ముందుమాట
నాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు,ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.
మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.
ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.
శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.
డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.
నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతూ ఈ నెల రెండు కవితలతో ప్రారంభిస్తున్నాను.
నమస్కారములతో – పారనంది అరవిందారావు
ప్రేమాభిషేకం
నా ప్రేయసి! నా ప్రేయసి! మనజాలను ఎడబాసి
నీ ప్రేమకు దాసోహం! నీ పై నేనెరుగని మోహం
నీ నవ్వుల పువ్వుల్ని చిరుగాలుల వెదజల్లి
పక్షుల కిల కిల రావములుగ వినిపిస్తా!
నీ కన్నుల తళ తళలను దోసిళ్ళపట్టి
అంబరాన తారలుగ వెలిగిస్తా!
నీ దేహపు ఛాయని నింగిపైన చిలికి
వెండి మబ్బులని సృష్టిస్తా!
నీ బుగ్గల కెంపుల్ని కెందామరలుగ మార్చి
నీ పసిడి పాదాలకి అర్పిస్తా!
ఎఱ్ఱటి నీ పద పారాణి భానునిపై జల్లి
గడియలో సంధ్యాసమయం తెప్పిస్తా!
నీ వినీల కుంతలాల్ని ఇది నిక్కమనిజెప్పి
అమావాస్య చీకటిని గేలి చేస్తా!
నీ ఇందువదనాన మారే రంగుల్ని
రంగరించి ఇంద్రధనస్సుగ గీసేస్తా!
నీ మందగమనాన ఒలికే సోయగాల్ని
అజంతా ఎల్లోరా శిల్పాలుగ మలిచేస్తా!
నువ్వు పలికిన ప్రతి పలుకు నా మదిన బంధించి
ప్రబంధ కావ్యములుగ రచియిస్తా
నీ నునువెచ్చని ప్రతి శ్వాస వెండిపోగుల అల్లి
వెలలేని శాలువుగ శీతలమున ధరియిస్తా!
నీ చేతుల విషమైనను గడియల్లో దిగమ్రింగెద!
అమృతము చుక్కైనను జన్మాంతము సేవించెద!
ప్రేమాహుతి
ఆ ఇంటి ముంగిట ఓ చక్కటి దీపం
ఆ చక్కటి ముంగిట ఓ ముచ్చటి దీపం
ఆ ముచ్చటి దీపం ఓ ఎర్ర ప్రమిదలో
ఆ ఎర్ర ప్రమిదలో ఓ యవ్వన దీపం
ఎదలని కాల్చేసే ఓ జవ్వన దీపం
మెల్లగా తలెత్తి మెత్తగా నవ్వింది
మెరిసే కళ్ళతో మత్తుగా నవ్వింది
మత్తుగా ఒడలంతా మెత్తగా ఊపింది
ఆ మెత్తటి ఊగులో మెరుపులా మెరిసింది
రానే వచ్చాడు ఆ కొంటె గాలి
రెమ్మల మీంచి మెల్లగా వాలి
కోర మీసం వాడు కోడె వయసు వాడు
వయస్సులో ఉన్న సొగసుని చూసాడు
సొగసులో తడిసిన వయస్సుని వలచాడు
ఆ ఇంపుసొంపులు తనవే అన్నాడు
ఆ వొంపు సొంపులు తనకే అన్నాడు
కొంటెగాలిని చూసి కళ్ళు తిప్పింది
కోరమీసం చూసి ఓరగా నవ్వింది
నడుము సన్నగ ఊపి నాజూకుగాను
చిరు గాలి తాకిడికి లేతగా వణికింది
వయ్యారం వొలికించి
నయగారం చిలికించి
చిరుగాలిని కవ్వించి
తన సుందర దరహాస
రుచులను చూపించి
దరికి వచ్చిన ప్రియుడితో
దోబూచులాడింది.
రా! రమ్మంది! హత్తుకోమంది!
రమ్యమైన రాత్రి రసవత్తమంది
కొంటె గాలి విరహం ఉరకలు వేసింది
వెచ్చటి ఆమె కౌగిలికై పరుగులు తీసింది
ఆగలేనన్నాడు అమె ఆలింగనానికి
అంగలేసాడు ఆమె వెచ్చదనానికి
అతనిలో ఆమె ఒదిగి పోయింది
అతనికై ప్రేమలో ఆహుతై పోయింది.