Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

7. అశోకుడు

గత సంచికలో అశోక చక్రవర్తి బౌద్ధ సన్యాసులు, సన్యాసినిలు ధ్యానం చేసుకోటానికి, నివసించటానికి వీలుగా కొండలను త్రవ్వి, తొలిచి నివాసయోగ్యమైన గుహలను నిర్మించినట్లు తెలుసుకున్నాము. వీటిని బౌద్ధులకే గాక జైన మతస్తులకు, అజీవికలకు కూడా కేటాయించటం జరిగింది.

ధర్మ స్థంభాలు (స్తూపాలు, మహా చైత్యలు)

గౌతమ బుద్ధ మానవాళికి ఇచ్చిన ఉపదేశాలను మరింత విశేషంగా వ్యాప్తి చేయటానికి, వాటిని మానవులు అనుసరించేటట్లు చేయటానికి అశోకుడు మరొక రూపంలో గట్టిగా కృషి చేయటం జరిగింది. దీని కొరకు ఈయన అనేక శిలా స్థంభాలను (pillars) నిర్మించాడు. ‘ధర్మ స్థంభాలు’ (స్తూపాలు; ప్రాకృతం: ‘ధమ్మ తంభాలు’) గా పేరొందిన ఇవి భారతావనిలో అద్భుతమైన శిలా కట్టడాలుగా పేరొందాయి. వీటిల్లో అత్యధిక స్థంభాలుమౌర్య మెరుగు’ను (Mourya Polish) ఇప్పటికీ, 2,270 ఏళ్ల తరువాత కూడా ప్రదర్శిస్తున్నాయి. ఈ మౌర్య చక్రవర్తి నిర్మించిన స్థంభాలలో 20 ఇప్పటికీ బుద్ధుడి సందేశాలతో నిండి ఉన్నాయి. ఈ ధర్మ స్థంభాన్ని ‘మహా చైత్య’ అని కూడా అంటారు.

ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఈ స్థూపాలు నిర్మించబడ్డాయి. ఈ రాతి ధర్మ స్తంభాలు బుద్ధుడు జన్మించిన చోట, ధ్యానం చేసిన చోట, మరణించిన చోట, నడయాడిన చోట్ల, ఇంకా దేశంలో అనేక చోట్ల నిర్మించబడ్డాయి. కొన్ని ప్రదేశాలను బుద్ధుడు దర్శించకపోయినా ఇవి నిర్మించబడ్డాయి. కొన్ని చోట్ల స్థంభాలను నిర్మించే ముందు భూమిలో శాక్యముని (బుద్ధుడి) అవశేషాలను ఉంచటం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనవి బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హర్యానా లో ఉన్నాయి.

ఈ స్థంభాలు రెండు రకాల రాళ్లతో తయారుచేయబడ్డాయి. ఒక రకం మధుర ప్రాంతంలో లభించే ఎరుపు-తెలుపు చుక్కలున్న ఇసుక రాయి. రెండవ రకం వారాణసి (వారణాసి) కి సమీపంలో ఉన్న చునార్ పట్టణం (Chunar; ఉత్తర ప్రదేశ్, మీర్జాపూర్ జిల్లా) లో లభించే నల్ల చుక్కలతో నిండిన గట్టి ఇసుక రాయి. ఈ రెండు రకాల రాళ్లతో నెలకొల్పిన స్థంభాలమీద ఒకే ప్రాంతానికి చెందిన శిల్పుల చేత చెక్కించబడ్డాయి. ఈ రాళ్లు మధుర, చునార్ నుంచి నిర్దేశించిన చోట్లకు తరలించబడిన తరువాత నే చెక్కబడ్డాయి.

ధర్మ స్థంభాలలో రకాలు, వాటి నిర్మాణం

అశోకుడు నిర్మించిన రాతి స్థంభాలలో రెండు రకాలు ఉన్నాయి: ఒక రకం అయన ఇచ్చిన శాసనాలతో నిండి ఉన్నాయి, రెండవది శాసన రహితంగా ఉన్నాయి. ఈ స్థంభాలన్నీ బుద్ధుడి జీవిత విశేషాలతో నిండి ఉన్నాయి.

ఒక స్థంభం రెండు తునకలతో (ముక్కలతో; pieces) కలిపి ఉంటుంది. ఈ రెండిటిలో మొత్తం నాలుగు భాగాలు (components) ఉంటాయి. ఒక రాతి తునక చివర మూడు విభాగాలు (sections) ఉన్న ఫలకం ఉంటుంది. ఈ ఫలకం పొడవాటి (నిడుపాటి) స్థంభం చివర అతికించబడి ఉంటుంది. ఈ స్థంభం ఒక పొడవాటి రాతితో నిర్మిచబడుతుంది. దానిని మొదట ఉలితో చెక్కి, తదుపరి చదునుగా చేయబడుతుంది. ఇది నున్నగా ఉండి, పైకి పోయినకొద్దీ సన్నబడి ఉంటుంది. స్థంభం చివర ఉన్న ఫలకం క్రింది భాగం పద్మ దళాల ఆకారంతో ఉన్న గంట (bell) ఉంటుంది. దీని పైన కూర్చుని ఉన్న, లేక నిలబడి ఉన్న జంతువుల (సింహాలు, అశ్వం, ఏనుగు, ఎద్దు) రూపాలు ఉంటాయి.

సారనాధ్ లో ఉన్న స్థంభం చివర అయితే నాలుగు-సింహాల ఫలకం ఉంటుంది. ఈ నాలుగు- సింహాల ఫలకం ప్రస్తుతం భారతదేశ అధికార చిహ్నంగా ఉంది. అలాగే సాంచి స్థంభం చివర నాలుగు-సింహాల ఫలకం, వైశాలి స్థంభం చివర ఏక-సింహ ఫలకం ఉన్నాయి.

ఇటివంటి రాతి స్థంభాలను అశోకుడు తన మౌర్య సామ్రాజ్య పరిధిలో అనేక చోట్ల నిర్మించటం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనవి: సారనాథ్ (వారణాశి ప్రక్కన), సాంచి (మధ్య ప్రదేశ్), రాంపూర్వ (బీహార్), వైశాలి (బీహార్), సంకిస్స (Sankissa, సంకస్స: ఉత్తరప్రదేశ్ లోని ‘శ్రవస్తి’ పట్టణానికి దగ్గర), నందన్ గర్హ్ (బీహార్), మీరట్ (ఉత్తరప్రదేశ్), తోప్రాకలాన్ (హరియాణా), కోశాంబి (కౌశాంబి: ఉత్తరప్రదేశ్, ప్రయాగరాజ్ సమీపంలో), నిగాలిసాగర్ (లుంబిని దగ్గర, నేపాల్), అల్లహాబాదు (ప్రయాగరాజ్), లారియా-నందన్ గర్త్, లారియా-అరారాజ్, ఢిల్లీ-తోప్రా, ఢిల్లీ-మీరట్, అమరావతి (ఆంధ్రప్రదేశ్), మొదలగునవి.

ఈ రాతి స్థంభాలమీద ఉన్న శాసనాలలో అశోకుడు పలు రాజాజ్ఞలు చెక్కించటం జరిగింది. అవి: ప్రభుత్వ అధికారుల విధులు; మత విబేధ (Schism) సంబంధిత శాసనం (Edict); రాణి శాసనం (Queen's Edict), మొదలగునవి. ఈ రాజాజ్ఞలు ధర్మం (ధమ్మ: Dhamma) గురించి అశోకుడు అవలం భించిన విధానం, సంఘంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను సరిదిద్దటానికి అయన చేసిన ప్రయత్నాలను వర్ణించాయి. ఈ శాసనాలలో అయన తనను ‘దేవనామప్రియ’ గా పరిచయం చేసుకున్నాడు. వీటిల్లో తాను ఎలా బౌద్ధ మతంలోకి మారిందీ; బౌద్ధ మత వ్యాప్తికి తాను చేసిన కృషి; నీతి, మత, ఆధ్యాత్మిక విషయాలలో అయన ప్రవేశపెట్టిన సూత్రాలు; సంఘం, జంతువుల సంక్షేమం విషయంలో అయన రూపొందించిన కార్యాచరణ; ప్రభుత్వ అధికారుల విధులు, మొదలగునవి.

సారనాథ్ ధర్మ స్థంభం

అన్ని స్థంభాలలో అతి ముఖ్యమైనది క్రీ.పూ.250 లో నెలకొల్పిన సారనాథ్ స్థంభం. దీని శిఖర అగ్ర భాగం నాలుగు సింహాలతో నిండి ఉంది. 2,270 ఏళ్ల క్రితం నెలకొల్పబడిన ఈ స్థంభం ఇప్పటికీ సారనాధ్ లోనే అదే స్థానంలో ఉంటే, సింహాల ఫలకం మాత్రం సారనాథ్ మ్యూజియంలో ఉంది. ఈ ఫలకం ‘భారత దేశం జాతీయ చిహ్నం’ గా ఉంటే ‘స్థంభంలో చెక్క బడిన 24 ఆకులతో ఉన్న ‘అశోక చక్రం’ దేశ పతాకాన్ని అలంకరించింది.

Dhamek-Stupa-Sarnath
Photo Credit: Wikimedia Commons

సారనాథ్ ధర్మ స్థంభం
Sarnath-capital
Photo Credit: Wikimedia Commons

సారనాథ్ ధర్మ స్థంభం చివర ఉన్న నాలుగు,సింహాలు, ధర్మచక్రం ఉన్న ఫలకం
Sanchi-Stupa
Photo Credit: Wikimedia Commons

సాంచి ధర్మ స్థంభం
Sanchi-capital-right-side-view
Photo Credit: Wikimedia Commons

సాంచి ధర్మస్థంభం చివర ఉన్న నాలుగు సింహాల ఫలకం


సాంచి ధర్మ స్థంభం 

మరొక ధర్మ స్థంభం మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు దగ్గరలో ఉన్న ‘సాంచి’ (Sanchi) లో ఉంది. ఈ స్థంభం పైన నాలుగు సింహాలు, ఒకదాని వెనుక మరొకటి, నెలకొల్పబడ్డాయి. దీనిలో అన్ని భాగాలు సమానంగా ఉండేటట్లు అనుసంధానం చేయబడ్డాయి. ఇది చాలావరకు సారనాధ్ స్తంభాన్ని పోలి ఉంటుంది. కాని దీని పైన ఉన్న సింహాలు ధర్మచక్రానికి ఆధారమివ్వవు. స్థంభానికి ఉన్న నగిషి ఈ రోజుకూ కాంతి వెదజల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. దురద్రుష్టవశాత్తు సింహాలతో ఉన్న ఈ ధర్మస్థంభం నిర్మించిన చోట ప్రస్తుతం లేదు. కేవలం స్థంభం మాత్రమే సింహద్వారం (gateway) వద్ద ఉంది. కాని ఈ నాలుగు సింహా ల సముదాయాన్ని భారత జాతీయ చిహ్నంగా స్వీకరించటం జరిగింది.

వైశాలి ధర్మ స్థంభం

బీహార్ రాష్ట్రంలోని ఒకప్పటి వైశాలి (ఇప్పటి Basarh) నగరంలో ఉన్న ఈ ధర్మస్థంభం నల్ల ఇసుకరాయి (Black Sandstone) తో నిర్మించబడింది. ఈ స్థంభం పైన ఒక పెద్ద సింహం రూపం ఉంటుంది. ఈ స్థంభం దగ్గరోలోనే ‘రామకుండ్’ (Ramkund) అనే సరస్సు ఉంది. ఇచ్చట గౌతమ బుద్ధ తన చివరి ఉపదేశం ఇవ్వటం జరిగింది. బుద్ధుడి కాలంలో అత్యంత సుందరాంగి, మగధ మహారాజు ‘బింబిసార’ రాజ సభలో నర్తకి, వేశ్యగా ప్రసిద్ధి చెందిన ‘ఆమ్రపాలి’ ఈ వైశాలి నగర వాసియే.

లుంబిని ధర్మ స్థంభం

గౌతమ బుద్ధ కాలంలో ఇప్పటి నేపాల్ లో కపిలవస్తు నగరానికి తూర్పు దిశలో రుపందేహి జిల్లాలో లుంబిని పట్టణం ఉంది. క్రీ.శ. 1896 లో డిశంబర్ 1 వ తేదీన ఒక ధర్మ స్థంభం లుంబినిలో కనుగొనబడింది. అశోకుడు తన పాలనలో 20 వ ఏట (క్రీ.పూ. 249 లో) ఇప్పటి నేపాల్ లోని లుంబినిలో ఈ ధర్మ స్తంభాన్ని నిర్మిచటం జరిగింది. లుంబిని ‘రుపందేహి’/’రూపందేవి’ (Rupandehi) జిల్లాలో ఉంది కాబట్టి ఈ స్తంభాన్ని ‘Rumminde pillar’ అని పిలుస్తారు. ఈ లుంబిని నగరంలోనే ‘శాక్య’ రాజు ‘శుద్ధోదన’ (Suddhodhana) భార్య మహారాణి మాయాదేవి ‘సిద్ధార్ధ గౌతమ’ కు క్రీ.పూ. 623 లో జన్మనిచ్చింది.

ఈ స్థంభం ఉన్న చోట భూమిని త్రవ్వినప్పుడు మొదట దాని పైభాగమే కనబడింది. దీనిని చూసి నేపాల్ అధికారులు ఇంకా లోపలికి త్రవ్వగా స్థంభం మీద బ్రహ్మిలిపి-ప్రాకృతంలో కొన్ని పంక్తులు కనిపించాయి. ఈ పంక్తులే అశోకుడి ఈ స్తంభాన్ని నిర్మించినప్పుడు చెక్కించిన శాసనం. ఇంకా లోపలికి త్రవ్వి స్థంభాన్ని పైకి తీసుకురావటం జరిగింది. కాని క్రింది భాగం పూర్తిగా విరిగిపోయి పోయింది. పై భాగమే మరొక చోట నిలబెట్టటం జరిగింది.

ఈ స్థంభం మీద చెక్కబడిన అశోకుడి శాసనం ఈ విధంగా ఉంది:

“రాజు ‘దేవనామప్రియ ప్రియదర్శి’ 20 ఏళ్ళు రాజుగా నియమించబడిన తరువాత ఈ చోటుకు వచ్చి బుద్ధ శాక్యమునిని ఆరాధించాడు. ఇచ్చట అశ్వ రూపాన్ని ఒక రాతి మీద నిర్మించి దానిని ఒక స్థంభం మీద స్థిరీకరించాడు. ఈ విధంగా చేయటానికి కారణం ఈ మహనీయుడు ఇచ్చట జన్మించినట్లు తెలియజేయటం. ఆయన (అశోకుడు) లుంబిని ని పన్ను-రహితంగా చేయటమేగాక, ఉత్పత్తిలో ఎనిమిదోవంతు మాత్రమే కోశాగారానికి ఇచ్చేటట్లు ఆదేశాలు ఇచ్చాడు.”


Ashoka-pillar-at-Vaishali-Bihar
Photo Credit: Wikimedia Commons

వైశాలి ధర్మ స్థంభం
Ashoka-pillar-at-Vaishali-Bihar
Photo Credit: Wikimedia Commons

వైశాలి ధర్మ స్థంభం చివర ఉన్న ఏక-సింహ ఫలకం

Lumbini-pillar-with-inscription
Photo Credit: Wikimedia Commons

లుంబిని లోని క్రీ.శ. 1896 లో త్రవ్వబడిన రూపందేవి (Rupandehi/Rumminde) ధర్మస్థంభం. అశోకుడి శాసనం ఉన్న స్థంభం ప్రదేశం భూమికి 3.5 అడుగుల లోపల ఉంది.
Lumbini-Pillar
Photo Credit: Wikimedia Commons

కొంత భాగం భూమి లోపల విరిగిపోయి ప్రస్తుతం పైకి కనపడుతున్న లుంబిని ధర్మ స్థంభం

ఆంధ్రప్రదేశం లోని అమరావతి అశోక ధర్మ స్థంభం, దేశంలోని ఇతర ధర్మస్థంభాల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.

మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com

****సశేషం****

Posted in January 2024, వ్యాసాలు

1 Comment

  1. కట్నేని వేంకట కృష్ణారావు

    సాంస్కృతిక వారసత్వం అనేది ప్రతి మనిషికి, మానవుల సామూహికమైన ప్రతి జాతికి, ప్రతి దేశానికి అత్యంత ఆవశ్యకమైన పునాది. అటువంటి సాంస్కృతిక వారసత్వం చరిత్ర నుంచే లభిస్తుంది. చరిత్ర లేనిదే జాతి లేదు. దేశమూ లేదు. మనిషి మనుగడ లేదు. అంత విలువైన చరిత్రను సవివరం గా అందిస్తున్న డా. వల్లూరిపల్లి శివాజీరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!