అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
మ.కో. ఎంతచక్కని మూర్తివో కని యెందఱో తరియింపఁగా చెంతఁ గాంతలు స్వర్ణకాంతులు చిందుచున్ మురిపెంబుగా సుంత నవ్వుచు వాలుచూపుల సోలి నీపయి డోలికన్ స్వాంతముల్ హరియించు వేళను జక్షురుత్సవ మయ్యెడున్ 116 ఆ.వె. అన్నమయ్య నిన్ను నలరించె వేనోళ్ళ పదకవిత్వగానపటిమ; సుమధు రాన్న మయ్య నన్నుఁ గన్న వాణి యొసంగి నట్టి పద్యకవిత లందుకొనుమ! 117 మ. అమితప్రేమను నన్నుఁ జూచుచును ‘వత్సా! రమ్ము ర’మ్మంచుఁ ద్వ త్సుమనోనిర్ఝరిణీప్లుతాంఘ్రిజనితాస్తోకప్రభాపుంజసం గమరాజత్పథయానభాగ్యము నొసంగన్ జాలు నో పూరుషో త్తమ! సప్తాచలవాస! విశ్వజనకా! దాక్షిణ్యవారాన్నిధీ! 118 శ్లో. ప్రాతర్నమామి గిరిసప్తకనాథపాదౌ భక్తావనౌచ శుభదౌ భవపాపహారౌ క్షీరాబ్ధిసూనుకరపల్లవసేవ్యమానౌ అస్మన్మనోఽబ్జదిననాథకరౌ సుదీప్తౌ II 119 పం. అసామ్యపుణ్యధామవేంకటాద్రిశృంగమందిరా! రసారమానివాసవక్ష! ప్రహ్వదేవతాకరా! అసాధ్యసాధ్యహేతుసత్కృపార్ద్రవీక్షణా! సదా ప్రసాదిత(1)ప్రసాధిత(2)స్ఫురత్ప్రసన్నవిగ్రహా! 120 (1) పూజింపఁబడిన (2) అలంకరింపఁబడిన