Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

వెన్నెల కిరణాల్లో విచ్చుకుంటున్న పెద్ద కమలంలా ఉంది నది.. రేకులు, రేకులుగా అలలు.. గాలికి చెట్ల కొమ్మలు ఊగుతూ ఇప్పుడేం చేయాలానుకుంటున్నావు ఆంజనేయులూ అని అడుగుతున్నట్టు అనిపిస్తోంది. అవును ఏం చేయాలి.. స్మరణ మామూలు యువతి కాదు అసాధారణ వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి.. ఆమె ముందు తన అనుభవం, వయసు అన్నీ చెల్లాచెదురు అయి, కాలి అవుతున్నాయి. పిల్లలు ఏదన్నా తప్పు చేస్తున్నట్టు కనపడితే పెద్దలు తెలిసీ, తెలియనట్లు నటించి, వాళ్ళని మార్చుకోడానికి ప్రయత్నిస్తారు.. ఇప్పుడు ఇక్కడ ఈ వృద్ధుడు చేసిన తప్పుని పిల్లలు తెలుసుకున్నారు. చూసీ, చూడనట్టు ఉంటున్నది తనని మార్చడానికి కాదు..ఏదో మేలు చేయడానికి. ఇది ఎంతవరకు సమంజసం!

స్మరణని వారించాలంటే భయమో, బెదురో అడ్డుపడుతోంది.. అనుమతించడం అంటే తనని తను దిగజార్చుకోడం! నువ్వెందుకు ఇప్పుడు నర్సాపూర్ వెళ్ళడం...అంటే సమాధానం ఏం చెప్తుంది? నిజం చెప్తుందా.. ఇంకేదో చెప్పి దాటేస్తుంది ..కాదు నువ్వు ఫలానా కారణంతో వెళ్తున్నావు అంటే చాటుగా మా సంభాషణ విన్నావా..ఇది సంస్కారమేనా అని అసహ్యించుకోవచ్చు. విషమసమస్య.. తన గతం ఒక వర్తమానంలో ఇంత ఘర్షణ సృష్టిస్తుందని ఊహించలేదు.. ఊహించి ఉంటే గతాన్ని గతంలోనే దహనం చేసేవాడు. తను కాకున్నా సంధ్య అయినా ఎందుకు ఇప్పుడు నర్సాపూర్ అని అడ్డుపెట్టడం కచ్చితంగా జరుగుతుంది. అలాంటప్పుడు స్మరణ నిజం చెప్తుందా! అప్పడు కోడలు, కొడుకు దగ్గర కూడా తను దిగజారిపోతాడు. ఎలా? పరువు కాపాడుకోవాలంటే స్మరణ నర్సాపూర్ వెళ్ళడానికి మార్గం సుగమం చేయాలి.. వెళ్తే అక్కడ జరిగే పరిణామాలు ఏమిటి? అల్లకల్లోలంగా మారింది అంతరంగం.

రాత్రంతా కలత నిద్రతో గడిచిపోయి ఐదున్నర అవుతుండగా మెలకువ వచ్చింది.

అప్పటికే సంధ్య లేచిన సందడి వినిపిస్తోంది పెరట్లోనుంచి. చలికాలం కావడంతో ఇంకా చీకట్లు వీడలేదు... కానీ ఆ  వీధిలో వాళ్ళంతా అప్పటికే లేచి పనుల్లో పడ్డారు అన్న సూచనగా కలకలం వినిపిస్తోంది. ఆయన నెమ్మదిగా మంచం దిగాడు.

సంధ్య బ్రష్ చేసుకుని కాఫీ డికాషన్ వేసి వీధిలోకి వెళ్ళింది. చిరువెలుగుల్లో వాకిళ్ళ ముందు ముగ్గులు ఎంతో కళాత్మకంగా కనిపిస్తున్నాయి. లక్ష్మి అప్పుడే చివరి మెలిక తిప్పి ముగ్గు పూర్తి చేసి లేచి నిలబడి వెనక్కి తిరిగి సంధ్యను చూసి పలకరింపుగా నవ్వి “లేచేసినారేటి.. పాలట్టుకు రమ్మంటారా” అంది సమాధానం కోసం చూడకుండా పెరట్లోకి వెళ్తూ.. సంధ్య గేటు పక్కన మొక్కలకి పూసిన కారం బంతి పూలుతెంపి రెక్కలు ముగ్గు మీద చల్లింది. లక్ష్మి చేతులు కడుక్కుని పాలగిన్నె తీసుకుని బయటకి వెళ్తూ “తవరు డికాషన్ ఏసీ రెడీగా ఉండండి.. చనంలో వచ్చేత్తా” అంటూ వెళ్ళిపోయింది.

సంధ్య కాసేపు అల్లాగే నిలబడి లక్ష్మి పాలు తీసుకుని రావడం చూసి వంటగదిలోకి నడిచింది. లక్ష్మి తెచ్చిన పాలు స్టవ్ మీద పెట్టి “పెద్దయ్యగారు లేచారేమో చూడు కాఫీ ఆయనకీ కూడా కలుపుతాను” అంది.

“అల్లాగే...” అంటూ లక్ష్మి ఆంజనేయులు గదివైపు వెళ్ళింది.. మంచం ఖాళీగా ఉండడం చూసి పెరటి వైపు నడిచింది. ఆంజనేయులు కనిపించలేదు.

వంటగదిలోకి వచ్చి “పెద్దయ్యగారు లేచి బయటకు ఎల్లినట్టున్నారండి” అంది.

“ఈ చలిలో అప్పుడే లేచి బయటకు కూడా వెళ్ళారా... ఈయనకి చాదస్తం ఎక్కువవుతోంది..” పాలు పొంగుతోంటే స్టవ్ ఆఫ్ చేసి డికాషన్ వంపుతూ అంది సంధ్య. సంధ్య కాఫీ తాగుతుండగా గేటు శబ్దం అయి ఆంజనేయులు లోపలికి వచ్చాడు. అరుగోనండి అంది లక్ష్మి తొంగిచూస్తూ.

సంధ్య కాఫీ గ్లాసులో పోసి ఆయనకీ ఇవ్వడానికి వెళ్తూ “ఎక్కడికి వెళ్ళారు మావయ్యా” అని ఆయన మొహంలోకి చూసి గాభరాగా గ్లాసు స్టూల్ మీద పెట్టి “ఏమైంది అల్లా ఉన్నారేం” అంటూ ఆయన చేయి పట్టుకుంది. చల్లగా మంచులో స్నానం చేసి వచ్చినట్టు తగిలింది.. “అయ్యయ్యో... ఎప్పడు లేచారు.. ఎప్పుడు బయటకు వెళ్ళారు.. ఈ వయసులో తెల్లవారుజామున లేవడం అవసరమా..కూర్చోండి... ఇదిగో వేడిగా కాఫీ తాగండి” అంటూ గ్లాసు ఆయన చేతికి ఇచ్చింది. ఆయన మారు మాట్లాడకుండా గ్లాసు తీసుకున్నాడు. సంధ్య ఆయన గదిలోకి వెళ్లి శాలువా తీసుకు వచ్చి భుజాల చుట్టూ కప్పింది. ఆయన కళ్ళు చెమర్చాయి. ఈ అభిమానం, గౌరవం ఇంకా ఎన్ని రోజులుంటాయో! అనుకున్నాడు. కాఫీ తాగి గ్లాసు సంధ్య చేతికి ఇచ్చి “నేను కాసేపు పడుకుంటా సంధ్యా” అన్నాడు లేస్తూ.

“పడుకోండి... ఇప్పుడు మీరు చేసేది ఏముంది? పదండి” అంటూ ఆయనకీ చేయూత ఇచ్చి కుర్చీలోంచి లేవడానికి సాయం చేసింది. ఆమె చేయి పట్టుకున్నా ఆయన తూలీ ముందుకు పడబోడంతో సంధ్య గట్టిగా పట్టుకుని మెల్లగా గదిలోకి నడిపిస్తూ “మీరు వయసు దృష్టిలో పెట్టుకోవాలి మావయ్యా! చిన్న పిల్లాడిలా ఇలా తిరిగితే ఎలా” అంది మందలిస్తూ.. ఆయన ఉలిక్కిపడ్డాడు.

ఈ సందడికి దీపక్ లేచి వచ్చాడు..”ఏమైంది” ఆవలిస్తూ అడిగాడు.

సంధ్య ఆంజనేయులు మంచం మీద పడుకోడానికి సాయం చేసి, బ్లాంకెట్ కప్పి గదిలో నుంచి బయటకు వచ్చి తలుపు జేరేస్తూ “ఏముంది మీ నాన్నగారు ఇంకా తనకి ముప్ఫయ్యో, నలభయ్యో ఉన్నాయి అనుకుంటున్నారు. తెల్లవారు జామున ఏ నాలిగింటికి లేచారో చలిలో వాకింగ్ వెళ్లినట్టున్నారు. .. ఒళ్ళంతా మంచు ముద్ద అయింది.. వణుకుతున్నారు.. పడుకోమన్నాను పడుకున్నారు.. మీరు బ్రష్ చేసుకుని రండి కాఫీ ఇస్తాను” అంది వంట గదిలోకి వెళ్తూ.

ఓహో అంటూ దీపక్ బాత్ రూమ్ వైపు వెళ్ళాడు.

ఆ మాటలు విన్న ఆంజనేయులు మనసు పశ్చాత్తాపంతో మరింతగా ముడుచుకుంది.. తెలిసిపోయిందా సంధ్యకి... పరోక్షంగా విమర్శిస్తోందా! తనని తాను తెలుసుకునే ప్రయత్నంలో ఎదుటివారి చూపులకు, కదలికలకు అనుకూలమైన అర్థం వెతుక్కుంటారు కొందరు.. అప్పటి పరిస్థితుల్లో వీరంతా నా గురించే మాట్లాడుకుంటున్నారా.. నా వైపు ఏవగింపుగా చూస్తున్నారా అని త్రుళ్ళిపడుతుంటారు. ఇప్పుడు ఆయన పరిస్థితి అలాగే ఉంది..ఇంత కాలంగా మరో మనిషికి తెలియకుండా గుండెల్లో నిక్షిప్తం చేసిన తన ప్రేమ కథ మరో మనిషికి తెలిసింది అన్న వాస్తవం తెలుసుకున్న క్షణం నుంచీ ప్రతీ ధ్వని ఆయన గుండెల్లో ప్రతిధ్వని చేస్తోంది. ఉద్వేగం అణచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.

కాఫీలు అయాక సంధ్య స్నానానికి వెళ్ళింది దీపక్ వాకింగ్ కి వెళ్ళాడు. అతను వచ్చేసరికి స్మరణ, సంధ్య గట్టిగా వాదించుకోడం వినిపించింది.

మళ్ళీ మొదలైంది తల్లి, కూతుళ్ళ వార్ అనుకుంటూ వాళ్ళ కంటికి కనిపించకుండా స్నానానికి వెళ్ళిపోయాడు. అయినా బాత్రూం లోకి వినిపిస్తూనే ఉన్నాయి రెండు స్వరాలూ.

“ఇప్పుడు ఎందుకే నర్సాపూర్.. బొత్తిగా నీకు భయం, భక్తీ లేకుండా పోతున్నాయి.. నా వల్ల కాదు.. ఆ మూడు ముళ్ళు పడ్డాక నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు.. నా దగ్గర ఇలాంటివి సాగవు..” కచ్చితమైన సంధ్య స్వరం.

“అమ్మా! భక్తి దేవుడి మీద ఉండాలి... దయ్యాలో, రాక్షసులో వస్తే భయం గురించి ఆలోచించాలి.. నీ దగ్గర, నాన్న దగ్గర నాకు ఈ రెండూ ఎందుకు?” స్మరణ లాజిక్ విన్న దీపక్ అబ్బో అనుకుని టాప్ తిప్పాడు.

“నీ మాటల గారడీ నా దగ్గర కుదరదు.. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళద్దు.. అందరం కలిసి రేపు పోలవరం ప్రాజెక్ట్ చూడ్డానికి వెడదాం... నోరు మూసుకుని కూర్చో.. తాతయ్య స్నేహితుడు సుబ్బారావు గారి అబ్బాయి జాయింట్ కలెక్టర్ గా రిక్రూట్ అయాట్ట.. పెళ్లి సంబంధాలు చూస్తున్నారట..తాతయ్య కి చెప్తాను మాట్లాడమని.”

“నేనిప్పుడు ఎం బి ఏ లో జాయిన్ అయాను.. ఇప్పట్లో నా పెళ్లి విషయం ఆలోచించకు.. జాయింట్ కలెక్టర్ అయినా వద్దు.. కలెక్టర్ అయినా వద్దు..”

“బుద్ధి భూములేలుతుంటే అదృష్టం గాడిదలు కాస్తుందిట.. నువ్వేం ప్రపంచ సుందరివనుకుంటున్నావా! బంగారం లాంటి సంబంధాలు వస్తుంటే వద్దంటావు.. నీకు పిచ్చి ముదురుతోంది.. అవతల పెద్దాయన ఆరోగ్యం బాగాలేదు పడుకున్నారు.. ఇంక వెధవ గోల ఆపి వెళ్లి లక్ష్మి దగ్గర ముగ్గులు నేర్చుకో..”

“అంతేనా కుట్లు, అల్లికలు, బుట్టలల్లడం ఇంకేం లేవా” వెటకారంగా అంది స్మరణ ఆంజనేయులు గదివైపు వెళ్తూ..

“అటెక్కడికి ఆయన పడుకున్నారు అని చెప్పానా..”

“పడుకున్నారని వదిలేద్దామా .. అసలేమయిందో చూడాలిగా ...” స్మరణ అలా అంటుండగా ఆంజనేయులు గుమ్మం లోకి వచ్చి నిలబడ్డాడు.

“ఏమైంది తాతయ్యా... ఆర్ యు ఓ కే ...” ఆప్యాయంగా అడిగింది స్మరణ ఆయన చేయి పట్టుకుని..

“నాకేం కాలేదు తల్లి... కొంచెం బడలికగా ఉంది... నువ్వు వెళ్లి బదరీకి ఏం కావాలో చూడు పాపం కుర్రాడికి కొత్త కదా..”

“అలాగే తాతయ్యా..” తల్లి వైపు నిరసనగా చూసి వెళ్ళిపోయింది. ఆయన తనలో తను స్థిరంగా నిర్ణయించుకున్నాడు. ఇవాళతో ఈ చర్చకి ముగింపు పలక్కపోతే స్మరణ సున్నితమైన మనసు గాయపడడం తధ్యం.. తన మీద పెట్టిన భారం ఇప్పుడు దింపుకోకపోతే సమస్య తీవ్రం అయే అవకాశం ఉంది. అందుకే గంభీరంగా అన్నాడు.

“సంధ్యా! కొన్నాళ్ళు స్మరణ పెళ్లి విషయం వాయిదా వేయి .. తనేదో చదువుకుంటా అంటోంది చదువుకోనీ..”

“అదేంటి మావయ్యా మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తారు.. పెళ్లి అయాక ప్రపంచం లో ఉన్న చదువంతా చదువుకోమని చెప్పండి..” చర్రున లేచిన కోపం అణచుకుంటూ అంది.

“మనం బలవంతం చేస్తే ఏదన్నా అఘాయిత్యం చేస్తే ఏం చేస్తావు? నా మాట మీద గౌరవం ఉంటే ఏడాది టైం ఇవ్వు... ఈ లోగా నేను ఒప్పిస్తాను సరేనా.. నువ్వు ప్రశాంతంగా ఉండు..”

ఆయన వైపు అదోలా చూసింది.. ఈయనకి పిచ్చా అనిపించింది సంధ్యకి.. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లక్ష్మి ఇడ్లి ఒక వాయ తీసి హాట్ ప్యాక్ లో వేస్తోంది. ఒక పక్క స్టవ్ మీద సాంబారు మరుగుతూ మంచి వాసన వస్తోంది. సంధ్య కొబ్బరిముక్కలు తరుగుతూ “పిచ్చి కుదిరింది రోకలి మోకాలికి చుట్టమన్నాట్ట ఎవరో.. ఎవరు ఏం ఆలోచిస్తోన్నారో, ఈ ఇంట్లో అందరి మెదడులు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో అర్థం కావడం లేదు..” సణుగుతూ ఇవిగో ఈ పచ్చడి నూరుకురా అంటూ పచ్చిమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, లక్ష్మి చేతికిచ్చింది.

“ఇవాళ బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీనా” వెనక నుంచి వచ్చి అడిగాడు దీపక్..

సంధ్య సమాధానం చెప్పలేదు..

“నా మీద అలకా” అడిగాడు.

“ఎవరి మీద అలిగితే ఎవరూరుకుంటారు” మొహం మటమట లాడిస్తూ అంది.

“పొద్దున్నే ఎందుకు రామాయణం... దాన్ని ఎందుకలా విసిగిస్తున్నావు ఎక్కడికి వచ్చినా పెళ్లి, పెళ్లి... నీకు నగలు, పట్టు చీరలు కావాలంటే కొనుక్కో..”

ఆ మాటలకి కాళికలా విరుచుకుపడింది.. “నా నగల కోసం దానికి పెళ్లి చేయమన్నానా.. దాని విచ్చలవిడి తిరుగుళ్ళు ఎప్పుడో కొంప ముంచితే అప్పుడు అర్థం అవుతుంది.. మీకు తెలుస్తోందా... ఆ పిల్లాడిని తీసుకుని రెండు రోజులు నర్సాపూర్ వెళ్తుందిట.. ఇంతకన్నా దారుణం ఉందా..”

“ఇందులో దారుణం ఏముంది? వాళ్ళు ఎదిగిన పిల్లలు.. వాళ్లకి హద్దులు మనకన్నా ఎక్కువ తెలుసు.. వృత్తి రీత్యా రేపు ప్రాజెక్ట్ వర్క్ వస్తే ఇద్దరూ విదేశాలకు కూడా వెళ్తారు.. అంతమాత్రాన వాళ్ళు లేచిపోరు.. పిచ్చి ఆలోచనలు మాని కాస్త చదువుకున్న దానిలా ఆలోచించు”

“ఆహా ... అలాగా... అయితే ఇంకేం దగ్గరుండి వాళ్ళని కారులో సాగనంపండి. నాలుగు తన్ని పెళ్ళికి ఒప్పించక తండ్రి కొడుకుల సమర్ధింపులొకటి... ఆడింది ఆట, పాడింది పాట అయింది..”

“సంధ్యా.. డోంట్ బి సిల్లి..”  విసుగ్గా అన్నాడు. “చూడు తప్పు చేసే మనస్తత్వం ఉన్న వాళ్లకి పెళ్లి పెద్ద ఆటంకం కాదు.. మన పిల్లల మీద మనకి నమ్మకం లేకపోతే వేరే ఎవరూ నమ్మరు.. అనవసరంగా రోజొక రభస చేసి దాని మనసు విరిగేలా ప్రవర్తించకు.. ఈ రోజుల్లో పిల్లల మనస్తత్వం నీకు అర్థం కాదు.. ఎక్కువ టార్చర్ పెడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు.. కానీ వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా మనం చెప్పిన ప్రతి దానికి గంగిరెద్దుల్లా తలలూపరు ... ఇంక చాలు ఇక నుంచి దాని పెళ్లి విషయం నువ్వు మాట్లాడకు..” ఎన్నడూ లేనిది దీపక్ సీరియస్ గా హెచ్చరించి అక్కడినుంచి వెళ్లిపోతుంటే సంధ్య మ్రాన్పడి చూస్తూ ఉండిపోయింది.

దీపక్ కిటికీ లో నుంచి పెరట్లో అన్యమనస్కంగా తిరుగుతున్న స్మరణ ని చూసాడు. పచ్చటి గులాబీ పూవుని కుడిచేతి వేళ్ళతో సుతారంగా పట్టుకుని కొద్దిగా ఒంగి దాన్ని పెదాలతో స్పృశించింది స్మరణ. దీపక్ ఆమె వైపు వెళ్ళాడు.. అడుగుల శబ్దానికి వెనక్కి తిరిగి తండ్రిని చూసి పలకరింపుగా నవ్వి “డాడీ రోజెస్ చూడు ఎంత బాగా వచ్చాయో.. మనం లాస్ట్ ట్రిప్ లో కడియం లో కొన్నవే ఇవి.”. అంది.

“జాగ్రత్త ముళ్ళు గుచ్చుకుంటాయి” అన్నాడు.

“ఏం గుచ్చుకోవు.. నేను ముళ్ళని ముట్టుకోను” అంది అర్దోక్తిగా .

“నీకు మొక్కలంటే చాలా ప్రేమ కదూ... ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మొక్కల మధ్య గడుపుతావు.. మన ఇంట్లో బ్యాక్ యార్డ్ చిన్నది అవడంతో మొక్కలు వేసుకునే చాన్స్ లేదు..పోనీలే నీకు పెద్ద బ్యాక్ యార్డ్ ఉన్న మొగుడిని చూద్దాము” అన్నాడు ఉపోద్ఘాతంగా.

స్మరణకి అర్థమైంది.. బహుశా అమ్మ ఈయన బ్రెయిన్ వాష్ చేసినట్టుంది అనుకుంటూ...” దానికోసం పెళ్ళే ఎందుకు? వచ్చే నెల నేనే కొంటా పెద్ద ఇల్లు.. నాకు లోన్ ఇస్తారు.” అంది.

“కలెక్టర్ భార్యవి అయితే ఇంకా చాలా పెద్ద ఇల్లు వస్తుంది స్మరణా.. అంతే కాదు పెద్ద హోదా కూడా” క్రీగంట ఆమె మోహంలో భావాలు గమనిస్తూ అన్నాడు. ఇవాళ కూతురు మనసులో ఏముందో తెలుసుకోవాలని ఉంది.

స్మరణ మాట్లాడకుండా బాదం చెట్టు మీద వాలిన పిచ్చుకలను పట్టుకోడానికి వేగంగా చెట్టు వైపు వెళ్ళింది.

“పిచ్చుకను పట్టుకుందామనేనా” అడిగాడు..

“అవును... పిచ్చుకల వంశం నిలపాలని... మన సౌకర్యాల కోసం ఈ జాతిని బలి పెడుతున్నాం అందుకే నాకు అవంటే జాలి” అంది.

“ఇంకేం పిచ్చుక వంశాభివృద్ధి అని కొత్త రకం సేవా మార్గం కనిపెడుడువు గాని.. నా మాటకు ముందు సమాధానం చెప్పు..”

“ఏమడిగావు?” దీపక్ కి స్మరణ నటిస్తున్నదన్న నమ్మకం కలిగింది. సీరియస్ గా అన్నాడు.. “స్మరణా! సీరియస్ గా అడుగుతున్నాను. చెప్పు.. నువ్వు పెళ్లి పట్ల విముఖతగా ఉండడానికి కారణం ఏంటి?”

“నేనేం విముఖతగా లేనే..”

“మరి మీ అమ్మ చెప్పిన కలెక్టర్ సంబంధం చూడ్డానికి అభ్యంతరం ఏమిటి?”

“నాకు వన్ ఇయర్ టైం కావాలి.. నేను ఎం బి ఏలో జాయిన్ అవుతున్నా .”

“ఎం బి ఏ వన్ ఇయర్ లో అయే కోర్సా“

“కాదు.. కానీ కొంచెం దారిలో పడ్డాక అయితే పెళ్లి చేసుకున్నా కంటిన్యు చేయచ్చు.. అందుకే.”

“ఫూలిష్ స్మరణా! ఎం బి ఎ మొదలు పెట్టాక మరో మూడేళ్ళు ఆగాల్సి వస్తుంది. అప్పుడు నీ వయసెంత పెరుగుతుందో తెలుసా.! నేను మీ అమ్మకీ, నీకూ మధ్య శాండ్ విచ్ అవుతున్నాను. తీసుకొచ్చిన ప్రతి సంబంధం ఎందుకు కాదంటున్నావో అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పు.. నేను వెళ్లి మాట్లాడతా. మేము నీకేం రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు కదా ఎందుకు మనసు విప్పి చెప్పవు?”

తండ్రి అలా మాట్లాడుతుంటే స్మరణకి దుఃఖం ఉప్పొంగి వచ్చింది. పెదాలు బిగించి దుఃఖం ఆపుకుంటూ అంది “చెప్తాను డాడీ నాక్కొంచం టైం ఇవ్వండి ప్లీజ్.”

“ఎందుకు? నువ్వు ప్రేమించిన వ్యక్తీ నిన్ను కాదంటున్నాడా! మన కులం కాదా.. పోనీ మతం వేరు కాకపొతే చాలు.. మంచి కుటుంబం అయితే ఒప్పుకుంటాను మీ అమ్మని కూడా ఒప్పిస్తాను. చెప్పమ్మా..” మృదువైన స్వరంతో అడుగుతున్న ఆయన స్వరం చెవుల్లో అమృతం కురిపిస్తున్నట్టు అనిపించింది స్మరణకి. ఎంత మంచివాడు నాన్న అనుకుంది. కళ్ళల్లో గిర్రున  తిరుగుతున్న నీళ్ళు ఆయన చూడకుండా తల వంచేసుకుని “ప్లీజ్ డాడీ నన్నేం అడగద్దిప్పుడు” అంది.

దీపక్ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు బాధపడుతోంది.. ప్రతి మాటా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే ఈ పిల్ల ఈ విషయంలో ఎందుకు తన దగ్గర రహాస్యం దాస్తోంది. ఆ రోజు నాకు జాబ్ దొరకగానే ఒక బకరాను చూసి ప్రేమిస్తాలే అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన స్మరణ ఇవాళ ఎందుకు తన ప్రేమ గురించి చెప్పలేకపోతోంది. ఆమె ప్రేమ ఒన్ వే ట్రాఫిక్ లా సాగుతోందా.. అవతలి వ్యక్తీ ప్రేమ పొందడానికి ప్రయత్నం చేస్తోందా.. లేక మతాంతర ప్రేమా.. ఏం జరిగింది?

దీపక్ చాలా సాధారణ వ్యక్తి .. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే తత్త్వం.. ఏది సీరియస్ గా తీసుకోడు.. కుటుంబం అంటే విపరీతమైన ప్రేమ.. తండ్రి పట్ల బాధ్యత .. కూతురు మీద ప్రేమ ఎంత ఉందొ నమ్మకం కూడా అంతే ఉంది. ఆమె తెలివితేటలూ, ధైర్యసాహసాలు బాగా తెలుసు. అందుకే సంధ్యలాగా నిబంధనలు పెట్టడు .. ఇంత కాలం తొందర పడకుండా ఆ అమ్మాయి ఒప్పుకున్నాకే పెళ్లి చేయచ్చు అని ఊరుకున్నాడు. సంధ్య పోరు ఎక్కువ అవడంతో ఇవాళ కొంచెం సీరియస్ గా తీసుకున్నాడు. తండ్రి, కూతుళ్ళు ఇంత తీరుబడిగా ఉండడం చాలా అరుదు.. ఈ అవకాశం మళ్ళి రాదనీ ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. కానీ స్మరణ కళ్ళల్లో కన్నీళ్లు అతనికి ఏవో అనుమానాలను కలిగిస్తుంటే కొత్త విషయాలు తెలుస్తున్నట్టు అనిపిస్తోంది. కొంపతీసి ప్రేమించి మోసపోయిందా..

మెత్తగా అడిగాడు..”స్మరణా ప్రేమించడం తప్పని నేను అనను.. కానీ నీ ప్రేమలో ఏదన్నా జరక్కూడనిది జరిగి ఈ కన్నీళ్ళకు కారణం అయితే మాత్రం నేను భరించలేనురా.. నా తల్లి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అదే నా కోరిక ఫెయిల్యుర్స్ వస్తుంటాయి. అంత మాత్రాన బెంబేలు పడకూడదు. అలా పడిపోయే మనస్తత్వం నీదికాదు అని నాకు తెలిసినా తండ్రిగా చెప్పడం నా బాధ్యత. నువ్వు ఎలాంటి వాడిని ప్రేమించావో, అసలు నీ ప్రేమలో సాంద్రత ఎంతో నాకు తెలియదు. కానీ ప్రేమిస్తున్నానన్న భావనని మాత్రం ప్రేమించకు. కళ్ళతో చూసి ప్రేమించడం అంటే ఎగురుతున్న పక్షి మీద పూలబాణం వేయడం లాంటిది... అది గురి చూసి కొట్టకపోతే తగలాల్సిన చోట తగలదు.. మనసుతో ప్రేమించు .. అర్థమైంది అనుకుంటా.. పద బ్రేక్ ఫాస్ట్ చేద్దాం.” ఆమె భుజం మీద చేయి వేసాడు..

ఆ స్పర్శలో అంతులేని ఓదార్పుతో పాటు, ఏం జరిగినా నీకు నేనున్నాను అనే అభయం కూడా కనిపించింది. స్మరణ మనసు తండ్రి పట్ల ప్రేమతో పులకించిపోయింది.. ఆయన భుజం మీద తలవాల్చి”ఏ విషయం అయినా సమయం వచ్చినపుడు నేనే చెప్తాను నాన్నా... అంతవరకూ నా మీద నమ్మకం ఉంచండి చాలు..” అంది.

ఆయన కుడిచేయి ఆమె వీపు మీద వేసి నిమిరాడు.. నాన్న అనే పదంలో మిళితమైన ఎన్నో రకాల అనుభూతుల మధురిమను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంది స్మరణ.

తన గది కిటికీ లో నుంచి ఆ సన్నివేశం చూసిన ఆంజనేయులు కనురెప్పల మీద, హృదయంలో నిండిన ఆర్ద్రత తాలూకు పొర పల్చటి మేఘంలా కమ్మింది. ఏ క్షణాన అయినా హృదయం పగిలిపోవచ్చేమో అనిపించింది ఆయనకీ. అవును ఈ హృదయం పగిలిపోతే! అనుకున్నాడు.

స్మరణ, బదరీ నర్సాపూర్ బయలు దేరి వెళ్ళారు. సంధ్య వాళ్లకి దారిలో తినడానికి చిరుతిళ్ళు, మంచినీళ్ళ బాటిల్స్, పులిహోర, దద్ధోజనం చేసి ఇచ్చింది.. ఆవిడ మనసులో ఏ మంటలు చెలరేగుతున్నాయో, ఏ  సుడిగాలులు వీస్తున్నాయో కానీ ఏమి మాట్లాడకుండా మౌనంగా తను చేయవలసినవి ఒక బాధ్యతగా చేస్తోంది.. కారు స్టార్ట్ చేయబోతుండగా మాత్రం  జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్పింది. స్మరణ ఆవిడని ముద్దు పెట్టుకుని డోంట్ వర్రీ మై డియర్ మామ్.. దిగ్విజయంగా వస్తాగా అంది నవ్వుతూ. సంధ్య మొహం మీద శీతాకాలపు చిరుఎండ లాంటి నవ్వు మెరిసింది. బదరీ కూడా అందరి దగ్గరా మర్యాద పూర్వకంగా సెలవు తీసుకుని వెళ్ళాడు. ఆంజనేయులు బడలికగా ఉందని ముందే జాగ్రత్తలు చెప్పి వెళ్లి పడుకున్నాడు.

దీపక్ భార్య మొహంలో కలుగుతున్న హావభావాలు గమనిస్తూ, ఇది తుపాను ముందు ప్రశాంతతనా... తుపాను వెలిశాక ప్రశాంతతనా అని ఆలోచిస్తున్నాడు.. ఏది అయినా అతనిప్పుడు అన్నిటినీ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాడు.. ఇంతకాలం అటు స్మరణ ని సమర్ధించలేకా, సంధ్యని వారించలేకా, ఇద్దరితో తప్పెవరిదో నిర్ణయించలేక తటస్థంగా ఉన్నాడు... నిశ్శబ్దం విస్ఫోటించింది.. ధ్వని తరంగాలు అన్ని వైపులా నుంచీ రక,రకాల హెచ్చరికలు చేస్తోంటే ప్రతిధ్వనించక పోవడం చేతకాని తనం అన్న భావన ఆయన మనసులో అంకురించింది. స్మరణ చదువుకున్న పిల్లే కాదు.. నవతరం యువతుల ఆత్మవిశ్వాసానికి ఆమె ప్రతీక.. ఆమె లాంటి పిల్లలు తప్పులు చేయరు..ఆధునిక యువతుల హృదయపు లోతులను చూడగలిగితే కొన్ని దశాబ్దాల భవిష్యత్ కాలం స్పష్టంగా కనిపిస్తుంది.

కొడుకును నిర్బంధించినా కట్టడి చేసినా, నిశ్శబ్దంగా వాటిని అతిక్రమిస్తాడు...అది అతని హక్కు... కూతురుని కట్టడి చేస్తే తిరగబడుతుంది...పోరాడుతుంది... అదీ ఆమె హక్కే. ఆమె హక్కుని కాలరాసే అధికారం ఎవరికీ లేదు. ఈ వాస్తవం ఇటీవలే బోధపడుతోంది. బోధపడ్డాక స్మరణ మీద విశ్వాసం ఏర్పడింది... అది ఆమె పట్ల ప్రేమని మరింతగా పెంచింది. తల్లి,తండ్రులు పిల్లల పట్ల స్నేహ భావం ప్రదర్శిస్తే పిల్లలు రహస్యాలు దాచుకోరు.. అదే పెద్దరికం ప్రదర్శిస్తే రహస్యాలు సృష్టించుకుంటారు. మనసనే తీగకు పూచే భావాలు పరిమళించాలంటే ఆ తీగ బలంగా నిలబడడానికి స్నేహం అనే పందిరి కావాలి.. ఆ పందిరికి ఉన్న నాలుగు గుంజల్లో రెండు తల్లి, తండ్రి అయితే, మిగతా రెండు స్నేహితులు.. తల్లి,తండ్రుల బలం తగ్గితే స్నేహితులవైపు ఒరగడం ఆ తీగ స్వభావం.. తానింతకాలం స్మరణ కి తండ్రిగా మాత్రమె ప్రవర్తించాడు .. ఇప్పుడే ఒక స్నేహితుడిలా మారి మనోబలాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. తను చేస్తున్న పని సంధ్య చేయలేదు.. ఆమె తల్లి... అతి సాధారణమైన తల్లి.. తల్లులు కొన్ని విషయాల్లోనే స్నేహితుల్లా ఉంటారు.. మిగతా విషయాల్లో తల్లుల్లాగే ఉంటారు. తండ్రిగా ఉన్నంతకాలం స్మరణ అడుగుల్లో  తడబాటు, మాటల్లో సందిగ్ధత ఇద్దరిమధ్యా దూరాన్ని పెంచుతాయి.. ఆ దూరం ఉన్నంతకాలం ఈ సమస్య విడదు.. ఇప్పుడు స్నేహితుడుగా దగ్గరైతే సమస్య విడిపోతుంది.. పరిష్కారం లభిస్తుంది. ఎస్ లభిస్తుంది.. అలా అనుకున్నాక దీపక్ మనసులో కొన్ని రోజులుగా ఉన్న అశాంతి సూర్యకిరణాల వెచ్చదనానికి కరిగిపోతున్న మంచులా కరిగిపోసాగింది.

****సశేషం****

Posted in August 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!