ఆ ఒక్క చూపు
నాలో పెట్టిన పుటానికి
సెగలు తొడిగిన అర్థాలను
రవ్వలు రువ్విన బంధాన్ని
మనసు మిరుమిట్లగొల్పిన వింతల్ని
మడతేసి ఎంత అడుక్కినెట్టినా....
నాలుక నడివీధిలో
పరుష పదజాలపు పలకల కింద
చీకటితో అర్థాన్ని పూడ్చి సమాధి చేసినా..
నిర్లక్ష్యపు నిప్పులలో
ఆశను కాల్చి మసిచేసినా
కసిగా కళ్ళు దృశ్యాలను
కసిరి నేలకేసికొట్టినా...
ఆ ఒకే ఒక్క చూపు
రక్తాన్ని ఏతమేసి తోడటం మానలేదు...
ఎర్రగా తడిసి ఏ జ్ఞాపకం ఆరడంలేదు.
ప్రతి అనుభవం అర్థరాత్రి చీకటిని ఉదయిస్తుంది.
ప్రవహించే మాటల్లో తేలాడే ఊహలు
గురిచూడటం మానలేదు.
ప్రసరించే భావాల్లో పారాడే ఊసులు
గుచ్చుకోవడం ఆగలేదు.
వెచ్చని శ్వాసనాళంలో
పచ్చని ధ్యాస దారులలో
మనసును ఒడిసిపట్టి
వడగట్టిన భావాలని ప్రశ్నలుగా
బతుకును వెలకట్టి సంధిస్తే....
జీవితమంతా తాకట్టు పెట్టి
మనసును వేలం వేసినా
తీరని బాకీల బంధంలో
తరగని వడ్డీలా అనుబంధానికి
లోపల కొలువైయున్న నీ ప్రేమకు బానిసనై ఋణపడే ఉన్నాను.
ప్రతి అనుభవం అర్థరాత్రి చీకటిని ఉదయిస్తుంది.
అద్భుతమైన అభివ్యక్తి.