అమ్మయ్య అనుకున్నాను. అప్పటిదాకా ఏమీ తినకుండా ఉన్నానేమో కడుపులో ఆకలి నకనకలాడుతోంది.
భోజనానికి రమ్మని మగపెళ్ళివారిని అందర్నీ బొట్టుపెట్టి పిలిచారు. బంధువులు స్నేహితులు మగపెళ్ళివారు ఆడపెళ్ళి వారు అందరూ భోజనాల దగ్గర కూర్చొన్నారు.....జంబేష్, ప్రణవి కూడా కూర్చొన్నారు. వడ్డన పూర్తయింది.
ముందు స్వీట్ తినండి అన్నారు. అక్కడున్న పెద్దలు. విస్తట్లో లడ్డును తీసి ఇద్దరూ మూతి దగ్గర పెట్టుకున్నారు. రాజన్ అదే జంబేష్ అన్నయ్య "తినబోకరా ఆగు" అన్నాడు. జంబేష్ను ఉద్దేశించి.
అంతే ....మూతి దగ్గర పెట్టుకున్న లడ్డు కూడా కింద పెట్టేసాడు జంబేష్. అతను తినకుండా ప్రణవి ఏం తింటుంది? తనూ కింద పెట్టేసింది. వీళ్ళు తినలేదని బంతిలో వాళ్ళు ఎవరూ తినకుండా కూర్చున్నారు..
"మీరు ఎందుకు ఆగడం తినండి ....తినండి...ఆ పాపం మాకెందుకు బంతినుద్దేశించి అన్నారు రాజన్. వాళ్ళు మాత్రం ఏం తింటారు నూతన వధూవరులు తినకుండా....
"ఏమయ్యింది? ఎందుకు అన్నం తినొద్దు అన్నారు?" ధైర్యం చేసి ఓ పెద్దాయన అడిగితే...
"ఏం లేదు మేమందరం కలిసి తర్వాత తింటాం మీరు తినండి." అని చెప్పారు.
ఎందుకో? ఏమిటో? వీళ్ళకు తెలియలేదు. ఎందుకో అలిగారని మాత్రం అర్థమయ్యింది.
ప్రణవి పక్కనే కూర్చొన్నగిరిజ సన్నగా అదేంటి ఇప్పటిదాకా అందరితో కలిసి సరదాగా ఉన్నారుగా అన్నీసర్దుకుపోతూ...వేడి నీళ్లు కూడా వాళ్ళే వచ్చి తెల్లవారి మూడింటికే కాచుకొని పట్టుకెళ్లారు. ఎంత మంచి వారో ఎవరిని లేపకుండా..... మగపెళ్ళివారమనే అహం లేకుండా ఉన్నారు అనుకున్నాం. మరి ఇంతలోకే ఏమయ్యిందే కంగారుగా అంది.....
ఆ....అవన్నీ నటనలే..... మూడు ముళ్ళు పడేవరకు ఆడిన నాటకం ఇప్పుడు వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నారు. అంది మెల్లిగా తాయారు.
ఈ సంభాషణలు వాళ్ళంతా ఎక్కడ వింటారోనని భయపడిపోతూ వారి వంక చూసింది ప్రణవి. మగపెళ్ళివారు అంతా గూడుపుఠాణి గా చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు.
జంబేష్ లేవబోతుంటే వద్దని కళ్ళతో సైగ చేసాడు రాజన్. అక్కడ కూర్చున్నా ముళ్ళ మీద కూర్చొన్నట్లుగా కూర్చొన్నాడు జంబేష్.
అడిగినదాని కన్నా ఎక్కువే కట్నం ఇచ్చారు. పైసా వాళ్ళకు ఖర్చుకాకుండా.... బ్యాండ్ మేళం ఖర్చు తో సహా అన్ని వీళ్లే పెట్టారు.. వాళ్ళు పిల్లకు నగలు కూడా ఏం ...పెట్టలేదు... వీళ్లే వాళ్ళు చేయించినట్లుగా పెట్టారు. ఏమైందో ఏమో.. గుసగుసగా చెప్పింది ఒకావిడ.
వారెంత మెల్లిగా మాట్లాడుతున్నా ప్రణవీ చెవికి సోకుతూనే ఉన్నాయి వారి మాటలు... అన్నీ నిజాలే .....అంతా ఆంజనేయులే ఖర్చుపెట్టారు. మగ పెళ్ళివారు ఎక్కడా పైసా తీయలేదు. వారి మర్యాదలు పోకుండా అంతా ఆంజనేయులు గారే చూసుకున్నారు.
పెళ్లి కొడుక్కి ఏ బట్టలు కొంటే అతని అన్న గారికి కూడా అలాంటి బట్టలే కొనాలన్నారు వాళ్ళు. అంతేకాదు తోటి కోడలికి కూడా ప్రణవీతో సమానంగా చీరలు కొనాలన్నారు.
అదేంటి పెళ్ళి వాళ్ళకు కదా అని అడిగితే వాళ్ళమధ్య ఎటువంటి బేధాలు ఉండవు. అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా ఉంటారు. ఏది కొన్నా ఇద్దరికీ సమానంగా కొంటాం అన్నారు ప్రణవి అత్తగారు. ఇక వాళ్ళు కోరినట్లే ఇరువురికీ అన్నింట్లో సమానతను ఏర్పాటు చేశారు వీళ్ళు.
పరిస్థితి అర్థం అయ్యీ కానట్టయ్యి ఇంక చేసేదిలేక వారంతా భోజనాలు ఎలాగో అయ్యిందనిపించారు. పాటలతో సందడి చేసిన పెద్దవారంతా రాజన్ దగ్గరికొచ్చి దిగులుగా మొహంపెట్టి
"గడుపుకొనీ వెళ్ళండీ కరుణమాపై చూపండి కన్యాదానం చేసిన మేము నేరస్తులమై ఉంటిమీ.... లాంఛనాలు పుచ్చుకొనీ ఘనంగా భోంచేయండీ, మీరడిగిన కట్నం ఇచ్చితిమీ...శక్తికి మించి చేసితిమీ... అలకలు మాని భోంచేసి మాకానందాన్ని ఇవ్వండీ.." అంటూ పాట అందుకున్నారు.
“ఆపండి మీ కాకి గోల. మేమేమన్నా మీ కంటికి రాక్షసుల్లా కల్పిస్తున్నామా? ఈ కాలంలో ఈ పిచ్చిపాటలేంటి? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి మీరు సృష్టిగా భోం చేయండి. మాట్లాడవలసిన వాళ్లతో మేం మాట్లాడతాం" అంటూ వాళ్ళనూ పంపేశారు.
గిరిజ ఆంజనేయులు ఎన్ని మార్లు అడిగినా విషయం చెప్పలేదు. ఏం లోపం జరిగిందో ఎవరికీ అంతబట్టలేదు. చివరికి ఆంజనేయులు గారు కాళ్ళు పట్టుకొనేంత పని చేసారు.
"మా నోటితో మేమేం చెబుతాం. మీరే తెలుసుకోవాలి." కోపంగా అన్నాడు రాజన్.
"మావరకు మేము ఏ లోపమూ లేకుండా చేసామనే అనుకుంటున్నాం. ఎక్కడ మీకు లోపం ఏర్పడిందో తెలుసుకోలేకపోతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఎవరూ భోజనాలు చేయలేదు. ఏదైనా లోపం జరిగితే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి భోజనం చేయండి". అని చేతులు జోడించి వేడుకున్నారు ఆంజనేయులు.
"ఆ పాపం మా కెందుకు మేం తింటాం లేండి. మాకు వేరే రూంలో వడ్డించండి". అని చెప్పి పంపేసాడు రాజన్.
తర్వాత విషయం తెలిసింది బంతిలో వీళ్ళు నోట్లో పెట్టక ముందే వచ్చిన అతిథులలో ఎవరో పులిహార తిన్నారుట. ఇలాంటి వాటికి కూడా అలుగుతారా అనుకున్నారు ఆడపెళ్ళివాళ్ళు.
"అందరికీ అది తీయని అనుభూతి అయితే ప్రణవి కి మాత్రం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
అన్నమాట జవదాటని తమ్ముడు. తమ్ముడు ఎదుగుదలను చూడలేని అన్న. భార్య భర్తలుగా వీరే నాడూ మనసు విప్పి మాట్లాడుకున్నది లేదు. జీతం తెచ్చి ఒదిన కిచ్చేవాడు. ప్రణవి ఏమడిగినా ఒదినను అడగమనేవాడు.
అడగడానికి మొదట్లో మొహమాట పడినా.... తర్వాత అవసరం కొద్దీ ప్రణవి ఆమెను అడిగితే...
"మా దగ్గర డబ్బులు లేవు ప్రణవీ. నీ దగ్గర ఉంటే వాడుకో" అనేవారు ఆమె తోడికోడలు రాణి.
పాపం లేవేమోననుకొని వాళ్ళ అమ్మావాళ్ళు చాటుగా ఇచ్చిన డబ్బులు వాడుకునేది ప్రణవి. ఎప్పుడూ ఆ ఇంట్లో ఆమె ఖర్చులు ఆమే పెట్టుకోవల్సి వచ్చేది.
బయట జనాలు అందరికీ అవి కొన్నాం ఇవికొన్నాం... ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ లో చూపించాము అని చెప్పేవారు. వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకొనే వారు. నేనెళితే ఇంటి విషయాలు మాట్లాడుకోవాలి నువ్వు వెళ్ళు అనేవారు. జంబేష్ కూడా అదేంటి తాను ఈ ఇంటి మనిషేకదా అని అనేవాడు కాదు. అసలు అతనిలోనే ఆ ఫీలింగ్ లేదనిపించేది ప్రణవికి. అందరూ ఉండి ఒంటరిని అనే భావన ఆమెలో నిండిపోయింది. ఎందుకలా చూస్తున్నారో అర్థమయ్యేది కాదు.
ఓ సారి ...
"మేమడిగామని కాకుండా మీ పుట్టింటికెళ్ళి లక్ష రూపాయలు అడిగి పట్టుకురా" అని చెప్పాడు రాజన్.
నాకు తెలుసు వాళ్ళ ఆర్థిక స్థితి. పెళ్లయి నెల రోజులు కూడా కాలేదు. చాలా అప్పు చేసారు. ఇప్పుడు వాళ్ళనడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.."నేనలా అడగలేనండి" అంది ప్రణవి.
అంతే...
“మా మాటకు ఎదురు చెప్తావా? అత్తవారంటే లెక్కలేని తనం ...అని ఎగిరిపడి..ఇంటికొచ్చిన వారందరికీ పెడమనిషి.. మమ్మల్ని ఎదిరిస్తుంది. చదువుకున్నాను అనే అహంభావం” అంటూ చెప్పేవాడు రాజన్.
ఎవరూ ఆమెతో మాట్లాడేవారు కాదు.
"నేనేం తప్పు చేసానో? నాకు అర్థం కావట్లేదు." అనుకొంది ప్రణవి.
కొన్నాళ్ళు గడిచిపోయాయి. ప్రణవి కన్సీవ్ అయినట్లు తెలిసి ఎంతో సంతోషంగావెళ్ళి వాళ్ళకు చెబితే సహజమే కదా! అన్నారు. ఎటువంటి స్పందనా లేదు.
మా బావ గారు, మొట్టమొదటి సారిగా (వర్జిన్స్ అయితే) పుట్టే పిల్లలు పిచ్చి పిల్లలు పుడతారు. ఈ కడుపు తీయించేయాలి అని కూర్చొన్నారు.
అదేంటండీ తొలిచూలు సంతోషపడాల్సింది పోయి ఇలా అంటారు? అని అమ్మ అడిగితే..ఈయనేమో అన్నయ్యమాటే శాసనం. ఆయన చెప్పినట్లు చేయండన్నారు.
డాక్టర్ కి చూపించి మొదటి కలయికతో పుట్టే పిల్లలు పిచ్చి పిల్లలు గా పుడతారా అని అడిగింది అమ్మ.
ఎవరు చెప్పారండి మీకు? అబార్షన్ చేయించారంటే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటానంది.
రాజన్ కి చెప్తే పర్యవసానం నువ్వే అనుభవిస్తావు అన్నాడతను. కారణం లేకుండానే గొడవలు. ప్రణవి వాళ్ళను మెప్పించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. తన ప్రయత్నాలు ఫలించలేదు. వాళ్ళు దేనిని తప్పు పడుతున్నారో కూడా తెలిసేది కాదు.
ఏ విషయాలు ప్రణవికి తెలియనిచ్చేవారు కాదు. ఆఖరుకు జంబేష్ కూడా అంతే. ఏ అర్థ రాత్రో అపరాత్రో దగ్గరకొచ్చినప్పుడు ఏదన్నా అడిగితే ఏం చెప్పేవాడు కాదు. 'పగలడుగు చెబుతా ననేవాడు'. పగలు అసలు వంటరిగా దొరికేవాడు కాదు. ఒకవేళ ఎప్పుడన్నా దొరికినా 'ఏమో నాకు తెలియదు. ఒదిననడుగు' అనేవాడు. ఆవిడ నడిగితే 'నాకు తెలియదు' అని చెప్పేది.
"ఏంటి ఇంటి విషయాలు వాళ్ళనడుగుతున్నావంట. ఏదైనా ఉంటే నన్నడుగు. పెళ్లయిన వెంటనే నీకు అన్ని విషయాలు చెప్పేస్తారే. నిన్ను పరీక్షించి మాకు నమ్మకం చిక్కాక చెబుతాం. అప్పటివరకు ఎవర్నీ ఏమీ అడగక' అన్నాడు రాజన్.
జంబేష్ పనులన్ని రాణి చూసుకొనేది. ప్రణవి అడిగినా చేయనిచ్చేవారు కాదు. ఎప్పుడన్నా తప్పీదారి ఇచ్చినా
"నా పనులు నువ్వు ఎవరివి చేయటానికి? నువ్వు చేస్తే నేను తినను" అనేవాడు జంబేష్.
ప్రణవి వంట చేస్తే ఆ రోజు ఆ ఇంట్లో ఎవరూ తినేవారు కాదు. ప్రణవి వంట బాగానే చేస్తుంది. అయినా వాళ్ళు అలా తినకపోయేసరికి బాధేసేది. కనీసం రుచి చూసి బాలేదు అన్నా అదో దారి అనుకొనేది ప్రణవి.
మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు
"ఇదుగో అమ్మాయ్. ఆ అంట్లన్నీ తోమి, ఆ గుడ్డలు ఉతికి విస్త్రీ చేయి. వాళ్ళ కంటపడకుండా చేయి" అని చెప్పేవారు ప్రణవి అత్త.
పని చెప్పడమే మహాభాగ్యంగా అన్ని పనులు చేసేది ప్రణవి. ప్రణవి పనులు చేస్తూ ఉంటే అత్తా,కోడలు కబుర్లు చెప్పుకొనేవారు. మగవాళ్ళు వచ్చేసరికి వాళ్ళు పనులు చేసేవారు.
ఎంత చేసినా వారికి చేరువ కాలేకపోయింది ప్రణవి. మూడోనెల కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి గెంటేశారు. ఎవరూ రాలేదు చూడలేదు. ప్రణవి మానసికక్షోభ ఇంతా అంతా కాదు. కారణం తెలియని బాధ.
ఆంజనేయులు గారికి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. అప్పుడు ప్రణవి అత్తింటి వారెవరు రాలేదు, చూడలేదు.
అందరూ బుగ్గలు నొక్కుకున్నారు. ప్రణవి లాంటి మంచి అమ్మాయికి వాళ్ళు తగరు అన్నారు.
డెలివరి అయ్యి ఆడపిల్లపుట్టిందన్నా వచ్చి చూడలేదు. పాపం ప్రణవికి గాని ఆ బిడ్డకి గాని జరగాల్సిన ముచ్చట్లు ఏమీ జరగలేదు.
పల్లెటూరు కదా! అక్కడ ఏం విషయాలూ దాగవు. అందులో ఆంజనేయులు మాష్టారంటే వారికి ప్రాణం. అందుకేనేమో ప్రణవి అత్తారింటి పరిస్థితి వాళ్ళు తెలుసుకోగలిగారు. అతను నీకు సరిజోడి కాదు విడాకులు ఇచ్చేయి అని సలహా ఇచ్చారు.
ఆడపిల్లను అకారణంగా ఇబ్బంది పెడితే ఊరుకుంటామా ఏంటి? పోలీస్ కేసు పెట్టండి ? మేమంతా వస్తామన్నారు? ఆ ఊరి సర్పంచ్.
సనాతన ధర్మాలను పాటించే ప్రణవి అందుకు ఒప్పుకోలేదు. "కష్టమైన నష్టమైన నా అత్తారిల్లే నాకు శాశ్వతం. ఆ ఇంటి కోడలిగా వారిని వీధిలోకి లాగడం భావ్యం కాదు. నేను ఒప్పుకోను." అనడంతో ఎవరూ ఏమీ చేయలేక పోయారు.
పుట్టిన పిల్లకు ఐదోనెల వచ్చాక గిరిజ, ప్రణవి తమ్ముడు కృష్ణా, ప్రణవిని ఆమె కూతురుని తీసుకెళ్ళి అత్తారింట్లోదించి వెళ్ళిపోయారు.
రచయిత్రి పరిచయం ..పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లికరచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.) పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు. బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’. సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు. |
“కొలిమి”లో ప్రణవి కష్టాలు, మానసిక
క్షోభ చదువుతుంటే…’ఈరోజుల్లో కూడా ఇలాంటి మూర్ఖులున్నారా?’ అనిపిస్తోంది.
రచయిత్రికి అభినందనలు!