ఈ దుఃఖపు రుధిర రణ క్షేత్రం లో…
ఒక అనివార్యపు దుఃఖ స్థితి
ఏవో ఆక్రమిత దృశ్యాల్లో ముక్కలవుతూ
కార్యకారణ సంచలిత కల్లోలం ఇది.
కళ్ళలో ఆకాశం చీల్చబడి
నా నిజ ఆనందపు శృతులు
లయ తప్పుతున్నాయి.
దూరాలు దూకినా
నా మట్టి నన్ను వెంటాడుతుంది.
నాలో మునిగిన పర్వత శ్రేణులు
నాలో కుంగిన సూర్యోదయాలు
నాలో నోళ్లు తెరచిన లోయలు
నా ప్రపంచంలో దర్శనమౌతాయి.
ఈ దుఃఖపు రుధిర రణ క్షేత్రం లో
అవ్యక్తాశ్రువులు ఘోషిస్తున్నాయి.
ఛేదించ సాధ్యం కాని
నైరాశ్యపు లోకంలో నిట్టూర్పుల నడకల్లో
క్షణాల్ని ఒంపుకుంటూ విలపిస్తున్నాను.
భళ్ళున వొలికే దుఃఖాన్ని
నా ఊరి చిత్రంగానో
నా ప్రాంత అభిమతం గానో
నా నేల జ్ఞాపకాల పుటగానో
నాలో ఒక వర్ణ క్షోభిత
దుఃఖ జలాలు ఉబుకుతుంటాయి.
నేను విశ్వ మానవుణ్ణే
అయినా వేళ్లవెంట జారుతూ
ఈ దుఃఖపు రుధిర సంక్షోభంలో
రాలుతున్న బొట్టు బొట్టులో
రగిలే మమకారపు వేదాగ్నిని నేను.
so nice