రచయితలకు స్వేచ్ఛనిచ్చి భావగర్భితమైన పాటలను వ్రాయమంటే, క్రొత్త, పాత అనే బేధాలు మరిచి దర్శకులకు, స్వరకర్తలకు వారి ప్రావీణ్యతను చూపించే అవకాశం అందిస్తే, అత్యద్భుతంగా చిత్ర సన్నివేశాలను వాటిని విడమరిచి వివరించే పాటలను సృష్టించగలరు అనే మాటకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ సంచికలో మేము అందిస్తున్న ‘ఆశా పాశం బందీ..’ అనే ఈ పాట.
ఇది సగటు మధ్యతరగతి పల్లె పట్టణ ప్రజల జీవిత సారాంశాన్ని వేదాంత మాటల ఒరవడిలో సూక్ష్మంగా చూపించిన పాట. ఇందులో ఎంతో చక్కటి బాణీతో యుక్తవయస్సులో ఉన్న అబ్బాయిల సగటు ఆశలు, నిత్య జీవిత ఆశయాలు, వెతలు, కన్నీళ్లు, బరువు బాధ్యతలు ఇలా అన్ని వర్ణాలను ఆవిష్కరించడం జరిగింది. వింటూ నేర్చుకుందాం రండి.
ఆశా పాశం బంది చేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరే లోగానే ఏ తీరవునో..
సేరువైన సేదు దూరాలే
తోడవ్తూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలే లోగానే ఎదేటవ్నో..
ఆటు పోటు గుండె మాటుల్లోన..
సాగేనా…
ఏ లే లే లేలో..
కల్లోలం ఈ లోకంలో
లో లో లోలోతుల్లో
ఏ లేలో ఎద కొలనులో..
నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటై పోతుంటే
నీ గమ్యం గందరగోళం..
దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు
పల్లటిల్లిపోయి నీవుంటే..
తీరేనా నీ ఆరాటం..
ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటవునో తేలాలంటే
నీ ఉనికి ఉండాలిగా
ఓ..ఓ.. ఆటు పోటు
గుండె మాటుల్లోన
సాగేనా…..
ఆశా పాశం బంది చేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరే లోగానే ఏ తీరవునో
ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడల విధి వేచున్నదో..
ఏ మలుపులో ఎం దాగున్నదో
నీవు గ తేల్చుకో..నీ శైలిలో..
చిక్కు ముళ్ళు గప్పి
రంగు లీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే
తెలియకనే సాగే కథనం..
నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి పట్టి పోతుంటే
కంచికి నీ కథలే దూరం…
నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా
రేపేటవునో తేలాలంటే
నువ్వెదురు సూడాలిగా…
ఓ.ఓ.. ఆటు పోటు
గుండె మాటుల్లోన…ఉంటున్నా….