Menu Close
Kadambam Page Title
ఇంతేనా?
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

ఆదిలో ఎంతైనా అంత్యదశలో ఇంతేనా?
ఎవరికైనా వృద్ధాప్యం ఒక చింతేనా?
చివరి రోజుల జీవితం చిరుగుల బొంతేనా?
చేవ జారిన జీవనం చిల్లుల ముంతేనా?
కుంగిన కంతేనా?

ఆ వయసులో గౌరవం గల్లంతేనా?
అర్ధం చేసుకోవటమనేది ఉండదా ఆవంతేనా?
ఉల్లాసం నిశిద్ధమేనా? పరితాపం ప్రసిద్ధమేనా?
నిరాశ అనిరుద్ధమేనా? (అనిరుద్ధం=అడ్డులేనిది)
నిస్పృహ బుద్ధమేనా? (బుద్ధం=తెలియజేయబడ్డది)
ఈ పరిస్థితి ప్రణాలికాబద్ధమేనా?
ఆశించటం అసహజమేనా?
భాషించటం అసహ్యమేనా?
ఈ మార్పులన్నీ అనూహ్యమేనా?
ఈ కూర్పులన్నీ అమేయమేనా? (అమేయము=లెక్కింప రానివి)
మనిషి జీవన చరమాంకం ఎదురుచూడని
బాధాతప్త అనుభూతేనా?

Posted in April 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!