Menu Close
sravanthi_plain
రచన – అయ్యగారి సూర్యనారాయణమూర్తి

వాడని కలువ

vaadani-kaluva
కం.
సితదళయుతకుముదము స్వ
చ్ఛతకున్ దర్పణము పట్టుఁ జంద్రాంశువులే
హితులై మేల్కొల్పఁగ సం
భృతమై ప్రేమొలుకుఁ గవుల కృతివర్ణనలన్[కలువకే కాదు, మానవ మానసిక స్థితిగతులకు, చంద్రునికి చాలా సన్నిహిత సంబంధం ఉంది]

వాడిన కలువ

vaadina-kaluva
కం.
వాడిన కలువ యిదే, యెట
వాడిన దిది కాదు, సత్తువనుఁ గడవఱకున్
వాడుచు సేవించినదే
వీడఁగ లే కిట్టు లొదిగె వికచం బయ్యున్

మా పొరుగింటివారి కొలనులోని ఆ కలువపువ్వు ఎంత అదృష్టానికి నోచుకుందోకదా. నా ఛాయాగ్రహణయంత్రానికి చిక్కి మీ ముందుకు వచ్చి, మీ సరసహృదయాలను తట్టింది.

ఇతివృత్తానికి వస్తే – ఈకవితకి మూలం సేవాభావం (సేవా+అభావం కాదు).

పద్యానికి బాహ్యార్థం - ఈ కలువ వాడిపోయిన పుష్పం అయినప్పటికీ, ఎక్కడా ఉపయోగింపబడినది కాదు. దాని స్వస్థానంలోనే (నీటి కొలనులో) అది ఉంది. దీనికి ఉన్న బలాన్ని చివరిదాకా ఉపయోగిస్తూ, చూసేవారికి తోడుగా ఉండి ఒకప్పుడు నయనానందం, హృదయోల్లాసం అనే సేవలు అందించినదే, ఇప్పుడు ఆ సేవలు పొందినవారిని (చూపరులను) వదిలి వెళ్ళలేక, విప్పారి మరీ ఈ విధంగా ఆలంబన కోసం అక్కడే ఉన్న గట్టు మీద వాలి ఇంకా సేవిస్తోంది.

పద్యం లోని అంతరార్థం – అసలు సిసలైన సేవకి జవసత్వాలతో పనిలేదు; అందించేవారి ప్రాణమున్నంతవరకు ఆ సేవ సాగుతూనే ఉంటుంది. దాన్ని అందించే విధానంలో మార్పు వస్తుంది కాని, భావంలో కాదు.

వీడిన కలువ

veedina-kaluva
చం.
ముగిసెను దీని జీవితము మోదము గూర్చిన జన్మ మంతమై,
పొగిలెడు మానసంబు; కనఁ బొంగుచు వచ్చుఁ దరంగవేదనల్,
మిగిలెను తీపి సంస్మృతులె మిత్రునిఁ బాసినరీతి నేలకో?
తగునని లేచి నా దయిన ధర్మముగాఁ గవితాంజ లెత్తితిన్
Posted in November 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!