సంగీతం పై సాహిత్య ప్రభావం
తాళ్లపాక అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ ఆశువుగా పాడిన అనేకవేల పద కీర్తనలలో మచ్చుకి ఒకటి
రాగము: కన్నడగౌళ
గాలినే పోయఁ గలకాలము
తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు ॥గాలినే॥
అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు
గడుగుకొననే పట్టెఁ గలకాలము
ఒడలికి జీవుని కొడయఁడైన హరిఁ
దడవఁగా గొంతయుఁ బొద్దు లేదు ॥గాలినే॥
కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె
కలుషదేహపు బాధఁ గలకాలము
తలపోసి తనపాలి దైవమైన హరి
దలఁచఁగా గొంతయుఁ బొద్దు లేదు ॥గాలినే॥
శిరసు ముడువఁ బట్టె చిక్కు దియ్యఁగఁ బట్టె
గరిమలఁ గపటాలఁ గలకాలము
తిరువేంకటగిరిదేవుఁడైన హరి
దరిచేరఁ గొంతయుఁ బొద్దు లేదు ॥గాలినే॥
శ్రీరాగం లో ‘చంచలమైన నా చిత్తాన్ని ఓ వెంకటేశా నీపై నిలుపుకో’ అంటూ అన్నమాచార్యులు మరొక దీన గానం:
కోరికె దీరుట యెన్నఁడు గుణమును నవగుణమునుఁ జెడి
వూరక యీమది నీపై నుండుట యెన్నఁడొకో ॥కోరికె॥
చిత్తం బాఁకలి దీరదు చింత దలంపునఁ బాయదు
యెత్తిన పరితాపమునకు నేదీ మితిమేర
హత్తిన పుణ్యము బాపము నప్పటి సుఖముల కొరకే
వత్తికి నూనెఁకు గొలఁదై వడిఁ జనె దివసములు ॥కోరికె॥
జీవుఁడె పరతంత్రుఁడుగన చింతింపఁడు నిన్నెప్పుడు
చావునుఁ బుట్టుగు సహజము శరీరధారులకు
శ్రీవనితాహృదయేశ్వర శ్రీవేంకటగిరివల్లభ
పావనమతిమై ప్రాణులు బ్రదుకుట యెన్నఁడొకో ॥కోరికె॥
తాళ్లపాక అన్నమాచార్యమరొక వేదనా భరిత గీతాలాపన సామంత రాగంలో
అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి ॥అయ్యో॥
చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు
వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృథా పిరివీకులైతి ॥అయ్యో॥
తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించలేక చింతాపరుఁడనైతి ॥అయ్యో॥
అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెనఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంతకూటముల యలజడికి లోనైతి ॥అయ్యో॥
“సామంత” రాగము లో వర్ణింప శక్యంగాని ఆ నారాయణుని రక్షింపమని వేడుకొంటూ:
నిగమనిగమాంతవర్ణిత మనోహరరూప
నగరాజధరుఁడ శ్రీనారాయణా ॥నిగమ॥
దీపించు వైరాగ్యదివ్యసౌఖ్యం బియ్య-
నోపక కదా నన్ను నొడఁబరుపుచు
పైపైనె సంసారబంధములఁ గట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణా ॥నిగమ॥
చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ-
లేక కా నీవు బహులీల నన్ను
కాకు సేసెదవు బహుకర్మములఁ బడువారు
నా కొలఁదివారలా నారాయణా ॥నిగమ॥
వివిధనిర్బంధముల వెడలఁద్రోయక నన్ను
భవసాగరములఁ దడఁబడఁ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీనారాయణా ॥నిగమ॥
మరొక ఆధ్యాత్మిక భావోద్వేగము దేశిరాగము లో
జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తన
దైవికము గడవ నెంతటివాఁడు దాను ॥జీవుఁడె॥
విడిచిపోవని యాస విజ్ఞానవాసనలఁ
గడచె మున్నాడె నెక్కడి వివేకములు
వుడుగనియ్యని మోహ ముబ్బి పరమార్థముల
మెడవట్టి నూకె నేమిటికింక నెరుక ॥జీవుఁడె॥
పాయనియ్యని మహాబంధ మధ్యాత్మతో
రాయడికిఁ దొడఁగె సైరణలేల కలుగు
మాయనియ్యని కోపమహిమ కరుణామతిని
వాయెత్తనియ్య దెవ్వరికిఁ జెప్పుదము ॥జీవుఁడె॥
సరిలేని యాత్మ చంచల మంతరాత్మకుని
నెరఁగనియ్యదు దనకు నేఁటిపరిణతులు
తిరువేంకటాచలాధిపుని మన్ననఁ గాని
వెరసి యిన్నిటి గెలువ వెరవు మఱిలేదు ॥జీవుఁడె॥
మరొక జీవిత సత్యాన్ని వెల్లడిస్తూ అన్నమయ్య ఆవేదన :
నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము
పుట్టటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్టనెదుట గల దీ ప్రపంచము
కట్టకడపటిది కైవల్యము
కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడమంత్రపు పని నాటకము
విడి గట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము
తూము నర్సింహదాసు కీర్తనలలో మచ్చుకి ఒకటి బిలహరి రాగం - రూపక తాళంలో
పల్లవి: ఇటువంటిసేవ మన, కెందైనఁ గలుగునా
పటుతరమైన రాఘవ ప్రభుసన్నిధినే గాక
చరణము(లు):
తేటకస్తురి నుదుట - నీటు గులుకుచుండ
హాటకాంబరుడైన శ్రీ - హరి సభయందునెగాక
ఆడుచు నాదమున - బాడుచు నెదుటను
వేడుచు నామది - గూడియుండుటె చాలు
వాసిగ భద్రశైల - వాసుని దాసాను
దాసుడౌ నరసింహ - దాసావనుని గనకున్న
మరొక నరసింహ దాసు కీర్తన దేశాక్షి రాగం - ఆట తాళంలో
పల్లవి: రామరామ యననైతిని
రామరామ యననైతి రాజసము విడనైతి
బ్రేమతో శ్రీభద్రాద్రిధామునిఁ గననైతి
చరణము(లు):కానిపోని పనులు నేఁ గడువేడ్క నొనరించి
కడకు కాలునిచేతిగాసి నోర్చి
పూని దుర్విషయాది పుంజములను జిక్కి
మానవాధముడనై మసలితిగాని
దినము నెనిమిది జాముల నొక్కగడియయైన
మనమున రామునిమహిమ వరించి
ఘనుల సంగతి గూడి కాలము గడపక
దినములు వ్యర్థముగా తిరిగితిగాని
దారితప్పి సంసారమునను జిక్కి
కారుమాట లాడి కాలము గడపి
భూరి దుర్యశముచేఁ బొక్కుచు సొక్కుచు
సారసాక్షునికథ చవి దెలియనైతి
తనివిదీరగ భవతాపత్రయము నొంది
మనసు చంచలమంది శునకమువలెను
దినము పొట్టకొరకు ఘననీచములు లేక
ధనవంతులను వెంటఁ దగిలితిగాని
వాసిగ భద్రాద్రివాస శ్రీనరసింహ
దాసుడనని నీకు దోసిలొగ్గితిని
రోసి యిహము లెల్లఁ ద్రోసి మనసు కుదురు
చేసి గొల్వగ లేక చెడిపోతిగాని
జగన్మోహిని రాగం - మిశ్ర చాపు తాళం లో శ్యామశాస్త్రి గాన వాహిని శ్రీమాతని ప్రార్ధిస్తూ
పల్లవి: దయజూడ మంచి సమయమిదే వే వేగమే వచ్చి॥
అను పల్లవి: జయమొసగే శంకరీ నీవు జననిగదా బృహదంబా॥
చరణము(లు):కనకాంగీ నీ పాదకమలమే దిక్కని నమ్మినాను నేను
సనకసనందన వందిత చరణా సారసనేత్రి నీవు గదా॥
చపలమన్యు దీర్చ్యఖండసామ్రాజ్యమీయవే
కపటము సేయకనే నిగమవినుతా కామిత దాయకి నీవుగదా॥
శ్యామకృష్ణ సోదరీ కౌమారీ సకలాగమపూజితే దేవి
నీ మహిమలు పొగడ తరమా నీ సమాన మెందుగాననే॥
ఆదిశక్తి కామాక్షిని కల్యాణి రాగం - మిశ్ర చాపు తాళంలో నుతిస్తూ
పల్లవి: తల్లి నిన్ను నెఱ నమ్మినాను వినవే॥
అను పల్లవి: ఎల్లలోకముల కాధారమైయున్న నా॥
చరణము(లు):ఆదిశక్తి నీవు పరాకుసేయకు ఆదరించుటకిది మంచిసమయము
గదా సరోజభవాచ్యుత శంభునుతపదా నీదు దాసానుదాసుడౌ నా॥
దేవి నీదు సరిసమానమెవరని దేవరాజమునులు నిన్ను పొగడగ
నా వెద దీర్చి బిరాన వరాలొసగి నన్నుబ్రోవ నీ జాలమేలనే॥
శ్యామకృష్ణ పరిపాలినీ జననీ కామితార్థప్రదా పంకజలోచని
కౌమారీ రాణీ పురాణీ పరాశక్తి కామకోటి పీఠవాసినీ॥
ఆ తల్లిని వరాళిరాగంలో, మిశ్ర చాపు తాళంలో నుతిస్తూ శ్యామశాస్త్రి..
పల్లవి: కరుణజూడవమ్మా వినమ్మా శ్రితజనకల్పవల్లీ మాతల్లీ॥
అను పల్లవి: మరకతాంగి పంచనదేశురాణి మధురవాణి ధర్మసంవర్ధని॥
చరణము(లు):నరాధములను మహారాజులని పొగడి దురాశచే తిరిగి వేసారి ఇలలో
విరాజముఖి నీవు దయతో కాపాడి బిరాన వరమీయవే గిరిరాజసుతా నీవు॥
ఉమా భువిని నీకు సమానమెవరు? భారమా రక్షించుటకు అభిమానములేదని
కుమారుడుగదా నాకిపుడు అభయమీయవే కుమారజనని నీవు మానవాతీత గదా॥
ఉదారగుణవతిగదా సామగాననుతా సదా నుతిజేరి నీ పదాంబుజముల
ను దాసుని మొఱ వినవా సమయమిదే సదాశివుని రమణీ దీనజనాశ్రితే॥
ఉదారముగను అవతారమెత్తి జగమును సుధాకరునివలె రంజింపజేయు నీ
పదాంబుజమును నమ్మి నిన్నే భజించి సదా శ్యామకృష్ణ జేసిన భాగ్యమే॥
కల్యాణి రాగ యుక్తంగా - ఝంప తాళంలో
పల్లవి: దేవీ నన్ను బ్రోవవమ్మా ఇపుడే మంచి సమయమమ్మా॥
అను పల్లవి:సేవించి నిన్నే సదా నమ్మితిని నిరతముగ నమ్మితిని॥
చరణము(లు):అనాథరక్షకి బిరానబ్రోవుము తల్లి ఆశ్రితజనపాలిని భవాని దేవి త్రిలోకజనని॥
పరాకుసేయక వరాలొసగుము తల్లి పామరజనపాలిని మృడాని దేవి త్రిలోకపాలిని॥
కుమారజనని కటాక్ష సేయుము తల్లి శ్యామకృష్ణపాలిని పురాణి దేవి బృహదంబా॥
మరొక వాగ్గేయకారుడు క్షేత్రయ్య మువ్వా గోపాల పదాలతో సుప్రసిద్ధుడు.
యదుకుల కాంభోజి రాగం- ఆది తాళంలో క్షేత్రయ్య పాడిన ఈ పదం చూడండి:
ఎంతచక్కనివాఁడె నాసామి వీడెంత చక్కని వాడే ఇంతి
మువ్వ గోపాలుడు సంతతము నామదికి సంతోషము చేసెనే ఎంత||
మొలకనవ్వుల వాడే - ముద్దు మాటల వాడె
తళుకారు చెక్కుటద్దములవాడె
తలిరాకు జిగి దెగడ దగు మోవి గలవాడె
తెలిదమ్మి రేకు కన్నుల నమ్మారు వాడే ఎంత ||
చిరుత ప్రాయము వాడె చెలువొందు విదియ
చండూరుగేరు నొసలచే మెరయువాడే
చెరుకు విల్తుని గన్న దొరవాలే నున్నాడే
మెరుగ చామనచాయ మే నమరుఁవాఁడె. ఎంత ||
పొదలు కెందామరల పెంపొదవు పాదముల వాడే
కొదమ సింగపు నడుము కొమ రమరు వాడే
మదకరి కరముల మరువు చేతులవాడే
సుదతి! మువ్వగోపాలుడెంత సొగసు గలవాడే. ఎంత ||
క్షేత్రయ్య మరొక మువ్వ గోపాల సుందర లలిత పదం:
ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా?
పంతమా మువ్వా గోపాల
అలుక చేసి యింటికి రావైతివి నెనరైన
చెలికత్తె లున్నారా! పిలువ వచ్చేరా ?
చెలికత్తెవైన నీవె చెలువుడవైన నీవె
తలచి చూడ నా పాలి దైవము నీవే ఇంత||
వింత దానివలె నన్ను వేరు చేసి రావైతివి
అంతరంగులున్నారా ? నన్నాదరించేరా?
అంతరంగమైన నీవే - యాదరించిన నీవె
చింతించి చూడ నా జీవనము నీవే. ఇంత ||
మరొక వాగ్గేయకారుడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ‘బాలమేధావి’ గా చిన్నతనంలోనే సుప్రసిద్దుడు. ఆయన సమకాలీకులమైన మనము ఎంతగానో గర్వించదగ్గ సంగీతకళానిధి. అయన సంగీతం సమకూర్చిన 400 కు పైగా కీర్తనలని 72 మేళకర్త రాగాలలో మాధుర్యాన్ని అందించి అనేక కొత్త రాగాలని, తాళ ప్రక్రియలో మూడు లేక నాలుగు 'నోట్స్' లో త్రిముఖి, పంచముఖి, సప్తముఖి మరియు నవముఖీ లతో 'సశబ్ద క్రియ'లో 'గతి భేదం' కల్పించి కొంగ్రొత్త తాళ రూపకల్పనలతో సంగీతంలోనే క్రొత్త వరవడి ఒనర్చిన అసమాన వాగ్గేయకారుడు. ఉదాహరణకి ఆయన రాగ సృష్టి:
- అంబామామవ: రాగం రాగమాలిక - రంజని నిరంజని & జనరంజని
- బంగారు మురళి శృంగార రవళి - రాగం నీలాంబరి ఉడుపి కృష్ణుని స్తుతిస్తూ
- భావమే మహా భాగ్యమురా: రాగం కాపీ త్యాగరాజు మొదలు బాలమురళి వరకు గురు పరంపర ని ప్రస్తుతిస్తూ
- పాహి సమీర కుమార; రాగం: ముందరి పంచముఖ ఆంజనేయ స్తుతి
- శ్రీ సకల గణాధిప పాలయమాం; రాగం; ఆభేరి గణపతి పై
- మహాదేవసుతం; రాగం: ఆభేరి
- గమ్ గణపతిం; రాగం: ఆభేరి
- ఓంకార కారిణి; రాగం : లవంగి
- సిద్ధి నాయకేన; రాగం : అమృత వర్షిణి
- సిద్ధిం దేహిమే; రాగం సిద్ధి
- మహనీయ మధుర మూర్తే; రాగం; మహతి, గురువు పై
- గురుని స్మరింపుమో; రాగం హంసధ్వని, గురువు పై
- అమ్మా నినుకోరి; రాగం కమాసు - దేవి దుర్గ
- బృహదీశ్వరా; రాగం కానడ- శివ