడుకు కోసం తన అందమైన నీలి ముంగురులను క్రాఫ్‌గా మలచుకొని, గంభీరత గురించి పెట్టుడు మీసాలను ధరించి, కళ్ళలోని భావాలను ఇతరులకు తెలియనీయకుండా చలువ అద్దాలను అలంకరించుకొని తమ అల్లుడే దివినుండి భువికి దిగివచ్చాడా? అన్న భ్రమతో కూతురి రూపాన్ని చూసిన భారతి తల్లిదండ్రులే ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

“నాన్న సూర్యునిలా పగలంతా లోకాన్ని తేజోమయం చేస్తే, అమ్మ చంద్రునిలా రాత్రంతా చల్లదనాన్ని ఈజగతికి అందిస్తుంది. అందుకే పగలు నాన్నలా, రాత్రివేళ అమ్మలా కార్తీక్‌ను రక్షించుకోవాలి” అని నిర్ణయించుకుంది భారతి.

“నాన్న కావాలి” అని తనెందుకు అంతగా మంకు పట్టు పట్టాడో, దానికి తగ్గట్టుగా “అమ్మే నాన్నగా ఎందుకు మారిందో” కార్తీక్‌కు అర్ధమయ్యింది.

తరువాత వాళ్ళ ఊరిలో కార్తీక్, భరత్ వేలు పట్టుకుని స్కూలుకు వెడుతూంటే “మీ నాన్నగారా?” అని పక్క ఇళ్ళవాళ్ళంతా అడిగారు. “ఔను” అంటూ గర్వంగా, ఆరాధనగా భరత్‌తో నడిచాడు.

“కొడుకును ఉన్నత లక్ష్యం దిశగా నడిపించే యత్నంలో, తన తాత్కాలిక అందాలను. వాటి మూలంగా తనకు కలిగే ఆనందాలను త్యాగం చేయాల్సిందే” అని మనసులో అనుకుంటూ ముందుకు నడిచాడు భరత్ ఉరఫ్ భారతి.

****

Posted in June 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!