8. అశోకుడు
గత సంచికలో అశోక చక్రవర్తి తన ఆధ్వర్యంలో నెలకొల్పిన అనేక ధర్మస్థంభాలలో (స్తూపాలు, మహా చైత్యలు) సారనాధ్, సాంచి, వైశాలి, లుంబిని లో ఉన్న వాటిని గురించి తెలుసుకొనటం జరిగింది. ఈ సంచికలో అయన నెలకొల్పిన మరి కొన్ని ధర్మ స్థంభాల గురించి తెలుసుకుందాము.
ఢిల్లీ-తోప్రా అశోక ధర్మ స్థంభం
మౌర్యుల కాలంలో ఇప్పటి హరియానాలోని యమునానగర్ కు పశ్చిమాన 14 కి.మీ. దూరంలో, ‘తోప్రా’ (Topra) అనే నగరం ఉండేది. కాలక్రమాన ఒక గ్రామంగా మారిన ఈ తోప్రా పంజాబు లోని చండీఘర్ కు 90 కి.మీ. దూరంలో ఉన్నది. అప్పటి ఈ నగరంలో ఒక ధర్మ స్తంభాన్ని అశోకుడు నెలకొల్పాడు. దాదాపు 1600 ఏళ్ళు అక్కడే ఉన్న ఈ అశోక స్తంభాన్ని తురుష్క నవాబు ‘ఫిరోజ్ షా తుగ్లక్’ క్రీ.శ. 1356 లో పెకలించి ఢిల్లీ నగరానికి తరలించాడు. ఈ స్థంభం ఈ రోజు పాత ఢిల్లీ లో ‘ఫిరోజ్ షా కోట్ల’ (Feroz Shah Khotla) లో మహ్మదీయ కట్టడాల మధ్య ఉంది. దీని మీద బ్రహ్మ లిపిలో ప్రాకృత భాషలో అశోక శాసనం చెక్కించబడింది. అది ‘దేవనామప్రియ ప్రియదర్శి’ అనే నామంతో ఈ విధంగా ఉంది:
“రహదారుల ప్రక్కన మానవులు, జంతువుల కొరకు అత్తి చెట్లను (fig trees) నాటించాను..... పెద్ద ఉద్యోగములు చేసేవారు, విద్యావంతులు, నిపుణులు తమ సామర్ధ్యాన్ని వినియోగించి పిల్లల దృష్టిలో, వారి హృదయాలలో ధర్మం, మతం గురించిన బోధనల ద్వారా అత్యుత్సాహం ప్రదర్శించేటట్లుగా తీర్చిదిద్దాలి. ..... నేను చేసిన, ఆజ్ఞాపించిన ధర్మకార్యాలు నా తరువాత వచ్చే వారు తప్పనిసరిగా పాటించాలి. ...తల్లిదండ్రులకు, ఆధ్యాత్మిక గురువులకు, విద్వాంసులకు, అనాధలకు, దిక్కులేనివారికి,నిరుపేదలకు, సేవకులకు, పరిచారికలకు, ధర్మ బుద్ధితో, అతి గౌరవంతో పాలిక వర్గాలు ప్రవర్తించాలి............”
“మతం, ధర్మం రెండు విధాల వృద్ధి చెందుతుంది. అవి మతాధికారి, ధర్మాధికారుల ద్వారా, మరియు హింసను అంతం చేసి అహింసను ప్రోత్సహించటం ద్వారా...అసలు అన్ని జీవులకు మరణ దండన నిషేధిస్తే మానవుల యెడల జరిగే హింసను అంతం చేసేటట్లు రాజులు, అధికారులు ప్రవర్తించాలి.. ఇలా జరిగినప్పుడు నా పుత్రులు, వారి పుత్రులు, వారి వారి పుత్రులు సూర్యుడు, చంద్రుడు ఉన్నంతవరకు ప్రజలు ధర్మ మార్గంలో నడుస్తూ సుఖ సంతోషాలతో ఉండగలరు.... రాతి స్తంభాల మీద ఈ నా శాసనం చెక్కించడం వల్ల కలకాలం నా సందేశం ప్రజలకు లభ్యమవుతుంది.”
ఢిల్లీ-మీరట్ ధర్మ స్థంభం
అశోకుడు మరొక ధర్మ స్తంభాన్ని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నెలకొల్పాడు. ఈ పట్టణం ఢిల్లీ కి 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ 33 అడుగుల భారీ స్తంభాన్ని కూడా ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ కి తరలించటం జరిగింది. ఈ తరలింపుకు 42 చక్రాల వాహనం మీద యమునా నది తీరానికి తీసుకువచ్చి, ఆ తరువాత అది పెద్ద నావలో ఢిల్లీకి తరలించటం జరిగింది. మరొక మహ్మ దీయ సుల్తాను పాలనలో (1713-19) పేలుడు జరిగి నప్పుడు ఈ స్థంభం 5 ముక్కలు అయింది. తరవాత 100 ఏళ్లకు బ్రిటిష్ పాలకులు ఒక ముక్కను బ్రిటిష్ మ్యూజియంకు తరలించగా మిగతా నాలుగు ముక్కలను కలకత్తాకు తరలించారు. వీటిని 1887 లో ఢిల్లీ తీసుకువచ్చి వీటిని అతికించి పాతించి నిలబెట్టటం జరిగింది.
కౌశంబి-అలహాబాదు ధర్మ స్థంభం
అశోక చక్రవర్తి నిర్మించిన మరొక ధర్మ స్థంభం ఈ కౌశంబి-అలహాబాదు స్థంభం. దీనిని మొదట కౌశంబి లో ఇసుక రాయితో నిర్మించినప్పుడు స్థంభం ఎత్తు 35 అడుగులు. స్థంభం క్రింది వైశాల్యం 35 అంగుళాలు, పైన వైశాల్యం 26 అంగుళాలు. స్థంభం పైన చుట్టూ పద్మాల ఆకారం లో ఉన్న ఫలకం నిర్మించ బడింది. దాని పైన ఏక-సింహం నిలబడి ఉంటుంది. తరువాత కాలంలో ఈ ధర్మ స్థంభాన్ని పశ్చిమ వైపు 50 కి.మీ. దూరంలో ఉన్న అలహాబాదు (ప్రయాగ్ రాజ్) కు తరలించబడింది. ఈ ప్రయాగ్ రాజ్ ఆ కాలంలో ‘వత్స’ (Vatsa) రాజ్యానికి రాజధాని.
ఈ ధర్మ స్థంభం పలుమార్లు పెకలించబడి పాతబడినట్లు కొందరు చరిత్రకారులు నుడివినా, ఇది అసత్యమని నిర్ధారించబడింది. కౌశంబి నుంచి తరలించబడి ప్రయాగ లో గంగా-యమున నదుల సంగమం వద్ద ప్రతిష్టించబడిన తరువాత ఈ స్థంభం ఎక్కడికీ తరలించబడలేదు.
ఈ స్థంభం మీద అశోకుడి రాజ శాసనాలు 6 ఉన్నాయి. ఇందులో మొదటి రెండు శాసనాలు ఇప్పటికీ స్పష్టంగానే ఉన్నాయి. అలాగే 5 వ శాసనం చివరి రెండు పంక్తులు కూడా. మూడు, నాలుగవ శాసనాలను మొఘల్ నవాబు జహంగీర్ తొలగించి తన పూర్వీకుల పేర్లను చెక్కించాడు. 6 వ శాసనం మాత్రం ఒక అర పంక్తి మినహా మిగతా పంక్తులు స్పష్టంగానే ఉన్నాయి. స్పష్టంగా ఉన్న పంక్తుల ద్వారా ‘దేవనామ ప్రియ’ ఆజ్ఞలు ఇలా ఉన్నాయి:
“ఎవరూ ఈ నా ఆజ్ఞను అతిక్రమించరాదు. బౌద్ధ సన్యాసులు, సన్యాసినిల శ్రేణులను ఒకటిగా చేయటం జరిగింది. ఈ ఐక్యం నా పుత్రులు, మనుమలు, ముని మనుమలు కాలం వరకు, సూర్య చంద్రులున్నంత వరకు వర్ధిల్లాలి. ఎవరయితే వీరిమధ్య విబేధాలు సృష్టిస్తారో వారి చేత శ్వేత వస్త్రాలు ధరింపజేసి సన్యాసులు, సన్యాసినిలు నివసించని చోట నివశించేటట్లు చేయాలి. ఈ నా ఆజ్ఞ, అభిలాష సన్యాసుల శ్రేణులకు, సన్యాసినుల శ్రేణులకు తెలియచేయాలి. నా ఆజ్ఞతో ఉన్న ఈ మూల పత్రం ఒక నకలు సమావేశ ప్రదేశం (గది, చావడి) లోనూ, మరొక నకలు మతాధికారి వద్ద ఉంచాలి."
“దేవనామ ప్రియ ఇంకా ఇలా ఆదేశిస్తున్నారు: సామాన్య వ్యక్తి ప్రతి ‘ఉపాసత’ రోజున (ప్రాయశ్చిత్తం చేసుకునే రోజున) ఈ నా ఆదేశాన్ని మన్నిస్తానని, ఆమోదిస్తానని ప్రతిజ్ఞ చేయాలి. క్రమం తప్పకుండా ఉపాసత ను హాజరు అయ్యే ప్రత్యేక రాజాధికారులకు కూడా ఇది వర్తిస్తుంది. వీరి అధికారిగా ఉన్న ప్రాంతంలో ఈ నా ఆజ్ఞను వ్యాపింప జేయాలి. అలాగే సైనికాధికారులు పాలించే ప్రాంతాలలో కూడా.”
ఈ ధర్మ స్థంభం మీదే అశోకుడి శాసనం దిగువ క్రీ.శ. 4 వ శతాబ్దం లోని గుప్త వంశపు రాజు సముద్రగుప్త (పాలన: 350 -375) కు సంబంధించిన ఒక శాసనం సంస్కృత భాషలో (బ్రహ్మ లిపి లో) ఉంది. దీనిని ఈ గుప్త రాజు ఆస్థానంలో ఉన్న కవి, మంత్రి ‘హరిసేన’ చెక్కించాడు. ఇందులో సముద్ర గుప్తుడి రాజకీయ చతురత, యుద్ధాలలో సాధించిన అనేక విజయాలను కీర్తిస్తూ, స్తుతిస్తూ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వాక్యాలు స్థంభం మధ్యలో, దాని చుట్టూ, సుమారు 30 పంక్తులలో చెక్కించ బడ్డాయి.
నిగాలి సాగర్ ధర్మ స్థంభం
నేపాల్ లోని ‘లుంబిని’ కి 20 కి.మీ. దూరంలో వాయువ్య దిశలో ఉన్న ‘నిగాలి సాగర్’ అనే ప్రదేశంలో అశోకుడు మరొక ధర్మ స్థంభం నెలకొల్పటం జరిగింది. దీనికి ఒక బలమైన కారణం ఉంది. బుద్ధుడి జన్మలలో గౌతమ బుద్ధ 24 వది. దీనికి ముందు జన్మలో, అంటే 23 వ జన్మలో ఆయన నామం ‘బుద్ధ కొనకమన’ (Buddha Konakamana). ఈయనను ‘కనకముని’ (Kanakamuni) అనేవారు.
ఈ 23 వ బుద్ధుడి గురించి బౌద్ధ మత చరిత్రలో ఘనంగా కీర్తించబడింది. ఈయన ఈ నిగాలి సాగర్ లోనే రాజ భవనాలలో నివసించి, తరువాత నిరాడంబర జీవితం గడిపి, ఒక బ్రాహ్మణ పుత్రిక నుండి పాలు, అన్నం, మొదలగువాటిని భిక్షగా స్వీకరిస్తూ, చివరి దశలో కొన్ని ఏళ్ళు బోధి (ఉదుంబర) వృక్షం క్రింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందటం జరిగింది. ఈ కనకముని బుద్ధుడి పేరుమీదనే ఈ నిగాలి సాగర్ ధర్మ స్థంభం నెలకొల్పబడింది.
ఇచ్చటి స్థంభం మీద శాసనం అశోక చక్రవర్తి క్రీ.పూ. 249 లో నిగాలి సాగర్ దర్శించినప్పుడు చెక్కబడింది. ఆ సమయంలోనే భూమిలో ఈ స్థంభం పాతించబడింది. ఆ సంవత్సరంలోనే ఆయన లుంబిని, గోతిహవ (Gotihawa) దర్శించి అచ్చటి ధర్మస్థంభాలకు తన నివాళులు, వందనములు అర్పించటం జరిగింది.
రాంపూర్వ జంట ధర్మ స్తంభాలు
బీహార్ రాష్ట్రంలో చంపారణ్ జిల్లాలో రాంపూర్వ (Rampurva) పట్టణంలో అశోకుడు జంట-ధర్మ స్థంభాలను నెలకొల్పటం జరిగింది. ఈ పట్టణం నేపాల్ సరిహద్దులో ఉంది. ఈ రాంపూర్వ (రామ పూర్వ) గౌతమ బుద్ధ పరినిర్వాణం చెందిన ఉత్తరప్రదేశ్ లోని ‘కుసీనగర’ (Kusīnagara) సమీపంలో ఉంది.
ఈ ధర్మ స్థంభం క్రీ.శ. 1877 లో భూమి పైభాగం విరిగి నేలమీద ఉన్న రెండు జంట ధర్మ స్థంభాలను ఒక ఆంగ్లేయుడు గుర్తించి వీటిని పునరుద్ధరించటానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఈ స్థంభాల పైన ఉన్న ఈ రెండు ఫలకాలు విరిగి నేలమీద పడియున్నాయి. ఈ స్థంభాలను మరల పాతి నిలబెట్టటానికి వీలు గాక ఈ రెండు ఫలకాలను ఢిల్లీ లో భద్రపరచడం జరిగింది. ఈ ఫలకాలలో ఒకటి సింహ ఫలకం, రెండవది ఎద్దు (bull) ఫలకం. ఈ స్థంభాల మీద అశోకుడి శాసనాలు చెక్కబడ్డాయి. ప్రాకృత భాషలో బ్రహ్మ లిపిలో ఉన్న ఆ శాసనాలు ఇప్పటికీ తర్జుమా చేయబడలేదు.
తరువాత ఈ రెండు ఫలకాలకు నగిషి పెట్టిన తరువాత అవి అతి సుందరంగా తయారయ్యాయి. వీటిల్లో ఎద్దు ఫలకం ఈరోజు ఢిల్లీ లోని రాష్ట్రపతి నిలయాన్ని అలంకరిస్తూ ఉంది.
ఆంధ్రప్రదేశం లోని అమరావతి అశోక ధర్మ స్థంభంతో సహా దేశంలోని ఇతర ధర్మస్థంభాల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.
మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com