Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

పది రోజులు శలవు పెట్టేసింది కవిత.

ఆరు రోజుల తర్వాత మళ్ళీ “పబ్” కెళ్ళింది కవిత. ఈ సారి ఆమెకి భయం వేయలేదు. ఎంతో అలవాటున్నట్టుగా ఉంది. ఒక అరగంట తర్వాత ఒకమ్మాయి తూలుకుంటూ వచ్చింది కవిత దగ్గరికి.

“ఓ నువ్వా?” అంది.

తాగిన మైకమేమో అనుకుని –

“అవును నేనే!” అంది కవిత.

“నిన్ను బోల్డు సార్లు చూశాన్లే! అంది ‘పోపోవే’ అన్నట్టు.

“ఎప్పుడూ?” అడిగింది కవిత.

“గ్రేట్ ఫిగర్ వనీ ఎక్కడున్నవి అక్కడక్కడ భలే మజాగా ఉన్నాయని, అప్సరసని తలదన్నేలా ఒకత్తుందని చెప్తే... ఓ... చూశాను. దీపక్ నావాడు. లాగేసుకున్నావు కాదే రాక్షసీ!” అంది. కవిత మొహం మ్లానమయింది.

“పొన్లే! పోతే పోయాడు. అంతకు వెయ్యిరెట్లు సాహసవీరుడు దినేష్ దొరికాడు నాకు. నేనంటే ఎంత ప్రేమో తెలుసా?” అంది.

కవిత ఆవేశంగా ఒక పెగ్ వేసుకుంది. ఆ పిల్ల పడీ పడీ నవ్వింది.

“ఏంటేంటి? అబ్బో! అబ్బబ్బో! నువ్వసలు తాగే తాగవనీ క్లబ్బులు, పబ్బులు నచ్చే నచ్చవనీ, చాలా పతిత్తువనీ తెగ కోశాడు నా దగ్గర! ఎన్నో ఆనందాల్ని కాదనుకునే పల్లెటూరి గబ్బిలాయి అన్నాడు నిన్ను దీపక్ నా దగ్గర!” ఇంకా ఇంకా నవ్వుతూనే ఉంది ఆ పిల్ల.

దామిని పరుగెట్టుకొచ్చి కవితని దగ్గరగా తీసుకుని-

“ప్చ్! సారీ! వెరీ వెరీ సారీ! పువ్వులాంటి నిన్ను ఒక్కదాన్నీ వదిలి వెళ్ళాను. అది ఆ రాస్కెల్ దీపక్ కి అర్ధం కాలేదు!” అంది.

“దామినీ! వాడు నామీద బాడ్ గా ప్రాపగాండా చేస్తున్నాడు!” ఏడ్చేసింది కవిత.

“చస్! అది నీప్లస్. అయినా నీకు నేనున్నాను!” భరోసా ఇచ్చిఅక్కడినుంచి తీసుకొచ్చేసి ఇంటిదగ్గర జాగ్రత్తగా దింపింది. తాను తాగుతానన్న విషయం అన్నయ్య, వదినలకి తెలియకుండా అతి జాగ్రత్తగా మేనేజ్ చేస్తోంది.

****

మర్నాడు ఆఫీసులో అడుగుపెట్టగానే దేవేందర్ అదోలా నవ్వాడు. వాడి ముందు సిగరెట్ వెలిగించి పొగ పీల్చి, మొహం మీద వదిలి “ఛీ” కొట్టింది. బిత్తరపోయాడు దేవేందర్.

మరో మూడునెలలు గడిచాక ముంబైలో ఉండలేనని అనిపించి దామిని తో సీరియస్ గా చెప్పింది. అప్పుడు తన తండ్రి పలుకుబడి ఉపయోగించి వైజాగ్ లో మంచి జాబ్ చూపించింది దామిని. అలా కవిత తన ఊరు ముఖం పట్టింది.

ఆమెలో ఎంతో మార్పు! ప్రేమ ఆమె పసితనం, అమాయకత్వం బలి తీసుకుంది... ఇదివరకటి పసిగారు మొహం మాయమైంది.

ఇప్పుడు కవిత ఎటువంటి సంకోచం లేకుండా దమ్ము కొడుతుంది. ఎవరెలా చూసినా పట్టించుకోదు. ఆమెని సాగనంపడానికి అన్న, వదినా, దామిని మాత్రమే స్టేషన్ కి వచ్చారు. కవిత అన్నయ్య తన ఫ్రెండ్ చూపించిన అపార్ట్మెంట్ లోనే దిగమని, తమ సొంత ఇంటికి వెళ్తే జ్ఞాపకాలు బాధిస్తాయని. స్టేషన్ కి తన ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసుకుంటాడని చెప్పాడు. అలా కవిత “లక్ష్మీ నగర్“ కాలనీ లోని “బడ్డీ ఎన్ క్లేవ్” కి చేరింది.

******

గుంటూరు! బ్రాడిపేట! పద్దెనిమిదవ అడ్డరోడ్డు!! ఓ మోస్తరు బంగ్లా!!

ఎవరన్నారు జరిగిపోయిన వేవీ తిరిగి రావని! బాల్యం ఎప్పుడూ మనిషిని వదలనట్టు యవ్వనం ఎప్పటికీ వీడనట్టు, జ్ఞాపకాలు మనిషిని కుదిపెయ్యవూ? ప్రౌడ వయసులో మాత్రం యవ్వనాన్ని ఎందుకు వదులుకోవాలి? జీవితం మరీ ఒక్కటే అయినప్పుడు. కాలం మారుతోంది. ఎన్నెన్నో ఆధునిక పోకడల్ని మోసుకొస్తోంది. ఏం? ఏదైనా రాసి పెట్టి, ముద్ర కొట్టిఉందా ఐఎస్ఐ మార్కు లాగా! ఇది ఇలా జరగాలి, లేకపోతే కుదరదని! ఒక్కసారి తిన్నగా ఆలోచిస్తే, ఆలోచించి చూస్తే మనసు యవ్వనంలోనే స్థిరంగా ఆగిపోయి అక్కడే గిరికీలు కొట్టడం చూస్తారు. శరీరానికి వచ్చే మార్పుని మనసు కొంచిత్ కూడా అంగీకరించదు.

పూలపడవలో తేలియాడుతూ సిరల్లోనుంచి, ధమనుల్లోనుంచి పయనించి, పయనించి ఊహాలోకాల్లో విహరించి విహరించి ఆ నింగి దాకా రెక్కలు తొడుక్కుని ఎగిరిఎగిరి అలిసాక మళ్ళీ హృదయాన్నే చేరుకోదూ? అలా శశికళ ఇప్పుడంత సంతోషంగా ఎప్పుడూ లేదు. దానికి కారణం మనోహర్ మళ్ళీ కనిపించాడు. కళ్ళు వెతుకుతూ... మనసు పిలుస్తూ ఉంటే ఆ పిలుపు వినబడి మళ్ళీ మనోహర్ కనపడ్డాడు.

నలబై ఏళ్ళు, కాలం తనని కొట్టిన దెబ్బ కొట్టకుండా పరుగెత్తిస్తే... విసిగి వేసారిపోతున్నప్పుడు మనోహర్ నవ్వుతూ ఎదురుపడ్డాడు. ప్రేమ తప్ప జీవితంలో ఏముంది?? అంతా ప్రేమే! మనోహర్ తో ఉన్న అనుబంధం నిజమనీ, అదే శాశ్వతమనీ ప్రేమ నిరూపించింది. మనోహర్ తన పదహారో యేట కదూ తనని ప్రేమించింది!

విధి దారుణంగా విడదీసింది... తనకి పెళ్లయింది. మనోహర్ కి పెళ్ళయిందని విన్నది. భర్తలో రాక్షసుడిని చూసింది. పారిపోయి జనారణ్యంలోకి వచ్చింది. పిచ్చిదానిలా ఊర్లో తిరగుతూ గాలివాటు జీవితం గడుపుతున్నప్పుడు ఒక ఎగ్జిబిషన్ లో మనోహర్ కనిపించాడు. అతడు వెళ్ళిపోతూ కనిపిస్తే...

“మనూ!” అని గట్టిగా అరిచింది. వెంటనే వెనక్కి తిరిగాడు.

శశికళ! తన చిన్నారి శశి!

తండ్రి మూర్ఖపు వాదనలతో, కుల పట్టింపులతో దూరమైన తన చిన్ననాటి చెలి. శశి కష్టాల గురించి ఎన్నో విన్నాడు మనోహర్. భర్తతో కలిసి ఉండడం లేదని కూడా!

“శశీ... ఇప్పుడు?”

“నువ్ విన్నది నిజమే!” అంది శశి. అప్పటిదాకా తనది యాంత్రిక జీవితమనుకున్నాడు. మళ్ళీ శశి ఇలా వసంతమై వస్తుందనుకోలేదు. కనీసం కళ్ళారా చూడగలడు! అనుకున్నాడు.

******

“చెప్పు బంగారూ! నీకోసం నేనేం చేయగలను?” అడిగాడు ఏదో మాట్లాడాలని శశి పిలిచినప్పుడు. దీపావళి రోజున సరదాగా కాల్చే బాంబు పేలకపోతే...ఎందుకా? అని దగ్గరికి చూద్దామని వెళ్తే “ఢాం”  అంటూ అదరగొట్టేసి గుండెచప్పుడు వేగాన్ని పెంచి బుర్ర పని చెయ్యడం మానేసినంత పనయ్యింది శశికళకి.

“ఎంత గొప్ప పిలుపు!”

లోకంలో ఒక్కడైన, ఒక్కసారైనా ‘బంగారూ!’ అనకుండా ఉంటాడా తన చెలిని?

*****

అది శశికళ బెడ్రూమ్! కూతుళ్ళిద్దర్లో ఒకరు బొటానికల్ టూర్ కి, ఒకరు కాలేజీకి వెళ్ళారు.

“మనిద్దరంకలిసి ఉందాం ఇక మీదట!” అంది శశికళ.

అప్పటిదాకా స్వర్గం చూసిన మనోహర్ పలబారినట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.

“ఎలా కుదురుతుంది? నీకు తెలియనిదేముంది?” అన్నాడు నెమ్మదిగా.

తన ప్రేమని అవమానం చేసినట్టు చిన్నబోయింది శశికళ. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు మనోహర్. నునుపుగా ఉన్న ఆమె భుజాన్ని రాస్తూ అనునయిస్తున్నాడు. ఆమె వింత హాయిని అనుభవిస్తోంది.

“ఏదో ఒక మార్గం ఉంటుంది మనో!” అంది.

“అవును.వెతుకుదాం!” అన్నాడు. ‘ఇన్నిరోజులూ నన్నెందుకు వదిలేశావ్!’ అని అడగాలని ఉంది ఆమెకి. గొంతుదగ్గర దు:ఖం అడ్డుపడి సుడిగాలిలా రివ్వురివ్వు మంటూ అక్కడక్కడే తిరుగుతోంది. నిస్త్రాణలా అతని ఒడిలో వాలిపోయింది. ఆకాశంలో పైన ఎగిరే ఒంటరి పక్షిలా తాను ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. ఎన్ని దిక్కులు వెతికింది? ఎన్ని రోజులు గిలగిల లాడింది!

“నేను లేనన్ని రోజులూ ఏం చేశావ్?” అడిగాడు ప్రేమగా.

“అప్పుడు నేనెక్కడున్నాను?” అంది జాలిగొలిపేలా.

“ప్చ్!” అన్నాడు.

“లావెక్కావ్!” నడుం చుట్టూ సరిపోని చెయ్యిని మరికాస్త బిగించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ.

“నచ్చడం లేదా ఇప్పుడు నేను?” అడిగింది.

“అంత మాట అవసరమా శశీ?”

“ఎంత మెత్తగా ఉన్నావో తెలుసా?” అన్నాడు. తెలీదన్నట్టు గబ గబా తల ఊపింది.

“ నాఊహంత!” అన్నాడతనిలోని కవి. అప్పుడొచ్చింది కన్నీరు శశికి.

“ఇంత ప్రేమని ఏం చేసుకోను?” అంది వెక్కుతూ.

“దాచేసుకో!”అన్నాడు.

“ఎలా? నాకాళ్ళకి సంకెళ్ళు. నేను బందీని!” అంది.

“ఒద్దమ్మా! ఈ తీయని క్షణాల్ని పదిలపరుచుకోని!” అన్నాడు గాద్గదికంగా.

అప్పటిదాకా భారంగా గడిచిన సమయం ఇప్పుడు ఉత్సాహంగా పరుగులు పెడుతున్నాయి. ఆమె కోసం అతడు. అతడి సమక్షంలో ఆమె. అప్పట్లో కలవలేని క్షణాల్ని తలచుకుంటూ లెక్కించుకుంటున్నారు. కలసిన క్షణాల్ని పోగేసుకుంటున్నారు. ఎలాగైతేనేం? ఇద్దరిలో మళ్ళీ యవ్వనం చిగురిస్తోంది.

******

కొత్త బిచ్చగాడు పొద్దెరుగడనేది సామెత!

“నిజం చెప్పనా?” పదమూడోసారి అడిగాడు మనోహర్.

ఆమె డైరీ లో నోట్ చేసుకుంది పదమూడోసారి అని. మృదుమధుర భావాల్ని ఒక దగ్గర పొందుపరచాలని ఆమె తపన. రెప్పవెయ్యకుండా తననే చూస్తున్న అతడిని _

“చెప్పరా మనూ!” అంది శశికళ.

నీ దగ్గర ఉన్నహాయి ఇంకెక్కడా దొరకదురా చిన్నీ!” మనసారా అన్నాడు.

“చిన్నీ!” అనే పిలుపుతో ఆమె పూర్తిగా మత్తులోకి కూరుకుపోయింది. అతడి ఒళ్ళంతా ముద్దులు కురిపించింది.

“ఎలారా తల్లీ? నీతోనే ఉండకుండా ఇలా గంటా, అరగంటా గడిపేది? అదే ఆలోచనతో సతమతమవుతున్నాను. నా అప్రయోజకత్వాన్ని నిందించుకుంటున్నాను. అప్పుడే పెద్దలని మనం ఎదుర్కోవాల్సింది. ఇప్పుడు – నాకా పెళ్లయింది. నాభార్య ఉత్తమురాలు. నోరు విడిచి నన్నేమీ అడగదు. ఏమీ అనదు. భర్తలో దైవాన్ని చూస్తుంది. కానీ ఆమె వల్ల నాకు ఒరిగేదేమీ ఉండదు. మరబొమ్మ. జడపదార్ధం. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా నాకొడుకు మహర్షి బాధ్యత ఉంది నాకు. వాడు కొద్దిరోజుల్లో అమెరికా వెళ్తున్నాడు. వాడికి దగ్గరుండి ఎన్నో ఏర్పాట్లు చేయాలి. నువ్వు మాత్రం బాధ్యతల్ని విస్మరించమని చెప్పగలవా పండూ?” అన్నాడు.

“అమ్మ ఇచ్చిన ఆస్తి ఉంది మనో! అది జీవితకాలం కాపాడుతుంది. నీకూ కొంత ఉపయోగ పడగలననే ధైర్యం ఉంది. పెద్దది ‘హేమ’కి కేంపస్ సెలెక్షన్స్ లో మంచి జాబ్ వచ్చింది. రెండోఅమ్మాయి’ సిరి’ కి మెడికల్ సీట్ వచ్చింది. తనకి హాస్టల్ లో ఉండి చదువుకోవడమే కమ్ ఫర్ట్ గా ఉంటుందని చెప్పింది. వాళ్ళు వెళ్ళగానే నువ్వు ఇక్కడే ఉండిపో మనో! బతిమాలింది.

ఆలోచించనీ శశీ! తొందర పడకు!” అన్నాడు మనోహర్.

అతడు సంఘజీవనం పట్ల చాలా మెలుకువతో, అప్రమత్తత తో ఉన్నాడు. పైగా పెద్ద హోదాలో ఉన్నవాడు. ఒక్కసారిగా తన నవనాడులూ కృంగిపోయినట్టు తోచింది శశికళ కి. ఆమెకి లోలోపల అసహనం మొదలయ్యింది. ముందు ఆలోచన లేని శశికి మొండితనం, మంకుపట్టు ఎక్కువ. తన అసహనం బయట పడకుండా జాగ్రత్త పడడం మంచిదనిపించింది. అపారమైన ప్రేమతో, చాతుర్యంతో అతడిని పూర్తిగా తన వశం చేసుకోగలననిపించింది. పెద్దగా శ్రమ పడకుండా సునాయాసంగా తన వాడవుతాడని తన మీద అతడికున్న ప్రేమ అటువంటిదనీ నమ్ముకున్న నమ్మకమంతా మేఘంలా విడిపోతోంది.

ఒక్కసారిగా మిన్ను విరిగి మీద పడినట్లు ఈర్ష్యాఅసూయలతో అట్టుడికి పోతోంది... తనని తన భార్య దైవంలా చూస్తుందని అతడన్న మాట ఆమెను రంపపు కోత కోస్తోంది. ఆలోచనలు మరింత వేగంగా పనిచేయడం మొదలెట్టాయి. చప్పున తేరుకుంది. మనోహర్ తన బాధ్యతల పట్ల చూపే శ్రద్ద, ముందుచూపు అతన్ని విలువైన వాడిగా నిలబెట్టి చూపిస్తున్నాయి. ‘తన ఎంపిక అత్యంత ఉన్నతమైనది’ అనుకుని తృప్తి పడడానికి ప్రయత్నిస్తోంది శశికళ.

ఆమెనే గమనిస్తున్న మనోహర్ ఆమెని చదవగలిగాడు.

“మనో! నాకింకెప్పటికీ నిశ్చింత లభించదా?” బేలగా అడిగింది. ఆమె బాధకి మనోహర్ హృదయం ద్రవించి పోయింది. దగ్గరగా తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు.

“నాకు కొంచెం వ్యవధినివ్వు. అంత నిరాశ పడకు. మహర్షిని ఫారిన్ పంపించాక ఒకటి రెండు నెలలు ఓపిక పడితే మనిద్దరం కలిసి ఉండేలా ప్లాన్ చేస్తాను. ఆలోచించుకోనీ!” అన్నాడు.

మాట ఇవ్వమంటూ చెయ్యి జాపింది. ఆమె పడకలో ఒకలాంటి మత్తులో ఉన్నాడు మనోహర్! చేతిలో చెయ్యి వేసేశాడు. ఆ చేతిని పట్టుకుని ఆనందంతో చేతుల్ని గట్టిగా ఉపేసిందామే!

******

మహాలక్ష్మి మనోహర్ భార్య. ముప్పై సంవత్సరాల క్రితం మనోహర్ ఇల్లాలిగా ఆ ఇంత అడుగు పెట్టింది. ఇంతవరకూ భర్త మాటకు ఎదురు చెప్పని మహాసాధ్వి! అతడెంత చెప్తే అంత! మనోహర్ వచ్చి తనని చూసి వెళ్ళాక తండ్రి మహాలక్ష్మితో చెప్పాడు. మనోహర్ తన ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించాడని ఒకే కులం కాకపోవడం వల్ల మనోహర్ తండ్రి ఒప్పుకోలేదనీ, అతడి గతాన్నీ మరిపించే మంచి భార్యవి అవుతావనే నమ్మకం తనకి ఉందని తండ్రి చెప్పాడు. తండ్రి అంటే ఉన్న భయం వల్ల మహాలక్ష్మి అన్నింటికీ తలఊపింది. కానీ, ఎందుకు మరో అమ్మాయిని ప్రేమించిన వాడికి తనని కట్టబెడుతున్నారని అడగలేకపోయింది. మనోహర్ కి భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టాక తన తండ్రి పేదరికం, మనోహర్ ఇంటి ఐశ్వర్యం తెలిసింది. తండ్రి ఎందుకు ఈ పెళ్ళి చేశాడో బోధపడింది.

కొన్నాళ్ళకి మనోహర్ లో చంటిపాపని కూడా చూసింది. ఆ ముప్పై సంవత్సరాల్లో అతడు ఆఫీసు, ఇల్లు తప్ప బయిట పెద్దగా తిరగడు. అఫిషియల్ కేంప్స్ కి వెళ్ళినా టైమ్ టు టైమ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నది, ఎపుడు వచ్చేది చెప్పేవాడు. అతను ప్రేమించిన అమ్మాయికి చాలా కాలం వరకు వివాహం కాలేదని, తర్వాత సమాధానపడి పెళ్ళికి ఒప్పుకుందని తెలిసాక భారం దిగిపోయి, నిట్టూర్చి దేవుడికి కోటి దండాలు పెట్టుకుంది మహాలక్ష్మి. ఆమెకి పతివ్రతల కధలు, నోములు, వ్రతాలు అంటే భక్తి. భర్త కోసమే తాను బతుకుతోందనీ, అతడి కోసమే తనని దేవుడు పుట్టించాడని నమ్ముతుంది.

పెళ్ళయిన కొత్తల్లో ఉపవాసాలు చేస్తే భర్త తిట్టాడని చెప్పకుండా కొన్ని, అనుమతి తీసుకుని కొన్ని చేసి, చెప్పని వాటికి టపా టపా లెంపలు వేసుకునేది. మనోహర్ ఆమె కంటిపాప. ఇంటి వెలుగు. ఇంటిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచేది. నెమ్మది, మెత్తదనం ఆమె స్వభావం! పిల్లలకి కూడా ఆమె స్వభావమే వచ్చింది. ఏ గొడవా లేని చల్లని సంసారం ఆమెది.

అలాంటిది. ఎప్పుడూ లేదు, ఈమధ్య ‘డ్యూటీ’ అంటూ మాటి మాటికి ‘కేంప్’ ల పేరుతో బొత్తిగా ఇంట్లో ఉండని భర్త మీద అనుమానం పొడజూపింది. అది మహావృక్షం కాకముందే తీసిపారేయాలని నడుం కట్టింది. ఆరా తీసింది, తీసింది. దొరకలేదు. మహాలక్ష్మి కి నిద్ర పట్టడం మానేసింది. పోగా, పోగా వంట మనిషి ‘కాంతం’ కూపీలు బాగా లాగుతుందనీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో తెలుసుకుని పనివాళ్ళతో గుస గుస లాడడం ఆమె ‘హాబీ’ అని తెలుసుకుంది.

ఆమెకి బాగా డబ్బిచ్చి సంతోషపెట్టాక మనోహర్ ఒకసారి ఎగ్జిబిషన్ లోనూ, మరొకసారి పబ్లిక్ పార్క్ లోనూ కనపడ్డారని యధాలాపంగా చెప్పినట్టు చెప్పింది. డ్రైవర్ ని మంచి చేసుకుంటే విజయవాడలో ఒక కేంప్ లో ఎవరో ఒకామెతో డబుల్ బెడ్ రూమ్ బుక్ చేసినట్టు తెలిసిందని చెప్పింది.

“ఛీ! నోర్ముయ్! అయ్యగారికి సవాలక్ష పనులుంటాయ్!” అని, ‘క్లూ ‘దొరికిందా...కుమ్మి పారేయనూ!... అనుకుంది లోపల.

మనోహర్ భార్య పద్దతీ, మాటి మాటికి ఏడుపులు కనిపెట్టాడు. కొన్నాళ్ళు ఇంటి పట్టునే ఉన్నాడు. భార్యకి తరుచూ ఫోన్లు చేస్తూ మాట్లాడుతున్నాడు. పిల్లల విషయాలని శ్రద్దగా అడుగుతున్నాడు. అనుకోకుండా పెద్దకూతురు అత్తగారికి ఒంట్లో బాగుండకపోతే కూతురికి సహాయంగామహాలక్ష్మి వెళ్ళక తప్పలేదు. మనోహర్ ఆనందం చెప్పనలవి కాకుండా ఉంది... వెంటనే ‘శశి’ ముందు వాలాడు.

రెండు నెలల తరవాత తన ఇంటికొచ్చిన మనోహర్ ని చూడగానే పరుగెట్టుకొచ్చి వాటేసుకుంది శశికళ. అప్పుడే పెద్దపిల్ల హేమ ఏదో కావాలని హాల్లోకి వచ్చింది. తల్లి ఎవర్నో కౌగలించుకోవడం చూసి నోటమాటరాని దానిలా నిల్చుండిపోయింది. గిర్రున తన గదిలోకి వెళ్లి తలుపు బిగించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

మనోహర్ ఒక నిశ్చయానికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. టి.వి. ఆన్ చేసింది శశికళ.

భయంకరమైన మౌనం!! ఏదో తట్టుకోలేని హెచ్చరిక. నాలుగు రోజులు శాంతి లేకుండా గడిచాయి. కూతురి మౌనం రంపపు కోతనిస్తోంది శశికి.

వారం రోజుల అయ్యాక _

‘తనకి హైదరాబాదులో పోష్టింగ్ అని చెప్పింది. హేమ. శశి భోరుమంది. ఆ ఒక్క మాటైనా తన కూతురు తనతో మాట్లాడినందుకు ఒక్కసారి తాను మాట్లాడే అవకాశం ఇమ్మంది. ఆ పిల్ల తల వంచుకునే ఉంది. తన చిన్నప్పటి ప్రణయం, పెద్దల తీర్పు, భర్త హింస అంతా కూతురికి చెప్పుకుంది. అది విన్న హేమ,

“నీ జీవితం నీదేనమ్మా! కానీ మా జీవితాలు తండ్రి తిరుగుళ్లకి, తల్లి ప్రేమకధకీ బలయ్యాయి కదా? మాకిదంతా సరిపడదమ్మా. చెల్లి ఈ వారంలో హాస్టల్ కి వెళ్లిపోతుంది. మంచీ-చెడూ నీకు తెలియనిదా?” అని వెళ్ళిపోయింది. మూడు రోజుల్లోనే చిన్న కూతురూ వెళ్ళిపోయింది.

******

ఆ సాయంత్రం ఆతృతగా వచ్చిన మనోహర్ శశి చిరునవ్వుతో మురిసిపోయాడు. అప్పుడప్పుడు వారం రోజులకు పైగా రాలేకపోతాడు. గతంలో అప్పుడు ఎదుర్కునే సంఘటనల్ని ఊహించుకుంటూ అడుగుపెట్టి ఆ నవ్వు చూసి మురిసిపోయాడు.

“శశీ! లక్ష్మీకేదో డౌట్ వచ్చినట్టుంది. ఒకటే ఏడుపు. అది కేవలం డౌటేనని నమ్మించేందుకు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.” అన్నాడు.

మళ్ళీ నవ్వింది శశి.

“అమ్మయ్య! నీ నవ్వు వెయ్యి ఏనుగుల బలం నాకు. ఇలా మనం తిరిగి ఈ విధంగా ఉంటామని కలలో కూడా అనుకోలేదు. ఇది కలా...నిజామా?” అన్నాడు. అతని సూట్కేస్ ని ఆనందంగా లోపలికి తీసుకు వెళ్ళింది. ఇద్దరి సహజీవనం పక్కాగా మొదలై పోయింది!

******

ఇంటికి తిరిగొచ్చిన మహాలక్ష్మి కి విషయం అర్ధమయిపోయింది. కాంతం పెద్దపెట్టున ఏడుస్తూ మనోహర్ ఇంటి నుంచి సూట్కేసు లతో సహా వెళ్ళిపోయాడనీ శశికళతో వేరే ‘సెట్టింగ్’ పెట్టాడని శివమెత్తినట్టు ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇంటికి వచ్చిన మనోహర్ వంటింటి గుమ్మం దగ్గర నించుని చూస్తున్నాడు, కాంతం ఏడుపు టక్కున ఆగిపోయింది. మనోహర్ ఏమి మాట్లాడలేదు.

“లక్ష్మీ! నువ్ త్వరగా వంట వండిస్తే ఆఫీస్ కి వెళ్లాలి!” అన్నాడు ఏమి జరగనట్లు.

“అయిదునిమిషాలు!” వినయంగా సమాధానం చెప్పి ఉరుకులు పరుగుల మీద స్నానం చేసేసి భోజనం రెడీ చేయించింది. ఇద్దరూ ఒక్క మాటామాట్లాడుకోలేదు. మనోహర్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఇల్లు చేరలేదు. మర్నాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు. నెమ్మదిగా పగలు రావడం కూడా తగ్గింది. అప్పటికి విషయం ఎంత దాకా వచ్చిందో అర్ధం అయింది మాలక్ష్మికి. అయిదో రోజు సాయంత్రం దాకా ఓపిక పట్టింది. మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంది. కానీ కాంతం మాత్రం మీ ఉప్పు తింటున్నాను గనక ఆ శశికళ ఇంటికి వెళ్ళి నిలదీయకపోతే ససేమిరా ఒప్పుకోనంది.

“అయ్యగారికిది మాములయిపోతుంది. మీకా నోట్లో నాలిక లేదు. ఇలా ఎన్నాళ్లూరుకుంటారు? ఈ సాయంత్రమే తాడో, పేడో తేల్చేయ్యండి!” అంది చిచ్చు మరింత రగిలిస్తూ. వేరే దారి లేక ఒప్పుకుంది మహాలక్ష్మి.

*****

కొంగు విదిల్చి నడుం చుట్టూ బిగించి బయలుదేరింది మహాలక్ష్మి. వెనుకే కాంతం. సరాసరి రాకెట్లా శశికళ ఇంటికి దూసుకు వచ్చింది. బెల్లు కొట్టకుండా అందరూ బయిటికి వచ్చేలా తలుపులు దబదబా బాదించింది. ఇరుగుపొరుగు బయిటికి వచ్చారు. అప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. శశికళ వెనుక కాస్తంత దూరంలో లుంగీ తో తన ఇంట్లో సొతంత్రంగా కూర్చున్నట్టు సోఫాలో దర్జాగా కూర్చుని ఉన్నాడు మనోహర్.

రుద్ర కాళిలా చూసిందతడి వైపు. తలదించుకుని ఉన్నాడతను. శశికళ ని బాల్కనీ లోకి లాగి జుట్టుపట్టుకుని వాయించి పారేసింది. మనోహర్ ని ఒక్క చూపు తోనే బెదిరించింది. అందరికీ అర్ధమయింది. భర్తని చూపుడు వేలుతో తన వెనుకే రమ్మని సైగ చేసింది. బట్టలు మార్చుకుని ఆమె వెంట పిల్లిలా నడిచి ఇంటిదారి పట్టాడు మనోహర్. కాంతం శశికళ మొహం మీద మెటికలు విరిచింది. సిగ్గుతో, బాధతో తలవంచుకుని గుడ్ల నీళ్ళు కుక్కుకుంది శశికళ!

కానీ ఇంటికి భర్తని తీసుకు వెళ్ళగానే మహాలక్ష్మి అతడి కాళ్లని చుట్టేసుకుంది. తాను చేసినది మహా పాపమనీ, తోటి ఆడదాన్ని అవమాన పరచడం తన అజ్ఞానమనీ, ఘోరమనీ పొగిలి పొగిలి ఏడ్చింది. కాంతం ఆశ్చర్యపోతుంటే కన్ను గీటింది.

పిల్లినే ఒక గదిలో బంధించి ఉంచితే ఎదురుతిరిగి గుడ్లు పీకి పారేస్తుంది. ‘అమ్మ అమ్మగారూ!” అనుకుంది. మనోహర్ మెత్తబడ్డాడు. ఆమెను ఒక్క మాటా అనకుండా గదిలోకి వెళ్ళి శశికోసం కుమిలి కుమిలి ఏడిచాడు.

ఆ రాత్రి మొత్తం భర్తని ఓదార్చింది మహాలక్ష్మి. లోకంలో పరువే ముఖ్యమనీ, మన సమాజంలో కొన్ని ఒడంబడికలు చేసుకుని ఒక రీతిగా బతకాలనీ నిర్ణయించిందనీ తద్వారా అందరి శ్రేయస్సు, విలువల్ని కాపాడడం కోసం ఇటువంటి గిరి గీసిందనీ, నీతిగా బతకి తీరాలనీ ఎన్నో హితబోధలు చేసింది. అన్నీ మౌనంగా విన్నాడు మనోహర్. అప్పటికి అవన్నీ వాల్యుబుల్ గా అనిపించాయి.

భర్త దారిలో పడ్డాక మళ్ళీ సాత్వికమయిపోయింది మహాలక్ష్మి. పదిహేను రోజులు అతడి వెనుకే తిరిగింది. ఆఫీసుకి కూడా వెంట వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి తెచ్చుకుంది. ఆ తరువాత వారం రోజులూ తనంత తానుగా ఇల్లుచేరాడు. ఆ రాత్రి మంచి మాటలాడి పిల్లల మీద ఒట్టేయించుకుంది బుద్దిగా ఉంటానని, పెద్దరికం తో వ్యవహరిస్తానని. ఒప్పేసుకుంటూ ఒట్టేసేసాడు. మధ్య రాత్రిలో మెలకువ వచ్చి భార్యా, పిల్లలమీద ఒట్టేయించుకుంది. ఒట్టేయించుకుంది సరే ‘ఇంకో ఆడదానితో తిరగను అని కాదుగా!’ అనుకున్నాడు తెలివిగా. శశి టచ్, మాటా గుర్తొచ్చింది.

“శశీ! నిన్నింక వదలను!” అనుకున్నాడు.

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in April 2024, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!