Menu Close
Galpika-pagetitle

వెయ్యి డాలర్లు - తెనుగుసేత: డా.కోడూరు ప్రభాకరరెడ్డి - English Original:One Thousand Dollars - O Henry

"వెయ్యి డాలర్లు!" గంభీరంగా, గట్టిగా నొక్కి మరీ చెప్పాడు లాయర్ టాల్మన్(Tolman).

"ఇదిగో డబ్బు!" అంటూ టాల్మన్ డబ్బును గిల్లియన్(Gilliam)కు ఇచ్చాడు.

యువకుడైన గిల్లియన్ సన్నని 50 డాలర్ల నోట్ల కట్టను పట్టుకొని తమాషాగా నవ్వాడు.

"ఇది చాల అవమానకరమైన, ఇబ్బంది కలిగించే మొత్తం" లాయర్తో సరసంగా అన్నాడు గిల్లియన్.

"మీ బాబాయ్ వ్రాసిన వీలునామా చదవగా విన్నావుగా? విల్లును జాగ్రత్తగా గమనించావా? నీకు మరొక విషయాన్ని గుర్తుచేస్తున్నాను - నీకు చెందబోయే ఈ వెయ్యి డాలర్లు ఎందుకు? ఎలా? ఖర్చుపెడతావో లెక్కాచారం చెప్పాలి. ఆ విషయాన్ని విల్లు నొక్కి చెబుతున్నది. మీ బాబాయ్ కోరికకు అనుకూలంగా నడుచుకోవాలి నువ్వు!" అన్నాడు టాల్మన్.

అక్కడి నుండి గిల్లియన్ నేరుగా క్లబ్బుకెళ్లాడు. అక్కడ అంతటా వెదికి ఒక మూల పుస్తకం చదువుకుంటున్న బ్రైసన్(Bryson) అనే ముసలాయన దగ్గరికెళ్లాడు. గిల్లియన్ ను చూస్తూనే బ్రైసన్ పుస్తకాన్ని క్రింద పెట్టి కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టాడు.

"మిష్టర్ బ్రైసన్! ఇది విను. నీకొక తమాషా కథ చెప్పాలి" అన్నాడు గిల్లియన్.

"ఆ కథేమిటో బిలియర్డ్స్ రూమ్ లో ఉన్న వాళ్లకు చెబితే బాగుంటుంది. నీకు తెలుసుగదా, నాకు కథలంటే చిరాకని!" అన్నాడు బ్రైసన్.

"పాత కథల్లాగా కాదు. ఇది వానికంటే ఉత్సాహకరంగా ఉంటుంది" సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు గిల్లియన్.

"నేనిప్పుడే చనిపోయిన మా బాబాయ్ కంపెనీ నుండి వస్తున్నాను. పోతూ ఆయన నాకు వెయ్యి డాలర్లిచ్చి వెళ్ళాడు. వెయ్యి డాలర్లతో ఒక మనిషి ఏమేం చెయ్యగలడు?" అడిగాడు గిల్లియన్.

"నా అంచనా ప్రకారం మీ బాబాయ్ సెప్టిమస్ గిల్లియన్ (Septimus Gillian) ఆస్తి సుమారు ఐదు లక్షల డాలర్లుండవచ్చు" నిరాసక్తంగా అన్నాడు బ్రైసన్.

"అవును, నిజమే! అక్కడే ఉంది జోక్. తన సంపదనంతా ఒక సూక్ష్మజీవి(Microbe/Bacteria)కి ఇచ్చేసాడు. అంటే అందులో కొత్త జీవాణువు(Bacillus)ను కనుగొనే శాస్త్రవేత్తకు, మిగిలినది ఆ జీవాణువును అంతం చేయటానికి నిర్మించే ఆస్పత్రికి చెందుతుంది. ఒకటి రెండు చిల్లర వీలునామాలు కూడ ఉన్నాయి. వంటవానికి, పనిమనిషికి చెరి 10 డాలర్లతో పాటు చెరొక ఉంగరం చెందేటట్లు వ్రాసాడు. దాని ప్రకారం ఆయన సోదరుని కొడుకుకు -అంటే నాకు- 1000 డాలర్లు చెందుతుంది" అన్నాడు గిల్లియన్.
"అయితే ఖర్చు పెట్టుకోవటానికి నీకు బోలెడు డబ్బులుంటాయే!" బ్రైసన్ పరిశీలనగా గిల్లియన్ ను చూస్తూ అన్నాడు.

"అహ్హహ్హ! లప్పలు, లప్పలు. నా ఖర్చులకిచ్చే విషయంలో ఆచి తూచి ఇస్తుంటాడాయన" అన్నాడు గిల్లియన్ పరిహాస స్వరంతో.

"ఇంకా వారసులెవరైనా ఉన్నారా?" అడిగాడు బ్రైసన్.

"ఎవరూ లేరు. కానీ ఆయన సంరక్షణలో ఉండే మిస్ హేడెన్(Miss Hayden) ఆయన ఇంట్లోనే ఉండేది. చాలా అణకువగా ఉండే అమ్మాయి. ఆయనతో స్నేహంచేసి కాలం చేసిన దురదృష్టవంతుని కూతురు. చెప్పటం మరచాను-ఆమెకు కూడ ఒక ఉంగరం, 10 డాలర్లు వ్రాసి పోయాడు ముసలాడు. మిష్టర్ బ్రైసన్! వెయ్యి డాలర్లతో ఎవరైనా ఏమేం చెయ్యొచ్చు?" అడిగాడు గిల్లియన్.

బ్రైసన్ తన కళ్ళద్దాలు తుడుచుకుని చిరునవ్వు సంధించి,
"వెయ్యి డాలర్లేమైనా చిన్న మొత్తమా? మనిషి ఒక ఇల్లు కొని దర్జాగా ఉండవచ్చు, జూన్-జులై-ఆగస్టు నెలల్లో నూర్గురు పసిపిల్లలకు స్వచ్ఛమైన పాలు కొని వాళ్ళ ప్రాణాలు కాపాడవచ్చు. దాంతో అరగంట పేకాట ఆడి పొద్దుపుచ్చవచ్చు. లక్ష్యసిద్ధి గల ఒక అబ్బాయికిగాని, అమ్మాయికిగాని విద్యాదానం చెయ్యవచ్చు, కొరోట్(Corot -Jean Baptiste Camille అనే ఫ్రెంచ్ చిత్రకారుడు) పెయింటింగ్ ను వేలంలో కొనవచ్చు. అంతెందుకు నువ్వు న్యూ హాంప్ షైర్(New Hampshire) వెళ్లి రెండేళ్లు అక్కడ హాయిగా గడపవచ్చు.

"బ్రైసన్! నిన్నందరూ ఇష్టపడవచ్చు. అందుకని నీతి బోధ చేయవద్దు. నేనా వెయ్యి డాలర్లతో ఏం చెయ్యవచ్చో చెప్పామన్నాను-అంతే!" చెక్కు చెదరకుండా అన్నాడు గిల్లియన్.

"నువ్వా? ఇదంతా ఎందుకు? నువ్వొక పని చెయ్యవచ్చు.ఆ డబ్బుతో మిస్ లొట్టా లోరియర్(Lotta Loriere)కు ఒక వజ్రాల పతకం కొనవచ్చు" అని చెప్పాడు బ్రైసన్.

"థాంక్స్ బ్రైసన్! నాకు సాయ పడతావనుకున్నాను. నా ప్లాన్ మీదే దెబ్బ కొట్టావ్. మొత్తం డబ్బుని సొంతం చేసుకోవాలనుకున్నాను. అందుకు నేను వెయ్యి డాలర్లకు న్యాయపరమైన లెక్కలు చూపించాలి. ఖర్చుకు ఖాతా వ్రాయాలంటే నాకు చిరాకు" అన్నాడు గిల్లియన్.

వెంటనే ఫోన్ చేసి టాక్సీని పిలిపించుకొని "కొలంబీన్ థియేటర్(Colambine theatre)కు పోనీయ్!"అన్నాడు డ్రైవర్ తో.

మధ్యాహ్న ప్రదర్శన కోసం లొట్టా లారియర్ మేకప్ కు తుది మెరుగులు దిద్దుకొంటున్నది. అప్పుడే మేకప్ మాన్ గిల్లియన్ వచ్చాడని ఆమెకు వార్త తెచ్చాడు. "లోపలికి పంపు!" అని గిల్లియన్ లోనికి రాగానే "ఏమిటి గిల్లియన్? రెండు నిముషాల్లో నేను స్టేజ్ మీదికి వెళ్ళాలి" అంది.

"నీ చెవి కొంచెం ఇటిస్తావా? రెండు నిముషాలకంటే ఎక్కువ సమయం పట్టదు నాకు. పతకం గురించి ఇంతకుముందు చెప్పావుగా!" అన్నాడు గిల్లియన్.

"డెల్లా స్టేసీ(Della Stacey) రాత్రి వేసుకున్న నెక్లెస్ చూసావుగా! 2200 డాలర్లవుతుంది" అంది లొట్టా లారియర్.

"మిస్ లారియర్! కోరస్ కు టైమయ్యింది" అంటూ కర్టెన్ బాయ్ పిలిచాడు.

గిల్లియన్ కారు దగ్గరికి వచ్చి "నువ్వయితే వెయ్యి డాలర్లతో ఏం చేస్తావ్?" డ్రైవర్ను అడిగాడు.

"ఒక బార్ తెరుస్తాను" అని తడుముకోకుండా చెప్పాడు డ్రైవర్.

"అదేం వద్దు! ఊరికే తెలుసుకుందామని ఆడిగానంతే! కారు ఆపమని చెప్పేటంతవరకు నడుపుతూనే ఉండు" అన్నాడు గిల్లియన్.

బ్రాడ్వే(Broadway)లో ఎనిమిది ఇళ్ల అవతల కారు దిగాడు. రోడ్డు ప్రక్కన ఒక గుడ్డివాడు స్టూల్ మీద కూర్చొని పెన్సిళ్ళు అమ్ముకుంటున్నాడు. గిల్లియన్ ఆయన ముందు నిలబడి "మీ దగ్గర వెయ్యి డాలర్లుంటే దాంతో ఏం చేస్తారు?" అడిగాడు గిల్లియన్.అప్పుడతను తన కోట్ పాకెట్ లో నుండి ఒక చిన్న పుస్తకం తీసి గిల్లియన్ చేతికిచ్చి చూడమన్నాడు. అదొక బ్యాoకు డిపాజిట్ బుక్. గిల్లియన్ దాన్ని తెరిచి చూస్తే ఆ ఖాతాలో 1785 డాలర్ల బ్యాలెన్స్ చూపుతోంది. బుక్ అతనికి ఇచ్చేసి మళ్లీ కారెక్కాడు గిల్లియన్.

"నేనొకటి మర్చిపోయాను, బ్రాడ్వే లోని టాల్మన్ & షార్ప్(Tolman & Sharp) ఆఫీసుకు పద!" అన్నాడు గిల్లియన్.

లాయర్ టాల్మన్ గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాల్లోంచి గీరగా చూసాడు గిల్లియన్ ను.

"క్షమించండి టాల్మన్! మిమ్మల్నొక ప్రశ్న అడగొచ్చా? ఇది అసంగతం కాదనుకుంటాను. మిస్ హేడేన్ కు పది డాలర్లు, ఉంగరం తప్ప వీలునామాలో మా బాబాయి మరేమైనా వ్రాసాడా?" అని అడిగాడు గిల్లియన్.

"అవితప్ప ఇంకేమీ వ్రాయలేదు" చెప్పాడు టాల్మన్.

"థాంక్యూ సర్!" అని కారు దగ్గరికి వెళ్లి  డ్రైవర్ కు తన బాబాయి ఇంటి అడ్రస్ చెప్పాడు గిల్లియన్.
మిస్ హేడెన్ లైబ్రరీ రూమ్ లో ఏవో ఉత్తరాలు వ్రాసుకుంటున్నది. నల్ల దుస్తులు ధరించింది.

"నేనిప్పుడే మిష్టర్ టాల్మన్ ఆఫీస్ నుండి వస్తున్నాను. ఆ విల్లులో వాల్లొక సవరణను గమనించారు. ముసలాయన కొంచెం ఉదార బుద్ధితో మీకు వెయ్యి డాలర్లు వ్రాసాడట. టాల్మన్ ఆ డబ్బు మీకు అందజేయమని నాతో పంపాడు. ఇదిగో, డబ్బు సరిగ్గా లెక్క చూసుకొoడి! డబ్బు ఆమె టేబుల్ పైన ఆమె చేతి ప్రక్కనే పెట్టాడు గిల్లియన్.

"ఓ! అలాగా!" అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చిందామె.

"నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు" అన్నాడు గిల్లియన్ మృదుస్వరంతో.

"నన్ను క్షమించాలి మీరు" డబ్బు అందుకుంటూ అన్నదామె.

"రసీదు వ్రాయనా!" నవ్వుతూ అడిగి టేబుల్ దగ్గర కూర్చొని "రాబర్ట్ గిల్లియన్ తన ప్రేమాస్పదురాలికి వెయ్యి డాలర్లు కానుకగా ఇచ్చాడు" అని వ్రాసి ఆ కాగితాన్ని జేబులో కుక్కుకున్నాడు.

కారు మళ్లీ టాల్మన్ ఆఫీస్ దగ్గర ఆగింది. లోపలికి వెళ్ళి,
"నేనా వెయ్యి డాలర్లు ఖర్చు చేసాను" టాల్మన్ కు చెప్పాడు గిల్లియన్.

"దాని వివరాలు చెప్పటానికి ఆధారం తెచ్చాను" అంటూ ఒక తెల్ల కవరును టేబుల్ మీదికి తోసి "అందులో ఆ డబ్బు ఖర్చు వివరాలు ఉన్నాయి"అన్నాడు గిల్లియన్.

ఆ కవరును ముట్టుకోకుండానే తన పార్ట్నర్ షార్ప్ ను పిలిచాడు టాల్మన్.

ఇద్దరూ పెద్ద బీరువాలో వెదికి సీల్ వేసిన పెద్ద కవరును బైటికి తీసారు. దాన్ని ఇద్దరూ చాల జాగ్రత్తగా పరిశీలించాక టాల్మన్ ఇలా చెప్పాడు.

"నీ బాబాయ్ తన వీలునామాకు ఒక అనుబంధాన్ని చేర్చాడు. ఈ సీల్డ్ కవరును నువ్వు నీకు కేటాయించిన వెయ్యి డాలర్లను ఎలా ఖర్చు పెట్టావో ఆ వివరాలు చూపించాక తెరిచి చూడమన్నాడు. ఇప్పుడు నువ్వా వివరాలు తెచ్చావు కాబట్టి నా భాగస్వామి, నేను కలిసి ఆ వీలునామాను జాగ్రత్తగా పరిశీలించాం.

చట్ట సంబంధమైన వివరాల జోలికి పోకుండా మూలార్థాన్ని నీకు తెలుపుతాను. మేము నీ కెంతమాత్రం వ్యతిరేకులం కామని నువ్వు గుర్తుంచుకోవాలి. వీలునామా లోని అనుబంధ నిబంధన(Clause) ప్రకారం నువ్వు వెయ్యి డాలర్లను పూర్వ పద్ధతిలోనే దుబారాగా ఖర్చు చేసినట్లయితే - అంటే దయార్ద్ర హృదయంతో చేసిన ఖర్చు కాదని మాకు తోచితే - నీ బాబాయి చివరి కోర్కె ప్రకారం ఆయన సంరక్షణలో ఉన్న మిరియం హేడెన్ కే 50000 డాలర్లు వెంటనే అందజేస్తాం.ఏదీ...ఆ రసీదు...నేనూ మిష్టర్ షార్ప్ దాన్ని చూసి నిర్ణయిస్తాం."

టేబుల్ మీదనున్న గిల్లియన్ తెచ్చిన రసీదు కవరును అందుకోబోయాడు టాల్మన్. కానీ అతనికంటే వేగంగా గిల్లియన్ దాన్నందుకొని ఆ రసీదున్న కవరును తీరిగ్గా ముక్కలు ముక్కలుగా చింపి కోటు జేబులో వేసుకున్నాడు.

"ఈ ఖర్చు పట్టీ మీకు అర్థం కాదు. మిమ్మల్ని కష్టపెట్టుకోదల్చుకోలేదు. నే నా వెయ్యి డాలర్లను గుర్రపు పందెలలో పోగొట్టుకున్నాను. గుడ్ బై!" అంటూ ఉల్లాసంగా విజిల్ వేసుకుంటూ బైటికి నడిచాడు గిల్లియన్.

నొప్పింపక తానొవ్వక... -- కాసాల గౌరి

"అమ్మా....ఫంక్షన్ వాళ్ళ దగ్గర నుంచి కారు వచ్చింది ఇంకా ఎంతసేపు...” తల్లి గది లోకి అడుగుపెడుతున్న దివ్య ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఉండి పోయింది.

"అబ్బా చాల్లే వదులు" అంటోంది అమ్మ అత్తయ్యతో

"ఉండు కదలకు...రాజీ ఒక్క నిమిషం.…." అంటూ అత్తయ్య అమ్మ తలలో చీరకి మ్యాచ్ అయ్యేటట్లుగా ఎరుపు పసుపు రోజా పూలను పిన్నులతో చక్కగా అమర్చింది. చూడు ఇప్పుడు ఎంత చక్కగా ఉందో అంది.

"సరే..సరే..ఇంక బయల్దేరదాం పద " అంది అమ్మ అత్తయ్య చెయ్యి పట్టుకుని. ఇంకా తెరుచుకునే ఉన్న దివ్య నోరుని చూపుడు వేలితో మూసేస్తూ....

'తర్వాత మాట్లాడుకుందాం' అన్నట్లుగా కళ్లతో సైగ చేసి బయలుదేరింది.

**      *** ***       **

దివ్య ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు.

వారం రోజుల క్రితం జరిగిన సంఘటన కళ్ళముందు మెదిలింది. ఆ రోజు అత్తయ్య ఏదో పెద్ద పేరంటమే చేసింది. తను అమ్మ వెళ్లారు. హాలులో పరిచిన తివాచీల నిండా జనాలు. అంతా హడావుడిగా ఉంది.

అత్తయ్య అత్తగారు ఒక మూల కుర్చీలో కూర్చుని కోడలికి అన్ని ఆర్డర్ లు వేస్తూ ఉంది.

"హలో నీరజా... ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు....అంటూ అమ్మ వెళ్లి ఒక ఆవిడ పక్కన కూలబడింది."

ఈ లోకంలో లేనట్లు ఇద్దరూ కబుర్లలో పడిపోయారు.

"అమ్మాయ్ ఆలస్యo అయిపోతోంది. ఇంక తాంబూలాలు ఇవ్వటం ప్రారంభించు" అని అత్తగారు హుకుం జారీ చేసింది అత్తయ్యకి.

ఇదిగో అయిపోయింది అత్తయ్యగారు అంటూ పిల్లల్ని అందరికీ బొట్టు, గంధమ్ ఇవ్వమని చెప్పి తాంబూలం ప్యాకెట్లు తేవడానికి లోపలికి వెళ్ళింది అత్తయ్య.

పెద్ద పిల్ల అందరికీ బొట్టు పెడుతూ అమ్మతో మాట్లాడుతున్న ఆవిడకి బొట్టు పెట్టింది.

అమ్మకి బొట్టు పెట్ట బోతుంటే మూలనుంచి పెద్దావిడగొంతు.
"అమ్మాయి ఏం చేస్తున్నావ్ ఒళ్ళు దగ్గర ఉందా" అంటూ ఖంగుమంది.

హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆ పిల్ల బెదిరిపోయి ఆగిపోయింది.

అత్తగారి కేకకి పరిగెత్తుకు వచ్చిన అత్తయ్య. ... కూతురు చేతిలోంచి కుంకుమ తీసుకుని అమ్మకి పెట్టడం మానేసి మిగతా వాళ్ళందరికీ బొట్టు పెట్టింది.

అందరూ అమ్మ వైపు చూస్తూ ఉంటే అమ్మ నెమ్మదిగా లేచి లోపలికి వెళ్ళిపోయింది.

దివ్య మనసు చాలా గాయపడింది. కళ్ళనిండా నీళ్ళతో తల్లి దగ్గరికి వెళ్లి పోయింది.

అత్తయ్య లోపలకు వచ్చి మలినమైన మొహంతో అమ్మకి తాంబూలం ప్యాకెట్ ఇచ్చింది. తను వద్దని చెబుదాము అనుకునే లోపలే అమ్మ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వచ్చేసింది.

అప్పటినుంచి దివ్యకి అత్తయ్య మీద కోపం.

*    *     *    *

"నాకేమి అర్థం కావటం లేదమ్మా మా అత్తయ్య పద్ధతి" ఫంక్షన్ నుంచి వచ్చి భోజనం అయ్యేక తల్లి పక్కన పడుకుంటూ అంది దివ్య. నిజంగా అత్తయ్యకి ఏ రకమైన పట్టింపులు లేకపోతే మొన్న పేరంటంలో అందరిముందు అవమానించటం ఎందుకు చక్కగా నీకు బొట్టు పెట్టి ఉంటే ఎంత హుందాగా బాగుండేది"

"అక్కడ వాళ్ళ అత్తగారు ఉన్న సంగతి మర్చిపోయావా"

"లేదమ్మా ఆవిడ వారించినా ఈవిడకి అభ్యంతరం లేకపోతే నీకు అందరి ముందు బొట్టు పెట్టి ఉంటే అక్కడ ఎంత హుందాగా ఉండేది.

"ఆ రోజు నిన్ను అవమానించటం ఏమిటి ఇవాళ నీకు బొట్టు సవరించి తలలో పువ్వులు పెట్టటం ఏమిటి ఏమిటి ఈ డ్యూయల్ పర్సనాలిటీ" అసహనంగా అంటున్న దివ్య నోటిని చేతితో సున్నితంగా మూసింది.

"తొందరపడి ఎవరిని ఏమి అనకూడదు దివ్య. అత్తయ్య అత్త గారిని ఎందుకు ఎదిరించాలి. తర్వాత ఆవిడ సాధింపులతో ఇల్లు నరకం అవ్వదా?? మామయ్యకి పొరపాటున ఏ చిన్న నలత వచ్చినా ఆ నింద/బాధ అత్తయ్య కే కదా. నువ్వు గమనించావో లేదో అక్కడ చాలామంది అదే అభిప్రాయంతో ఉన్నారు. అసలు వాళ్ళ తప్పు కూడా లేదు. ఇప్పుడు ఆడవాళ్లే అవి అమలు పరుస్తున్నారు. కాదంటావా? తరతరాలుగా వాళ్ళని... ఆలా తయారు చేశారు. నీకు ఇంకా బాగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే వాళ్ళ మైండ్ ఆలా ట్యూన్ అయిపొయింది. స్త్రీలకు అందరికన్నా భర్తే ముఖ్యం. అతడికి ఆపద అంటే వాళ్లు తర్కం జోలికి కూడా వెళ్లరు. అది ఒక రకంగా మంచిదే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదో ఆవేశంలోనో, తోటి స్త్రీని బాధ పెట్టలేకో అలా చేసినా తర్వాత శారీరకంగా మానసికంగా కుంగిపోయిన వాళ్లు నాకు తెలుసు. ఎందుకంటే మన ఆలోచనలను నిర్ధారించేది మన మెదడు.., అందులో జరిగే రసాయనిక చర్య. మనకి ఒక విషయం మీద  విరుద్ధమైన ఆలోచన వచ్చింది అంటే ... బడిగంట వినగానే  బయటకి పరిగెత్తే పిల్లలలా... ఆ ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి దాడిచేస్తాయి. "అయ్యో ఇలా చేసానే,...ఆయన కి ఏమన్నా అవుతుందా.... ఆయన చనిపోతే నాకు దిక్కెవరు... చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానే... ఇలా అన్నమాట. ఈ ఆలోచనల దాడి వల్ల వాళ్ళకి కూడా ఏదైనా అయ్యే అవకాశం ఉంది. దీనినే  సైంటిఫిక్ గా ( వైద్య/మానసిక పరిభాషలో) ‘ఎమిగ్డాలా హైజాక్’ అంటారు. అందుకే నేను ఎప్పుడు పేరంటానికి వెళ్ళినా ఇలాంటి ఇబ్బంది నుంచి తప్పించుకుంటాను/వాళ్లని తప్పిస్తాను.

మొన్న చాలా ఏళ్ల తర్వాత నీరజ కనిపించిన ఆనందంలో ఏమరిపోయాను. స్త్రీలని స్త్రీలే అర్థం చేసుకోకపోతే ఎలా దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది.

దివ్య ఏమీ మాట్లాడకుండా ఆమెకు దగ్గరగా జరిగి నడుము మీద చేయి వేసి  కళ్ళు మూసుకుంది.

యువరాణి -- శ్రీముఖి

"జయంతీ!"

"వస్తున్నా...తెస్తున్నా"

భర్త కేకకు జవాబుతో పాటు తానూ వచ్చింది జయంతి. చేతిలో రుమాలు అందిస్తూ, చిన్నగా నవ్వుతూ అంది.

"ఆదివారమే కదా...ఇంటిదగ్గరే ఉంటారని అనుకున్నాను"

"నాకు మాత్రం నీతో పిల్లలతో గడపాలని ఉండదా...ఆ సుబ్బారావుగారు వాళ్ళమ్మాయి సంబంధానికి వెళ్లి వద్దాం రమ్మని ఒకటే గొడవ..వెళ్ళకపోతే బావుండదు."

"సరే, వెళ్ళండి.కానీ..."

"ఆగాగు...నీవడగని ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. తొందరగానే వచ్చేస్తా. సరేనా?"

"డాడీ...." అంటూ వస్తున్న...ఏడూ, తొమ్మిదేళ్ల కూతుళ్ళిద్దరిని చూసి, వాళ్లకు 'బై' చెప్తూ వెళ్ళిపోయాడు మోహన్.

********

జయంతి, పిల్లలు మధ్యాహ్నం భోజనం చేశాక పిల్లలతో అన్నది.
"హోమ్ వర్క్ రాత్రే చేశారు కదా...రండి కాసేపు పడుకుందాం."అని.

పిల్లలిద్దరూ తల్లితోపాటు మంచం మీదకు చేరారు.

"ఏదైనా కథ చెప్పమ్మా?" అన్నారు.

"ఏం చెప్పను... ఇప్పటికే బోలెడు కథలు చెప్పాను కదా...కొత్తవి ఏం ఉన్నాయబ్బా....?"

"ఏదోకటి చెప్పమ్మా...నీ చిన్నప్పటి మాటలు...మీ స్కూల్ కబుర్లు..." పెద్దపాప అందించింది.

కొన్ని క్షణాలు ఆలోచించింది జయంతి.

"చెప్పమ్మా..." తొందర పెట్టింది చినపాప.

"నేను మూడవతరగతి చదివేప్పుడు మా తెలుగు వాచకంలో ఒక పాఠం ఉండేది. నాకు మరుపురాని కొన్ని పాఠాల్లో అదొకటి... అది చెప్పనా?" అడిగింది జయంతి.

"ఆ.....చెప్పు చెప్పు!" పిల్లలు ఉత్సాహంగా అడిగారు.

చెప్పబోయింది జయంతి.

"ఆగాగు....." పిల్లలిద్దరూ తల్లికి చెరో పక్కన పడుకుని, వెల్లకిలగా పడుకున్న తల్లి మీద చెరోకాలు, చెరో చెయ్యి వేసి ఆమెను దిగ్భంధం చేశారు. జయంతికి తెలుసు ఎటు వత్తిగిలినా రెండో వాళ్ళు అలుగుతారని. ఆమె చెప్పసాగింది.....

*********

"లోగడ మీకు చెప్పాను...తెల్లవాళ్లు మన దేశాన్ని పాలించారనీ..."

"ఆ...అవన్నీ నాకు గుర్తేనమ్మా! వారు మనల్ని బానిసలుగా చూస్తూ బాధలు పెట్టేవారని...మన నాయకులు వారిని తరిమికొట్టటం, స్వాతంత్య్రం రావటం..." పెద్దపాప చెప్పసాగింది.

"సరే...కథలోకి వద్దాం. అప్పటికి మన దేశాన్ని ఆంగ్లేయులే పాలిస్తున్నారు. తెల్లవారి సిపాయిలు దండుగా ఒక చోటు నుండి మరోచోటికి  వెళ్ళాలంటే...మధ్య మధ్య మజిలీలు చేస్తూ వెళ్లేవారు..."

"మజిలీ అంటే ఏంటమ్మా?" చినపాప అడిగింది.

"మజిలీ లంటే...అక్కడక్కడ ఆగి, విశ్రాంతి తీసుకోవటం..."

" ---------------"

"అది...1893వ సంవత్సరం, అక్టోబర్ 4వ తేదీ.....ఆంగ్లేయుల సిపాయిలు దండుగా సికింద్రాబాద్ వెళుతున్నారు."గుంతకల్లు" అప్పటికి ఇంకా చిన్నఊరు. దండు అక్కడ ఆగి మజిలీ వేశారు....
వీళ్ళు మజిలీ వేసిన చోటల్లా, ప్రజలు ముఖ్యంగా ఆడవాళ్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండేవారు...."

"ఎందుకని అమ్మా?"

"ఎందుకంటే...మీదపడి రాక్షసుల్లా హింసించే వాళ్ళు కాబట్టి..."

“--------------"

"వీళ్ళ మజిలీ సంగతి తెలీని ఆఊరి స్త్రీ ఒకామె పగలంతా జొన్నచేనుకు కాపలా కాసుకుని, సాయంత్రం తిరిగి వస్తుంది. దారిలో ఆమెకు మరొకామె తోడు కలిసింది. వాళ్ళను చూశారు ఆ ఆంగ్ల సిపాయిలు...అంతే! వాళ్ళవెంట పడ్డారు. భయంతో ఆ స్త్రీలు పరిగెత్తసాగారు! సిపాయిలు వాళ్ళను వెంటాడేరు. అక్కడకు దగ్గరగా ఒక రైల్వే గేటు ఉంది. ఆ గేటు కీపరుగా ఉన్నాయన పేరు "గూళపాలెం హంపన్న".

ఆయన పరిగెత్తుకొస్తున్న ఆ స్త్రీలను, వారిని తరుము కొస్తున్న సిపాయిలను చూశాడు. పరిస్థితిని గ్రహించాడు. ఆ స్త్రీలను గేటు దగ్గర తను ఉండే చిన్న గది లోనికివెళ్లి లోపల గడియ వేసుకోమని చెప్పాడు.

తన చేతిలో ఉన్న బాణా కర్రతో ఆ సిపాయిలను ఎదుర్కొన్నాడు...."

"ఆ సిపాయిలు వెనక్కి వెళ్లి పోయారా అమ్మా...?"

"............."

"చెప్పమ్మా"

"....లేదు. సిపాయిల చేతుల్లోని తుపాకీ గుళ్లు హంపన్న గారి లోకి దూసుకు పోయాయి...

"అయ్యయ్యో...."

"అపుడేమయ్యిందమ్మా?"

"ఈలోపు...లోపలనుండి ఆ స్త్రీలు పెట్టిన ఆర్తనాదాలకు...గొడవకూ, ఆ దరిదాపుల్లో ఉండే రైల్వే పోలీసులు వచ్చి, హంపన్నగార్నిహాస్పిటల్ కు తీసుకువెళ్లారు..."

"మరి బ్రతికారా?"

"రక్తం ఎక్కువగా పోయిన హంపన్నగారు...."

"చని పోయారా?"

"అవును...."

"ఆ స్త్రీలు హంపన్నగారికి చుట్టాలా అమ్మా?" చిన్న పాప అడిగింది.

"కాదు" చెప్పింది జయంతి.

"ఆయన కూడా మన దేశంవారు కాబట్టి...మన స్త్రీలను, ఆంగ్లేయులు వెంటాడుతుంటే, ఎదురు తిరిగారు.

“అంతే కదమ్మా?" పెద్దపాప అడిగింది తల్లిని.

తన బిడ్డకు మాతృదేశం వారి పట్ల కలుగుతున్న సదభిప్రాయానికి సంతోషం కలిగింది జయంతికి...

********

"అమ్మా...కాలింగ్ బెల్ నొక్కుతున్నారెవరో..."

పిల్లల్ని తప్పించుకుని జయంతి వెళ్లి వరండా తలుపులు తెరచింది, తల్లితో పాటే లేచివచ్చారు పిల్లలు.

ఎదురుగా అపరిచిత యువతి!

"ఎవరు కావాలమ్మా?" అడిగింది జయంతి.

"విరజ...వాళ్ళయిల్లు ఇదేకదండీ?" ప్రక్కన తాళం వేసిఉన్న పోర్షన్ వేపు, గోడకున్న వాళ్ళనాన్నగారి నేమ్ ప్లేట్ అనుమానంగా చూస్తూ అడిగింది.

"అవును ఇదే. కానీ, వాళ్ళు లేరు ఊరెళ్ళారమ్మా"

"అలాగా..." నిరాశగా అంది యువతి.

"ఎక్కడనుండి వచ్చావమ్మా?"

"గుడివాడ నుండి అండీ! నేను, విరజ స్నేహితులం...పదిరోజులుగా ఫోన్ చేసినా కలవటంలేదు. ఆ మధ్య తనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పింది...చూసి పోదామని వచ్చాను..."

"అలాగా...మొన్న వాళ్ళ స్వగ్రామం వెళ్లారు, తనకి టైఫాయిడ్, తగ్గింది లే, లోపలికి రామ్మా, కూర్చో ...మంచినీళ్లు తెస్తాను." చెప్పి లోపలికి వెళ్ళింది జయంతి.

వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుందా యువతి. మంచి నీళ్లిస్తూ పరిశీలనగా ఆ అమ్మాయిని చూసింది జయంతి. వయస్సు పందొమ్మిదేళ్ళుండవచ్చు. వయసు తెచ్చిన వన్నెతో మరింత ఆకర్షణీయంగా ఉంది. ముఖమంతా అలుముకున్న స్వేద బిందువులతో, రేగిపోయిన ముంగురులతో... కాస్త అలసటగా కనిపిస్తోంది...లోపలికి వచ్చేపుడు బైట విడుస్తున్న చెప్పులు చూసింది. ఒక చెప్పు తెగి...పిన్ను పెట్టి ఉంది... ఇంటి దగ్గర నుండే అలా వేసుకొచ్చినట్లుగా అనిపించడం లేదు. ...దారిలో తెగి ఉంటుంది..ఖాళీ గ్లాసు తిరిగిస్తున్న ఆమెతో

"విరజ వాళ్ళొస్తే..ఎవరని చెప్పను?" అడిగింది జయంతి.

"యువరాణి వచ్చిందని చెప్పండి" అందా అమ్మాయి.

"అబ్బ! నిజంగా! ఏ దేశానికి అక్కా!?" తల్లిచాటున ఉన్న చిన్నపాప ఆశ్చర్యంగా అడుగుతూ ముందుకు వచ్చింది, మెరిసే కళ్ళతో చూస్తూ.

ఆ పిల్లకు అమ్మ చెప్పే రాజురాణి కథలు గుర్తుకొచ్చాయి.

ఫక్కున్నవ్వింది యువరాణి. తనూ నవ్వుతూ మురిపెంగా ఆపిల్ల తలమీద మొట్టింది తల్లి.

చెల్లి అడిగిన ప్రశ్నకు జవాబు కోసం చూస్తోంది పెద్దపాప.

నవ్వాపుకుంటూ చెప్పింది యువరాణి.

"మా ఇంటికమ్మా...దేశానికి కావాలంటే..ఓటింగ్ లాంటి చాలా తతంగాలుంటాయని...మా నాన్నగారు ఏకగ్రీవంగా తీర్మానించేసి, మా ఇంటికే 'యువరాణి' ని చేసేశారు..." చినపాపకు చెప్పి, జయంతితో అంది
"....నా పేరే అదండీ!"అని.

నవ్వుతూ "బాగుందమ్మా" అంది.

"ఎండలో వచ్చావ్...భోజనం చేద్దువుగాని  లే..."

"లేదండీ భోజనం చేసే బైలు దేరాను. గంట ప్రయాణమే కదా..." అంటూ

"పాపా మీ పేర్లేమిటి?" అడిగింది.

జయంతి లోపలికి వెళ్ళింది.

డాడీ పెట్టిన పేర్లా..అమ్మ పెట్టినవా?" పెద్దపాప సందేహం.

"రెండూ చెప్పేద్దాం లే అక్కా."

"డాడీ నన్ను 'బ్యూటీ' అంటారు,

అమ్మ 'సౌందర్య' అంటుంది.", పెద్దపాప చెప్పింది.

"డాడీ నన్ను 'స్వీటీ' అంటారు.. అమ్మేమో 'మాధుర్య' అంటుంది."

"ఓహ్...మీ డాడీ ఆంగ్లానికి అమ్మ తెలుగు అనువాదాలన్న మాట మీ పేర్లు...బావున్నాయ్... స్వీటీ, మీకు స్వీట్స్  ఇస్తాను...రండి!" యువరాణి హ్యాండ్ బ్యాగ్లోనుండి విరజ కోసం తెచ్చిన స్వీట్ బాక్స్ తీసి ఇచ్చింది.

అప్పుడే మజ్జిగ గ్లాసుతో వచ్చిన జయంతి ఇస్తూ అంది.

"ఇవైనా తాగమ్మా"అని. కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాక, లేస్తూ అంది  యువరాణి.
"మరి...నేను వెళ్ళొస్తానండీ! అని.

"చీకటి పడబోతోంది, మబ్బులు పడుతున్నాయి కూడా. ఒక్కదానివి...రోజులు బాగాలేవమ్మా...బస్ స్టాండ్ వరకు తోడు పంపటానికి మావారింక రాలేదు..." జయంతి మాటలకు నవ్వుతూ అంది యువరాణి.

"పట్టపగలు అయినా మనకు రక్షణ ఉందనుకుంటున్నారా? వచ్చేపుడు ఏమైనదో తెలుసా అండీ?"

"ఏమయ్యింది?"

" విరజ చెప్తూ ఉండేది...'మాఊరు ట్రైన్ కి వస్తే...స్టేషన్లోదిగితే, ఆ ప్రక్కనే ట్రావెలర్స్ బంగ్లా ఉంటుంది...దాని ప్రక్కగా ఉన్నదారిగుండా ఒక్కఐదునిమిషాలు నడిస్తే వచ్చే కాలనీలో రెండవఇల్లే మాది. అదే బస్ కి వస్తే...దిగి మళ్లీ ఆటో చేయించుకోవాలి...చాలా చుట్టూ...తిరగాలి అని..."

"అవును, మేమూ ట్రైన్ కే వెళతాం"

"అలాగే వస్తూ...బంగ్లా ప్రక్కనే ఉన్న పంపు చూశాను. అప్పటికే చాలా దాహంగా ఉండటంతో ఆగి, ఓ చేత్తో పంపుకొడుతూ మరో చేత్తో త్రాగే ప్రయత్నం చేస్తున్నాను. కాస్త అవతలగా ఒకతను సిగరెట్ కాలుస్తూ నిలబడిన వాడు వచ్చి..."నీవు తాగు" అని పంపు కొట్టాడు. కొట్టటం ఆపాక...చటుక్కున వచ్చి...నన్ను పట్టుకున్నాడు...నేను 'వదల' మంటూ పెనుగులాడుతుంటే...అసభ్యపు మాటలతో...వాగసాగాడు..."

"అయ్యో...ఎవరు లేరా?"

"లోపల నుండి మాటలు విపిస్తున్నాయ్...నేను టెన్త్ చదివేప్పుడిలాగే ఎవరో ఏడిపిస్తున్నారని మా నాన్నగారికి చెప్పాను..."

"ఏమన్నారు?"

"మర్నాడే తీసికెళ్లి కరాటే క్లాస్ లో జాయిన్ చేశారు. చేసి ఓ మాట చెప్పారు..."

"ఏమని?"

"నేనో మరొకరో ఎప్పుడూ నీ వెంటే ఉండం. తిరగబడు...తిరగబడితే ఒంటికి మాత్రమే గాయాలవుతాయ్! ఊరుకుంటే...జీవితం మొత్తం గాయాల పాలవుతుంది!! నిన్ను నీవు రక్షించుకో! అందుకు ఇదే మార్గం!" అని చెప్పారు.

"మంచి మాట చెప్పారు"అంది జయంతి.

"ఆ విద్యే ఉపయోగ పడింది...నేనిలా ఎదుర్కోగలనని వాడు ఊహించలేదు...ఈ గలాభాకి లోపల
నుండి ఓ ఇద్దరు ముగ్గురు చేతుల్లో పేకముక్కల తోనే బైటకొచ్చారు...."

".............."

"నీ బుద్ధి మారదయ్యా...ఆపిల్ల జోలినీ కెందుకు? అని, తిడుతూ...

"సారీ అమ్మా,...నీవెళ్ళు"అన్నారు. వాడికి మెడ పట్టేసి నట్లుంది...వంకరగా పెట్టుకుని పోయాడు..."

"అప్పుడేనా...చెప్పు తెగింది?"

"అరె... భలే కనిపెట్టేశారే!" నవ్వింది యువరాణి.

"మంచిపని చేశావమ్మా" అంది జయంతి.

"సరే, వస్తానండీ!" అందరూ వాకిట్లోకి వచ్చారు.

యువరాణి చెప్పులేసుకుంటోంది.

"అరుగో...మావారు వచ్చేశారు...ఆగమ్మా..బండి మీద తీసుకెళ్లి, బస్ స్టాండ్ లో దించుతారు" జయంతి.

అటుచూసిన యువరాణి
"వీడా!?" అసంకల్పితంగా అనేసింది. అవాక్కయ్యింది జయంతి.

బైక్ ఆపి, అక్కడే నిలబడిన మోహన్ అయోమయంగా చూడసాగాడు వీళ్ళ వైపు!

తండ్రిని చూసే ధ్యాసలో రాణీ నోట "వీడా!"అన్నమాట వినని పిల్లలిద్దరూ తండ్రి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లారు.
"డాడీ...ఈ అక్కమీద ఎవడో ఒక ఆంగ్లేయుడు కలబడితే ...అక్క భలే కరాటే కిక్ లిచ్చిందట..."
"మాక్కూడా కరాటే నేర్పించు డాడీ!"

పిల్లల మాటలు వింటూ...మోహన్ వైపోసారి చురుగ్గా చూసి, ముందుకు నడిచింది యువరాణి.

Posted in July 2022, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!