Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

కోనసీమలో ప్రవేశించగానే యాజులు తాతయ్య, తన జన్మభూమిని గురించి చెప్పిన కథ గుర్తు వచ్చింది జీవన్ కి. బస్సు నడుస్తుండగా సర్వ సంవృద్ధితో నిండివున్న పరిసరాలను చూస్తూ, కాటన్ పుణ్యమా - అని, కోణసీమకూ కోనసీమకూ మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని తలుచుకుని ఆశ్చర్యపోయాడు జీవన్. ఎటు చూసినా కొబ్బరి, మామిడి, అరటి  తోటలు; వరి, చెరకు పొలాలు, ఇంకా ఎన్నో రకాలైన చెట్టు చేమలతో, ఎటుచూసినా కనిపించే హరిత సౌoదర్యమే కోనసీమ!

గోధూళి వేళ కావడంతో పశువుల కాపర్లు, గడ్డిబీళ్ళకు తోలుకెళ్ళిన పాడిపశువుల్ని ఇళ్ళకు మళ్ళించారు. దారికి అడ్డుపడే పశువుల మందలవల్ల బస్సు వేగం తగ్గింది. అయినా జీవన్ దిగవలసిన చోటు శీఘ్రంగానే వచ్చేసింది. శివాలయం పక్కనున్న రావిచెట్టు దగ్గర ఆగింది బస్సు. దిగవలసిన చోటు వచ్చిందని కండక్టర్ హెచ్చరించడంతో జీవన్ బస్సు దిగాడు. ఆపై బస్సు వెళ్ళిపోయింది. ఇంక అక్కడనుండి జీవన్ మల్లెవాడ వెళ్ళవలసి వుంది. ఎవరైనా కనిపిస్తే దారి అడగాలనుకున్నాడు. కాని, పక్కనే దేవాలయం కనిపించే సరికి దైవదర్శనం చేసుకుందా మనిపించి గుడిలోకి నడిచాడు పెట్టె పట్టుకుని.

దేవాలయంలోని స్వామి మహాశివుడు! ప్రదోషవేళ కాబోతూండడంతో, పూజకు ఏర్పాట్లు చేసుకుంటూ పూజారి గుడిలోనే ఉన్నాడు. గుడిలోని పున్నాగ చెట్లక్రింద రాలిన పూలు ఏరుకుంటూ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. బయట చెప్పులు విడిచి, నూతిదగ్గర కాళ్ళుకడుక్కువచ్చి, విభూతి నొసట పెట్టుకుని, గర్భగుడికి ఎదురుగా ఉన్న గంట కొడుతున్న జీవన్ ని, ఊరికి కొత్తగా వచ్చిన మనిషిగా గుర్తించి పలకరించాడు పూజారి...

"ఊరికి కొత్తా? ఏ ఊరు బాబూ మనది" అని అడిగాడు పూజారి.

ఆయనకి వినయంగా నమస్కరించి, "ఔనండీ, కొత్తే! ఇప్పుడే బస్సు దిగాను" అంటూ తన ఊరూ పేరూ చెప్పి, తను మల్లెవాడ వెళ్ళవలసి ఉందని కూడా చెప్పి దారి అడిగాడు జీవన్.

పూజారికి చాలా ఆనందమయ్యింది. ఒక పట్నం కుర్రాడు తనతో ఇంత వినయంగా మాట్లాడుతాడనీ, తనకు నమస్కరిస్తాడనీ అసలు అనుకోలేదు ఆయన. జీవన్ మీద ఆయనకు సదభిప్రాయం ఏర్పడింది. వెంటనే, "దీర్ఘాయుష్మాన్ భవ! ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు" అని మనసారా దీవించాడు ఆ పూజారి. అంతేకాదు, అతనికి మల్లెవాడ వెళ్ళే సులువైన దారికూడా చెప్పాడు...

"ఇదిగో బాబూ! మల్లెవాడ ఇక్కడనుండి వెళ్ళాలంటే రెండు దారులున్నాయి. ఒకటి - చుట్టుదారి. బండెక్కి, మీరు వచ్చిన రోడ్డు వెంట కొంతదూరం వెనక్కివెళ్ళి. ఆపై పక్కకి తిరిగి వేరే రోడ్డుమీడుగా వెళ్ళాలి. ఇకపోతే రెండవది దగ్గరదారి. కాలవ గట్లవెంట, పొలాలకు అడ్డంపడి వెడితే సుమారు మూడు మైళ్ళు ఉండొచ్చు. కాని నడవాలి మరి. నువ్వు పెట్టెపట్టుకుని నడవగల్గితే చెప్పు, ఆ ఊరి ఆసామీ ఒకడు ఇక్కడకు వచ్చాడు. కొడుక్కి సుస్తీ చేస్తే ఆ అబ్బాయికి నయం కావాలని పూజ చేయించడానికి వచ్చాడు. నువ్వు, "సరే!" అంటే, అతన్ని జతచేసి పంపిస్తాను. పూజా సామగ్రి తేడానికి వెళ్ళాడు, కాసేపట్లో వచ్చేస్తాడు."

ఆ మాట వినగానే, "నడిచి వెళ్లడంవల్ల ఆ ప్రాంతపు నైసర్గిక స్వరూపం చక్కగా చూడవచ్చు. పెట్టెలో మూడు జతల బట్టలు, ఒక తువ్వాలు తప్ప మరేమీ లేవు. మూడు మైళ్ళైతే నేను తేలిగ్గా నడవగలను, ఆపాటి దూరం రోజూ నేను ఆరోగ్యం కోసమని నడుస్తూనే ఉంటా కదా" అనుకున్న జీవన్ కి చాలా సంతోషమయ్యింది. వెంటనే నడిచి వెళ్ళడానికి ఒప్పేసుకున్నాడు.

"ఇంతకీ ఆ ఊరు ఏం పనిమీద వెడుతున్నావు బాబూ? బంధువుల ఇంటికా?"

"నాకని బంధువులెవరూ లేరండి అక్కడ. తెలిసినవారి పనిమీద అక్కడకి వెళ్ళాల్సివచ్చింది. వాళ్ళకి తెలిసిన వాళ్ల ఇంటికి వెడుతున్నా. ఎప్పుడూ నే నీవైపుకి వచ్చిన వాడిని కాను, అంతా కొత్తగా ఉంది."

గుడి పనులు చేసుకుంటూనే మాటాడుతున్నాడు పూజారి, మండపంలో స్తంభానికి ఆనుకుని కూర్చుని విశ్రాంతి తీసుకుంటూనే పూజారితో కబుర్లు చెపుతున్నాడు జీవన్. అంతలో పూజాసామాగ్రి తీసుకుని మల్లెవాడ ఆసామీ రానే వచ్చాడు. అతని పేరు రామారావు.

పూజారిగారు జీవన్ గురించి తనకు తెలిసున్నదంతాచెప్పి, రామారావుని మల్లెవాడ చేరేందుకు అతనికి సాయం చెయ్యమన్నారు.

వెంటనే, "ఆయ్! అలాగేనండి" అంటూ పూజారికి మాటిచ్చి, రామారావు జీవన్ ని మల్లెవాడ చేర్చే పూచీ తనమీద వేసుకున్నాడు.

పూజారి జీవన్ ని గోత్రనామాలు అడిగి, అతని పేరుమీద కూడా అర్చన చేశాడు. పూజచేసి, ఇద్దరికీ తీర్థప్రసాదాలు ఇచ్చాడు ఆయన. ఇద్దరూ చెరో పదిరూపాయలు పళ్ళెంలో ఉంచి శఠగోపం పెట్టించుకుని, శివ నిర్మాల్యాన్ని అందుకుని పూజారివద్ద శలవు తీసుకున్నారు.

శివుని గుడిలోని నిర్మాల్యాన్ని(శివునికి పూజచేసిన మారేడుదళాలూ వగైరా) దగ్గర ఉంచుకోకూడదని తల్లి ఎప్పుడో చెప్పిన మాట గుర్తువచ్చి, పూజారి శివునికి పూజచేసి ఇచ్చిన మారేడు దళం నందిమీద ఉంచి, పెట్టె అందుకున్నాడు జీవన్.

రామారావుకి శలవిస్తూ పూజారిగారు, ''శుభమస్త!" అని దీవించి, "రామారావుగారు! ఇంటికెళ్ళగానే “ఓం, నమః శివాయ”అని శివనామం జపిస్తూ, విభూతి అబ్బాయి నొసటను పెట్టండి. ఈ రాత్రికి మీ అబ్బాయికి జ్వరం తగ్గి, తెల్లారేసరికల్లా లేచి తిరుగుతాడు. ఇంక దిగులుతో పనిలేదు" అంటూ భరోసా ఇచ్చారు. ఆయనకి మళ్ళీ నమస్కరించి, రామారావు తిరుగు ప్రయాణమయ్యాడు.

దేవాలయం మెట్లు ఇంకా పూర్తిగా దిగకముందే రామారావు జీవన్ చేతిలోని పెట్టెను అడిగాడు, తను తీసుకువస్తా ఇమ్మనంటూ...

"మీరు మా ఊరువస్తే శాను, మా ఇంటికి వచ్చినట్లేనండి, ఆయ్! ఇంటికాడి కొచ్చిన చుట్టాలు ఎవరి సామాను ఆరే మోసుకుంటే ఇంక మేముండి లాబమేంటండీ, ఆయ్!"

బలవంతంగా జీవన్ చేతిలోని పెట్టెను రామారావు అందుకున్నాడు.

జీవన్ కి అది నచ్చలేదు. కాని యాజులుగారు వచ్చే ముందు చెప్పి పంపారు, "పల్లెవాసులు చేసే మర్యాదల్ని మనం కాదంటే వాళ్ళు చాలా కష్టపెట్టుకుంటారు, వద్దనకుండా భరించాలి మనం" అని. ఆయన చెప్పింది గుర్తొచ్చి రామారావుకి పెట్టె ఇచ్చేశాడు జీవన్.

వాళ్ళు రోడ్డు మీద కొంత దూరం వెళ్లి పక్కకు మళ్ళి పొలం గట్లవెంట మరికొంత దూరం నడిచాక, ఒక కాలవగట్టు ఎక్కారు. కాలవ గట్టు వెంట ఒక అరకిలోమీటరు దూరం వెళ్ళాక, కాలవకి అడ్డంగా ఒక కొబ్బరి దుంగ వెయ్యబడి ఉంది. దానిమీద, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి రామారావు పెట్టెతోసహా, అవలీలగా దాటి వెళ్ళిపోయాడు. కాని జీవన్ కి కాలువలో పడిపోతానేమో నని భయం వేసి, ఈవలి ఒడ్డునే నిలబడిపోయాడు.

"అబ్భాయిగారూ! మరేం ఫర్లేదండి, వచ్చెయ్యండి. ఇదేమీ పెద్ద పడవల కాలువేం కాదండి, ఆట్టే లోతుండదండి, పొలాలకు నీరు తీసుకెళ్ళే పంటకాలువండిది, ఆయ్! దృష్టి దుంగమీదే పెట్టి జాయ్ గా, దారినే చూసుకుంటూ వచ్చెయ్యండి. ఇది చాలా చిన్నకాలువ. పంట కాలువకి తక్కువ, బోదికాలవకి ఎక్కువ! మేం దీన్ని రేవటికాలువ - అంటామండి, ఆయ్!"

ఆవలి ఒడ్డుకి వెళ్ళాక, తానెందుకంత భయపడ్డాడో తనకే తెలియలేదు జీవన్కి. పైకిమాత్రం, "ఈ దుంగమీద నడవడం చేతకాక పడితే, బట్టలు తడుస్తాయని భయమేసింది" అన్నాడు రామారావుతో. ఇద్దరూ ఆవలి ఒడ్డు మీదుగా నడక సాగించారు.

కొంతదూరం వెళ్ళాక, వాళ్ళ ఇద్దరిమధ్య సాగుతున్న మౌనానికి ఫుల్ స్టాప్ పెట్టాడు రామారావు.

"ఔనుగాని, అబ్బాయిగారు! తమరు ఎంతవరకూ చదూకున్నారండి" అని అడిగాడు.

"లెక్కలతో కాలేజి చదువు పూర్తిచేశాను" అన్నాడు జీవన్ టూకీగా.

"లెక్కలంటే - వడ్డీ లెక్కలు, సగటు, సరాసరి, బద్దింపు లెక్కలు, ఇంకేంటంటే కాలమూ- దూరమూ - ఇలాంటి లెక్కలేనాండి?",

"ఇవి నేర్చుకోడం హైస్కూల్లో ఐపోతుంది. కాలేజీల్లో ఇంకొంచెం పెద్దతరహా లెక్కలు నేర్పుతారు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ... ఇలా కొన్నిరకాలు... ఇవికాక ఇంకా పై తరహా లెక్కలు కూడా ఉన్నాయి. ఆ లెక్కలు విమానాలు, రాకెట్లు లాంటివి నడిపేటప్పుడు ఉపయోగిస్తాయి! చదువుకు ఆదేగాని, అంతంలేదండి!"

"అయ్యబాబోయ్! అయ్యన్నీ మాకెందుకండి! అంత చదువు చదవడానికి ఎంతో పెట్టిపుట్టాలి. నా చిన్నప్పుడు నేను బద్దింపు లెక్కలు రాక నానా తిప్పలు పడేవాణ్ణి, ఆయ్. తమరు లెక్కలతో చదివారంటే శానా  బోలెడు అదృష్టవంతులండి."

"ఇంకా ఇంకా పై చదువులు చాలా ఉన్నాయండి రామారావుగారు! వాటితో పోలిస్తే నా చదువెంతమాత్రం పెద్దది కాదు. అలాంటి పెద్ద చదువులు, నిజంగానే ఎవరో పెట్టిపుట్టిన వాళ్లకు తప్ప వాటిని చదువుకొనే అదృష్టం అందరికీ కలగదు."

"ఆయ్! నిజమేనండి. మా ఊరి మిడిలుస్కూలు చదువైపోగానే, మా అయ్య, పక్కూరుపోయి చదూకుంటానని ఎంత చెప్పినా వినకుండా, నన్ను యవసాయంలో పెట్టేశాడండి. అప్పటినుండి ఎడ్ల ఏనకాతల పడి తిరుగుతూ, "ప్పప్పప్పా - ఎడ్డెడ్డే " అనుకుంటూ ఈ యవసాయం చేస్తానే ఉన్నా. అదే నా బతుకుతెరు వైపోయిందండి, ఆయ్ !" అన్నాడు రామారావు కసిగా.

"మీకు ఏపాటి వ్యవసాయం ఉంది? గిట్టుబాటుగా ఉంటుందా?"

"అబ్బే! ఎంతో లేదండి, ఓ పదెకరాల మాగాణి, ఐదెకరాల కొబ్బరితోట ఉన్నాయండి. అదికాక మరో మూడెకరాల బంజరుందండి . ఇకపోతే, చిన్న చిన్న పళ్ళతోటలు, ఇళ్ల స్థలాలు కొన్ని ఉన్నాయండి. ఈ సంవత్సరం బంజరులో జీడిమామిడి తోట వెయ్యాలని ఉందండి, ఆయ్!  అలా బంజర్లు ఊరికే పడి ఉంటే ఊరికే అరిష్టం అన్నారండి మా మేజరుగారు. ఇక కిట్టుబాటు సంగతి చెప్పాలంటే శానా కథ ఉందండి - ఒకోసారి అతివృష్టి, మరోసారి అనా వృష్టి! ఏటా ఏటా గాలివానలు! గాలివాన వస్తే పెట్టుబడికూడా దక్కదండి. ఒకోసారి ధరలు కిట్టుబాటుగా ఉండవండి, వ్యవసాయమంటే కష్టమే కాదు, ఖర్చు కూడా శానా ఉంటుందండి. ఎరువులు, పురుగులమందులు గట్రా ఎకరా కింతని కావాలండి. అలా బోలెడు సొమ్ములుపోసి కొన్నా, అన్నప్పుడు నిఖార్సయిన సరుకు దొరుకుతుందన్న గేరంటీ లేదండి. ఆయ్! దళారులకు దక్కినంత కూడా ఏడాదీ కష్టపడ్డ వాడికి దక్కనప్పుడు ఎందుకొచ్చిన యవసాయమండీ! నేను నా పిల్లల్ని పై చదువులు, ఎంతకష్టమైనా చదివించి, ఉద్యోగస్థుల్ని చేస్తానేగాని, కులవృత్తికి పెద్దపీటవేసి, ఎంతమాత్రం యవసాయంలో పెట్టనండి! ఎందుకొచ్చిన యవసాయమండి, కూటికా, గుడ్డకా?" గాఢంగా నిటూర్చాడు రామారావు.

"అందరూ అందలం ఎక్కితే మోసీవారెవరు" అన్న సామెత గుర్తొచ్చింది జీవన్ కి. అందరూ ఉద్యోగాలు చేసి అలసి వస్తే, మరి మనకి అన్నదాత లెవరు? ఇది చాలా పెద్ద ప్రశ్న!

"అలా అనకండి రామారావుగారు! ఏ వృత్తీ కూడా ఈ వ్యవసాయానికి సాటిరాదు. ఏ పనినైనా తీసి పారేయ్యవచ్చునేమోగాని, తిండిపెట్టి మనిషిని పోషించే పనిని మాత్రం తక్కువ చెయ్యకూడదు. మీ కృషిని సరిగా అర్ధం చేసుకుని తగిన గౌరవాన్నిచ్చే మంచిరోజు త్వరలోనే రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను" అన్నాడు జీవన్ ఎలుగు రాసిన కంఠస్వరంతో.

భావోద్వేగంతో ఇద్దరూ కూడా మాట్లాడలేకపోయారు. కొంతసేపు అలాగే మౌనంగా నడిచారు.

అకస్మాత్తుగా దూరం నుండి, "ఒహోహోహోహోయ్" అన్నకేక వినిపించింది. ఆ కేక విన్న రామారావు ఆగి, కేక వచ్చిన దిక్కుగా తిరిగి చూశాడు. దూరంగా పచ్చని వరిచేను గట్టుమీదుగా వేగంగా నడిచి వస్తున్న మనిషి ఒకరు కనిపించాడు. అదే తీరుగా రామారావు కూడా ఆ కేకకు బదులిచ్చాడు.

ఆ ఇద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డ జీవన్ ని ఉద్దేశించి చెప్పాడు రామారావు...

"ఆయబ్బి మా రంగనాధం మామయ్యండి! అలాని మా సొంత మామయ్యేం కాడండి, అసలుమా కులపోడు కూడా కాడండి. ఏ కులమైతేనేం, మంచోడు, పెద్దమనిషి - అందుకని మేమంతా "మామ" అంటామండి. దూరానికి మనిషి రూపు సరిగా తెలియకపోయినా ఆ గొంతుకు గుర్తేనండి, ఆయ్ ! మేము అలాగే ఒకళ్ళ ఉనికి ఒకళ్ళకు చెప్పుకుంటామండి. గాలి వాలున ఈ కేక శానాలెక్క వినిపిస్తాదండి. స్వరాన్నిబట్టి కేక ఎవరిదో తెలుస్తుంది. దీన్ని "పొలంకేక" అంటామండి. పొలంలో పనులు చేసుకునేటప్పుడు ఎవరెక్కడున్నారో ఇలా కేకేసి తెలుసుకుంటుంటామండి, ఆయ్."

ఇంతలో రంగనాధం సమీపించాడు. రంగనాధం వయసులో రామారావు కంటే చాలా పెద్దవాడు. అరవైకి పైబడినా, కాయకష్టం చేస్తున్న శరీరం కావడంతో, ఇంకా శరీరదారుఢ్యం ఏమాత్రం సడలలేదు. నిలువెత్తు మనిషి! దృఢంగా పెరిగిన కండరాలతో రాజసంగా ఉన్నాడు. జుట్టుకూడా తిలతండుల న్యాయంగా - సగం సగంగా నెరిసింది. తలవెనుక ముచ్చటముడి ఉంది. తెల్లని మీసాలు బుగ్గలమీదికంతా పెరిగి ఒంపు తిరిగి ఉన్నాయి. చెవులకు ఒంటిరాయితో ధగధగా మెరుస్తున్న తమ్మంట్లు ఉన్నాయి. పొలంపని మధ్యలో వచ్చాడేమో మోకాళ్ళవరకు ధోవతి కట్టుకుని, అరచేతుల చొక్కా వేసుకుని ఉన్నాడు. తలకి తలపాగాగా తువ్వాలు చుట్టి ఉంది. అతనివైపు చూసి జీవన్ "రూపుగొన్నకృషీవలుడు" గా గుర్తించాడు."అన్నదాతా! సుఖీభవ" అని మనసులోనే అనుకుని, అతనికి భక్తిగా నమస్కరించాడు జీవన్.

వెంటనే ప్రతినమస్కారం చేశాడు రంగనాధం. "ఈయనెవర్రా, అబ్బయా? ఊరికి కొత్తలావుంది. ఎవరి తాలూకు" అని అడిగాడు, జీవన్ వైపు చూస్తూ.

"కరణంగారి చుట్టాలు. పట్నం నుండొచ్చారు. గుడికాడ దసుకులయ్యారు. దారి తెలవదంటే ఎంటెట్టుకొస్తున్నా."

"అలాగా! తవరి పేరేంటండి అబ్బాయిగోరు! పట్నంలో తమరేం చేస్తూంటారండి?" నడుస్తూనే మాటాడుతున్నాడు రంగనాధం.

"రెడ్డొచ్చె మొదలాడు" అన్నట్లు మళ్ళీ అదంతా ఏకరువు పెట్టాలేమోనని భయపడ్డాడు జీవన్. కాని ఆ బాధ్యత స్వయంగా రామారావు తీసుకున్నాడు.

"ఈయన పట్నంలోని పెద్ద కాలేజీలో చదివారు. ఈయనకి విమానాలు నడిపే పెద్దపెద్ద లెక్కలు తెలుసునంట ..."

అంతా అతిశయోక్తి! తాను అతనికి చెప్పినదేమిటి, ఆతను ఇతనికి చెపుతున్నదేమిటి!

ఏం మాటాడడానికీ తోచలేదు జీవన్ కి.

ఇంకా రామారావు మాట పూర్తవ్వకముందే అందుకున్నాడు రంగనాధం, "తమర్ని చూస్తేనే తెలిసిపోద్దండి - తమరు శానా గొప్పోరని! కరణంగోరు తమరి కేమౌతారండి? తమ రిక్కడ నాల్రోజులు ఉంటేనే బాగుంటాదండి. ఆయ్ !"

ఇలా దారిపొడుగునా రంగనాధం ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. జీవన్ ఓపిగ్గా వాటికి జవాబులివ్వక తప్పలేదు. యాజులుగారి పనిమీద వచ్చినట్లు తెలిసి రంగనాధం పాత జ్ణాపకాలతో ఉప్పొంగిపోయాడు ...

"అద్గదీ మాట! ఐతే అబ్బాయిగోరూ, తమరు ఈ ఊరు వచ్చింది యాజులుగోరి పనిమీదాండి! బాగా చిన్నతనంలో మేమిద్దరం "గూటీబిళ్ళ" అడేటోళ్ళం. ఆయనకా కర్రా - బిళ్ళా ఎప్పుడూ నేనే చెక్కి ఇచ్చేటోణ్ణి. ఆ తరవాత కూడా చిన్నప్పటి స్నేయితం మర్చిపోకుండా ఎప్పుడు కనిపించినా నోరారా పలకరించేటోరు! ఎలాగైనా ఆయన తీరే వేరు. ఆయన ఊరువిడిచి వెళ్ళిపోయాక ఊరికి కళే లేకుండా   పోయింది." నిట్టూర్చాడు రంగనాధం.

కాలువ మీదుగా వస్తున్న చల్లని నీటిగాలి నడకలోని శ్రమని తెలియనీకుండా చేస్తోంది. పంట కాలువకి అటూ ఇటూ కనుచూపుమేర వ్యాపించి ఉన్నాయి వరిపొలాలు. వాటిలో కొన్ని, తక్కువ కాలవ్యవధిలో పండే వరివంగడాలు కాబోలు, అప్పుడే పువ్వారంతో ఉన్నాయి. పైరుగాలికి వాటి పువ్వారం పైకి లేస్తోంది. గాలి తగ్గగానే ఆ పరాగం మళ్ళీ క్రిందకు దిగి, వేరే కంకులపైనపడి వెంటనే  పరాగసంపర్కమై, నెమ్మదిగా పాలుపోసుకుని వరికంకులు రూపుదిద్దుకుంటున్నాయి.

పెట్టె కొంతసేపు రంగనాధం మోశాడు. దారిలో ఎదురుపడ్డ ప్రతి ఒక్కరూ, ఎంతో ఇదిగా జీవన్ ని గురించి - ఎవరింటికి వచ్చారు, ఏం పనిమీద వచ్చారు, ఎన్నా ళ్లుంటారు  వగైరా వివరాలను అడగసాగారు. ఒకసారి రామారావు, ఒకసారి రంగనాధం తనగురించి చెపుతున్న విశేషాలు విని నవ్వుకోడం తప్ప ఇంకేం చెయ్యాలో తెలియలేదు జీవన్ కి. ఇక, యాజులుగారి పనిమీద వచ్చారంటే జనం ఆయనని తలుచుకునీ తీరు, వాళ్ళకి ఆయన మీదున్న గౌరవానికి ప్రతీకగా ఉంది. వేరేచోటికి వెళ్లి ఇన్నేళ్లయినా కూడా ఆ ఊరి జనం ఎంతో ఆప్యాయంగా ఆయనగారిని తలుచుకుంటున్నట్లు యాజులు తాతయ్యకి చెప్పాలి అనుకున్నాడు జీవన్.

"తమరు యాజులుగారి తాలూకాండి, దండాలండి! ఆ మారాజుకే రావాలా ఆ మాయదారి జబ్బు! అదొచ్చి ఆయనని ఊరుకి దూరంగా తీసుకుపోయింది. ఆ మారాజు ఊరు విడిచి వెళ్ళాక, ఊరి కళే పోయిందండి. అవసరంలో ఉండి వెడితే ఉట్టి చేతులతో పంపీవారు కాదు ఎవరినీ ఆ మారాజు!"

ఊరువిడిచి ఇరవై ఏళ్ళయినా ఇంకా, చేసినమేలు మర్చిపోకుండా ఆయనని ప్రేమగా తలుచుకుంటున్నారు ఆ ఊరి జనం! "నిజంగానే ఆయన చల్లని వేళలో తలుచుకోవలసిన వ్యక్తి" అనుకున్నాడు జీవన్, తన అనుభవాన్ని కూడా గుర్తు చేసుకుని యాజులుగారిని తనుకూడా ప్రేమగా తలుచుకుంటూ.

****సశేషం****

Posted in March 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!