5. అశోకుడు
గాంధార దేశం (ఆఫ్గనిస్తాన్) లో అశోకుని సందేశం
ఒకవైపు మౌర్య అధికారులు, లేఖకులు భారతావనిలో అనేక చోట్ల అశోకుడి సందేశాలు చెక్కటంలో నిమగ్నమయినప్పుడు ఒక రాజాజ్ఞ క్రీ.పూ. 259 లో ఉపఖండం వెలుపల ఉన్న ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ (ఒకప్పటి గాంధార) కు పంపించటం జరిగింది. వెంటనే ఈ సందేశం ఒక శిలా శాసనం రూపం దాల్చింది. అప్పటికి అశోకుడు మౌర్య చక్రవర్తి అయి దాదాపు 10 ఏళ్ళు అయింది. ఈ శాసనాన్ని కాందహార్ వాస్తవ్యులు గిరిష్క్ (Girishk)-హెరాత్ (Herat) వెళ్లే రోడ్డు మార్గంలో ఒక కొండ గుట్టల మధ్య ఉండటం గమనించారు. ఈ మార్గంలో ప్రయాణికులు, వర్తకులు అత్యధికంగా ప్రయాణిస్తారు. కొండ గుట్టల మధ్య ఒక చోట ద్విభుజ చతురస్రాకార (trapezoidal) రాతి పలక కనిపిస్తుంది. ఈ రాతి పలక శాసనం అశోకుడి తరువాత వందలాది ఏళ్ళు అనేక మంది రాజులు, యుద్ధ నాయకులు చూసి ఉండవచ్చు.
ఈ శాసనం ప్రాకృత భాష-బ్రహ్మి లిపిలో కాక వేరే రెండు భాషలలో ఉంటుంది. అవి గ్రీకు, అరా మైక్ (Aramaic) భాషలు. ఇవి అచటి ప్రజలు వాడే భాషలే. ఈ ప్రాంతం గ్రీకు పాలనలోకి వచ్చే ముందు, అరామైక్ భాష మాట్లాడే పర్షియన్ రాజుల అధీనంలో ఉంది. అందువల్ల ఇచటి ప్రజలు ఈ రెండు భాష లు మాట్లాడుతారు. అందువల్ల ఈ శాసనం ఈ రెండు భాషల్లో చెక్కించటం జరిగింది.
భారతావనిలోని శాసనాలలో ఈ మౌర్య చక్రవర్తి తాను ఎంత ఆధ్యాత్మిక వికాసం పొందాడో వివరించాడు. కాని కాందహార్ శాసనంలో మాత్రం అప్పటికే అనేక మందిని తన మార్గంలోకి తీసుకు వచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న చక్రవర్తిగా కానవస్తాడు. ఈ సందేశం కేవలం తన పూర్ణ పరివర్తన గురించి మాత్రమే. ఆ సందేశం సంక్షిప్తంగా ఇలా ఉంది:
“10 సంవత్సరాలు పాలనను పూర్తిచేసుకున్న రాజు ‘ప్రియదర్శి’ (గ్రీకు: Piodasses) మానవుల యెడల విశ్వాసం చూపించాలనే సిద్ధాంతం ప్రవేశపెట్టటం జరిగింది. ఈ క్షణం నుంచి అయన మానవులను అత్యంత పవిత్రులుగా చూడాలని అందరకు సూచిస్తున్నారు. ఈ చక్రవర్తి జీవ రాసులను అంతం చేయటం మానుకున్నారు; ఇతర మానవులు, వేటగాళ్లు, మత్స్యకారులు కూడా వేటాడటం మానుకున్నారు.
కొంతమంది మితిమీరిన వారు తమ స్వభావమును శక్తి మేర సంస్కరించుకుని తల్లి తండ్రులు, పెద్దల యెడల గతంలో కంటే అధిక విధేయత ప్రదర్శించటం జరుగుచున్నది. ఇదే కొనసాగితే వారి జీవితాలు మెరుగుపడి సుఖవంతమవుతాయి.”
ఈ సందేశం ఒక రాతి మీద రెండు భాషలలో (అరామైక్, గ్రీకు) చెక్కటం జరిగింది. ఈ రెండు లిపులకు సామీప్యత చాలా ఉంది. ఈ రెండు భాషలలోని పదాలు వేరేగా ఉన్నా అర్ధం మాత్రం ఒకటే. పదాలు ఏవయినా ఈ ద్విభాషా శాసనంలో పశు సంహారం విసర్జించమని అశోకుడు కాందహార్ ప్రజలకు సూచించాడు.
కాందహార్ ప్రజలు అత్యధికంగా మాంసాహారులు. మాంసం కోసం వారు అనేక రకాల జంతువులను (ముఖ్యంగా గొర్రెలు, లేళ్ళు, మేకలు, పశువులు, శునకాలు, అశ్వాలు, మొదలగునవి) సంహరిస్తారు. వారు శాకాహారులను, ముఖ్యంగా పాటలీపుత్రలోని ప్రజలను ఎగతాళి చేస్తారు, పరిహసిస్తారు. ఈ పరిస్థితిలో అచ్చటి ప్రజలు శాకాహారులుగా మారటం చాల కష్టమైన పని. అందువల్ల వారు అశోకుడి శాసనం చూసినా, చదివినా పట్టించుకోలేదు; తమ మాంసాహార అలవాట్లు విడిచి పెట్టనూలేదు!
ఈ శాసనంతో పాటు మరికొన్ని శాసనాలు (Minor Rock Edicts) అదే సమయంలో ఇతర ప్రదేశాల్లో కూడా చెక్కటం జరిగింది. కాని దీనికి ఇతర శాసనాలకు కొన్ని తేడాలున్నాయి. ఈ కాందహార్ శాసనంలో అశోకుడు తన స్వానుభవం గాని, తాను ప్రవేశపెట్టిన అహింస సిద్ధాంతం ప్రవేశపెట్టటానికి గల కారణాలు గాని వివరించలేదు. కానీ అయన పరిపూర్ణమైన బౌద్ధ మతస్తుడు అయినట్లు కనిపిస్తుంది. 10 ఏళ్ళు పాలన తదుపరి ఒక పరిణతి పొందిన ఆధ్యాత్మిక చక్రవర్తిగా అయన తన ప్రజలకు తగిన సూచనలు చేయటం జరిగింది. ఈ శాసనం ముఖ్య ఉద్దేశం తన ‘ప్రజలు సంతోషంగా ఉండటం.’
ప్రధాన శిలాశాసనాలు (Major Rock Edicts); సత్యం, ధర్మం, దయ, వినయం, విధేయత
అశోకుడు క్రీ.పూ. 259 లో ఇచ్చిన చిన్న తరహా శిల్ప శాసనాల (Minor Rock Edicts) సముదాయంవల్ల ప్రజలలో అయన ఆశించినంత స్పందన రాలేదు. అందువల్ల క్రీ.పూ. 256 లో అయన మరికొన్ని శిలా శాసనాలను చెక్కించి తన సందేశాలను ప్రజలు తప్పనిసరిగా అనుసరించటానికి అవసరమైన చర్యలు తీసుకోవటం జరిగింది. మొదట ఇచ్చిన శాసనాలు 6 నుంచి 22 పంక్తులు ఉంటే, ఈ సారి ఇచ్చిన శాసనాలు దాదాపు 100 పంక్తుల సముదాయం.
కొన్ని ప్రదేశాలలో అయితే దగ్గర దగ్గరగా ఒకే సందేశం బహుళ శిలలమీద చెక్కబడింది. ఈ ప్రధాన శిలాశాసనాలు భారతావనిలో 14 చోట్ల లిప్యంతరీకరణ చేయబడ్డాయి. అశోకుడి ఈ రకపు ప్రధాన శిలా శాసనాలను ప్రధాన రాతి శాసనాలు (Major Rock Edicts) గా కూడా పరిగణించ బడుతున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఈ క్రింది పట్టికలో పొందుపరచడమైనది.
కొన్ని ప్రదేశాలలో అయితే ఇవి ఈ నాటికీ, 2,264 ఏళ్ల తరువాత కూడా సజీవంగా ఉన్నట్లుగా కనపడతాయి. ఒక అసాధారణమైన శాసనం ‘ఎర్రగుడి’ (ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా) రాళ్ళల్లో ఉంది (చిత్రం 1, 2). ఇది ఒకే రాళ్ల సముదాయంలో 6 బండ రాళ్ల మీద వంకరటింకరగా చెక్కించ బడింది. బ్రహ్మ లిపిలో ఉన్న ఈ బండరాళ్లు తూర్పు వైపున కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల లిప్యంతరీకరణ ఈరోజుకూ స్పష్టంగా కనపడితే, మరి కొన్ని చోట్ల కనపడి, కనపడనట్లు ఉంటాయి. అన్నిటి కంటే ఎత్తులో ఉన్న బండరాయిమీద 1.5 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవులో 7 పంక్తులు ఇమిడితే, అటువంటి రాయి మీద 3.5 అడుగుల పొడవులో 5 పంక్తులు ఇమిడ్చబడ్డాయి. ఇదే సందేశం ఇదే ప్రదేశంలో ఒక చోట ఒక బండరాయి మీద 29 పంక్తులలో చెక్కబడితే, దాని ప్రక్క నే ఉన్న బండరాయి మీద ఆఖరి 7 పంక్తులు చెక్కబడ్డాయి.
ఊరు | జిల్లా, రాష్ట్రం |
ఎర్రగుడి (Erragudi) | అనంతపురం, ఆంధ్రప్రదేశ్ |
గిర్నార్ (Girnar) | జునాఘడ్, గుజరాత్ |
ధయూలి (Dhauli) | ఖోర్ధ, ఒడిశా |
జౌగడ (Jaugada, 2 శాసనాలు) | గంజాం, ఒడిశా |
కాల్సి (Kalsi) | డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ |
సోపార (Sopara) | పాల్ఘర్, మహారాష్ట్ర |
సన్నతి (Sannati) | గుల్బర్గా, కర్ణాటక |
కాందహార్ (Kandahar) | ఆఫ్గనిస్తాన్ |
షాబాజ్గర్హి (Shahbazgarhi) | పాకిస్తాన్ |
మనసెహ్రా (Mansehra) | పాకిస్తాన్ |
భారతావనిలో ఎర్రగుడి ఒక్క చోటే అశోకుడు క్రీ.పూ. 259లో చిన్న తరహా శిల్ప శాసనాలు (Minor Rock Edicts), ఆ తరువాత (క్రీ.పూ. 257 లో) ఇచ్చిన ప్రధాన శిలా శాసనాలు ఉన్నాయి. ఈ రాతి శాసనాలలో అశోకుడి బిరుదు ‘ప్రియదర్శి’ బదులు ‘రాజు’ (King) అని ఉంది. వీటిల్లో తాను నమ్మిన ధర్మం గురించి వివరిస్తూ వేడుకుల సమయంలో పశువుల బలులను నిషేధించి, జీవహింస ప్రోత్సహించమని ప్రజలను ఆజ్ఞాపించటం జరిగింది. అయన ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన సందేశం ఈ విధంగా ఉంది:
“ఇచ్చట ప్రాణంతో ఉన్న ఏ ప్రాణిని బలి ఇవ్వటానికి వధించకూడదు. మరియు దీనికోసం ఉత్సవాలను నిర్వహించకూడదు. దేవనామ ప్రియ ఇటువంటి సామూహ పండుగలలో ప్రజలు గుంపుగా చేరటం దుష్ట సంప్రదాయంగా భావిస్తారు. .......తల్లిదండ్రుల యెడల వినయ విధేయతతో ఉండాలి; అలాగే పెద్దల విషయంలో కూడా. ప్రాణుల యెడల దయతో ఉండాలి; సత్యమే పలకాలి; ధర్మాన్ని, ధర్మ గుణ గణాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. రహదారులలో మొక్కలు, చెట్లను నాటాలి, మానవులకు, పశువులకు, ఇతర జీవుల కొరకు బావులను త్రవ్వాలి. నేను వ్రాయించిన ధర్మానికి సంబంధించిన విషయాలు, వృత్తాంతాలు నా పుత్రులు, మనుమలు తెలుసుకుని వీటిని భవిష్యత్తులో మానవుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.”
ఆరోజులలో ఆంధ్ర-కర్ణాటక ప్రాంతంలో మానవులు మరణించిన తరువాత వారి శరీరాలను ఖననం చేసేటప్పుడు వాటి ప్రక్కన జంతువుల భాగాలు కూడా ఉంచేవారు. అలాగే దేవుళ్ళకు మేకలు, ఎద్దులు, గొర్రెలు, అశ్వాలు, మొదలగు జంతువులను బలి ఇచ్చేవారు. తన ఆజ్ఞను ప్రజలు ధిక్కరిస్తారని అశోకుడికి తెలుసు. అందువల్లే ఈ శాసనం ద్వారా జంతు బలి నిషేధాన్ని ప్రజలకు తెలిపి, వారిని ఇతర ఆహార నియమాలవైపు మళ్ళించమని ఆదేశించటం జరిగింది. ఈ సందేశం ఈ క్రింది విధంగా ఉంది:
“ప్రతి రోజు అనేక లక్షలాది జంతువులను ‘ప్రియదర్శి’ వంటగదులలో ప్రజల కూరల కోసం సంహరించబడుతున్నాయి. కాని ఈ శాసనం ద్వారా ప్రస్తుతానికి ఒక రోజుకు మూడు జీవులను మాత్రమే కూర కోసం చంపవచ్చు అని తెలియజేస్తున్నాను. అవి: రెండు పక్షులు, ఒక జంతువు. ఈ జంతువుని కూడా అప్పుడప్పుడు మాత్రమే కాని, ప్రతిరోజూ కాదు. భవిష్యత్తులో ఈ మూడు ప్రాణులను కూడా చంపకూడదు.”
తాను ప్రబోధించిన ఈ ధర్మ శాసనం తన పుత్రులు, మనవళ్లు, వారి తరువాత ఈ ప్రపంచం అంతరించేవరకు వచ్చే రాజులు కూడా కొనసాగిస్తారని అశోకుడి నమ్మకం. దీనిని రాళ్ల మీద చెక్కించితే తన ఈ సందేశం కలకాలం ప్రజలు ఆచరిస్తారని, తన వారసుసులు తాను నమ్మిన ధర్మాన్ని కొనసాగిస్తా రని ఆయన గట్టి నమ్మకం.
మౌర్య సామ్రాజ్యం వెలుపల రాజ్యాలకు కూడా ఇచ్చిన సందేశం
తన విశాల సామ్రాజ్య సరిహద్దుల బయట అన్నివైపులా కూడా తన సందేశం విస్తరించాలని అశోకుడి అభిలషించటం జరిగింది. ఈ చర్య వల్ల తన సామ్రాజ్య బలం ఇతర రాజులకు తెలియజేయవచ్చని కూడా ఈయన అభిప్రాయం. దక్షిణాన చోళ (Chola) చేర (Chera) రాజ్యాలు, ఉత్తరాన ఉన్న రాజ్యాలు ఆయన మదిలో ఉన్నాయి.
ఈ ఆలోచనతో కళింగ యుద్ధం జరిగిన తరువాత ఎనిమిది ఏళ్లకు (క్రీ.పూ. 260 ప్రాంతంలో) అశోకుడు తన రాజ్య సరిహద్దుల బయట ఉన్న రాజులకు ఉద్దేశించిన ఒక రాతి శాసనం ఇలాఉంది (చిత్రం 3).
“......మరియు ‘దేవానాం ప్రియ’ ఇటువంటి విజయాలు ఇచ్చటే (నా రాజ్యం) లోనే గాక దీనికి సరిహద్దులో 600 వందల యోజనాల దూరంలో ఉత్తరాన ఉన్న ఇతర రాజ్యాలలోనూ సాధించాను; అచ్చట Antiochus (Antiyoka) అనే యవన రాజు పరిపాలిస్తున్నాడు; ఈ రాజ్యం అవతల నలుగురు ఇతర రాజులు Ptolemy (Tulamaya), Antigona (Antigona), Maga (Maka), అలెగ్జాన్డర్ (Alikasudara) పాలించారు, పాలిస్తున్నారు; మరియు దక్షిణాన చోళులు, పాండ్యులు; తామ్రపర్ణి (Tambapanni: ఇప్పటి శ్రీ లంక) కూడా ……
“అలాగే ఈ రాజ్య పరిధిలోనే గ్రీకులు, కాంభోజులు, నాభకులు (Nabhakas: వాయువ్య దిక్కున ఒక రాజ్యం ప్రజలు), నాభిపంక్తిలు (Nabhapanktis హిమాలయ సరిహద్దు ప్రజలు: టిబెట్ వాసు లు అయిఉండవచ్చు), భోజులు (Bhojas: మధ్యప్రదేశ్ లోని మాళ్వ రాజ్య ప్రజలు), పితినిక్యులు (Pitinikyas), ఆంధ్రులు (Andhras), పలాదులు (Paladas: ఒక గ్రీకు రాజ్యం అయిఉండవచ్చు) ధర్మాన్ని, నైతికతను పాటించే విషయంలో దేవనామ ప్రియ ఆదేశాన్ని పాటిస్తున్నారు. …..
“దేవనామ ప్రియ రాయబారులు ఉన్న చోట్ల, వీళ్ళు లేని చోట్ల కూడా (అంటే మౌర్య రాయబారులు లేని చోట్ల కూడా) అయన (అశోకుడు) పాటిస్తున్న ధర్మం, నైతికత విని, తెలుసుకుని పాటిస్తున్నారు, లేక పాటిస్తారు. ….
“అన్నిచోట్ల సాధించిన విజయం సంతృప్తికి దారి తీస్తుంది; ధర్మం, నీతి పాటిస్తేనే సంతృప్తికి మూల కారణం అవుతుంది; పై లోకంలో లభించే ఫలాలు అత్యంత విలువైనవని దేవనామ ప్రియ అనుకుంటారు. ఈ విజయం, దీని వల్ల వచ్చే ఫలం ఈ లోకంలో పాటు, పైలోకంలో కూడా లభిస్తుంది.”
అశోకుడి గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.
మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com