Menu Close
M P Rajyalakshmi
ఇంటిచూపులు (కథ)
రాజ్యలక్ష్మి మిరియంపల్లి

లలితా, లలితా ఎక్కడున్నావు?

ఇదిగోనండీ వస్తున్నాను బట్టలారేస్తున్నా అంటుంటే ఆయనే బాల్కనీలోకి వచ్చి, మొన్న మధ్యవర్తి చెప్పిన అబ్బాయి వాళ్ళు ఈ రోజు సాయంత్రం వస్తున్నారట, ఇల్లు కాస్త సర్దిపెట్టు అని చెప్పారు మా వారు.

మొన్నే వస్తారనుకున్నాం కానీ ఆ రోజు ఏదో పని వచ్చి రాలేకపోతున్నామన్నారప్పుడు. ఈ రోజు వస్తున్నారు కదా అని పనులు తొందరగా ముగించి ఇల్లు సర్దడం మొదలుపెట్టాను. వేళావిశేషం, అమ్మాయి వాళ్ళ మేనేజర్ సెలవులో ఉండడంతో దానిక్కాస్త ఖాళీ ఉండి, అది కూడా సహాయం చేసింది. సోఫాకవర్లు దులిపి, టీవీ స్టాండ్ తుడిచి మమ అనిపించాం హాల్‌ని. అప్పటికే నాలుగవుతుండడంతో వాళ్ళు వచ్చేస్తారని మేము కూడా కాస్త తయారయ్యి రెడీగా ఉన్నాము.

చెప్పినట్లుగా నాలుగున్నరకల్లా వచ్చాడబ్బాయి. స్నేహితులో, పెద్దవాళ్ళో తోడు వస్తారేమో అనుకున్నాం కానీ ఒక్కడే వచ్చాడు. సరే కూర్చోబెట్టి టీ ఇచ్చాను. బొత్తిగా మొహమాటస్తుడిలా ఉన్నాడు. మా వారే ఎక్కడ పని చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించిన వివరాలు మాట్లాడారు. ఇల్లు చూపిస్తూ ఏమైనా ప్రశ్నలుంటే అడగమన్నాం కూడా. ఈ ఊర్లోనే వాళ్ళ మేనమామ గారింట్లో ఉంటున్నాడట. ఈ మధ్య తీసిన ఫొటోస్ ఉంటే పంపించమన్నాడు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని వాళ్ళ వాళ్ళని తీసుకుని ఆదివారం వస్తానన్నాడు. అంతా బానే ఉంది, మన ఊరికి దగ్గర వాళ్ళే, ఉద్యోగం అదీ బావుంది, నెమ్మదస్తుడిలానే ఉన్నాడు, నచ్చినట్లే మాట్లాడాడు. ఒప్పేసుకుంటే బానే ఉంటుందనిపించింది మాకు. మా అబ్బాయికి కూడా ఇలా వచ్చారు, చూసుకుని వెళ్ళారు అని చెబితే, వాళ్ళకి నచ్చితే మనకీ నచ్చినట్లే అన్నాడు. సరే ఆదివారం ఎంతలో వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉన్నాము.

ఆదివారం రెండ్రోజుల్లోకి వచ్చింది. పూజ ముగించి నేనూ, ఆయన టిఫిన్ చేస్తూ కూర్చున్నాము. ఇంతలో మేము అప్పుడెప్పుడో వివరాలు ఇచ్చిన పెద్దమనిషి ఫోన్ చేసి మా ఊరి వాళ్ళు ఒకరికి మీ వివరాలు నచ్చి ఇష్టపడుతున్నారు, ఇంకో అరగంటలో ఇంటికి వస్తున్నారు, తయారుగా ఉండండి అని బాంబు పేల్చాడు. ఒకవైపు వీసా ఇంటర్వ్యూకి ఏదో కాగితం కనపడలేదు అని రాత్రంతా ఇల్లు చిందరవందర చేసి పెట్టిందమ్మాయి, ఇటు వీళ్ళేమో అరగంటలో వస్తున్నామన్నారు. ఆఘమేఘాల మీద అటుదిటు, ఇటుదటు సర్దేసరికి వాళ్ళు రానే వచ్చారు. మా జిడ్డు మొహలతోనే వాళ్ళని ఆహ్వానించాము. ఈ అబ్బాయి వాళ్ళ బావమరిదితో కలిసి వచ్చాడు. అసలు ఒంగోలట వాళ్ళది. మా ఇంటి దగ్గర టెక్పార్క్‌లో ఏదో ఇంటర్వ్యూ కి వచ్చి దగ్గరే కదా అని మా ఇంటికి కూడా వచ్చారట. కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాము. వీళ్ళు ముందే ఏవో సందేహాలతో వచ్చారు. మీరు ఇక్కడే ఉంటారా, ఉన్నదున్నట్లు చెప్పండి అని మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్ళే మాట్లాడారు. అన్నింటికీ ఓపికగా వివరించి చెప్పాము. తృప్తి పడ్డట్లే కనిపించారు. ఫొటోస్ ఉంటే పంపించండంకుల్, ఇంటికి వెళ్ళి చర్చించుకుని చెబుతామన్నారు. మంచిది, ఇంకా ఏమైనా సందేహాలున్నా నిరభ్యంతరంగా అడగండి అని సాగనంపాము.

ఆదివారమొచ్చింది, మొదట వచ్చి చూసుకున్న అబ్బాయి వాళ్ళ నుండి ఏ కబురు రాలేదు. మధ్యాహ్నం దాకా చూసి మా వారే ఫోన్ చేశారు. రెండుసార్లు చేసినా ఎత్తకపోవడంతో, పనిలో ఉన్నారేమో అనుకుని ఊరుకున్నారు. ఇలా రెండు వారాలు గడిచాయి. పోయిన వారమొచ్చిన ఇద్దరి నుండి ఏ వార్త లేదు. అవునో, కాదో తెలియదు. మా అమ్మాయికి వీసా కూడా వచ్చేసింది, ప్రయాణం తేదీ దగ్గరకి వచ్చేస్తోంది. అది ఊరు వెళ్ళేలేపు, ఈ విషయం తేలిపోతే బావుండుననుకుంటే, ఏదీ ముందుకు కదలట్లేదు. మా అబ్బాయికి ఫోన్ చేసి, ఈ విషయమే బాధపడుతుంటే, వాడేమో ఇలా మధ్యవర్తులు, వాళ్ళ సలహాలతో ఉపయోగం లేదు, మనం ఆన్లైన్లో వివరాలన్నీ పెడదామన్నాడు. అంతకుముందున్న ఫొటోలు, కొత్తవి కొన్ని తీసి పంపించాము వాడికి.

ప్రొద్దున్నే నేను ముగ్గేసి లోపలికొస్తుంటే ఫోన్, ఏదో తెలియని నంబరు. కట్ చేస్తే మళ్ళీ మోగుతోంది. చూద్దామని తీస్తే, నిన్న మా వాడు వివరాలు పెట్టిన కంపెనీ నుండి! మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకోవడానికి కాల్చేస్తున్నామందామ్మాయి. వాళ్ళ వెబ్సైట్‌లో పెట్టే ప్రొఫైల్స్ అన్నీ నికార్సైనవనీ, మా ప్రొఫైల్ అసంపూర్తిగా ఉందనీ, ఇంకొన్ని వివరాలు కావాలని ఒక గంటసేపు చిత్ర విచిత్రమైన ప్రశ్నలతో నా బుఱ్ఱ తిన్నారు. అక్కడితో ఆ ప్రహసనం ముగిసింది అనుకుంటుండగా అరగంటలో ఇంకో ఫోన్. అటువైపు నుండి ఎవరో పెద్దాయన. వెబ్సైట్లో మా వివరాలు చూసి చేస్తున్నామని, వీలుంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళు రేపు వస్తారని చెప్పుకొచ్చారు. రేపు కదా, తప్పకుండా రండి అని చెప్పా. ఇదేదో బానేఉందనిపించింది, ఇలా వివరాలు పెట్టడం, అలా మన గురించి వెతుక్కుంటూ రావడం. ఇదైనా కుదిరేటట్లు చేయి భగవంతుడా అనుకుని నా రోజు వారీ కార్యక్రమాల్లో మునిగిపోయా.

తెల్లవారింది, వాళ్ళొస్తున్నారని త్వరగా పని ముగించుకున్నామందరం. పోయినసారి ఒంగోలు వాళ్ళొచ్చినప్పుడు నేను కట్టుకున్న చీర పాతగా ఉందనీ, ఇంటావిడ అంత బాలేదని వాళ్ళు కబురు పంపించలేదేమో అందప్పుడు అమ్మాయి. ఆ విషయం గుర్తొచ్చి, క్రితం వారం ప్రవచనానికి కట్టుకున్న పెద్దంచు చీర ధరించా. పన్నెండయ్యింది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే, ఆఫీస్లో మీటింగ్ వల్ల ఆలస్యమైందని మూడింటికి వస్తామన్నారు. బానే ఉంది సంబడమని, నా మామూలు అవతారంలోకి మారి వంట మొదలుపెట్టా. వద్దు వద్దంటున్నా వినకుండా, ఒక్క గంటలో తీసేస్తానని హెన్నా పెట్టుకూర్చుంది నా కూతురు. వంట ముగించి భోజనాలు చేస్తుండగా కాలింగ్బెల్ మోగింది. యే కొరియర్ వాళ్ళేమో అని చూస్తే, మూడింటికి వస్తామని రెండింటికే వచ్చేసిన పెద్దమనుషులు. అప్పుడు చూడాలి మా హడావిడి. వాళ్ళని కూర్చోబెట్టి భోజనాలు కానిచ్చాము. ఈ సారి అక్క-తమ్ముడు వచ్చారు. వాళ్ళ పెద్దవాళ్ళు ఊర్లో ఉంటే, వీళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారట. సరే ఎంతసేపు మాట్లాడతాం, తప్పదు కదా ఇల్లు చూపించాం. సింకు నిండా అంట్లు, బాల్కనీ నిండా బట్టలు, బాత్రూం నిండా హెన్నా మరకలు. ఎలా ఉండకూడదనుకున్నానో అంతకు రెండు రెట్లు భయంకరంగా ఉంది ఇల్లు! షరా మాములుగా మా వాళ్ళతో మాట్లాడి చెబుతాము, ఫొటోస్ పంపించండాంటీ అని చక్కాపోయారు.

వాళ్ళటు వెళ్ళగానే ఫోన్! వెబ్సైట్లో మీ వివరాలు చూసి చేస్తున్నాము, మీకు పెయింటింగ్ సర్వీస్ కావాలా అని! అక్కర్లేదు బాబూ అంటే వినడే, ఏవో ప్యాకేజీలు చెప్పాడు. పెయింటింగ్ వేసేసాం అన్నా వదలట్లేదు. మా ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, అదే వెబ్సైట్లో ఫొటోస్ ఉన్నాయి చూడమని కట్ చేసా. కాసేపటికి ఇంకో ఫోన్, ఈసారి చెదలమందు వాళ్ళ నుండి. ఇందాక చెప్పినట్లే మీ సేవలు మాకొద్దు మహా ప్రభూ అని పెట్టేసా.

ఇది మొదలు నా రోజువారీ ప్రణాళికే దెబ్బతింది. తెల్లవారిన దగ్గరనుండి, ప్రొద్దుపోయే వరకూ రకరకాల సేవల వారి ఫోన్లు, మధ్యలో ఇల్లు కావల్సినవారు. వస్తామని ఫోన్ చేస్తారు, మేము హడావిడి పడడం, చుట్టూ చూసి బావుందని ఒక మాట పడేసి, మా ఇద్దరికి పెద్దదవుతుందేమో అని కొంతమందంటారు. రెండో ఫ్లోర్ లిఫ్ట్ పనిచేయకపోతే ఎక్కలేమంటారు కొందరు. చాలమంది ఇంటికెళ్ళి చెబుతామంటారు, కానీ మళ్ళీ ఏ కబురు ఉండదు. ఫర్నీచర్‌తో సహా ఇస్తామన్నామని, ఆ గిటార్ కూడానా అన్నాడోసారి ఒకబ్బాయి. మా అమ్మాయి చూసిన చూపుకి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

ఒకసారి భార్య-భర్త వచ్చారు. బాత్రూంలో గీజర్ల మోడల్‌నంబర్ల నుండీ, గడపలకేసిన పెయింటింగ్ కలర్ కాంబినేషన్ వరకూ క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. మాకు బాగా నచ్చింది, మా అత్తగారికి కూడా చూపించాలి, ఫొటోస్ పంపించండే అని వెళ్ళిపోయారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, వెళుతూ వెళుతూ గడప ముగ్గులని కాసేపు పొగిడి వెళ్ళిందామ్మాయి, చచ్చీ చెడి నడుంనొప్పి పుట్టేటట్లు వేసినందుకు అదొక్కటే దక్కుదల!

ఇలా మా ఇంటిచూపులు సాగుతూ ఉన్నాయి. వస్తారు, చూస్తారు, ఫొటోస్ అంటారు, నచ్చినట్లే ఉంటారు, ఇంటికి వెళ్ళి కబురంపిస్తామంటారు, మళ్ళీ అయిపు ఉండరు. మా అమ్మాయి ఊరు వెళ్ళడం వారంలోకి వచ్చేసింది. ఈ చూపులు, సర్దడాలు, ముస్తాబు చేయడాలు మీవల్ల కాదులే ఇక ఇప్పటికి వదిలేయండి తరువాత చూసుకుందామని గట్టిగా చెప్పిందమ్మాయి. అంతేలే ఈ తిప్పలు పడలేము అనిపించింది, కానీ బంగారంలాంటి ఇల్లు అలా ఎవరూ లేకుండా అట్టిపెట్టడం ఎట్లా అని ఇంకోవైపు. ఈ సంకటాల మధ్య మా అబ్బాయి నుండి ఫోన్, తీయగానే అమ్మా, నాకు బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇంకో నెల్లో పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి, నేనే వచ్చేస్తున్నా మన ఇంటికి అని. అలా మా ఇంటిచూపులు ముగిశాయి.

********

Posted in June 2022, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!