‘దర్శనం’
నీ వచ్చి నా ప్రక్కనే కూర్చున్నావా
మెలుకువ వచ్చింది కాదు
నా దురదృష్టం నెత్తికెక్కి కూర్చుంది.
పాపిష్టి నిద్ర
నాకెక్కడ ఆవహించిందో
ఎంత నిర్భాగ్యురాలిని
రాత్రి నిశ్శబ్దంగా వున్నప్పుడు వచ్చావు
జనసంచారం లేనప్పుడు వచ్చావు
లీలగా
నా కలలో
నీ మధుర వీణాగానం మ్రోగింది
మగతలో
ఆ నిద్రలో
నీ సన్నని తీయని పిలుపు వినిపించింది
నిద్రమత్తులో
‘ఎవరోలే’ అని సరిపెట్టుకున్నాను
అయ్యో! యిలా
ఎన్నెన్ని రాత్రులు
నా కునుకు చాటున గడిచి పోయాయో!
నా రాత్రులన్నీ
యిలా వృధాగా పోవలిసిందేనా!
ఎవరి కోసం
నా శ్వాస నిద్రలో సైతం కలవరిస్తుందో
అతని ‘దర్శనం’
నాకెందుకు సాధ్యం కాదు?
నా ప్రయత్నం ఎందుకు సఫలం కాదు?