గుండె గూటిపై పిడుగుపాటుకు...
తలపు తేమని
మడతలెన్నేసినా చెమ్మాగడం లేదు.
సన్నగా సెగ కమ్మడం మానలేదు.
కళ్లను సూటిగా తాకి
చిందే కన్నీటిలో
తీపి శబ్దాలని రంగరించి తాపినా
దప్పికారలేదు.
మాటతో పాటుగా
మనసు కోల్పోయిన నాలుక,
సెలయేరై పారి
ఎండి సొమ్మసిల్లిన పెదాలు,
కలల కోరికను తెంపుకుని
నిద్రను తెంచుకున్న కళ్ళు,
బాధతో బీడై బరువెక్కిన భావుకత,
కాలం సంకెళ్లకు
మౌనం మాటున ముడుచుకుని.....
గుండె గూటిపై పడ్డ
పిడుగు పాటుకు
తలచుకుని ఒంటరిలోకి
కూరుకుపోయే సమయంలో
ఏ అక్షరాన్ని నాటాలన్నా
చేతికి చలనంలేదు.
ఏ భావాన్ని పులుముకోవాలన్నా
హృదయంలో సందడి లేదు.
ఎదురు తిరిగిన వ్రాతలో
వెక్కి ఏడ్చే నిజాలను చూసి
ఏళ్ల కొద్ది తపస్సు చేసిన
మునివేళ్ళుకు మతితప్పి
అక్షరాన్ని తలవాలంటే ....
భయమైంది..
పద వరుసలని పిలవాలంటే....
దిగులైంది...