అపరాన్న వేళ భానుడు నడి నెత్తిమీదనుండి పడమర వైపు దీనంగా వాలు తున్నాడు.
పురుషోత్తం మాస్టారు ఎంతో ఓర్పుతో శక్తి నంతా కూడగట్టుకొని నులక తాడు మంచానికి నేస్తున్నాడు. స్వేదబిందువులు నుదిటినుండి మెల్లగా జారుతున్నాయి.
ఇంతలో,
తాతా! ....తాతా !.. అంటూ బిగ్గరగా అరుస్తూ ....నులక మంచం నేస్తున్న తన తాతయ్య దగ్గరకు వచ్చాడు ఏడేళ్ల కిరణ్ .
ఆ అరుపులకి కంగారుపడుతూ ..ఏటిరా ...ఏమైంది ..ఎందుకంత కంగారు ?...అనిపూర్తిచేసేలోపే....
మనవడు అందుకున్నాడు,
"తాతయ్య! ...మన కర్రి ఆవు ఈనితుంది, తొందరగా రా తాతయ్య ...అమ్మమ్మ నిన్ను పిలుస్తుంది"' అని ఏకబిగిన సంతోషం ఆతృత కలగలిపి చెప్పాడు.
"అలాగా! పదరా పద ..." అని నేస్తున్న నులక తాడు కి అర్థ ముడి వేసి ...గావంచా తీసుకుని గబా గబా ..అడుగులు వేసాడు పురుషోత్తం మాస్టారు. కిరణ్ తాత కంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
పురుషోత్తం బడి పంతులుగా ఉద్యోగం చేసి, పదవీ విరమణ అనంతరం విరమణ లేని రైతు జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.
పేరు చివరన "మాస్టారు" ఉద్యోగం చేరిన రోజునే చేరి "పురుషోత్తం మాస్టారు" అయ్యారు. అది అరుదైన గౌరవం. ఆ గౌరవం నిలబెట్టుకోడానికి తన శ్రాయశక్తులా ప్రయత్నం చేసాడు. ఎందరినో ఆణిముత్యాల్లా తీర్చి దిద్దాడు. ఆ గౌరవం తోనే పదవీ విరమణ రోజు ఊరంతా ఊరేగించారు. ఇక ఆ ఊరికే మాస్టారు అయ్యారు.
మనవడి ఆదుర్దా తో సమయానికి చేరుకున్నాడు.
అంతలో అన్నీ ఏర్పాట్లు చక చకా సాగిపోయాయి. అవసరానికి అందరూ ఒకటిగా మెలిగే ఊరి జనం సాయం చేసే చేతులు తోడై, ఆవు దూడ ని ఈనింది.
తన కళ్ళముందు ఓ లేగ దూడ ఈ ప్రపంచంలోకి రావడం ఆనందంగా మరియు ఆశ్చర్యంగా ఉంది కిరణ్ కి. ముని వేళ్ళతో లేగ దూడ ని తాకాడు. ఏదో అనుభూతి. చెప్పలేని ఆనందం. ఒక్కసారి ఎగిరి గంతేశాడు.
రోజులు ఆ దూడ తో ఆనందంగా గడిసాయి. అలుపెరగని పరుగులు ఏవేవో ఊసులు.
కిరణ్ తాతయ్యకు ప్రతి పనిలో తన వంతు సాయం చేసేవాడు. మనవడి ప్రతి కదలికని నిశితంగా గమనించేవాడు పురుషోత్తం మాస్టారు.
వాడు ఉండేది స్కూలు సెలవులు అయ్యేంతే వరకే అయినా ఎంతో కొంత నేర్చుకుంటాడులే అని వీలైనప్పుడు బోధించేవాడు మనవడికి.
కిరణ్ తన వయసుకు మీరి చెప్పిన పనులు ఎంతో ఆసక్తి తో చేసేవాడు. మధ్య మధ్యలో తాత చెప్పిన పద్యాలను వల్లె వేసేవాడు. ఇదే దినచర్య అయ్యింది.
విశాలమైన మహా నగరంలో ...డ్యూడ్... డాడ్.. మమ్మీ అంటూ.... ఇరుకైన గదులు.. ఇరుకైన మనసుల మనుషుల మధ్యన పెరిగే కిరణ్ కి తాతయ్య ఊరు చిన్నదే అయినా, విశాల స్వర్గం లా అనిపించింది. అందుకే మొండిపట్టు పట్టి తాతయ్య ఇంటికి వచ్చేస్తాడు సెలవులకి.
ఓ రోజు ఎప్పుడూ పొద్దున్నే కనపడే తాతయ్య తనకి కనపడలేదు. ఇల్లంతా వెతికాడు.
ఎప్పుడూ మంచం దిగలేని తాతమ్మ దగ్గరకు వెళ్లి చూసాడు ఎందుకంటే తాతయ్య రోజు తాతమ్మ కి సేవ చేస్తూ ఉంటాడు. అక్కడా కనపడలేదు.
అమ్మమ్మ దగ్గరికి వెళ్లి అడిగాడు "అమ్మమ్మా తాతయ్య ఎక్కడ?" ఇల్లంతా వెతికా గానీ నాకు కనపడలేదు" అని.
"మీ తాత పక్క ఊరిలోని ఏదో పనుందనని వెళ్లాడురా, నువ్వెళ్ళి ఆడుకో" అంటూ వంట గదిలోనుంచి వెళ్ళగొట్టింది వాళ్ళ అమ్మమ్మ. ఎక్కడ నిప్పురవ్వలు తగులుతాయో అని. అప్పుడు మట్టి పొయ్యిలు. పిడకల్తో వంట. పశువుల పేడ, గడ్డి బొత్తు కలిపి పిడకలు చేసేవారు. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే "ప్రొడక్ట్ ఫ్రొమ్ వేస్ట్".
గుమ్మం లో చప్పుడు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కిరణ్. పురుషోత్తం మాస్టారు అప్పుడే కాళ్ళు కడిగి లోపలికి వస్తున్నారు. ముఖం నీరసంగా ఉంది.
కిరణ్ తాతయ్య వైపు తదేకంగా చూస్తూ తాతయ్యా అని దగ్గరగా వెళ్ళబోయాడు. దగ్గరగా వస్తున్న మనవడితో "ఆగరా.. ఆగు నే స్నానం చేసి రాని. బయట తిరిగొచ్చానుకదా!" అంటూ గుమ్మం దగ్గర సంచి పెట్టి లోపలికి అడుగుపెట్టాడు.
తాతయ్య స్నానం చేసి రాగానే దగ్గరగా వెళ్లి వాటేసుకున్నాడు కిరణ్.
"తాతయ్య నన్నెందుకు తీసుకెళ్లలేదు.." అని మారాం చేసాడు. వాడి ముఖం వైపు చూస్తూ ముని వేళ్ళతో జుత్తు సవరిస్తూ చెప్పాడు "తాతమ్మ మందుల కోసం పట్నం వెళ్లానురా, సరేలే రేపు నేను సంతకి వెళ్తున్నాను నువ్వు నాతో వద్దువు గాని సంతకి ..అలాగేనా?" అంటూ లాలించి బుజ్జగించి పంపాడు.
బయట తిరగడం.. అదీ సంత అంటే.. ఓహ్.. సంబరం. ఇంక చెప్పేదేముంది.
రేపటికోసం కిరణ్ కి ఆత్రుత ఎక్కువైంది.
మరుసటి రోజు రానే వచ్చింది.
తాత కంటే ముందే తయారై కూర్చున్నాడు. వాళ్ళ అమ్మమ్మ సంచిలో మంచి నీళ్లు.. కొబ్బరి ఉండలు పెట్టింది దారి లో తినడానికి. చేతి రుమాలు నిక్కరు జేబు లో పెట్టింది.
పురామయించిన పని వాడు వచ్చాడు. పశువుల పాక లో ఉన్న ముసలి ఆవుని మెడలో కన్ని వేసి తీసుకొచ్చాడు.
కిరణ్ ఆవుని చూసి, "తాతా! ఆవు సంత కి ఎందుకు?" అన్న ప్రశ్నకు ..సమాధానం ఇవ్వలేదు పురుషోత్తం మాస్టారు. "పద పద ఎండ ఎక్కువవుతుంది" అంటూ బయలుదేరారు గొడుగు టార్చి లైటు చేత పట్టుకొని.
ఎప్పుడూ ఏదో పద్యం ...పరమార్ధం చెప్పే తాతయ్య ముభావంగా ఉండడం కిరణ్ కి నచ్చలేదు. అడగాల వద్దా అన్న సందిగ్ధం. వాళ్ళ ప్రయాణం లో మౌనం తోడైంది అందుకేనేమో అలసట పెరిగింది. కిరణ్ కి ఏమీ పాలుపోలేదు ముభావంగా నడుస్తూ ఉన్నాడు. పురుషోత్తం మాస్టారు మనవడి అవస్థ చూసి మనవడి కోసమని ఓ చెట్టు దగ్గర ఆగారు. దాహం తీర్చుకున్నాక.. ఉండ లేక కిరణ్ అడిగాడు. " తాతయ్యా మనతో మన ఆవు ఎందుకు?" అని. మనవడి మోస్తున్న ప్రశ్నల బరువు ఇక దింపాల్సిందే అని, ఇహ దాచే అవసరం లేక నిజం చెప్పాడు..
"ఆవు ఒట్టిపోయింది. అందుకే ఆవుని అమ్మడానికి తీసుకెళ్తున్నాం" అని
తాత సమాధానం తో ఎంతో శక్తి వచ్చిన వాడిలా ప్రశ్నల వర్షం కురిపించాడు కిరణ్. "అన్ని ఆవులు ఉండగా ఈ ముసలి ఆవే ఎందుకు..? డబ్బులు కోసమా?."...అని.
నడక మొదలుపెట్టి ...చెప్పాడు పురుషోత్తం మాస్టారు. "మనకి ఆవు అవసరం పాల కోసం. ఈ ఆవు ఇక పాలు ఇవ్వలేదు. ముసలిది అయిపోయింది దానికి రోజూ మేత కావాలి.. అవసరం లేని ఖర్చు. అందుకే సంతలో అమ్మేస్తున్నాం."
కిరణ్ కొంత సేపు ఆలోచించి "తాతయ్య మరి అవసరం లేని ఈ ఆవుని ఎవరు కొంటారు...? అని చిక్కు ప్రశ్న వేసాడు.
మాస్టారు ఆలోచనలో పడ్డారు ఎలా చెప్పాలా అని.
కంటికి రెప్పలా తమలో ఒకరిలా.. పెరిగి తమ అవసరాలకు మించి పాలిచ్చిన ఈ ఆవుని ఇక అవసరం తీర్చదని సంతలో అమ్మిన అనంతరం ఏమి చేస్తారో ..తెలిసి..తెలిసి ...తీసుకొచ్చాడు.
కానీ మనవడు గుచ్చి గుచ్చి అడుగుతుంటే చెప్పక తీరలేదు. పసి మనసుకి.. ఎక్కువ గాయ పర్చడం ఇష్టంలేక క్లుప్తంగా చెప్పాడు. కానీ చెపుతున్న సేపు మాస్టారు మనసు మాత్రం మౌనంగా లేదు.
కిరణ్ వెంటనే "తాతయ్య... ఆవుని అమ్మొద్దు తాతయ్య ..మనతోనే ఉన్ని తాతయ్య. నువ్వే అన్నావుగా ఆవు దేవత అని, అమ్మొద్దు తాతయ్య కావాలంటే నేను తక్కువ తింటాను ..అసలు బొమ్మలు కొనమని కూడా అడగను....." అంటూ ఇంకా...ఇంకా... అలా తాతయ్యకు బ్రతిమాలుతూనే ఉన్నాడు. ఇంతలో సంత దగ్గరకు చేరారు.
ఈ హడావిడి లో పడి వాడే మర్చిపోతాడు అని అనుకున్నాడు పురుషోత్తం మాస్టారు.
కిరణ్ నువ్వు అక్కడ కూర్చో... అంటూ పాలిగాడికి సంతలో ఆవుని బేరం పెట్టమని ఇంకా ఏమి ఏమి చేయాలో వివరించాడు. కానీ తన మనసు ఎందుకో భారంగా ఉంది.
ఆవు కళ్ల లోకి చూసి దగ్గరగా వెళ్లి మెడమీద నిమిరాడు.. ఆవుని నిమురుతున్న కొద్దీ... ఇంకా మనసు బరువు పెరుగుతూనే ఉంది. మనిషి కి మించిన బరువును మోయవచ్చేమో... కానీ... మనసుకు మించిన బరువుని మోయలేము. ఇప్పుడు మాస్టారు పరిస్థితి ఇదే.
మనవడి వైపు చూసాడు.. వాడిలో సంతకి బయలుదేరే ముందు ఉన్న హుషారు.. ఆనందం ఇప్పుడు లేదు. వాడి కళ్లన్నీ ఆవుని మాత్రమే చూస్తున్నాయి.
పురుషోత్తం మాస్టారు.. మెల్లగా వాడి దగ్గరకు వెళ్ళాడు. కిరణ్ తాతని చూసి...
"తాతయ్య మన ఇంట్లో తాతమ్మ అలానే మంచం మీద ఉంటుంది, ఏ పనీ చేయదు మరి ఎందుకు అమ్మలేదు..? నేను పెద్దయ్యాక నిన్ను అమ్మమ్మని అమ్మేయ్యొచ్చా. ...?" అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు.
మనవడి ప్రశ్నకు మాస్టారు కి మతి పోయినంత పని అయ్యింది. ఇన్ని సంవత్సరాల అనుభవం.. గురువు గా ఎంతో మన్ననలు అందుకున్నా... మనవడి ప్రశ్న కి సమాధానం చెప్పలేని స్కూలు పిల్లాడిలా నిస్తేజంగా నిల్చున్నాడు.
ఇంత ఎదిగినా ...అంతలా ఆలోచించ లేక పోయానే... అనుకుని అంతర్మధనం లో పడ్డాడు.
అంతర్మధనం లో మనవడి ప్రశ్నకి మనసులో.సమాధానం దొరకగానే...మనసులో ఉన్న బరువు ఒక్కసారిగా తొలిగిపోయినట్టు అనిపించింది.. ఇప్పుడు ఎంతో తేలికగా అనిపించింది.
ఇంతలో పాలిగాడు వచ్చి "బేరం వచ్చింది రండి బాబూ" అంటూ పిలిచాడు.
పురుషోత్తం మాస్టారు నిబ్బరమైన మనసుతో "వద్దురా... మనం ఆవు అమ్మటంలేదు. బేరాన్ని పంపించెయ్" అంటూ మనవడి వైపు చూసాడు.
పాలిగాడు కిరణ్ వైపు ఓ చిరునవ్వు తో చూసి వడివడిగా... వెళ్లిపోయాడు. వాడి ముఖం లోనూ ఆనందం.
తాత మాటలు విని తాత ని పరికించి చూసాడు నమ్మలేనట్లుగా. పురుషోత్తం మాస్టారు అవును అన్నట్టు చిన్నగా తల ఊపాడు. కిరణ్ ఇంతవరకు తనలో దాచుకున్న దుఃఖాన్ని..ఆవుని అమ్మటం లేదన్న ఆనందాన్ని జోడించి తాతయ్యని గట్టిగా కౌగలించుకుని.. వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
అప్రయత్నంగా పురుషోత్తం మాస్టారు కను కొలకుల్లో నీరు చేరి చెంపలపై జారింది. కండువతో తుడుచుకుని మనవడికి ఓదార్చి..దగ్గరగా తీసుకుని "నేను అందరిలా ఆలోచించానే గాని, నాలా నేను ఆలోచించ లేకపోయాను. మనవడివి అయినా ఈ తాతకి గురువు అయ్యావురా" అని గట్టిగా హత్తుకున్నాడు. "పద రా పద సంత చూద్దాం..నీకు సంతలో ఏమి కావాలో కొనుక్కో. ఆవుకి మెడగంట కొందాం" అంటూ ఆవు మెడ నిమిరి పనివాడ్ని పట్టుకోమని సంత లోపలికి వెళ్లారు ఆనందం తో...మనవడి చెయ్య పట్టుకుని..
మనవడి మనసు నెగ్గిన తాతగా, తరాల వారధికి ఆదర్శంగా, తనను తాను గెలిచిన “మనీషి” గా.
(మనిషి ప్రతి పని వెనక ఒక “ఆశ” లేక “ఆశయం” లేక “అవసరం” ఉంటాయి. అవి లేని చేసే పని మనిషిని “మనీషి” ని చేస్తాయి)
ఉపాధ్యాయ వృత్తి నుండి రిటైర్ అయిన వాడిని, ఆ వాడి వేడి తగ్గని వాడిని; మీ కథ అధ్యాపక వృత్తిలో ఉన్నపపటి ఎన్నో జ్ఞాపకాల్లోకి లాక్కెల్లింది. ఎంతటి వయస్సులో నున్న తాతలకైనా మనమలు దగ్గులే కాదు ఇంకేమైనా, ఇంకెన్నైనీ నేర్పగలలని నిరూపించింది మీ ఈ కథ!
.హాట్సాఫ్ టు యు ,
శ్రీపెరంబుదూరు నారాయణ రావు
మీ ఆత్మీయ సమీక్ష కు నా మనఃపూర్వక ధన్యవాదాలు