“ఇంత దగ్గరగా గోదారిని చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి” అంటూ స్మరణ వైపు చూసిన బదరీ ముగ్దుడైనట్టు ఉండిపోయాడు.. గాలికి ముంగురులు చెదిరి మొహాన్ని కప్పేస్తుంటే నాజూకైన చేత్తో వెనక్కి తోసుకుంటూ మబ్బుల్ని తొలగించుకుంటూ నేలమీద వాలిన నిండు చందమామలా ఉంది ఆమె మొహం. “ఎంత బాగుంది స్మరణ!” అనుకున్నాడు.
ఆ అందమైన వాతావరణంలోకి రాగానే ఆమె మనసులో నుంచి మిగతా విషయాలన్నీ అదృశ్యమై పోయి మనోఫలకం మీద మధు వచ్చి కూర్చున్నాడు. రెండు చేతులూ కట్టుకుని చిరునవ్వుతో తననే చూస్తూ గోదారి అలల మీద నుంచి నడిచి వస్తున్నట్టు అనిపించింది. రెండు అడుగులు అప్రయత్నంగా ముందుకు వేసింది. ఒడ్డుకి వచ్చి చేరిన తడి ఇసక మీద అడుగు వేయబోయి గబుక్కున జారి పడబోయింది. “ఏయ్ జాగ్రత్త” అంటూ చప్పున పట్టుకున్నాడు బదరీ.
ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినదానిలా సర్దుకుని “థాంక్ యూ” అంది.
“ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?” అడిగాడు.
నవ్వి “రా పడవలో కూర్చుందాం” అంటూ అతని చేయి పట్టుకుని విశ్రాంతిగా ఉన్న పడవలోకి ఎక్కింది. చెక్కమీద కూర్చుని అలల మీద జల్లులుగా రాల్తున్న వెన్నెల చూస్తూ అనుకుంది. మధూ ఈ అలల మీద నుంచి నిజంగానే ఓ పూవుల పడవ తీసుకుని రాకూడదూ నా కోసం.. ఆ నక్షత్రాలన్నీ మాలగా గుచ్చి నా మెడలో వేయకూడదూ .. ఈ నదికి ఆవలి తీరం ఎక్కడో అక్కడికి వెళ్ళిపోదాం. నీతో వచ్చేస్తాను.. నిజంగా వచ్చేస్తాను..” ఆమె గుండెల్లో వేదన ఓ పెద్ద కెరటంలా ఎగసింది.
తాతయ్యతో కాకతాళీయంగా అంది కానీ, నిజంగా ఇక్కడ మధు కనిపిస్తే ఎంత బాగుంటుంది! గోదారి సాక్షిగా ఒక్కటి అవరూ..
“ఏంటి ఆలోచిస్తున్నావు.. ఏదో చెప్తానన్నావుగా ..” ఆమె ఊహలని చెదరగొడుతూ అడిగాడు.
స్మరణ సుదీర్ఘమైన స్వప్నం నుంచి మేలుకున్నట్టు చూసింది అతని వైపు.. తల ఊపుతూ చెప్తాను అంటూ కాసేపు ప్రవాహాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండి నెమ్మదిగా అంది. “నీకో పవిత్రమైన ప్రేమ కథ చెప్తాను.. అందులో కథానాయికను వెతకాలి..”
“కథానాయికా... అది నీ ప్రేమకథ కాదా!” అడిగాడు.
“నాది కాదు.. నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి కథ.. బదరీ! మనం పెద్దవాళ్ళం అయి, సెటిల్ అయాక మన పేరెంట్స్ ని చూసుకోడం బాధ్యతగా భావిస్తాం. వాళ్ళని చూసుకోడం అంటే వాళ్లకేదన్నా అనారోగ్యం వస్తే హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం, వాళ్లకి తిండి పెట్టడం, పుట్టినరోజులు లేదా మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ గిఫ్ట్స్ ఇవ్వడం.. ఇవేనా.. ఇంకా ఏదన్నా చేస్తామా!”
వెన్నెల వెలుగులో ఆమె మొహంలో భావాలు వెదకడానికి ప్రయత్నిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అతని సమాధానం ఆశించని దానిలా స్మరణ చెప్పుకుపోతోంది. “కొందరు అసలు తల్లి,తండ్రులను వృద్ధాప్యం లో పట్టించుకోవడం లేదని, వృద్దాశ్రమాల్లో చేర్పిస్తున్నారని మన యువతరం మీద అపవాదులు కూడా వస్తున్నాయి అది వేరే విషయం.. మంచి, చెడు అనేవి ఉన్నట్టే బాధ్యతాయుతమైన ప్రవర్తన, బాధ్యతారహితమైన ప్రవర్తన ఉంటాయి.. అవి అవతల వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటాయి. అయితే, వాళ్ళ తిండి, బట్ట కాకుండా వాళ్లకి కొన్ని కోరికలుంటాయి ఒప్పుకుంటావా..”
“వాళ్లకి కోరికలా.. “ ఆలోచిస్తూ అన్నాడు “ఏముంటాయి వాళ్ళ పిల్లలు పైకి రావాలని, పెళ్ళిళ్ళు చేసుకుని ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలని, మనవాళ్ళని, మనవరాళ్ళ ని ఎత్తుకుని ఆడించాలని..”
నవ్వింది స్మరణ... “ఇలా ఆలోచించడం మన స్వార్ధం, సంకుచితం.. వాళ్లకి యవ్వనం ఉండేదని, ఆ యవ్వనంలో వాళ్ళకీ కొన్ని తీరని కోరికలు ఉంటాయని అవి తీర్చాలని ఏ కొడుకన్నా, కూతురన్నా ఆలోచించి ఉంటారా... అలాగే పేరెంట్స్ తో పాటు గ్రాండ్ పేరెంట్స్ .. వాళ్ళకీ ఉంటాయిగా కొన్ని కోరికలు..”
“వాళ్లకి కోరికలేంటి స్మరణా!”
“వాళ్ళు కూడా బాల్యం, యవ్వనం, కౌమారం అనే దశలను దాటి వృద్ధాప్యానికి వచ్చారు బదరీ! పుట్టగానే వృద్ధాప్యానికి జంప్ చేయలేదు.” నవ్వి అంది “ఓ వృద్ధుడి కోరిక, భావాలు నీకు తెలుసుకోవాలని ఉందా! నీకు కొన్ని విషయాలు చదివి వినిపిస్తా.. వింటావా” మొబైల్ ఓపెన్ చేసింది..
వై నాట్... చెప్పు..” కుతూహలంగా అన్నాడు.
“ఇది ఒక డైరీ... కానీ ఒక పద్దతిగా తేదీలు, సంవత్సరాలు అని చూసుకుంటూ రాయలేదు. ఒక పాత డైరీనే ఒక నోట్ బుక్ లా వాడుకున్నారు. మనసులో ఒక సంఘర్షణ వచ్చినపుడు కాగితాల మీద రాసుకుని సేదతీరినట్టు అనిపించింది నాకు.. ఈ డైరీ ఎప్పటిదో కూడా నాకు తెలియదు.. బాగా పాత బడింది. మొదట రాసుకున్నది చదువుతున్నా విను..
ఇలా జరిగిందేమిటి? నేను ఘనీభవించిపోయానేంటి? మెదడు ఆలోచనా శక్తిని కోల్పోయింది.. నోట మాట రాకుండా మూగబోయింది.. కాళ్ళు, చేతులూ చలనం లేకుండా అచేతనం అయాయి..నేనేం చేసాను? ఒక అనాకారి మెడలో తాళి కట్టానా! ఎందుకు? నర్సాపూర్ నుంచి బస్ ఎక్కి, రాజమండ్రి రావడం, నాన్న ఏదో అనడం నేను మౌనంగా ఉండడం ఇదంతా ఎలా జరిగింది? మాలతికి ఒక్కమాట కూడా చెప్పకుండా నేను ఎలా వచ్చాను? ఏ అదృశ్య శక్తి నన్ను తీసుకుని వచ్చింది.. నేనింత పిరికివాడినా.. దుర్మార్గుడినా.. ఆలోచిస్తూ ఉంటె నేనూ మామూలు మగవాడిని అని అర్థం అవుతోంది .. పెదనాన్న ఉన్నపాటున నన్ను ఎందుకు బస్సు ఎక్కించాడు.. నేను ఎందుకు బయల్దేరాను.. నా చదువు ఏమవుతుంది? మళ్ళి తిరిగి వస్తానా అని ఏమి ఆలోచించలేదు.. నాన్న ఓ ఇనప్పెట్టె కి తాళి కట్టమని చెబితే కాదు అని ఎందుకు అనలేకపోయాను. అక్కడ ఉన్నంత కాలం మాలతి లేకుండా బతకలేను అనుకున్నవాడిని ఇంత అకస్మాత్తుగా ఆమె లేకుండా జీవించడం ప్రారంభించానేంటి?
పెళ్లి అయాక చదువుకో అన్నాడు నాన్న... పెళ్లి అయింది.. మొదటి రాత్రి ఆమెని కళ్ళెత్తి చూసాను.. ఒళ్ళు జలదరించింది.. ఆ రూపం ఆ స్వరం...నేను సుషుప్తావస్థలో ఉన్నాను.. నాకేవో పీడకలలు వస్తున్నాయి.. పారిపో... పారిపో ఎవరో వెనక నుంచి తోస్తున్నారు.. సన్నజాజి పూవు పరిమళం ఆస్వాదించిన నాకు ఆమె సామీప్యం, ఆమె నుంచి వస్తున్నా ఊపిరి భరించలేని బాధ కలిగిస్తోంది.. నన్ను ఆమె తాకిందా... నేను ఆమెని తాకానా... అసంకల్పితంగా... అనూహ్యంగా ఆమె నా అర్ధాంగి అయింది. అప్పటివరకు తాత్కాలికంగా మరగునపడిన మాలతి జ్ఞాపకాలు బూజులు దులుపుకుంటూ స్పష్టంగా నన్ను ప్రశ్నిస్తూ, శపిస్తూ, మాలతీ! నేను నిన్ను ప్రేమించలేదా!
అప్పడు అసలు నాకేం కావాలో, నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు.. నా జీవితంలో మాలతితో గడిపిన కాలం యాదృచ్చికమా! ఎదురుగా ఓ అమ్మాయి కనిపిస్తే యవ్వనంలో ఉన్న మగవాడు ఏం చేస్తాడో నేనూ అదే చేసాను. నేనేం చేశానో ఏం జరిగిందో, జరుగుతున్నదో తెలిసాక కానీ నేనేం కోల్పోయానో నాకు అర్థం కాలేదు.. అర్థం అయాక చేయగలిగేది శూన్యం.
చాలా పేజీలు ఏవో లెక్కలు, కూడికలు తీసివేతలు, కిరణా కొట్టు సామన్ల లిస్టు...గమ్మత్తుగా ఉంది.. మళ్ళి అదే డైరీ లో రాసినది చదువుతా విను.. అంటూ తిరిగి చదవసాగింది.
ఆశ్చర్యం... జీవితం బరువెక్కినా, గమనం మాత్రం సాగిపోయింది. ఏది ఆగలేదు.. కదులుతున్న కాలంతో ముందుకు నడిచాను. కాలానికి ఇంత శక్తి ఉందా! నా జీవితాన్ని శాసించగలిగిందా! నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే కలెక్టర్ గానో, ఒక డాక్టర్ గానో ఎదగాలనుకున్న నన్ను ఒక సామాన్య ఉద్యోగిని చేసింది.. ప్రేమించిన పడతిని కాకుండా ఓ అనాకారికి భర్తను చేసింది.. ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.. ఆఖరికి బతుకును ఎడారి చేసింది.. అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరిని చేసింది.
కానీ, తమాషా.. తొలిప్రేమ పరిమళం మాత్రం నన్ను విడవకుండా నా హృదయస్పందనలో, ఉచ్చాసనిశ్వాసల్లో, ఆలోచనల్లో చుట్టుకుని ఇంకా తాజాగానే ఉంది. నా కోసం ఇంకా మాలతి గోదావరి గట్టుమీద మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని ఓ చెంప మోకాళ్ళ మీద ఆనించుకుని ఎదురుచూస్తూ ఉన్నట్టే అనిపిస్తుంది.. నా బాధ్యతలు, నా కర్తవ్యాలు అన్నీ పూర్తిచేసుకుని వెళ్ళడానికి ఉద్యుక్తుడుని అయాక కాళ్ళల్లో శక్తిని, నరాల్లో నిస్సత్తువను నింపి నిస్సహాయుడిని చేసింది. శక్తులన్నీ హరించాక కానీ వాస్తవం బోధపడలేదు.. కాలంతో నేను నడిచినట్టె తను కూడా నడిచి వెళ్ళిపోయి ఉంటుందిగా.. ఎక్కడికి తీసుకుని వెళ్లి వదిలావు కాలమా.. తన చిరునామా చెప్పవూ..
అవును మాలతీ! నువ్వే కావాలి.. నీ కోసం రెండుసార్లు వచ్చాను నర్సాపూర్.. ఎక్కడ వెతకాలి.. ఎవరిని అడగాలి.. నదిని, నావనీ, చెట్టుని, పుట్టని అడిగాను. అన్నీ నిశ్శబ్దంగా నవ్వాయి. అది పరిహాసమో! వికటాట్టహాసమో! సిగ్గుతో తలవంచుకుని వెళ్ళిపోయా.
ఇన్నేళ్ళ తరవాత ఇవాళ నా బంగారు తల్లి నోటిగుండా ఓ అద్భుతమైన విషయం విన్నా.. సాంకేతిక విప్లవం గోదావరిని గుప్పిట్లో తీసుకువచ్చి నా ప్రేమ దాహం తీరుస్తుందిట..ఎలా సాధ్యం అనుకున్నా.. మనిషికి సాధ్యం కానిది ఏది లేదు అంటోంది నా బంగారం.. అదే నిజమైతే యాభై ఏళ్లుగా దప్పికగొన్న నాకు కావాల్సింది గోదావరి కాదు.. గట్టున ఉన్ననువ్వు. అందుకే కొత్తగా అక్షరాభ్యాసం చేసుకున్నా.. నవ్వుతున్నావా... నేనూ నవ్వుకుంటున్నా... ఏడవలేక..
మాలతీ! నాగరికత నడక నేర్చుకుంటున్న రోజుల్లో మనం కలిసాము. ఇప్పుడు నాగరికత ప్రచండ వేగంతో ముందుకు వెళ్ళిపోతోంది. వయసు ఉడిగాక ఈ వేగాన్ని నేనెలా అందుకోగలను చెప్పు! నువ్వెక్కడ ఉన్నావో... నేను మాత్రం ఇక్కడ.. జీవనది అంచున నిలబడి ఉన్నాను. ఏక్షణం అయినా మునిగిపోతాను. నిజంగా నాకు సుఖానికి నిర్వచనం మాత్రం తెలియదు.. కానీ, నువ్వు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాకపొతే నా ఆఖరి కోరిక ఒకటి మిగిలిఉంది. ఏనాటికైనా నిన్ను ఒక్కసారి కలిసి క్షమార్పణ అడగాలని ఉంది. అది తీరుతుందా.. గడప దాటడానికి కర్ర ఊతం ఉంది.. గట్టు దాటడానికి ఎవరిని ఊతం అడగను! ఇవ్వడమే కానీ తీసుకోడం ఎరుగని వాడిని చేయి చాచి అడగలేను.. గుండె తెరిచి కోరలేను... కొడుకునే అడగనా.. కోడలిని అడగనా.. పెళ్ళీడుకొచ్చిన మనవరాలిని నా ప్రియురాలిని చూడాలని ఉంది అని సిగ్గులేకుండా అడగనా.. అందుకే పిచ్చివాడిలా గుప్పిట్లో ఓ ఎలక్ట్రానిక్ పరికరం పట్టుకుని విశ్వమంతా తిరిగివచ్చాను. ఎంత భ్రమ! నర్సాపూర్ లో పోగొట్టుకున్న చెలిని అంతర్జాలంలో వెతుక్కోడం ఎడారిలో మల్లెతోట వెతుక్కోడం కదా... ఆశ వివేకాన్ని చంపేస్తుంది..
అయిపొయింది.. నా ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నా.. ఒక్క బాధ్యత నా కోడలు నా భుజాల మీద పెట్టింది. మనవరాలి పెళ్లి చేయాలి. కోడలంటే ఆపేక్ష.. మనవరాలంటే ఆనందం.. అవును.. నాకున్న ఆనందం నా మనవరాలు..మనసు విప్పి తన ప్రేమ కథ చెప్పిన మనవరాలికి ప్రేమ విలువ తెలిసిన నేను అన్యాయం చేయలేను.. అందుకే ఆ భగవంతుడి ఇంకో రెండేళ్ళు నాకు ఆయుర్దాయం ఇవ్వమని కోరుకుంటున్నా.. నా తల్లి ప్రేమించిన యువకుడు తప్పకుండా తిరిగివస్తాడు.. అతని చేతుల్లో తన చేతులు పెట్టి నెమ్మదిగా బయలుదేరతా... ఆ గట్టు మీద అలాగే వేచి ఉండు... తప్పక కలుద్దాం.
స్మరణ గబుక్కున రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి, వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
బదరీ విచలితుడయాడు. ఎవరిదో ప్రేమగాధ ఈమెని ఇంతగా కదిలించడం ఏంటి? అనుకున్నాడు..
కానీ స్మరణ మానసిక స్థితి వేరు.. ఆమె తాతగారి ప్రేమ కథకి, తన ప్రేమకదకి ముడిపెట్టి ఆలోచిస్తోంది. కాలం ఏదైనా ప్రేమ భావన ఒక్కటే... ప్రేమించిన వాళ్ళని పొందాలనుకోడం పొందకపోతే వేదన చెందడం... తాతయ్య ప్రేమ విఫల ప్రేమ... తన ప్రేమ .... ఏమో! తెలియదు.. సఫలం అవుతుందా! విఫలం అవుతుందా! ప్రేమించిన వాళ్ళని పొందలేకపోవడంలోని వేదన ఆమెకి తెలుసు.. పొందాలన్న తపన తెలుసు.. తను తన ప్రేమికుడిని పొందడానికి ఏమైనా చేయగల సమర్ధురాలు.. చదువు, ధైర్యం, స్వేఛ్చ.. అన్నిటికీ మించి భూమ్మీద ఎక్కడ ఉన్నా జల్లెడ వేసి పట్టుకునే సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. బహుశా ఆ కాలంలో ఉన్న కట్టుబాట్లు, పరిమితులు, స్వేచ్చ లేకపోవడం వల్ల తాతయ్యలాంటి వాళ్ళు ఎందఱో విఫల ప్రేమికులు అయి ఉంటారు.. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా.. ప్రేమ రాహిత్యంతో జీవితాంతం ఓకే యోగిలా జీవించిన తాతయ్యకి ఆయన మనసులో నిగూధంగా ఉన్న కోరిక తీర్చి చరమదశలో ఆయనకీ ఆనందం చేకూర్చగలిగితే ఎంత బాగుంటుంది! వృద్దులైనంత మాత్రాన వాళ్లకి తిండి, బట్ట, ఆశ్రయం మాత్రమేనా ఇవ్వాల్సింది.. వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న చిన్న, చిన్న కోరికలు తీర్చడం కూడా బాధ్యత కాదా!
“స్మరణా! ఎవరు ఈ ప్రేమికుడు? నువ్వు ఇంతగా మూవ్ అయావు అంటే నీకు బాగా కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు కదా! మీ తాతగారా..!”
స్మరణ కొంతసేపు మౌనంగా ఉండి సన్నగా నిట్టూర్చి అంది.. “అవును బదరీ! పాపం తాతయ్యకి ఆయన జీవితంలో ఏ కోరికా తీరలేదు.. మా నానమ్మ వలన ఎలాంటి ఆనందం ఆయన పొందలేదు. బహుశా నానమ్మ ఆయనకి కోల్పోయిన ప్రేమానురాగాలు అందించి ఉంటే ఆయనలో ఈ ప్రేమరాహిత్యం ఉండేది కాదేమో!”
“స్మరణా! మాకు నాలుగు అపార్ట్ మెంట్లు ఉన్నాయి.. నలభై ఎకరాల పొలాలు ఉన్నాయి.. నా పేరునే బోలెడు ఎఫ్ డి లు ఉన్నాయి... కానీ, గుప్పెడు ఆప్యాయత, కొంచెం ప్రేమ దొరకవు.. ఉన్న ముగ్గురం ఎవరి దారి వారిది.. నేను అమ్మతో మాట్లాడాలన్నా.. నాతొ అమ్మ మాట్లాడాలన్నా ఇంటర్ కం లో మాట్లాడుకుంటాం. మాది విచిత్రమైన జీవితం.. అలాంటిది మీ తాతగారి కోసం ఇంత తపన పడుతున్నావా.. చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తోంది.”
“మా తాతగారికి నేను కాక ఇంకా ఇద్దరు మనవాళ్ళు, ఒక మనవరాలు ఉన్నారు అందరూ దూరంగా ఉంటారు.. నన్ను ప్రేమించినట్టు ఆయన ఎవరినీ ప్రేమించలేదు. తాతయ్య నాకో ఫ్రెండ్.. నేను ఏది అడగకుండానే అన్నీ అమర్చే తాతయ్యకి నేను ఒక్క సాయం చేయలేనా.. “
“ఏం చేయాలనుకుంటున్నావు ”
“నర్సాపూర్ వెళ్లి మాలతి అడ్రెస్ సంపాదిస్తా.. ఆవిడ ఎక్కడ, ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక్కసారి తీసుకువచ్చి తాతయ్యకి చూపిస్తా..”
“నీకు పిచ్చా.. అసలు ఆవిడ ఎవరో, ఉందో లేదో...”
“నో.... కీచుగా అరిచింది..” అలా అనకు... ఉంటుంది.. తాతయ్య కన్నా చిన్నదే కదా.. తప్పకుండా ఉంటుంది..”
“మై గాడ్.. స్ట్రేంజ్... ఇంతకీ ఈ డైరీ ఎక్కడ దొరికింది.”
“తాతయ్య రూమ్ లో ... నేను ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ తో చాట్ చేస్తుంటే తాతయ్య అడిగారు అదేంటి అని.. ఫేస్ బుక్ గురించి చెప్పాను. నా ఫ్రెండ్స్ ని కలవచ్చా అని అడిగాడు.. కలవచ్చు అన్నాను.. ఆయనకీ కీ బోర్డ్ మీద టైపింగ్ నేర్పా.. టాబ్ కొనిచ్చి ఎఫ్ డి ఎకౌంటు ఓపెన్ చేసిచ్చా.. ఒకరోజు నా డిస్క్ టాప్ లో గూగుల్ హిస్టరీ చూస్తే మాలతి అనే పేరుతొ చేసిన సెర్చ్ డీటెయిల్స్ కన్పించాయి. తాతయ్య కళ్ళల్లో బాధ కనిపించింది. ఆయన స్నానానికి వెళ్ళినపుడు రూమ్ వెతికితే ఈ డైరీ కనిపించింది. నా ఫోన్ లో కన్పించిన పేజీలు స్కాన్ చేసుకుని ఆఫీసు లో చదివా..అలా తెలుసుకున్నా. నాకు హెల్ప్ చేయి బదరీ.. ప్లీజ్..” బదరీ చేతులు పట్టుకుంది ప్రాధేయ పడుతూ.
ఆ చేతులని ధృఢమైన తన చేతుల్లో బిగించి ప్రమాణం చేస్తున్నట్టు అన్నాడు. “స్మరణా! చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు.. వాళ్ళల్లో నా భార్య ఉండే ఉంటుంది.. కానీ నీలాంటి స్నేహితులు ఎక్కడో ఉంటారు.. నాకు లభించిన నీ అపూర్వమైన స్నేహం స్నేహం గానే ఉండనిస్తానని మాట ఇస్తున్నా.. స్నేహం అనేది దేవపుష్పం నిత్యం పరిమళిస్తూ ఉంటుంది. నాకా పరిమళం కావాలి..తప్పకుండా నీకు సాయం చేస్తా.. తాతగారికి ఏ మనవడు, మనవరాలు ఇంతవరకు ఇవ్వని కానుక మనం ఇద్దాము.”
“థాంక్ యూ బదరీ.... థాంక్స్ ఏ లాట్” అతని చేతుల మీద ముద్దు పెట్టుకుంది.
మొబైల్ లో టైం చూస్తూ “పద వెళదాము అమ్మ నిద్రపోకుండా టెన్షన్ గా కూర్చుని ఉంటుంది. రేపు నర్సాపూర్ వెళదాము..” అంటూ లేచింది.
ఇద్దరూ చేతులు పట్టుకుని నావ లో నుంచి బయటకు వచ్చారు.
ఒక పొడుగాటి ఆకారం వాళ్ళని దూరం నుంచి చాలాసేపు గమనిస్తోంది.. గోదావరి అలలు ఓ మధురమైన నాదాన్ని ఆలపిస్తున్నాయి.. గాలి తాళం వేస్తోంది.. ప్రకృతి ఆ రాగ,తాళాలకు అనుగుణంగా నర్తిస్తోంది..
విఫలమైన ఓ వృద్ధుడి ప్రేమకథ సుఖాంతం చేయడానికి ఆ ఇద్దరు యువతీ, యువకులు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకృతి పులకిస్తున్నట్టుగా మంచుపూలు రాల్చింది. ఆ పూలు పరిమళిస్తాయో లేదో కదులుతున్న కాలానికే తెలుసు.. కానీ, పొద్దుపోయి ఇంకా ఇంటికి రాని మనవరాలిని, ఆమె స్నేహితుడిని వెతుక్కుంటూ వచ్చిన ఆంజనేయులు వాళ్ళా మాటలు విని నిశ్చేష్టుడై నిలబడ్డాడు.. వెలుగు,చీకట్లు ఏది నిజం? ఏది అబద్ధం! అనేది అర్థం చేసుకోలేనట్టు ముడుచుకున్నాయి. నది ప్రవహించడం మర్చిపోయి, ఘనీభవించినట్టు స్తబ్దుగా ఉండిపోయింది. ఓ సుడిగాలి చాపలా చుట్టి ఒక్కసారి ఆకాశం ఎత్తు నుంచి డామ్మని కింద పడేసినట్టు కుదేలయిపోయాడు ఆంజనేయులు. నేను విన్నది నిజమేనా! స్మరణ మాటలు స్పష్టంగానే వినిపించాయి. ఏ అమ్మాయికి తెలిస్తే చులకన అయి, గౌరవం కోల్పోతానో అని ఆ అమ్మాయి ముందు మనోభావాలు బయటపడకుండా గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చాడో ఆ అమ్మాయికి తెలిసిపోయింది. ఇంకా ఆ పిల్లకి మొహం చూపించలేడు. ఎన్నో ఏళ్లుగా గుండెల్లో అణిచేసిన రహస్యం ఇంత అకస్మాత్తుగా ఎలా బయటపడింది! స్మరణ ఏమంటోంది? స్థాణువై నిలబడిన ఆయన చెవుల్లో అనేక శబ్దాలు... గుండె మీద డోలు వాయిస్తున్నట్టు...స్మరణ ఇంకా మాట్లాడుతూనే ఉంది.
ఆయన భోజనం చేసిన వెంటనే పడుకున్నాక కొద్దిసేపు బాగా నిద్రపట్టింది. సడన్ గా ఒక గంట తరవాత మెలకువ వచ్చింది. సంధ్య, లక్ష్మి మాటలు వినిపించాయి.. “చూసావా లక్ష్మి ఈ పిల్ల ఆ కుర్రాడిని తీసుకుని గోదారి ఒడ్డుకి వెళ్ళింది.. త్వరగా రమ్మని చెప్పానా ... ఇంకా రాలేదు. ఇలా ఆడపిల్ల పరాయి మగాడితో అర్ధరాత్రిళ్లు తిరుగుతుంటే నలుగురూ ఏమంటారు.. తండ్రిని, తాతని అనరు.. తల్లి ఇలా పెంచింది అంటారు .. నా గోడు ఆయనకీ పట్టదు.. పెద్దాయనకి పట్టదు. వాళ్ళ అలుసు తీసుకుని ఇది ఇట్లా చెలరేగిపోతుంది. నేనేమన్నా అంటే పాతకాలం ఆలోచనలు నువ్వు మారవా అని నన్ను నిలదీస్తుంది.. ఏం మారాలి ఇంతకన్నా? నేనేమన్నా ఆడపిల్ల దీనికి పెద్ద చదువులెందుకు అని ఆలోచించానా.. తను చదువుకుంటాను అన్న చదువు చదివించాము.. ఉద్యోగం చేస్తానంటే చేయమన్నాము. పాంట్లు, షర్ట్ లు వేసుకుంటే వేసుకోనిచ్చాను.. ఏవేవో కొత్త రకం డ్రెస్ లు వస్తున్నాయని రోజుకో కొత్తరకం కొనుక్కుని వస్తే కూడా ఏమి అనలేదు.. ఇంతకన్నా ఏం చేయాలి.. నేనేం మారాలి.. బరితెగించి మగపిల్లలతో తిరుగు అంటే నాగరికత అవుతుందా.. వీళ్ళు నాగరికత పేరుతొ అనాగరికంగా తయారవుతున్నారు. ఆది మానవుడు మానం దాచుకోవడం తెలియక ఆకులు కట్టుకుని తిరిగాడు.. నాగరికత వచ్చాకేగా బట్టలు కట్టుకోడం తెలిసింది. ఇప్పుడు ఒళ్ళు చూపిస్తూ బట్టలు వేసుకుంటే నాగరికత అవుతుందా! ఇలా పరాయి మగాడితో అర్ధరాత్రి విచ్చలవిడిగా తిరిగితే నాగరికత అవుతుందా? ఎంత నాగరికత ముసుగు వేసుకున్నా ఆడది ఆడదే... మగాడు మగాడే... ఆకర్షణలు, వాంచలు వీటికి ఎవరూ అతీతులు కారు.. “ సంధ్య స్వరంలో వినిపిస్తున్న ఆవేదన ఆయనని కదిలించింది.
స్మరణ ఇంత రాత్రివేళ బదరీతో గోదావరి ఒడ్డుకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం! వాళ్ళ మధ్య ఉన్నది స్నేహమే కావచ్చు... వాళ్ళ మనసులు పవిత్రంగా ఉండచ్చు... తప్పు చేయాలని ఎవరూ చేయరు.. తప్పు చేయడానికి పురికొల్పే పరిస్థితి వస్తేనే తప్పు జరుగుతుంది. ఆ పరిస్థితులు కల్పించుకోడం దేనికి? స్మరణ ఇంత సాహసం చేయడానికి కారణం తనిచ్చిన చనువే అయితే, రేపు ఆ అమ్మాయి ఏదన్నా తప్పు చేస్తే అందుకు బాధ్యుడు తనే అవుతాడు. సంధ్య తన మీద పెట్టుకున్న నమ్మకం, ఇచ్చిన గౌరవం గొయ్యితీసి పాతిపెట్టినట్టేగా! ఆమె ముందు తను దోషిగా తలవంచుకోవాలి కదా! స్మరణకి మరీ చనువిచ్చి పాడు చేస్తున్నాడా! ఆలోచనలు ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేకపోయాయి. యవ్వనంలో ఉన్న యువతీ, యువకులు ఒంటరిగా అర్ధరాత్రి, నదీతీరంలో విహరిస్తే ఏం జరుగుతుందో ఏ చరిత్ర చదివినా తెలుస్తుంది.. ఏకాంతం, వెన్నెల చల్లదనం, ఇవిచాలవూ చలించడానికి.. తప్పు జరగడానికి పెద్దగా ప్రణాళిక అవసరం లేదు... సమయం, సందర్భం అనేవి తప్పు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఆయన మంచం మీద కొద్దిసేపు ఆలోచనారహితంగా కూర్చుని ఉండిపోయి, గబుక్కున లేచి, లాల్చీ తొడుక్కుని మఫ్లర్ చుట్టుకుని పెరటి గుండా వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాడు.
ఎంతో దూరం ఉండదు గోదావరి .. రెండు సందులు తిరిగితే రోడ్డు.. రోడ్డు దాటితే సువిశాలమైన నదీ తీరం.. పెద్దగా కష్టపడకుండానే ఇద్దరి ఆకారాలు కనిపించాయి... విశ్రాంతి తీసుకుంటున్న పడవలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి మధ్యా దూరం.. హమ్మయ్య కొంచెం నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. సంధ్య ఊహిస్తున్నట్టు, తను భావిస్తున్నట్టు వాళ్ళు లేరు.. చదువుకున్న పిల్లలు.. ఎంత చనువుగా ఉన్నా వాళ్ళ హద్దులు వాళ్లకు తెలుసు.. లేనిపోని ఆలోచనలు పెద్దవాళ్ళకే వస్తాయి. బహుశా వాళ్ళ అనుభవాలను ఆపాదించుకోవడం వల్ల కావచ్చు. ఇద్దరినీ హెచ్చరించి ఇంటికి తీసుకువెళ్లాలని అటువైపు నడుస్తున్న ఆయన కాళ్ళకు ఏదో అడ్డుపడినట్టు ఆగిపోయాడు. చేతులు పట్టుకుని నడుస్తూ మాట్లాడుకుంటున్నా వాళ్ళ స్వరాలూ ఇంకా గాలిలో సుడులు తిరుగుతూ ఆయన చెవులను తాకుతున్నాయి.
“తాతయ్య నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో, ఇప్పటికీ నా ఆలోచనలు, భావాలు ఎంత గౌరవిస్తారో నాకు తెలుసు బదరీ.. ఇవాళ నెలకి లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగాను అంటే కారణం నా వేళ్ళకు ఆయన అంటించిన అక్షరసుగంధం.. అమ్మ, నాన్న కాదు నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఓం నమశివాయ అని నా చేత పలక మీద రాయించింది.. తాతయ్య.. రోజూ అరటి, ఆవు, ఇటుక అని దిద్దించింది కూడా తాతయ్యే.. తాతయ్య కోసం ఈ మాత్రం చేయలేనా చెప్పు.. నాకు కోటి రూపాయల ఆస్తి ఇచ్చిన ఆయనకీ గుప్పెడు ఆనందం నేనివ్వలేనూ! అందుకే ఎలా అయినా సరే నర్సాపూర్ వెళ్లి మాలతి అనబడే ఈ స్త్రీ ఎక్కడ ఉన్నా తీసుకుని వచ్చి తాతయ్యకి చూపించాలి. అయన మనసులో నిశ్శబ్దంగా జ్వలిస్తున్న కోరిక తీరుస్తాను.”
సున్నితంగా ఉన్నా ధృడంగా ఉన్న స్వరంతో వినిపిస్తున్న స్మరణ మాటలు వినిపించి ఆయన పాదాలు అడుగువేయడం మర్చిపోయినట్టు ఇసకలో కూరుకుపోయాయి. నిలుచున్న చోటే భూస్థాపితం అవుతున్నట్టు ఆరడుగుల ఆ విగ్రహం అంగుళం, అంగుళం కుంచించుకు పోతున్నట్టు, తాళ్ళతో బంధించి కాళ్ళ కింద ఎలెక్ట్రిక్ వైర్లు పెట్టినట్టు అణువణువూ ఆ మంటల్లో దహించుకుపోతున్నట్టు అచేతనంగా శిలలా నిలబడిపోయాడు. వాళ్ళిద్దరూ ఆయన్ని గమనించలేదు.
“త్వరగా పద..అమ్మ కంగారు పడుతుంది” అంటూ స్మరణ స్వరం, వాళ్ళ అడుగుల్లో వేగం గమనించిన ఆయన గబుక్కున చెట్టు చాటుకి తప్పుకున్నాడు. అక్కడ తను అలా కనిపిస్తే ఆ ఇద్దరినీ అనుమానించి, అవమానించినట్టు.. వాళ్ళ సంస్కారం ముందు తానో మరుగుజ్జులా అయిపోతున్నాడు. ఏదో ఊహించి, ఏదో పాఠాలు చెప్పాలని వచ్చాడు.. వాళ్ళు తనకే ఎన్నటికీ మరచిపోని గుణపాఠం నేర్పినట్టు ఎంతో హుందాగా ఒకరి పక్కన ఒకరు నడుస్తూ వెళ్తోంటే స్తంభించినట్టు నిలబడిపోయాడు. వీళ్ళు ఆధునిక యువతీ యువకులు.. విద్యాసుగంధం అలదుకుని, జీవితం పట్ల స్థిరమైన అభిప్రాయాలు కలిగిన పరిణితి చెందిన వ్యక్తిత్వం.. వాళ్ళని అనుమానించడం అంటే అవమానించడమే కాదు నేరం.. వాళ్ళేదో నేరం చేస్తున్నారు అనుకుని మందలించడానికి పెద్దరికం ముసుగువేసుకుని వచ్చిన తన ముసుగుని లాగి విసిరిపడేసారు. చెంప మీద చెళ్ళున చరిచి “నువ్వు మాకు నీతులు చెప్పేవాడివా! ముందు నీ బతుకేంటో నువ్వు గుర్తు తెచ్చుకో” అన్నట్టుగా .. ఏమంటోంది స్మరణ.. మాలతిని వెతుక్కుంటూ వెళ్తుందా.. అసలు మాలతి ఎవరో ఆమెకెలా తెలుసు.. నాకు కానుకగా ఇస్తుందా.. ఒక్కసారి కుడిచేత్తో ఎడమ భుజం మీద చరుచుకున్నాడు... స్పర్శ తెలిసింది.. అంటే ఇది కలకాదు... నిజం ... అయిపొయింది.. తను కాపాడుకుంటూ వస్తున్న పెద్దరికం వాళ్ళు దోసిళ్ళతో తీసుకుని వచ్చి గోదారిలో కలిపేసారు. ఇప్పుడు ఈ మొహం వాళ్ళకి చూపించడం ఎలా?
ఆయన అవమానంతో, సిగ్గుతో కుంచించుకుపోసాగాడు. “తాతయ్యకి నేనివ్వగలిగిన కానుక అది ఒక్కటే బదరీ!” సిగ్గుతో చితికిపోయాడు. తన ప్రేమకథ వాళ్లకి తెలిసిపోయిందన్న న్యూనతా భావం ఆయన్ని నిలువెల్లా దహించసాగింది. పాదాల దగ్గర నుంచి తలదాకా నిస్సత్తువ ఆవరించినట్టు, శక్తులన్నీ హరించినట్టు చెట్టుని ఆధారం చేసుకుని అలా నిలబడిపోయాడు. ఆకాశం విరిగి నెత్తిన పడితే ఎంత బాగుండు! ఈ గోదావరి కదిలివచ్చి తనతో తీసుకువెళితే!
జీవిత చరమాంకంలో కృష్ణా, రామా అనుకోవాల్సిన వయసులో ఒకనాటి తన ప్రియురాలి గురించి ఈ ముసలాయన ఆలోచించడం ఏమిటి? ఆమెని చూడాలని తపించడం ఏమిటి? బుద్ధిలేకపోతే సరి.. సంధ్య అసహ్యం నిండిన స్వరంతో గట్టిగా అరుస్తున్నట్టు అనిపించింది. ఇది నిజం కాదు.. అవును కాదు... కల...కల అయితేనే బాగుంటుంది.. ప్రేమ కథ మనవరాలికి, మనవడి వయసున్న ఓ కుర్రాడికి తెలిసిపోయిందన్న వాస్తవం ఆయన్ని తల్లడిల్లేలా చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జీర్ణం కావడంలేదు. తను వృద్ధుడిని అని తప్ప ఆ సమయంలో తనకీ యవ్వనం ఉండేదని, అది దాటి చాలా దూరం వచ్చేసానని, యవ్వనంలో ఆకర్షణలు, ప్రేమ, అనుభవాలు అందరికీ సహజం అని ఇప్పుడు ఈ క్షణంలో ఎంతమాత్రం అనిపించడంలేదు. ఎంతో మంచివాడు అనుకుంటున్నా తాతయ్య కూడా ఒక అమ్మాయికి అన్యాయం చేసాడు అన్న చేదునిజం మనవరాలికి తెలిసింది. ఇప్పుడు తనతో ఆ పిల్ల ఏదన్నా చెప్పాలన్నా, చర్చించాలన్నా ఈయనతోటా అనుకోదూ ... నీకే నైతిక విలువలు లేవు నాకు ఏం చెప్తావు తాతయ్యా! అని మొహం మీద కొట్టినట్టు జవాబు చెప్పగల ధైర్యం స్మరణకి ఉంది.
బాధ, ఆందోళనతో ఉక్కిరి, బిక్కిరి అవసాగాడు.. ఎలా తెలిసింది? ఈ వయసులో తాతయ్య ప్రియురాలి గురించి తెలుసుకుని అసహ్యించుకోవాల్సిన పిల్ల ఆయన ప్రియురాలిని వెతకడానికి వెళ్ళడం ఏంటి? ఎక్కడని వెతుకుతుంది.. మాలతి అనబడే ఒక యువతి తనకి చాలా ప్రముఖవ్యక్తి అయి ఉండచ్చు... కానీ ఈ సమాజానికి కాదె.. అగ్రహారంలో పుట్టి అమెరికా వెళ్ళిన యువతి కాదు.. అంతర్జాతీయంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆరితేరి స్విట్జర్ లాండ్ లో స్థిరపడిన మహిళా కాదు.. ఒక సామాన్యురాలు.. అలా అయితే అంతర్జాలమే ఆమె చిరునామా అయేది. ఇప్పుడు చిరునామా తెలియని ఒక అనామకురాలిని ఎక్కడని వెతకాలనుకుంటోంది! వద్దని వారించాలంటే ఆమెకి తెలిసిన నిజం తనకి తెలుసనీ ఆమెకి తెలుస్తుంది.. తెలిసీ తెలియనట్టు ఉండాలా... పిచ్చి, పిచ్చి ఆలోచనలు చేయద్దని మందలించాలా! ఏం చేయాలి? ఒక పక్క వయసు, స్థాయి అడ్డం పడుతున్నాయి.. మరోపక్క బాధ్యత హెచ్చరిస్తోంది.. కర్తవ్య విమూడడై అలా చేష్టలుడిగి నిలబడిన ఆంజనేయులు వేళ్ళతో సహా నేలకూలిన చెట్టులా ఇసకలో కూలబడిపోయాడు. అంత చలిలో కూడా ఆయన లాల్చీ చెమటతో తడిసిపోయింది.