తెల్లని మల్లెలు పూసినవి ఎందుకో .....
మధురూహలు మననం చేసుకునేందుకు.
వెన్నెల కాసేది ఎందుకు?
గుండెనిండా ఆనందం నింపుకునేటందుకు.
వానవెలిసిన వేళ హరివిల్లు విరిసింది ఎందుకు?
ప్రకృతిలో అందం ఎన్ని రంగులో తెలిపేటందుకు.
సాగరంలో కెరటాలు ఎగిరిపడతాయి ఎందుకు?
ఒడ్డున కూర్చున్న వారికి స్వాంతన ఇచ్చేటందుకు.
మంచు కురిసేది ఎందుకు?
చల్లదనం లోని సౌశీల్యాన్ని చూపేటందుకు.
సూర్య కిరణాల వెచ్చదనంలో మార్పులెందుకు?
మనిషి ఆలోచనల అరమరికలు తెలిపేటందుకు.
మనిషికి ప్రకృతికి మధ్యనున్న అనుబంధం ఏమిటి?
ఆలోచనా పరిధిని పెంచే ఆరోగ్యకర ఆనందకర జీవన సూత్రం.
కనులకు కనిపించేది, మనసును మురిపించేది ఏది?
ప్రకృతి అందం, వెన్నెల వెలుగు, చెప్పలేని అనుభూతి.
అనంత నీరవ నిశీధిలో దిగులెందుకు
చీకటిలో కూడా దూరానవున్న నక్షత్రం మనకు ఆశాదీపం.
ప్రకృతి భీభత్సం అంటే భయపెట్టడంకాదు అన్నీ భరించాలని చెప్పే నీతి.
అణువణువులో ఆత్మస్థైర్యాన్ని నింపే ఒక భరోసా.
పంచభూతాలకు నిలయం నీ చుట్టు వుండే వింత ప్రపంచం.
భూమి మీద మట్టిలో వేసిన విత్తు నుంచి పచ్చని చిగురు వస్తుంది.
ఆచిగురే కొమ్మలు రెమ్మలుగా ఎదిగి భవితకు ఆశల పందిళ్లు వేస్తుంది.
ఈ రోజునాటిన చెట్టు రాబోయే తరాలకు నీడ నిచ్చు సంపద.
వృక్షో రక్షతి రక్షితః