పెద్దలమాట
కృష్ణానంద బడికి దసరా సెలవలిచ్చారు. సాయంత్రంవేళ ఎప్పటిలాగే తన స్నేహితులతో ఆడుకునేందుకు తమ ఊరిలోని మైదానానికి వెళ్ళాడు కృష్ణానంద.
అక్కడ తేజ అనే పిల్లవాడు తన స్నేహితుడితో ఏవో కబుర్లు చెబుతూ, "ఒరేయ్! నేను నిన్న ఒక కథ విన్నానురా! అందులో మనలాంటి ఒక పిల్లాడికి ఒక గుహలో బోలెడు నగలూ, డబ్బులూ దొరుకుతాయ్!! మన ఊరి చివర ఒక కొండ ఉంది కదా?! ఆ కొండలో ఒక గుహ ఉంది. మనం అక్కడికి వెడదాం. వెళ్ళి ఆ గుహలో ఎవరైనా డబ్బులు కానీ నగలు కానీ దాచుకున్నారేమో చూసి, ఒకవేళ ఉంటే వాటిని మనం ఎంచక్కా పంచుకుందాం. సరేనా?", అని అన్నాడు.
తేజ అంటున్న మాటలు విని కృష్ణానందతో సహా అక్కడ ఆడుకుంటున్న పిల్లలంతా ఆశ్చర్యపోయి, తేజ గుహ గురించి ఇంకా ఏం చెప్తాడోనన్న ఆతృతతో అతడి చుట్టూ మూగారు.
తేజ పిల్లలందరివంకా ఒకసారి చూసి, "ఏంటీ? మీరంతా కూడా మాతో గుహలోపలికొస్తారా?", అని అడిగాడు.
కొందరు పిల్లలు ఉత్సాహంగా, "ఓ! మేము కూడా మీతో వస్తాం!", అన్నారు. మరికొంతమంది ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయారు.
అప్పుడు కృష్ణానంద, "అమ్మో! ఆ గుహకు వెళ్ళొద్దని మా బామ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. నేను మాత్రం అక్కడికి రాను!", అని అన్నాడు.
"పెద్దవాళ్ళెప్పుడూ అంతేరా! మన గురించి ఎక్కువగా కంగారు పడిపోతూ మనల్ని భయపెట్టేస్తూ ఉంటారు. అందుకే కొన్ని పనులు వాళ్లకి చెప్పకుండా చేసేస్తే మనకు ఏ గొడవా ఉండదు. గుహకు వెడుతున్న సంగతి మీ ఇంట్లో చెప్పకుండా మాతోపాటూ వచ్చెయ్! మేమంతా నీకు తోడుంటాముగా!", అన్నాడు తేజ.
"లేదురా! మా బామ్మ ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తుంది. ఆ గుహలోకి వెళ్లడం మంచి పని కాదు. నేను రానంతే!", అని తన నిర్ణయం చెప్పేశాడు కృష్ణానంద.
"సర్లేరా! నీలాంటి పిరికివాళ్ళను నాతో తీసుకెళ్ళడం నాక్కూడా ఇష్టం లేదులే! నువ్వు పోయి మీ బామ్మతో కూర్చో!", అంటూ హేళనగా మాట్లాడి పగలబడి నవ్వాడు తేజ.
కృష్ణానంద మరేమీ మాట్లాడకుండా ఇంటికి బయలుదేరాడు.
"ఒరేయ్ తేజ! పెద్దలను గౌరవించడం మన ధర్మం. వాళ్ళను గౌరవించడమంటే వాళ్ళ మాటను వినడమే కదా! గుహకు వెళ్లడంలాంటి సాహసాలు చెయ్యకపోవడమే మంచిది. నేను కూడా కృష్ణానందతో వెడుతున్నా!", అంటూ కృష్ణానందను అనుసరించాడు కృష్ణానంద స్నేహితుడు త్రిభువన్.
మర్నాడు సాయంత్రం తేజ కొంతమంది పిల్లలతో కలిసి ముందురోజు అనుకున్న ప్రకారం కొండమీదున్న గుహలోకి వెళ్ళాడు. గుహలోపలంతా చిమ్మ చీకటిగా ఉంది.
దాంతో కొందరు పిల్లలు, "ఈ చీకట్లో గుహలోపలికి రావడం మావల్ల కాదు! మేము ఇంటికి వెళ్ళిపోతామురా!", అంటూ గుహ బయటకు పరుగు తీశారు.
"సరే! ధైర్యం లేనివాళ్ళంతా ఇంటికే పొండి! మాకు గానీ గుహలో ఏమైనా దొరికితే అది మీకు అస్సలు ఇవ్వం!”, అంటూ తేజ మిగిలిన పిల్లలతో కలిసి గుహలో మరికొంత దూరం తడుముకుంటూ వెళ్ళాడు.
అలా ఒక నాలుగడుగులు వెయ్యగానే తేజ చెయ్యి ఒక తేనె తుట్టెకు తగిలి అందులోని తేనెటీగలు ఒక్కసారిగా 'జుయ్' అంటూ బయటకు వచ్చేశాయి. తేజతో సహా పిల్లలందరూ ఏవో పురుగులు తమను కుట్టడం మొదలుపెట్టాయని అనుకుంటూ వేగంగా గుహ బయటకు వచ్చేశారు. కానీ అప్పటికే తేనెటీగలు వాళ్ళ ముఖంపైనా, చేతులపైనా కుట్టేశాయి!
"అబ్బా నొప్పి! అమ్మో మంట!", అని ఏడుస్తూ పిల్లలంతా ఎవరిళ్ళకు వారు చేరుకున్నారు. పిల్లలను చూసిన వారి తల్లిదండ్రులు ముందు కంగారు పడి, వైద్యం చేయించి, ఆ తర్వాత తమకు చెప్పకుండా కొండ గుహలోకి వెళ్ళినందుకు చివాట్లతో వారికి బుద్ధి చెప్పారు. తేజను వాళ్ళింట్లోని పెద్దవారంతా కాస్త గట్టిగానే మందలించారు.
విషయం తెలుసుకున్న త్రిభువన్ కృష్ణానంద వద్దకు వెళ్ళి, "మీ బామ్మ మాట వినడం మంచిదయ్యిందిరా! లేకపోతే మనం కూడా ఆ తేనెటీగల బారిన పడేవాళ్లం!", అన్నాడు కృష్ణానందతో.
"అందుకే నేనెప్పుడూ మా పెద్దవాళ్ల మాటను వింటానురా. అది మనకు మంచి చేస్తుందని నాకు తెలుసు!", అన్నాడు కృష్ణానంద.
వీరి సంభాషణను విని జరిగినది అర్థం చేసుకున్న ప్రసూనాంబ, "పిల్లలూ! పెద్దలమాట చద్ది మూట అని ఊరికే అన్నారా? పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది వారు అనుభవంతో సంపాదించిన జ్ఞానంతో చెప్తారు! అందుకే పెద్దలమాట వినపకపోతే తిప్పలు తప్పవు. వింటే మాత్రం ఆనందం మీ సొంతమైనట్లే!", అంటూ ఆ రోజు అమ్మవారికి నివేదించిన పూర్ణంబూర్లూ, బొబ్బట్లూ కృష్ణానందకూ, త్రిభువన్ కూ ప్రసాదంగా ఇచ్చింది ప్రసూనాంబ.
తన పళ్లెంలోని ప్రసాదంవంక చూసి, “నువ్వన్నది నిజమే బామ్మా! ఆ గుహలో నిజంగా డబ్బులూ, నగలూ దొరికినా నాకు ఇంత ఆనందం కలిగేది కాదేమో!", అంటూ ఒక తియ్యటి బొబ్బట్టు ముక్కను కమ్మటి నేతిలో ముంచి నోట్లో వేసుకుని, ఆ రుచిని ఆస్వాదిస్తూ మైమరచిపోయాడు కృష్ణానంద!