బాలరాముని ప్రతిష్ఠ – అయోధ్య
సీసమాలిక వివిధప్రాంతమ్ముల విఖ్యాతతూర్యముల్(1) మాఱ్మ్రోఁగ రామనామము ధ్వనించె ప్రతిజీవిగళమునఁ బ్రకృతియే పులకింప హర్షమ్మె వర్షమై యవని తనిసె వాడవాడల రామభద్రుఁడే తిరుగాడి కనువిందు సేయుచుఁ గానుపింప ఐదువందల యేండ్ల యందఱి కలలన్ని యాకారమునుఁ దాల్చి యవతరింప ప్రతియింట ధ్యానమ్ము, ప్రతియింటఁ బూజలుఁ బ్రతిగుడిగంటలు రవళు లీన ప్రతిగుండెచప్పుడుల్ రామాహ్వ(2)భజనకుఁ దాళముల్ వేయుచుఁ బాలుగొనఁగ బాలరాముని చారుప్రతిమను మది నిల్పి ప్రమిదల దీపాలు ప్రతిగృహాన అజ్ఞానతిమిరంబు నంతంబుసేసి యా శాజ్యోతి వెలిగించి జగతి యెల్ల ఏకకుటుంబమై యెనలేని సంబరా లంబరంబునుఁ దాఁక నచ్చెరువుగ త్రేతాయుగమునాఁటి దివ్యానుభవముల మఱల నొందెడురీతి క్ష్మాతలమును మఱవ శక్యముగాని మధురానుభూతుల ముంచెత్తి తేల్చిన పుణ్యదినము తే.గీ. విశ్వసౌభ్రాతృకల్యాణవేదికగను నేఁ డయోధ్యను నిల్పినవాఁడు బాల రాముఁ డా రాముపాలన ప్రగతి నొసఁగ భరతఖండ మఖండమై వఱలుఁ గాక! (1) వాద్యపుమ్రోత (2) రామనామము
రామజన్మస్థలమైన అయోధ్యలో బాలరాముని విగ్రహప్రతిష్ఠ ప్రతిష్ఠాత్మకముగా గావించిన మహానుభావుని ఏకాదశదినదీక్షకు ఏకాదశపద్యపాదములతో అందించే కవితాసుమమాలికయే ఈ సీసమాలిక.
ఉ. చేత ధనుస్సు బాణమును, జిర్నగ వొల్కెడు మోము, దృక్కులన్ ఖ్యాతి గడించినట్టి కరుణార్ద్రత, సౌష్ఠవ మొప్పు రూపమున్, పీతదుకూలమున్, శ్రితుల వేదనలన్ హరియించు పాదముల్ చేతము రంజిలంగ నిలిచెన్ సముఖమ్మున బాలరాముఁడై