Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

ముంబై మహానగరం!!

చీమల పుట్టల్లా జనం! ఆ మహానగరానికొచ్చి ఆ జనాన్ని చూస్తే చాలు. ప్రశాంతంగా ఉన్న పొట్ట దానంతట అదే గడబిడ పుట్టించేస్తుంది.

అదిగో... ఆమె కవిత! క్రఫర్డ్ మార్కెట్ లో నడుస్తోంది.

అమ్మకాల అరుపులు! అంతా హిందీ లో సాగుతోంది.

“సరైన ధర! సరైన ఖరీదు! మళ్ళీ ఇంకెప్పుడూ ఇంత వెరైటీ రాదు! చాలా తక్కువ ధర. సరసమైన ధర! ఒక్క బాగ్ నూట ఏభై రూపాయలు మాత్రమే!

అరుపులు, కేకలు! రకరకాల హ్యాండ్ బేగ్ లు కుప్పలు, కుప్పలుగా పోసున్నాయి. చుట్టూ చూసింది. ఒకటే తొక్కిసలాట. రకరకాల వస్తువులు రోడ్ల మీద పోగులు. క్రఫర్డ్ మార్కెట్ జనాల్ని చూసి ఇక్కడ తానేమైనా కొనగలదా? ‘కొలాబా’ మార్కెట్ లో తానున్న ప్లేస్ లోనే తీసుకోవాల్సింది అనుకుంది.

“తీసుకో మా! సరసమైన ధర” బాగ్ ఒకటి అందించాడు షాప్ ముందున్న ఒకడు. చూడముచ్చటగా ఉందది. మెరూన్ కలర్. చెయ్యి చాచి అందుకునే లోగా ఒకతను దాన్ని అందుకున్నాడు. అతడికి కావాలేమో అని కవిత వదిలేసింది. ఒక బాగ్ కోసం ఇద్దరు పోటీ పడడం చూసి-

“మేం సాహబ్... ఒకే డిజైన్ లో రెండు మూడు పీస్ లు ఉంటాయి. భయ్యా! ఒన్ మినిట్!” అని-

“దామన్! ఇంకో పీస్ వెంటనే తీసుకురా! అని పురమాయించాడు. అక్కడున్న కుర్రాడొకడు చాకులా పరుగెట్టాడు. కవితని చూసి పలకరింపుగా నవ్వాడు పక్కన ఉన్న కష్టమర్.

“మీరెక్కడనుంచి?” అడిగాడు ఇంగ్లీష్ లో.

“వైజాగ్!” క్లుప్తంగా అంది.

“ఓ! తెలుగువారా! నేను కూడా!”అన్నాడతను.

“ఉండేదెక్కడ?” అని అడిగితే చెప్పింది కవిత.

‘ఓ వెరీ నైస్. నేనూ అక్కడే! ఇటొచ్చాను కదా అని మా సిస్టర్కి ఒక బాగ్ తీసుకుందామని వచ్చాను!” అన్నాడు. కవితా చిన్నగా నవ్వింది మనీ ‘పే’ చేస్తూ.

“ఈ ఊర్లోనేనా మీ జాబ్?”అడిగాడు.

కంపెనీ పేరు చెప్పింది. జనం మధ్యనుంచి వెళ్ళడం అలవాటు లేని కవిత గాభరాపడుతోంది.

“నాపేరు దీపక్. నా ఆఫీస్ ఇక్కడికి దగ్గర. మీరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ మార్కెట్ కి వచ్చారు కదూ?” అంటూ గబుక్కున చెయ్యి పట్టి పక్కకి లాగాడు. కోపంగా తలెత్తింది.

“కోపం ఒద్దు. అటు చూడండి. ఎంత పెద్ద తోపుడు బండి. దాన్నిండా సామానే! తప్పుకోమని చెప్పకుండా దూసుకు వచ్చేస్తున్నాడు. జనం తప్పుకోడానికి కూడా టైమ్ ఇవ్వడం లేదు!” అన్నాడు. కృతజ్ఞత గా చూసింది కవిత.

“రండి! నేను కూడా కొలాబా లో ఉన్న మాయింటికే. డ్రాప్ చేస్తాను. అదిగో... అక్కడుంది నా మోటార్ బైక్” కాస్త దూరం లో ఉన్న బైక్ ని చూపించాడు... జనం లో నుంచి బయిటికి వచ్చాక!

“ఒద్దు...ఒద్దు... నేను వెళ్తాను!” అటుగా పోతున్న ఒక టాక్సీని ఆపి కూర్చుని డోర్ వేసేసింది. టాక్సీ ఫాస్ట్ గా దూసుకుపోయింది. ఆమె వెళ్ళిన వైపు ఒకసారి చూసి భుజాలు ఎగరేసి ముందుకి నడిచాడతను.

వారం తర్వాత ఫ్రెండ్ ‘లీనా’ తో సాయంత్రం సరదాగా తిరుగుతోంది కవిత. ఓన్లీ విండో షాపింగ్! లీనా చాలా అల్లరిది. అందరికీ ఏదో ఒక పేరు పెడుతుంది. నవ్వు వచ్చేట్లుగా ఉంటాయవి. ఒక షాప్ దగ్గర ఒక లావుగా ఉన్న ఒకామె పాన్ నములుతూ కూర్చుని ఉంది. వ్యాపారం మీద అసలు దృష్టి లేదు. లీనా అదీ ఇదీ బేరం ఆడడం మొదలు పెడితే తోచిన ధర చెప్తోందామే!

“ఏయ్! గుమ్మడికాయ నోటికొచ్చిన రెట్టింపు ధర చెప్తోందే కవితా!” అంది. దిగ్గున లేచింది ఆవిడ.

“ఏందీ? నేను గుమ్మడికాయనా? నువ్వు కాకరకాయవి కాదూ? నాకు తెలుగు రాదనుకున్నావే నీ జిమ్మడా!” తిట్లందుకుదామె! లీనా మొదట బిత్తరపోయింది. ఆ తర్వాత పరుగులు, నవ్వులు. లీనాతో ఉంటే నిజంగా సరదాగా ఉంటుంది.’ అనుకుంటోంది కవిత.

“కవితగారూ! బాగున్నారా?’ దూరం నుంచే అడిగేస్తున్నాడు దీపక్. వడివడి గా వస్తున్నాడు తమ వైపు.

“ఎవరే?” అంది లీనా.

“క్రఫర్డ్ మార్కెట్ దగ్గర పరిచయం. ఒక్క పరిచయం తోనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు!” అంది.

‘ఇప్పుడు నాకు పరిచయం చెయ్యకే బాబూ! ఇప్పటికే స్నేహాలు ఎక్కువయిపోయ్యాయి. అదీగాక నాకు కొంచెం పనుంది.’ బైక్ స్టార్ట్ చెయ్యబోయింది. రెండు నిముషాలు అంటూ ఆపేశాడు అతను. పరిచయం అయ్యాక అతనేదో కాల్ లో ఉన్నప్పుడు –

“భలే అందంగా ఉన్నాడే” అంది లీనా పాముచెవులు. విన్నట్టున్నాడు.

“నేనేనా? తెలుపు, ఎరుపుల కలయిక అండి. అమ్మ కాశ్మీరీ. నాన్న గుంటూరు. లవ్ ఇన్ ముంబై.” అన్నాడు నవ్వుతూ. నవ్వింది లీనా.

“రండి! రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుందాం!” ఆహ్వానించాడు.

“నాక్కొంచెం పని ఉందండి. కవిత! వస్తుంది!” అంది స్కూటీ స్టార్ట్ చేస్తూ.

“అలాగే! కానీ మళ్ళీ కలవాలి మనం!” అన్నాడు. తల ఊపి వెళ్లిపోయింది లీనా.

ఇతనెవరో తెలియదు. ఈ ముంబై లో ఇతనితో రెస్టారెంట్ కి వెళ్ళడం కరక్ట్ కాదేమో? ఆలోచిస్తోంది కవిత.

“మీ ఆలోచనలు నాకు తెలుసు మరేం పర్లేదు. ‘సుఖ్ సాగర్’ అని ఇక్కడ ఒక చిన్నరెస్టారెంట్ ఉంది. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ముందు ముందు నేనెంత మంచివాడినో మీకే తెలుస్తుంది.” అంటూ నడవడం మొదలుపెట్టాడు. అతని వెనుకే నడిచింది కవిత. కాఫీ తాగుతుంటే అడిగాడు.

“ఆర్ యు కంఫర్ట్ ఇన్ ముంబై?” అని.

“నో... అన్నయ్య, ఒదినా ఇక్కడ కొంతకాలం ఉండమని జాబ్ చూశారు. ఉద్యోగం మంచిది కదా అని జాయిన్ అయ్యాను!” అంది చిరాగ్గా మొహం పెట్టి.

“మరేం పరవాలేదు అలవాటయితే ఇదే హాయిగా కనపడుతుంది. అన్నాడు.

“మీ ఊరు... ఐమీన్ మీ స్వంత ఊరు?” అడిగాడు.

“వైజాగ్!” అంది.

“ పేరెంట్స్ అక్కడ ఉంటారా?”... ఆ ప్రశ్నకి గబగబా లేదంటూ తల ఊపింది.

“మరి?”

అప్పటికే ఆమెలో ఏదో మార్పు. కళ్ళల్లో నీళ్ళు ఊరుతున్నాయి. పెదాలు వణికి కన్నీరు జలజలా రాలింది.

“యాక్సిడెంట్లో... ఈ మధ్యే... త్రీ మంత్స్ బాక్ బెంగుళూరు కార్లో వెళ్తూ!” దు:ఖం అంతకంతకూ ఎక్కువయిపోతోంది  ఆమెకి.

“బాప్ రే! మైగాడ్! కమాన్ కవిత గారూ! కమాన్! వెరీ సారి!” అంటూ రుమాలు తీసి ఇచ్చాడు. వద్దని వారిస్తూ బాగ్ లో తన రుమాలు తీసి కళ్ళు తుడుచుకుంది. అతని ముందు ఏడ్చినందుకు సిగ్గుపడుతూ నవ్వింది. దీపక్ చాలా దయగా చూశాడు.

“ఈ రోజు నుంచి మనం స్నేహితులం!” అన్నాడు చెయ్యి చాస్తూ ఇంగ్లీష్ లో. అతని కళ్ళల్లోకి చూసింది.

“నమ్మండి నన్ను!” అన్నాడు చెయ్యి దించకుండా. ఆ కళ్ళల్లో స్నేహం,నిర్మలత్వం కనపడ్డాయి. తన చేతిని అతని చేతితో కలిపింది. ఆ చేతిని సుతారంగా పట్టుకుని బయటకు తీసుకు వచ్చాడు. జనం సందడిగా తిరుగుతున్నారు. వెహికిల్స్ ఫాస్ట్ గా హారన్ చేస్తూ స్పీడ్ గా వెళ్తున్నాయి. అతని చేతిని నెమ్మదిగా వదిలి తన చూపుడు వేలుని పెదవిపైన ఆనించి ఆలోచిస్తున్నట్టుగా నిలబడ్డారు. ఆమె కళ్ళు అతన్ని నిజంగానే బాధించాయి. శలవు తీసుకుని వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా-

“ఇప్పుడు టైమ్ అయిదు అయింది. మిమ్మల్ని సరిగ్గా ఏడింటికి ఇక్కడ దింపేస్తాను. చల్లని ప్రదేశం ఇప్పుడు మీకు చాలా అవసరం!” అన్నాడు బైక్ వెనుక కూర్చోమని సైగ చేస్తూ.

బైక్ ఆఘమేఘాల మీద సాగింది. అంత స్పీడ్ చూస్తుంటే భయం వేస్తోంది కవితకి.

ముప్పై నిముషాల తర్వాత వేగం తగ్గి మెత్తగా సాగిపోతోంది. నెమ్మదిగా గాలి వీస్తోంది. చుట్టూ ఎవరూ లేరు. దీపక్ నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ మౌనం ఎంతో బాగుంది. ఆ గాలిలో వినిపించని రాగాలేవో వినిపిస్తున్నట్టు ఉంది. రెండు నిముషాల్లో ఒక పార్క్ దగ్గర బైక్ పార్క్ చేసి లోపలికి నడిచారు. అది చిల్డ్రన్ పార్క్. పార్క్ లో పెద్దగా ఎవ్వరూ లేరు. పిల్లలు మాత్రమే ఆడుకుంటున్నారు. పౌంటెన్ నీటిని విరజిమ్ముతోంది.

“ఇక్కడ కూచుందాం” ఆమె మొహం లో పిల్లల్ని చూశాక వచ్చిన సంతోషం ఉంది. చుట్టూ ఎన్నో రంగుల పూలు! వాటి పరిమళాలు! ఆకాశం వైపు చూసింది. పక్షులు వరుసగా తాపీగా ఎగురుతూ గూళ్ళకి  చేరుకుంటున్నాయి.  వరుసక్రమం తప్పడం లేదు. ఒకదాని వెంట ఒకలా. ఒకేలా. ఎన్ని రోజులయింది ఇటువంటి ఆహ్లాదపరిచే దృశ్యాలు. అలా చూస్తూనే ఉంది. దీపక్ ఆమెని పలుకరించలేదు. ఏమీ అడగలేదు. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టాడు. ఎటువంటి డిస్టర్బెంస్ లేదు. మనసు కుదుటపడేలా ఏదో హాయి, ఏ ఆలోచనలు కలవరపెట్టని సమయం.

జీవితం ఎంత చిత్రమైనది? తానూ, తన బాల్యం, తల్లితండ్రులు, తన ఊరు అవే శాశ్వతమనుకుంది. ఒక్కసారే తల్లితండ్రులిద్దరూ వెళ్ళిపోవడమేమిటి? అన్నయ్యే గనుక తనతో ప్రేమగా, ఆదరంగా ఉండి ఉండకపోతే తనేమయి ఉండేది? వదిన స్నేహంగా ఉండకపోతే తాను ఇక్కడ ఉండగలిగేదా? కానీ, ఆ తృప్తి ఎక్కడా లేదు. ఏదో వెలితి. తనలో తాను లేనట్టుంది. ‘మమ్మీ’ ఎవరో అమ్మాయి గట్టిగా పిలిచింది. ఆ పిలుపుకి వాస్తవంలోకి వచ్చింది కవిత. దీపక్ ని, పరిసరాల్నీగమనించింది. దీపక్ కూల్ గా నవ్వాడు

“బావుందాప్లేస్?” అడిగాడు. తల ఊపింది.

“తెలుసా? మీరిక్కడ కూర్చుని గంట అయింది. పరిసరాల్ని కూడా మరిచిపోయారు. మొత్తానికి ఈ లోకంలోకి వచ్చారు!” అన్నాడు. నవ్వి టైమ్ చూసుకుంది.

“మిమ్మల్ని ఇంకో నలబై నిముషాల్లో దింపే బాధ్యత నాది” బైక్ దగ్గరికి రమ్మని సైగ చేస్తూ అన్నాడు హిందీలో.

“మిమ్మల్ని చూడగానే పోగొట్టుకున్నదేదో లభించినంత ఆనందంగా అనిపించింది. సో... మీరు నాకు లభ్యమయ్యారు!” అన్నాడు. అతడు హిందీలో మాట్లాడినంత కంఫర్ట్ గా తెలుగులో మాట్లాడలేడని అర్ధం అయింది.

“ముంబై లో మీరొక్కరే ఉంటారా? మీవాళ్లు?” అడిగింది.

“అమ్మ,నాన్నా పూణేలో. నా జాబ్ ఇక్కడ. నేనుండేది ఇందాక మీరు షాపింగ్ చేస్తున్న ప్లేస్ కి ఒకటిన్నర ఫర్లాంగ్ దూరం!”అన్నాడు. ఆమె మళ్ళీ టైమ్ చూసుకుంది.

“మీరేం వర్రీ అవకండి కవితా! నేను పద్దతి కలవాడిని. పైగా తెలుగువాడిని. మిమ్మల్ని భద్రంగా దించేస్తాను!” అన్నాడు. అన్నట్లుగానే “కోలాబా” దగ్గర దించేశాడు.

“థాంక్యూ!”అంది మనస్ఫూర్తిగా కవిత.

“వెల్కం కవితా! నన్ను మీరు దీపక్ అని పిలవొచ్చు. ఇదుగో నాకార్డ్!” అని ఇచ్చాడు. నిస్సందేహంగా తన నంబర్ ఇచ్చింది కవిత.

******

పదిరోజులు గడిచాయి. ఆఫీస్ వర్క్ తో బిజీ గా ఉంది కవిత. ఇంటికి రాగానే వదినకి కనపడి అన్నా, వదినల ప్రైవసీ కి అడ్డుగా ఉండకూడదని ఏదో ఒక వంక పెట్టుకుని ఇంటి దగ్గర ఉన్న మార్కెట్ రోడ్లన్నీ తిరిగి అక్కడున్న శివాలయానికి వెళ్ళి తొమ్మిదింటికి ఇంటికి చేరుకుని భోజనం చేసేటప్పుడు కబుర్లు చెప్తూ పదిలోపల తన గదికి చేరుకుంటుంది.

రోజులు రొటీన్ గా గడుస్తున్నాయి. అప్పుడప్పుడు ఎదురింటి లీనా తో గడుపుతుంది. లీనా మహారాష్ట్రియన్. హిందీ కూడా అనర్గళంగా మాట్లాడుతుంది. జోక్స్ వేస్తూ వేస్తూ మాట్లాడుతూ, మాట్లాడుతూ మాయమైపోతుంది. నాగేష్ అనే అబ్బాయిని పరిచయం చేసి తమిళ్ అబ్బాయితో ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవడం లేదని వాపోతుంది. లీనాతో బయిటికి కలిసి వెళ్ళినా మధ్యలో ఏదో ఒకటి నచ్చజెప్పి నాగేష్ తో వెళ్లిపోతుంది. రెండు నెలలపైనే అయింది ముంబై వచ్చి. ఒక్క ఫ్రెండ్ ని సంపాదించుకోలేదని నవ్వుతూ వెక్కిరిస్తాడు అన్నయ్య. వదిన తక్కువ మాట్లాడుతుంది.

ఆమె నేచర్ అంత! అవసరమైనంత మేరే గొంతుని వాడుతుంది తమాషాగా అంటూ ‘నా చెవిని తప్ప’ అంటాడు అన్నయ్య పకపక నవ్వుతూ. అన్నయ్య అల్లరిని నవ్వుతో స్వీకరిస్తుంది వదిన. అందంగా నవ్వుతుంది. వాళ్ళిద్దరి అన్యోన్యత కవితకి ముచ్చట!

******

ఆ రోజు ఆదివారం. ఆ సాయంత్రం ఒక షాప్ లో ఒక పెయింటింగ్ ని తీరికగా పరిశీలిస్తోంది.

“ఇది అంతగా బాగా లేదండి. ఇంతకు ముందు చూశారు చూశారు చూడండి బాలకృష్ణుడు సజీవంగా ఉన్నాడు!” అన్న వైపు చూసింది. దీపక్! పలకరింపుగా నవ్వి ఉత్సాహంగా చూసింది.

“ఒక్కసారీ కాల్ చేయలేదు” అన్నాడు.

“కొత్తకదా? కొద్దిగా మొహమాటం!” అంది.

“కృష్ణ పెయింటింగ్ పాక్ చేయండి!” అని హిందీ లో చెప్పి ‘మనీ’ ఇచ్చేశాడు.

“అదేంటి?” వారించబోయింది.

“ఈ పెయింటింగ్ నా గిఫ్ట్ మేడమ్. ఈ సాయంత్రం గుర్తుగా!” అన్నాడు.

పెయింటింగ్ పాక్ అయ్యాక ఆమెకి అందించాడు. ఆ తర్వాత ‘సుఖ్ సాగర్ రెస్టారెంట్ లో ఫిల్టర్ కాఫీ ఒక సిప్ తీసుకుని “వా! ఎక్స్ లెంట్!” అన్నాడు. రెండు నిముషాలు ఆగి -

“ఒక అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చి చాలా రోజులయింది. ఒక్క కాల్ చేయలేదు. మొహమాటం, కొత్త పోయి క్లోజ్ అవ్వాలంటే ఏదైనా ఉపాయం ఉందా?” ముందుకి ఒంగి అడిగాడు. నవ్వి –

“అదేం కాదు ఈ రోజు చేద్దామనే అనుకున్నాను!” అంది.

“కాదు. డౌట్! వీడు మంచివాడే నా... కాదా అని” అన్నాడు జోక్ చేస్తూ.

“లేదు. లేదు!” అంది గబ గబా. పకపకా నవ్వాడు దీపక్. నవ్వుతున్నప్పుడు అతని మొహం ఎర్రగా కందిపోతోంది. చక్కని పలువరుస మెరుస్తోంది. విచ్చుకున్న పెదవులు సుందరంగా ఉన్నాయి. తననే చూస్తున్న ఆమెని  కనిపెట్టి నవ్వాడు.

“బాగున్నాడు కదూ వీడు?” అన్నాడు తన వైపు చూపించుకుంటూ. గలగలా నవ్వేసింది.

“అది చెప్పాల్సింది ఎదుటివారు!” అంది.

“చెప్పండి చెప్పండి. నా రూమ్ మేట్స్ అనేవారు నవ్వితే ఎక్స్ లెంట్ రా నువ్వు!” అని.

“అది నిజం!” అంది ప్రశంసిస్తూ.

“వావ్! దీపూ! రేయ్ ఒక అందలరాశి నువ్వు అందగాడివని సర్టి ఫై చేసింది!” తన భుజం మీద తానే కొట్టుకుని అభినందించుకున్నాడు.

“సరే! ఇప్పుడు ప్రోగ్రామ్ ఏమిటి?” అడిగాడు

“కూరలు, పళ్లు కొనాలి!” అంది.

“కమాన్! ఇక్కడే మార్కెట్. కొనేద్దామ్!” అన్నాడు.

‘కొలాబా’ లో ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆపాడు బైక్.

“ఈరోజు మిష్టర్ దీపక్, మిస్ కవితల స్నేహం బలపడినందుకు కవిత గారు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పిస్తారు!” అని ఆర్డర్ ఇచ్చాడు. తింటున్నప్పుడు -

“మీకో నెంబర్ ఇస్తాను. రింగ్ ఇవ్వండి. కొద్దిగా అర్జంట్!” అన్నాడు. గబగబా అతను చెప్పిన నెంబర్ కి రింగ్ చేసింది. అతని పాకెట్ లోనుంచి మోగింది సెల్.

“అమ్మయ్య! కాల్ చేశారు. సేవ్ చేసుకుంటున్న!” అన్నాడు నవ్వుతూ. తన ఫోన్ ని ఆమె కళ్ళ ముందు ఉంచి మంచి అభినయం ఫోజు ఇచ్చాడు. ‘కవితా దిగ్రేట్’ అని తన పేరు రాసుకున్నాడు.

“అదేంటి? నా గ్రేట్!” అని నవ్వింది. ఫోన్ ని పెదాలకి చేర్చి ఆ పేరు మీద ముద్దు పెట్టాడు. అతడి ఉత్సాహం చాలా బాగుంది కవితకి. “ఒక కథ  చెప్పనా... పాతకథ!” అన్నాడు.

“కథా?” అంది ఆశ్చర్యంగా.

“య! మీరు శ్రమ పడి కూరలు కొంటుంటే అలసట తెలియకుండా ఒక కథ!” అని మొదలుపెట్టాడు.

“ఓ విదర్భ రాజ కుమారి పెళ్లీడుకి వచ్చింది. రాజుగారు స్వయంవరం ఏర్పాటు చేశారు. మీలా బ్రైట్ గా ఉండకపోవడం వల్ల...అని ఆపాడు. కవిత గుండె స్పీడ్ గా కొట్టుకుంటోంది. ఏం చెప్తాడోఅని. రాజుగారు అన్నీ ఏర్పాట్లు అదిరిపోయేలా చేశాడు. దేశదేశాలనుంచి యువరాజులు విడిది చేస్తున్నారు.

“అమ్మా! ఆనపకాయ ఎంత?” అని ఒక ముసలామెని అడిగాడు.

“పాతికరూపాయలు కిలో” అందామె.

“ఆనపకాయ మన ఊళ్ళో పది రూపాయలు. ఇక్కడ పాతిక అదీ కిలో మాత్రమే”. అంటూ ఏభై రూపాయలు ఇచ్చాడు.  చిల్లర లేదని పాలక్, ధనియా తీసుకో అని కొత్తిమీర ఇచ్చింది.

“ఇంతకీ యువరాణి సాహెబా ని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకి రావడం లేదు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కూడా కొనేయ్యండి. కథ లోకి వస్తే ఆమె అంత క్యూట్ గా లేకపోవడం వల్ల, రూపసి కాకపోవడం వల్ల, అందవిహీన కావడం వల్ల,... పళ్లు కూడా కొనేయండి. ఓ పని అయిపోతుంది.” అన్నాడు. ఫక్కున నవ్వింది కవిత.

“నవ్వండి నవ్వండి. నిజానికి రాజుగారు, అతని ఏడుగురు భార్యలూ అందమైన వారే! ఇక పోతే అటు ఏడు తరాల వారూ ఇటు ఏడు తరాల వారు కూడా ఏ ఒక్కరూ రాజకుమారిలా అందవిహీనంగా లేరు. పచ్చిమిర్చి, అల్లం మరిచిపోతే వంట కి రుచి ఉండదు.” అన్నాడు. పకపకా నవ్వింది. కొనడం మానేసి-

“సరేకానీ ఎందుకు రాజకుమారి అలా ఉంది?” అని అడిగింది.

“ఇదీ సరి అయిన ప్రశ్న. రాజుగారి అయిదోభార్య ఎన్నెన్నో నోములు నోచింది. టైము కుదరక ఉద్యాపన చేయలేదట!” అన్నాడు. నవ్వు ఆగలేదు కవితకి. అతడు నోముల కధ ఎందుకు చెప్పాడో అక్కడ అమ్ముతున్న మామిడాకులు, అరిటాకులు, పసుపు, కుంకుమ వగైరాలు బారులు తీరి అమ్ముతుంటే మర్నాడు మహారాష్ట్రీయులది ఏదో నోము అని తెలిసింది. మనుషులు ఆరోగ్యం కాపాడడం కోసం మామిడాకులు, గుమ్మానికి పసుపు వగైరాలనీ, ఉద్యాపనలు దానాలు చేయడం కోసమేనని పూర్వీకులు ప్రవేశపెట్టారని, దాన్ని మసి పూసి మారేడు కాయ చేస్తున్నారనీ అన్నాడు.

“ఇంతకీ ఉద్యాపన చేస్తే రూపం మారుతుందా?” కొంటె ప్రశ్నవేసి, నవ్వుతూ ఇంటిదగ్గర దింపేశాడు.

****

దీపక్ స్నేహం, కబుర్లతో మూడునెలలు మూడు రోజులుగా గడిచాయి. దీపక్ ఫ్లాట్ కి రెండు మూడుసార్లు ఎటువంటి సంకోచం లేకుండా వెళ్లింది. ఎంతో సంస్కారయుతంగా ప్రవర్తించాడు దీపక్. వచ్చే ‘మండే’ తన పుట్టినరోజనీ, ఇంట్లోనే తన కొద్దిమంది ఫ్రెండ్స్ తో జరుపుకుంటున్నానని ఆహ్వానించాడు. కొద్దిమందే అన్నాడు గానీ చాలా మందే ఫ్రెండ్స్ ఉన్నారతడికి. చాలా గ్రాండ్ గా ఉంది అలకరణ.

కవితని అందరికీ పేరు పేరు నా పరిచయం చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. అందరూ శ్రద్దగా, ఇంట్రెస్ట్ కనపరుస్తూ మాట్లాడుతూ ఉంటే కవితకి చాలా సంతోషం వేసింది. పార్టీ అవుతూ ఉండగానే కవితకి లేట్ అవుతుందని, దగ్గరే కనక డ్రాప్ చేసి వస్తానని ఫ్రెండ్స్ కి నమ్రతగా చెప్పి ఆమెను జాగ్రత్తగా దింపాడు. పది గంటలు దాటాక వచ్చినందుకు ఇంట్లో ప్రోబ్లమ్ ఏమి లేదని తను కాల్ చేశాక గానీ అతడు వెళ్ళలేదు. ‘కేరింగ్’ అంటే అదే!’ అనుకుంది.

మర్నాడు ఈవినింగ్ కాల్ చేశాడు దీపక్! ఆఫీస్ పని మీద నెల రోజుల కేంప్ అని, కాల్ చేస్తూ ఉంటానని, ఏ కారణంగా నైనా వీలుకాకపోతే అపార్ధం చేసుకోవొద్దని, హెల్త్ జాగ్రత్త గా చూసుకోమని చెప్పాడు. ఒక్కసారిగా నిరాశతో నీరసపడిపోయింది కవిత. పాటలు వింటూ, సినిమాలు చూస్తూ, విండో షాపింగ్ చేస్తూ గడిపినా మనసు లేక కాలం కదలనట్టు తోచింది.

లీనా గమనించి గమనించి ‘దీది! ఏమలోచిస్తున్నావు?’ అని అడిగేది. నెల రోజులు భారంగా గడిచాక తను వస్తున్నట్టు, వచ్చీ రాగానే తన ఇంటి దగ్గర తనకి స్వాగతం చెప్పాలని మెసేజ్ ఇచ్చాడు దీపక్. అతడొచ్చేవేళకి అతని ఇంటి దగ్గరే నిలుచుని నవ్వుతూ ఆహ్వానించింది. చాలా ఆత్రంగా దగ్గరకు తీసుకున్నాడు. నెమ్మదిగా విడిపించుకుంటూ అదొక ఆత్మీయ స్పర్శగా భావించింది. ఇంటినుంచి తాను తెచ్చినవి ఆప్యాయంగా తినిపించింది. ఆఫీస్ కి డుమ్మా కొట్టేసింది. రాత్రి ఎనిమిది దాటేవరకు అతని పక్కనే కూర్చుని ఉంది. అతడు ఆమె చేతిని తన చేతుల్లో ఉంచుకుని మాట్లాడడం, తనని తాకుతూ కూర్చోవడం మామూలుగా అనిపించింది. తొమ్మిది దాటుతోంది. తొమ్మిదిన్నర అయ్యాక కవిత అన్నయ్య ఎక్కడ ఉన్నావంటూ గాభరాగ ఫోన్ చేశాడు. ఫ్రెండ్ బర్త్ డే అనీ, ఇంకొక అరగంట పడుతుందనీ వాళ్లుదింపేస్తారనీ మొదటిసారిగా అన్నయ్య తో అబద్దం చెప్పింది కవిత.

కవితా ‘ఇంటికి వెళ్ళాలి’ అని గుర్తుచేసిన ప్రతిసారీ ఆమెని వెళ్ళనివ్వకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఆపేస్తున్నాడు దీపక్. సడన్ గా లేచి లోపలికి వెళ్ళి ఒక బాక్స్ తో తిరిగి వచ్చాడు. కవిత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఒక ఉంగరాన్ని ఆమె వేలికి తొడగబోతూ ఆమె అంగీకారం కోసం చూసి, సిగ్గు ని ఆక్సెప్ట్ గా తీసుకుని ఒక్కో సెకండ్ అపురూపం అయినట్టు నెమ్మదిగా తొడిగి...”కవీ! ఇంకా అర్ధం చేసుకోలేదా నన్ను?” అన్నాడు.

తల వంచుకుని అంగీకారంగా నిలబడ్డ ఆమెని మరింత దగ్గరగా తీసుకుంటూ –

“నువ్వంటేనాకు చాలా ఇష్టం కవీ! ఐ లవ్యూ!” అన్నాడు.

నాలుగే నాలుగు ఇంగ్లిష్ అక్షరాలు చేసే జిమ్మీక్స్ అది!.

‘ఏమిటిది? నోటివెంట మాట రాదేమిటి?’ కవిత తన ధోరిణికి తానే ఆశ్చర్యపడుతోంది.

సిగ్గు, సంకోచం, బెదురు, గుండెచప్పుడు శరీరం చేసే మిరాకిల్. అది ప్రేమ చప్పుడు!

ఆమె చేతిని అందుకుని నెమ్మదిగా తన వైపు లాక్కుంటూ –

“కెన్ ఐ హగ్ యు?” అనడిగాడు. అంతే! అన్నీ సంకోచాలు వదిలి అతన్ని అల్లుకుపోయింది కవిత. బిగికౌగిలి లో బంధించాడు ఆమెని. అతడిని నిరాకరించడానికి ఏ కారణమూ కనపడలేదు ఆమెకి.

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in February 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!