ఎడాపెడా పిల్లలు కావడంతో గిరిజ ప్రణవి తో "పిల్లల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళు ఇబ్బంది పడతావు." అని చెప్పింది.
"వాళ్లు నేను లేక పోతే నిన్ను ఇబ్బంది పెడతారేమో! పరవాలేదు తీసుకుని వెళతాలే అమ్మా"
"నన్నేం ఇబ్బంది పెట్టరు. ఒకవేళ ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, నేను చూసుకుంటాను." అంది గిరిజ
సరే అని పిల్లల్ని వదిలేసి, బయలుదేరేముందు నూర్జహాన్ కి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి, బస్సులో బయలుదేరి వస్తున్నాను అని చెప్పింది ప్రణవి.
బస్టాండ్లో దిగగానే నూర్జహన్ ప్రణవి ని రిసీవ్ చేసుకుని, తన స్కూటీ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళింది.
ఇంటికి వెళ్ళగానే గబగబా వాళ్ళ పాప ఎదురొచ్చింది. పాపకి ఐదేళ్లు ఉండొచ్చు. తెల్లగా ముద్దుగా అందంగా ఉంది. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది నూర్జహాన్. కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్ళారు ఇరువురూ.
నూరి భర్త లోపల ఉన్నాడు. స్నేహితురాలని పరిచయం చేసింది.
నమాజ్ టైం కావడంతో విష్ చేసేసి వేరే గదిలోకి వెళ్లి చిన్న చాప వేసుకుని, తలకి తెల్ల టోపీ పెట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని నమాజ్ చేసాడు.
ఇదంతా ఆశ్చర్యంగా చూస్తోంది ప్రణవి.
"ఏంటి అలా ఆశ్చర్యపోతూ చూస్తున్నావు?" నవ్వుతూ అడిగింది నూర్జహాన్.
"మీది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని విన్నాను. మరి... " అర్థోక్తిగా ఆగిపోయింది ప్రణవి.
"ఇప్పుడు కాదని ఎవరున్నారు?" నూర్జహన్ అడిగింది. చూపుడువేలుతో నూర్జహాన్ భర్త నమాజ్ చదవేది చూపించింది ప్రణవి.
“ఓ అదా! ప్రేమించి పెళ్ళి చేసుకున్న తరువాత సమాజ పరంగాను, ఆర్థిక పరంగాను, పేరెంట్స్ పరంగా మేము ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నాము. మాకు పుట్టబోయే పిల్లలు ఏ కమ్యూనిటీ క్రిందకు వస్తారో, వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటారో అర్థం కాలేదు. మాటలలోఅందరూ సమానం అంటారు. కానీ ఓ స్కూల్లో చేర్చాలన్నా ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలన్నా అన్నింట్లోనూ క్యాస్ట్, రిలీజియన్ కాలమ్స్ ఉంటాయి.
మా పిల్లలు ఏ కాస్ట్ కిందకి వస్తారు? చాలామంది తండ్రిది ఏ కులమైతే ఆ క్యాస్టే రాస్తూ ఉంటారు. అంటే అక్కడ వివక్షత చూపినట్టే కదా! ఆడ మగ సమానం అనేది కూడా అబద్ధమే అవుతుంది కదా! చట్టాలు మారాలి. ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది తొలగిపోవాలి. మనుషులు అంతా సమానం అనే ధోరణి రావాలి.
ఇవన్నీ రావాలంటే ఇంకా టైం పడుతుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. ఈ సమాజంలో బ్రతకాలి అంటే అని అర్థమైంది మాకు. అదే సమయంలో మా నాన్నగారు మా మతం లోకి మారితే మమ్మల్ని ఆదరిస్తాం అనడంతో...మేమిరువురం మా మతంలోకి మారిపోయాము.
మూర్తి మహ్మద్ గా మారాడు. అంతే కాదు మా భాష కూడా నేర్చుకున్నాడు. మాలో ఒకడిగా ఉండిపోయాడు. ఇప్పుడు అతన్ని హిందువంటే ఎవరూ నమ్మరు." నవ్వుతూ చెప్పింది నూర్జహాన్.
"మరి మూర్తి పేరెంట్స్ ఏమీ అనలేదా?" అనుమానంగా అడిగింది ప్రణవి.
"ఎందుకనరు? వాళ్ళేం దేవలోక నుంచి దిగివచ్చిన దేవ దూతలు కాదు కదా! అంటారు..
నన్ను, మా వాళ్ళని నానా తిట్లు తిట్టారు.
'నా కొడుకు కు ఏం మందు పెట్టావ్? వాడు ఏకంగా మతాన్ని కూడా మార్చుకుని, నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వగలాడి, మాయలాడి అంటూ నన్నూ తిట్టేవారు. ఏమన్నా మౌనంగా ఊరుకున్నా. వాళ్లకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇచ్చా. వారి కోపం చల్లారాక ప్రశాంతంగా ఉన్నప్పుడు... నేను మా ఆయన కూర్చుని మనసులు కలవని పెళ్లిళ్లలో వాళ్లు పడే నరకయాతన, తల్లి తండ్రి కొట్టుకుంటూ ఉంటే పిల్లలు పడే మానసిక క్షోభను వారికి అర్థమయ్యేలా తెలియజేశాము.
ఆయన మా విధానాన్ని నేర్చుకునే ఆచరిస్తున్నారు కాబట్టి... నేను మీ విధానాన్ని నేర్చుకునే ఆచరిస్తా' అంటూ వారికి నచ్చ చెప్పా.
వారు మమ్మల్ని అర్థం చేసుకుని ఆశీర్వదించారు.” అంటూ చెప్పింది నూర్జహాన్.
"ఎందుకో నాకు ఈ ప్రేమ పెళ్ళి ళ్ళ మీద సదభిప్రాయం లేదు" అంది ప్రణవి.
"నువ్వు పెరిగిన వాతావరణం అటువంటిది. మీది అరేంజ్డ్ మ్యారేజే కదా ఎంతవరకు సుఖపడుతున్నావు చెప్పు? అయినా పెళ్ళి ద్వారా రెండు దేహాలే కాదు రెండు మనసులూ కలవాలి.
మనస్ఫూర్తిగా కలిసిన ఆ జంటలే ఎంతో అన్యోన్యంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తుకై ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఇలాంటి జంటలకు పుట్టిన పిల్లలు వ్యక్తిత్వ వికాసంతో ఎదిగి నెక్స్ట్ జనరేషన్ కి పూల బాట వేస్తారు. వీరిలో తమకు కావలసినది అడిగి తీసుకునే ధైర్యం ఉంటుంది.
నువ్వే ఆలోచించు... పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో ఎంత మంది పైకి చెప్పుకోలేక లోపల లోపల కుమిలిపోతున్నారో. అహంకారపు ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నారో! వారు సంతోషంగా ఉంటున్నారా? మొహమాటానికో... పెద్దల బలవంతానికో పెళ్లిళ్లు చేసుకుని, భార్య చాటున భర్త, భర్త చాటున భార్యలు... ఒకరినొకరు విమర్శించుకుంటూ...బాధపడుతున్నారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు...ఎడ్డం అంటే తెడ్డం... తెడ్డం అంటే ఎడ్డం... అనుకుంటూ... నెగిటివ్ థాట్స్ తో కుమిలిపోతున్నారు. ఇవన్నీ అవసరమా!
మమ్మల్ని బరితెగించిన వాళ్ళు అని ఈ సమాజంలో నీలాంటి చాందస్సులు కొందరు అనొచ్చు కానీ, మేము గట్టి బంధం కోసం పాకులాడే వాళ్ళమని అర్థం చేసుకోరు.
ప్రేమ అనేది ఏ క్షణాన్న ఎలా పుడుతుందో తెలియదు! ప్రేమకు మనసు చప్పుడే గాని మతము గొప్పలు వినిపించవు. భాష్యం తెలిసిన కనులకు కులం కనిపించదు.
ఆ క్షణం మాకు ఎవరైనా ఒకటే లా కనిపిస్తారు. ప్రేమికుల గుండె చప్పుడు మాత్రమే మాకు వినిపిస్తుంది.”
"సరే నీతో నేను ఏకీభవిస్తున్నాను. మరి ధైర్యంగా పెళ్లి చేసుకున్న మీరు అలాగే ఉండొచ్చుగా మళ్ళీ ఈ కులాలు, మతాలు వెనకాతల పరిగెత్తటాలెందుకు?" అంది.
"నీది మట్టి బుర్ర. నీకు ఇప్పటిదాకా చెప్పింది ఎక్కలేదు. ఇంకా సమాజంలో సమైక్యతా భావం రాలేదు తల్లి. అందుకని చెప్పలేదు తల్లి ఈ పాట్లు ఈ సమాజంలోనే గా మేము బ్రతకాలి కావున... ఏదో ఒక మత ముద్ర మా మీద వేసుకోక తప్పలేదు. అయితే మేము అన్ని పండగలూ చేసుకుంటాం.
ఇదుగో సంక్రాంతి పండగకు నాకు మా అత్తమ్మ పట్టు చీర కొనిపెట్టారు" అంటూ బీరువాలోంచి పట్టుచీర తీసి చూపించింది నూర్జహాన్.
అంత చెప్పినా ప్రణవి లో ఏదో ఓ మూల శంక మిగిలి పోయింది.
"మీరు భిన్న మతస్తులు కదా! ఆహార, వ్యవహారాలు పండుగలు, పబ్బాలు ఎలా చేస్తున్నారు? కొంపదీసి మూర్తికి నాన్ వెజ్ కూడా అలవాటు చేసావా? ఏంటి? అడిగింది ప్రణవి.
"ఇంట్లో నేను మడి కట్టుకుని వంటచేస్తా. ప్యూర్ వెజ్. మా అత్త గారికి ఇచ్చిన మాట ప్రకారం నేను మీ నోములు, వ్రతాలు కూడా చేస్తున్నాను తెలుసా! మాకు డబుల్ ధమాకా హిందువుల పండగలూ చేస్తాం, ముస్లింల పండుగలు చేస్తాం." నవ్వుతూ చెప్పింది నూర్జహాన్.
"సంతోషం నువ్వు హ్యాపీగా ఉన్నావు." అంది గాని ప్రణవి మనస్సులో ఇది చెప్పేది నిజమేనా? లేక నన్ను బాధ పెట్టకూడదని ఇలా చెప్తోందా? అనే అనుమానం తొలుస్తూనే ఉంది.
"నీకంటే మంచి జరిగింది, కానీ పెద్దలు అన్ని చూసి చేస్తేనే అంతంతమాత్రంగా ఉన్నాయి పెళ్లిళ్లు. అలాంటిది ఎదిగీ ఎదగని పిల్లలు వివాహ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ కావామో" అంది ప్రణవి.
నూర్జహన్ ఏదో మాట్లాడబోయింది.
అదే సమయంలో నమాజ్ పూర్తి చేసుకుని వచ్చిన మూర్తి అలియాస్ మహమ్మద్ అక్కడ ఏదో చర్చా కార్యక్రమం జరుగుతోందని గ్రహించి...
"ఏంటి మీ ఫ్రెండ్ కి కబుర్లతోనే కడుపు నింపేసేట్టున్నావ్. ఇంకా అన్నం పెట్టవా ఏంటి?" అన్నాడు.
"అయ్యో! ఎందుకు పెట్టను?...నువ్వొచ్చాక అందరం కలిసి తిందామన్న ఉద్దేశంతో ఆగాను.” అని మహమ్మద్ తో చెప్పి “కాళ్లు, చేతులు కడుక్కురా ప్రణవి అన్నం తిందువు గాని" అని ప్రణవి ని ఉద్దేశించి చెప్పింది నూర్జహాన్.
"నేను తరువాత తింటా ముందు వారికి పెట్టేయి." అంది ప్రణవి.
"మీ ఫ్రెండ్ నేనున్నానని ఇబ్బంది పడుతున్నట్లున్నారు. ముందు నాకు పెట్టేయి. తినేసి ఆఫీస్ కి వెళ్ళిపోతాను." అని నూర్జహాన్ కు మాత్రమే వినపడేట్టుగా చెప్పాడు.
నూర్జహాన్ అతనికి భోజనం పెట్టి పంపించేసింది.
తర్వాత నిదానంగా పాపతో కలిసి స్నేహితురాళ్ళిద్దరూ భోజనం చేశారు.
వంటిల్లు సర్ది పెట్టేశాక ఇద్దరూ డబుల్ కాట్ మీద నడుంవాల్చారు.
"నువ్వు వచ్చిన దగ్గరనుంచి నా గురించే చెప్తున్నాను. నిన్ను సమాధానపరచలేక పోయానని నాకు అర్థం అవుతోంది. అయినా ఇంక దాని గురించి చర్చించడం అనవసరం. తీరం చేరలేని సమస్యలు మావి. అందరూ అర్థం చేసుకునే ఆదరించడానికి ఇంకా టైం పడుతుంది. వదిలేసేయ్.
నీ గురించి చెప్పు. మీ వైవాహిక జీవితం గురించి...” అని అడిగింది.
ప్రణవి తనగురించి అంతా చెప్పింది. అంతా విన్న నూర్జహాన్.
“నీదే తప్పు ప్రణవి. వాళ్ళేంటి అనేది మొదట్లోనే నీకు అర్థమైఉండాలి. అంత మాత్రం గ్రహించలేని నీ చదువు ఎందుకు దండగ.
'నన్ను వాళ్ళెందుకు ఏడిపిస్తూన్నారు?' అని జవాబు వాళ్ళ నోటంబడే రావాలి అని
నీలో నీవు కుమిలి నీ ఆరోగ్యమే చెడగొట్టుకున్నావు. వాళ్లు ఎందుకు ఏడిపిస్తున్నారు అనేది నువ్వే గ్రహించి,
మళ్ళీ మళ్ళీ వాళ్ళు నిన్న ఏడిపించకుండా జాగ్రత్తలు తీసుకొని ఉండవలసింది.
జీవితం ఓ చదరంగపుటాట. అవతల వాళ్ళు ఒక ఎత్తు వేశారు అంటే అది దేనికి వేశారు? చుట్టూ ఉన్నవేటినైనా తినటానికి చూస్తున్నారా? మనల్ని అణచటానికి చూస్తున్నారా? నెక్స్ట్ స్టెప్పు ఏంటి? అని రకరకాల యాంగిల్స్ లో ఆలోచించాలి. ఒకవేళ ప్రమాదం పొంచి ఉంటే డిఫెన్స్ కాచుకోవాలి. అంతేగాని నేనెవరిని బాధ పెట్టను, వచ్చే ప్రమాదాన్ని పట్టించుకోను, నా మార్గంలో నేను స్ట్రైట్ గా వెళ్ళిపోతాను, నాకు ఏమీ అడ్డు రాకూడదు అంటే జరిగే పనేనా...? అవతల వాళ్ళు ఈజీగా నెగ్గేస్తారు. స్పీడ్ గా వచ్చే లారీకి ఎదురెళ్ళి నువ్వే కాపాడు దేవుడా అన్నట్టుగా ఉంది నీ వ్యవహారం. ఎల్లవేళలా మంచితనం పనికిరాదు.
సాంప్రదాయాలను గౌరవించమన్నారు గాని ఆ ముసుగులో జరిగే హింసలను అడ్డుకోవద్దని చెప్పలేదే ఏ ధర్మ శాస్త్రం లోనూ! నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మాత్రం ఎప్పుడూ చూడక.
ముందు నువ్వు ఆర్థిక స్వేచ్ఛను పొందు. ఏదైనా ఉద్యోగం చూసుకో. నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో. అప్పుడే నువ్వు ఏది చేయాలన్నా ధైర్యంగా చేయగలుగుతావు." అని హితవు చెప్పింది నూర్జహాన్.
"నీ కేమమ్మా ఎన్నైనా చెబుతావు. మా సాంప్రదాయంలో భర్తను ఎదిరించి మాట్లాడకూడదు. అత్తారింట్లో అణుకువ గా ఉండాలి." అంది ప్రణవి.
నూర్జహాన్ ఓ నవ్వు నవ్వి “మరీ ఇంత పిచ్చిదానివి ఏంటే!?! ఏ మతమైనా, ఏ కులమైనా అన్నింటి సారాంశం ఒక్కటే. ఈమతాలు, వారి ఆచారాలు వివిధ పేర్లతో పిలిచే నదుల లాంటివి. ఇవన్నీ పోయి సాగరం లో కలిసినట్లుగా వీటన్నింటి సారాంశం ఒక్కటే. అది గ్రహించిన వాళ్ళు అన్నిమతాలను గౌరవిస్తారు. ఇలా చెబితే నీకు అర్థం కాదు గాని నేను ఒక కథ చెప్తాను. విని నీకు అన్వయించుకో.
బహుశా నీకు ఈ కథ తెలుసేవుంటుంది.” అంటూ కథ చెప్పడం మొదలు పెట్టింది నూర్జహాన్.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లికరచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.) పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు. బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’. సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు. |